VRO, VRA.. విజయ మార్గమిదే

ఏ ప్రభుత్వానికైనా స్థానికసంస్థల పరిపాలన, నిర్వహణ కీలకాంశం. ఇందుకు తోడ్పడేది రెవెన్యూ శాఖ. క్షేత్ర స్థాయిలో పరిపాలన, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వం ప్రజలకు మధ్య అనుసంధానం, గ్రామీణాభివృద్ధి వంటి అంశాల్లో ఈ శాఖ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనికి ప్రత్యక్షంగా తోడ్పడేవారే వీఆర్‌వో (గ్రామ రెవెన్యూ అధికారి), వీఆర్‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకుడు). ప్రభుత్వ సేవలు, పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా? పేదరిక నిర్మూలన, విద్యా, ఆరోగ్యం, జీవనోపాధి, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, వివిధ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డుల జారీ పథకాల అమలు - పర్యవేక్షణ వంటి అంశాల్లో పురోగతిని పర్యవేక్షించడానికి వీఆర్‌వో, వీఆర్‌ఏలు రెవెన్యూ శాఖకు తోడ్పడతారు.

రెవెన్యూ విభాగంలో అధికస్థాయిలో ఉద్యోగులను నియమించాలని రాష్ర్ట ప్రభుత్వం తలపెట్టిన తరుణంలో తాజాగా 5,962 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 1,657 వీఆర్‌వో, 4,305 వీఆర్‌ఏ పోస్టులున్నాయి. పదో తరగతి, ఇంటర్ విద్యార్హతతో ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణావకాశం. రాష్ర్ట స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు దాదాపు 10 లక్షలకు పైగా పోటీ పడే అవకాశం ఉంది. ఈ పరీక్షలో గట్టెక్కడం సవాల్ లాంటిదే. మీరనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవాలంటే ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం, కృషి వీటికి అనుగుణంగా పటిష్టమైన ప్రణాళిక అవసరం. ఏ అంశాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి? పరీక్షకు ఎలా సంసిద్ధులవ్వాలి? బండబారిన పద్ధతుల్లో మొండిగా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో చదవడం ఎలా? వంటి విషయాలపై ఫోకస్..

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. వీఆర్‌వో పోస్టులకు ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలోనూ, వీఆర్‌ఏలకు పదోతరగతి స్థాయిలోనూ ఉంటుంది. మొత్తం 100 మార్కుల్లో జనరల్ స్టడీస్ 60 మార్కులకు, అర్థమెటిక్ స్కిల్స్ 30 మార్కులకు, లాజికల్ స్కిల్స్ 10 మార్కులకు ఉంటాయి. జనరల్ స్టడీస్‌లో 60 ప్రశ్నల్లో 30 ప్రశ్నలు గ్రామీణ వాతావరణం, పరిస్థితులు, వారి జీవన విధానాల నుంచి అడుగుతారు.
గమనిక: పశ్నాపత్రం తెలుగు, ఉర్దూ, ఇంగ్లిషు భాషల్లో ఉంటుంది.

సిలబస్.. ప్రిపరేషన్
ప్రభుత్వ నోటిఫికేషన్లు లేని తాజా పరిస్థితుల్లో వీఆర్‌వో, వీఆర్‌ఏ ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానంగా వీఆర్‌వో పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రం కొంతవరకు లోతుగా ఉండొచ్చని అధికారుల విశ్లేషణ.

