ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 టాపర్ నిశాంత్ రెడ్డి

ఏడో తరగతిలో ఉన్నప్పుడే తండ్రి మరణం. తల్లి ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం.. బాగా చదువుకొనిపైకి రావాలని తరచూ చెప్పడం.. ఆ అబ్బాయి మనసుపై బలమైన ముద్ర వేశాయి. అమ్మ మాటలు వింటూ.. ఆ తల్లి పడుతున్న కష్టం చూస్తూ ఎదిగిన ఆ కుర్రాడు.. జీవితంలో ఎలాగైనా పైకి రావాలని, అందుకు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగమే మార్గమని భావించాడు. సివిల్స్, గ్రూప్-1 వంటి అత్యున్నత లక్ష్యం నిర్దేశించుకొని.. పట్టుదలతో శ్రమించి.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్-1(2016) ఫలితాల్లో ఏపీ టాప్ ర్యాంకర్ (522.5 మార్కులు)గా నిలిచిన అప్పెచెర్ల నిషాంత్ రెడ్డి సక్సెస్ స్పీక్స్ తన మాటల్లోనే...
Career Guidance మాది అనంతపురం జిల్లా, బుక్కారాయ సముద్రం మండలం, బి.కొత్తపల్లి గ్రామం. నాన్న ఆదిశేఖర్‌రెడ్డి. అమ్మ పార్వతి, ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ నన్ను, చెల్లి దివ్యారెడ్డిని చదివించింది. పదో తరగతి వరకు ఎల్‌ఆర్‌జీ స్కూల్లో, ఇంటర్ విజయవాడ గౌతమ్‌లో.. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కర్నూల్‌లోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తిచేశా.

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా..
అమ్మ మా చిన్నప్పటి నుంచే మేం చదువుకొని పైకి రావాలని తరచూ చెప్పేది. అమ్మ చెప్పిన మాటలు, కుటుంబం నెట్టుకురావడానికి అమ్మ పడుతున్న కష్టం నాపై బలమైన ప్రభావమే చూపాయి. అందుకే చదువుకునే రోజుల్లోనే పెద్ద ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే కసి, పట్టుదల పెరిగింది. ఆర్థిక వెసులుబాటు లేని కుటుంబం కావడంతో ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏడాదిన్నరపాటు ఇఫ్కో టోకియా ఇన్సురెన్స్ కంపెనీలో పనిచేశాను.

సివిల్స్ ప్రిపరేషన్‌తో..
సివిల్స్ కోచింగ్ తీసుకుంటే.. గ్రూప్స్ వంటి పరీక్షలకు కూడా ఉపయోగపడుతుందని ఢిల్లీకి వెళ్లి వాజీరాం అండ్ రవి ఇన్‌స్టిట్యూట్‌లో జీఎస్ కోచింగ్ తీసుకున్నా. సివిల్స్ ప్రిలిమ్స్ రెండుసార్లు దాటాను. ఒకసారి మాత్రమే మెయిన్స్ రాశాను. 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ రావడంతో దానికి హాజరయ్యా. దీంతోపాటు ఎస్‌ఎస్‌సీ, ఆర్‌బీఐ, బీమా సంస్థల్లో ఉద్యోగాల ప్రకటనలు విడుదలైనప్పుడు అవీ రాసా. అలా ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌లో రెండుసార్లు నాన్ ఇంటర్వ్యూ పోస్టులు వచ్చాయి. 2013లో యునెటైడ్ ఇన్సూరెన్స్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికై ఉద్యోగంలో చేరాను.