జనరల్ స్టడీస్:
జనరల్ స్టడీస్ విభాగంలో 30 ప్రశ్నల్లో అధిక శాతం దేశాలు, రాజధానులు, కరెన్సీలు, ముఖ్య పట్టణాలు, దేశాధ్యక్షుల పేర్లు, రాష్ట్రం, దేశంలో జరిగిన ముఖ్య పరిణామాలు, ముఖ్య తేదీలు, అవార్డులు, బిరుదులు, నియామకాలు వంటి వాటి నుంచి ప్రశ్నలు రావచ్చు. దీనికోసం అభ్యర్థులు వివిధ దినపత్రికలు, మ్యాగజీన్లు, ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు చదివితే సరిపోతుంది. అదేవిధంగా ఇంటర్ స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటున్నందున భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్యాంగం, అందులో ముఖ్యమైన ఆర్టికల్స్, రాజ్యాంగ సవరణలు, ఎకనామిక్స్, జాగ్రఫీ, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, వంటివాటిపై దృష్టి సారించాలి. ప్రధానంగా ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని ప్రభుత్వ తెలుగు టెక్ట్స్‌బుక్స్ చదవాలి. వీఆర్‌ఏ పోస్టులకు ప్రశ్నపత్రం పదోతరగతి స్థాయిలోనే ఉంటుంది కాబట్టి ఏడో తరగతినుంచి పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను క్షుణ్నంగా చదివి సొంతంగా ప్రశ్నలు తయారు చేసుకుంటే మంచి స్కోరింగ్ సాధించొచ్చు.

కరెంట్ అఫైర్స్‌లో గామీణాభివృద్ధితో ముడిపడి ఉన్న అంశాల నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. వీటిల్లో సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, జనాభా, పేదరికం, పారిశ్రామిక రంగం, సాగునీటి పారుదల, ఆవరణ వ్యవస్థ సమతుల్యత, కాలుష్యం పర్యావరణ అంశాలు, సమాచార సాంకేతిక రంగం, ఇంధన వనరులు వంటి అంశాల్లో ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. వీటిలో తాజా పథకాలు, వాటి ఉద్దేశ్యం, ఇంధన వనరుల లభ్యత, నీటిపారుదలలో మార్పులు వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి.

అర్థమెటిక్ ఎబిలిటీ కీలకం:
రెండో విభాగమైన అర్థమెటిక్ స్కిల్స్‌లో 30 మార్కులకు 30 ప్రశ్నలు వస్తాయి. వీటిలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులో క్లాస్ 4, బ్యాంక్ క్లరికల్ పరీక్షల్లో అడిగే విధంగా ప్రశ్నలు ఉంటాయి. భాజనీయతా సూత్రాలు, సరాసరి, కాలం, పని, ఎత్తులు-దూరం, లాభనష్టాలు, వడ్డీలు, శాతాలు, క్షేత్రమితి, పరిమాణాలు, వైశాల్యాలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అర్థమెటిక్‌లో సమస్యలు సాధన చేసేటప్పుడు అభ్యర్థి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. 1) సమయపాలన, 2) కచ్చితత్వం, 3) వేగం. పోటీ పరీక్షల్లో అర్థమెటిక్ విభాగంలో ప్రతి ప్రశ్నకు 40-45 సెకన్ల వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో అభ్యర్థి ప్రతి ప్రశ్నకు సమాధానం చేయడానికి కచ్చితత్వం, వేగం అవసరం. ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ప్రయోజనం చేకూరి, అభ్యర్థికి మానసిక సామర్థ్యం పెరగుతుంది. సమయపాలనతో లెక్కలు చేయగల సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

లాజికల్‌గా ఆలోచించాలి:
లాజికల్ స్కిల్స్‌లో కోడింగ్ / డీకోడింగ్, పోలికలు, బంధాలు, సంఖ్యా శ్రేణి, అక్షర శ్రేణి, భిన్న లక్షణాల నిర్ధారణ (Odd Man Out), దిశ నిర్ధారణ, కేలండర్, నాన్-వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో మంచి మార్కులు సాధించడానికి Thinking అవసరం. వివిధ సమస్యలను బాగా సాధన చేయాలి. ఒక క్రమ పద్ధతిలో ఆయా ప్రామాణిక పుస్తకాల నుంచి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది.
ఈ రెండు విభాగాలపై దృష్టిపెడితే మిగిలిన అభ్యర్థుల కంటే ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అర్థమెటిక్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్‌లో పట్టు సాధిస్తే ఈ రెండు సబ్జెక్టుల్లో అడిగే 40 ప్రశ్నలకుగాను కనీసం 28 నుంచి 35 మార్కుల వరకు సాధించొచ్చు. పాతపశ్నాపత్రాలు, వీలైనన్ని మాదిరి ప్రశ్నా పత్రాలు సాధన చేయడం వల్ల ప్రశ్నల సరళి తెలిసి ప్రిపరేషన్ సులువవుతుంది.
ఎక్కువ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో చేసే తప్పులు నివారించొచ్చు.

V.R.O 2012 పేపర్ - మార్కుల విశ్లేషణ:
I. జనరల్ స్టడీస్ + గ్రామీణ ప్రాంతాల అవగాహన
  1. చరిత్ర 4
  2. భూగోళ శాస్త్రం 10
  3. పౌర శాస్త్రం 5
  4. అర్థ శాస్త్రం 1
  5. జనరల్ సైన్‌‌స 22
  6. జీకే, కరెంట్ అఫైర్‌‌స 9
  7. గ్రామీణ ప్రాంతాల అవగాహన 9
II. అర్థమెటిక్ ఎబిలిటీ 30
III. లాజికల్ స్కిల్స్ 10
నియామక విధానం:
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలు జరుగుతాయి. వీఆర్‌వోల నియామకాలు జిల్లా స్థాయిలో జరుగుతాయి కాబట్టి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. వీఆర్‌ఏ పోస్టుల భర్తీ మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవి పార్ట్‌టైం పోస్టులు. వీటికి సంబంధిత గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు.

వేతనాలు.. కెరీర్
వీఆర్‌వోలది ఫుల్‌టైం జాబ్. ఆరంభంలో వేతనం రూ.7,250 తో ప్రారంభమై సీనియార్టీ ఆధారంగారూ.22,430 అందుకోవచ్చు. వీరి ఉద్యోగం రికార్డ్ అసిస్టెంట్‌తో సమానంగా ఉంటుంది. వీఆర్‌ఏలకు గౌరవ వేతనం రూ.3,000. ఇది పార్ట్‌టైం జాబ్. సామాజిక సేవ చేయాలనుకునేవారికి, ప్రజలతో సత్సంబంధాలు నెరపాలనుకునేవారికి ఈ ఉద్యోగం సరైన వేదిక.

వీఆర్‌వోగా విధుల్లో చేరినవారు కనీసం పదేళ్లలో పనితీరు, ఖాళీల ఆధారంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ పోస్టుల వరకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. వీఆర్‌ఏగా చేరినవాళ్లు ఆ తర్వాత వీఆర్‌వో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్ వరకు పదోన్నతులు పొందొచ్చు.

గమనిక: వీఆర్‌ఏ ఉద్యోగాలను మాత్రం స్వగ్రామానికి చెందిన వారికే కేటాయిస్తారు.

సాక్షి భవిత ధైర్యం నింపింది: వీఆర్‌వో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎస్.చిట్టిబాబు
ఇప్పటివరకు చాలా పోటీపరీక్షలు రాశాను. వీఆర్‌వో పరీక్షకు సిలబస్ కచ్చితంగా ఎలా ఉంటుందో తెలియదు. పైగా ఈ పోస్టుకు దరఖాస్తుచేద్దామన్నా సరే నా లక్ష్యం వేరేవిధంగా ఉంది. అప్పటికే నాపై నాకు నమ్మకం సడలిపోయింది.నాకు ప్రభుత్వ ఉద్యోగం రాదని ఇంట్లో కూడా దాదాపు ఫిక్స్ అయిపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఈ సమయంలో సాక్షి ‘విద్య’లో వీఆర్‌వో పరీక్ష కోసం స్టడీమెటీరియల్‌తోపాటు మోడల్‌పేపర్లు ఇచ్చారు. వీటిని చూడటంతో సిలబస్ గతంలో చదివినట్లు అనిపించింది. తరచుగా భవితను ఫాలో అయ్యా. అదేవిధంగా భవితలో ఇచ్చిన వీఆర్‌వో గ్రాండ్ టెస్ట్‌ను ఆన్సర్ చేస్తే 83 మార్కులు వచ్చాయి. దీంతో వీఆర్‌వో కచ్చితంగా విజయం సాధించగలననే నమ్మకం ఏర్పడింది. అంతే.. పట్టుదలగా చదివాను. చివరకు ఫలితం అనుకూలంగా వచ్చింది.