రోజువారీ షెడ్యూల్ :
బీమా కంపెనీలో ఏవో ఉద్యోగం చేస్తూనే గ్రూప్-1కు సన్నద్ధమయ్యాను. గ్రూప్-1కు గంటల ప్రకారం కాకుండా.. రోజువారి షెడ్యూల్ పూర్తయ్యే విధంగా చదవడం అలవాటు చేసుకున్నా. సిలబస్ ప్రకారం ప్రతి రోజు చదువుతూ నోట్స్ రాసుకోవడం వల్ల ప్రిపరేషన్ సులువుగా జరిగింది. ప్రిపరేషన్‌లో భాగంగా అన్ని సబ్జెక్టులకు ఒకే ప్రాధాన్యం ఇచ్చా. సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ పేపర్లు.. స్కోరింగ్‌కు ఎక్కువ అవకాశం ఉండటంతో వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించా. ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకనామిక్ సర్వే, మృణాల్ వెబ్‌సైట్ ద్వారా ఎకానమీపై అవగాహన పెంచుకున్నా.

వేగంగా రాయడం :
పాలిటీకి లక్ష్మీకాంత్ పుస్తకం, హిస్టరీకి శీనయ్య మెటీరియల్, కరెంట్ ఎఫైర్స్ కోసం విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మేగజైన్‌పై ఆధారపడ్డాను. తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతూ, వాటికి సమకాలీన అంశాలను జోడిస్తూ సొంత నోట్స్ సిద్ధం చేసుకున్నా. ఉదాహరణకు సిలబస్‌లో జీఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ, స్పేస్ టెక్నాలజీ అని ఇస్తారు. మనం దానికి సంబంధించిన చంద్రయాన్, మంగళ్‌యాన్‌లు తెలుసుకోవాలి. మెయిన్‌లో వినూత్నంగా రాయడానికి ప్రయత్నించాను. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఎక్కువ వచ్చినా.. మొత్తంగా 20-30 మార్కులు ఎక్కువ వచ్చేలా ప్రయత్నించా. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లోతుగా అన్ని కోణాల్లో ఆయా అంశాలను చదవడంతోపాటు వేగంగా రాయడం కూడా అలవాటు చేసుకోవాలి.

ఇంటర్వ్యూ ఇలా..
ఇంటర్వ్యూలో వ్యక్తిగత ప్రొఫైల్, జాబ్‌ప్రొఫైల్, జిల్లా సమాచారంతోపాటు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ కరెంట్ ఎఫైర్స్‌పై ప్రశ్నలు అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, వాటిపై నా అభిప్రాయాన్ని తెలుసుకునేలా ప్రశ్నలు ఎదురయ్యాయి.

అడిగిన కొన్ని ప్రశ్నలు :
ఇంజనీరింగ్ తర్వాత ఏం చేశారు?, అనంతపురంలో పోస్టింగ్ ఇస్తే ఎలాంటి చర్యలు చేపడుతారు?, రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్, పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి కదా.. ఏపీకి కేంద్ర సహాయం అవసరమా?, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఎందుకు పెంచారు?, పీఎన్‌బీ స్కామ్‌లాంటివి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనూ జరిగే అవకాశం ఉందా? తదితర ప్రశ్నలతో పాటు చంద్రబాబు బీమా యోజన, ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యలు, గుంటూరు కలరా సంఘటనకు ఎవరు బాధ్యులు, మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎల్‌ఐసీలో పెట్టుబడులు ఉత్తమమా?, దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఉన్న అవకాశం ఎంత? వంటి ప్రశ్నలు సంధించారు.

నా విజయంలో వీరూ:
నేను ప్రిపరేషన్‌లో మునిగిపోయినప్పుడు నా సోదరి దివ్య కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది. నా భార్య సాయిదీప్తి నాకు అవసరమైన పుస్తకాలు సేకరించి పెట్టేది. మా పెద్దనాన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శంకర్‌రెడ్డిని చూసి నేను స్ఫూర్తి పొందేవాడిని. వీరితోపాటు సాక్షి భవితలో వచ్చే సక్సెస్ స్టోరీలు, కరెంట్ ఎఫైర్స్, సాక్షి ఎడిటోరియల్ కథనాలు నా విజయంలో భాగస్వాములు!!
Published on 3/26/2018 12:22:00 PM

సంబంధిత అంశాలు