నోటిఫికేషన్ వివరాలు:
పోస్టుల సంఖ్య:
వీఆర్‌వో - 1657
వీఆర్‌ఏ - 4,305

విద్యార్హతలు:
వీఆర్‌వో -
ఇంటర్ లేదా సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు ఉన్న మూడేళ్ల డిప్లొమా
వీఆర్‌ఏ - పదోతరగతి లేదా తత్సమానం

వయోపరిమితి:
వీఆర్‌వో -18 నుంచి 36 సంవత్సరాలు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 41 ఏళ్లు, వికలాంగులకు 46 ఏళ్లు, మాజీ సైనికులకు 39 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చారు.

వీఆర్‌ఏ - 18 నుంచి 37 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 42, వికలాంగులకు 47, మాజీ సైనికులకు 40 ఏళ్ల వరకు సడలింపు ఉంది.

పరీక్ష రుసుం: జనరల్ అభ్యర్థులకు రూ.300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.150/-. వికలాంగులకు ఫీజు లేదు.

ఫీజు చెల్లింపు విధానం: దరఖాస్తులను ఈసేవా, మీసేవా, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.

షెడ్యూల్ ఇలా...
నోటిఫికేషన్ జారీ: డిసెంబర్ 28, 2014
ఫీజు చెల్లింపు గడువు: జనవరి 12, 2014
ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు: జనవరి 13, 2014
హాల్ టికెట్ల జారీ: జనవరి 19, 2014 నుంచి
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2, 2014 (వీఆర్‌వోలకు ఉదయం, వీఆర్‌ఏలకు మధ్యాహ్నం)
ప్రాథమిక ‘కీ’ వెల్లడి: ఫిబ్రవరి 4, 2014
తుది ‘కీ’ వెల్లడి: ఫిబ్రవరి 10, 2014
ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి 20, 2014
నియామక పత్రాల జారీ: ఫిబ్రవరి 26, 2014 నుంచి
వెబ్‌సైట్: www.ccla.cgg.gov.in

జిల్లాల వారీగా పోస్టులు...

జిల్లా

వీఆర్‌ఏ

వీఆర్‌వో

శ్రీకాకుళం

176

77

విజయనగరం

137

90

విశాఖపట్నం

12

41

తూర్పు గోదావరి

357

87

పశ్చిమ గోదావరి

360

51

కృష్ణా

403

64

గుంటూరు

425

83

ప్రకాశం

282

117

ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు

145

48

చిత్తూరు

188

104

అనంతపురం

167

64

వైఎస్సార్ కడప

128

27

కర్నూలు

176

105

మహబూబ్‌నగర్

94

103

కరీంనగర్

223

83

మెదక్

172

98

వరంగల్

177

62

నిజామాబాద్

94

65

ఆదిలాబాద్

83

53

ఖమ్మం

105

78

నల్లగొండ

201

68

రంగారెడ్డి

158

72

హైదరాబాద్

42

17

మొత్తం

4,305

1,657

www.sakshieducation.com
Tags:
VRO VRA.. preparation plan study material chapterwise bitbank VRO VRA Preparation plan
Published on 12/21/2011 4:51:00 PM

Related Topics