సాంఘిక శాస్త్రం నూతన సిలబస్‌పై విశ్లేషణ

Tenth Class నూతన పాఠ్యప్రణాళికా నిబంధనలకనుగుణంగా ఈ విద్యా సంవత్సరం (2014-15) నుంచి కొత్త సిలబస్‌తో 10వ తరగతి పాఠ్యపుస్తకాలను రూపొందించారు. గతంలో సాంఘికశాస్త్రంలో భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్ధశాస్త్రంలకు చెందిన వివిధ పాఠ్యాంశాలను ఆయా విభాగాల కింద పాఠ్యపుస్తకంలో పొందుపర్చేవారు. ఈ మారు ఆ విధంగా కాకుండా సాంఘిక శాస్త్ర విషయాలకు సంబంధించిన పాఠ్యాంశాలన్నింటికి రెండు భాగాలుగా విభజించి వాటిలో మొత్తం 22 చాప్టర్లను ఇవ్వడం జరిగింది.

భాగం-1 లో (వనరులు అభివృద్ధి, సమానత) 1 నుండి 12 చాప్టర్లు ఉన్నాయి. ఇందులో భారతదేశ భౌగోళిక స్థితిగతులను, శీతోష్ణస్థితి, నదులు, నీటిపారుదల వ్యవస్థ, జనాభా (ప్రజలు), వ్యవసాయం, పంటలు, ఆహార భద్రతల గూర్చి విస్తృతంగా చర్చించారు. ఈ అంశాలన్నీ కూడా భారతదేశ ప్రాంతీయ భౌగోళిక వ్యవస్థకు చెందినవి. వీటితోపాటు అదేభాగంలో అర్ధశాస్త్రంలో భావనలైన స్థూల జాతీయోత్పత్తి, జాతీయ తలసరి ఆదాయం, ప్రజల వలసలు, విదేశీ వాణిజ్యం, ప్రపంచీకరణ, పర్యావరణ హక్కులు, ప్రజా పంపిణీ వ్యవస్థ, సుస్థిర అభివృద్ధిల గురించి తెలయపర్చారు.

భాగం-2 లో (సమకాలీన ప్రపంచం, భారతదేశం) 13 నుంచి 22 చాప్టర్లున్నాయి. వీటిలో ఆధునిక ప్రపంచ చరిత్ర (1900-1950 వరకు) వివిధ వలస పాలన వ్యతిరేక ఉద్యమాలను, భారత జాతీయోద్యమ పాఠ్యాంశాలను చేర్చారు. ఇవి చరిత్రకు సంబంధించినవి. వీటితోపాటు పౌరశాస్త్ర పాఠ్యవిషయాలైన భారత రాజ్యాంగ నిర్మాణం, ముప్పై సంవత్సరాల స్వతంత్ర భారతదేశం (1947-77), దేశంలో వివిధ రాజకీయ ధోరణులు (1977-2000 కాలం వరకు), విదేశాలతో భారత సంబంధాలు, భారత ప్రాధికార సంస్థలగూర్చి విపులంగా తెలిపారు.

ఈ అంశాలన్నింటిపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించుటకు పాఠ్యాంశాలలో వివిధ ఉదాహరణలను, గణాంకాలను, పత్రికావార్తా కథనాలను, గ్రాఫ్‌లను, పటాలను, ఫొటోలను కార్టూన్‌లను, బొమ్మలను పొందుపర్చారు. గత సిలబస్‌తో పోలిస్తే ఇది తక్కువైనదిగా, మెరుగైనదిగా చెప్పవచ్చు. ఈ పాఠాలు విద్యార్థిలో విషయ అవగాహన కల్పించడండతో పాటు సమాచార సేకరణ, పట నైపుణ్యాలను, ఆచరణ పూర్వకమైన ఊహాత్మకతను, విషయాలను వ్యాఖ్యానించడం, అభివ్యక్తీకరించడం, అలాగే సమకాలీన అంశాలపై విద్యార్థుల్లో సానుకూల లేదా వ్యతిరేక ప్రతిస్పందనలను కలిగిస్తూ, వారిలో అవగాహన, వినియోగ సామర్ధ్యాలను పెంచడానికి తోడ్పడేటట్లుగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేశారు.

ప్రశ్నాపత్రం తీరు తెన్నులు
గతంలో ఉన్న మాదిరిగానే సాంఘిక శాస్త్రంలో రెండు పేపర్లుంటాయి. కానీ పేపర్-1 కు 40 మార్కులు, పేపర్-2కు 40 మార్కులు మాత్రమే ఉంటాయి (మొత్తం 80 మార్కులు). మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ మార్కులుగా సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు వేస్తారు. పాఠశాలలో కాలానుగుణంగా జరిపే నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా ఆ ఇంటర్నల్ మార్కులను కేటాయిస్తారు. ఇంటర్నల్ మార్కులలో కనీసం 7 మార్కులు (20 మార్కులకి) తప్పనిసరిగా విద్యార్థులు పొందాలి. అలాగే పేపర్-1, 2 లను కలిపి 28 మార్కులు (మొత్తం 80 మార్కులకి) కనీసంగా పొందినపుడే వారు ఉత్తీర్ణులయినట్లు పరిగణిస్తారు. ఆ విధంగా మొత్తం 100 మార్కులకి 35 మార్కులు (28 పబ్లిక్ పరీక్ష మార్కులు + 7 ఇంటర్నల్ మార్కులు) విద్యార్థులు సాధిస్తే పాస్ అయినట్లుగా భావించవచ్చు.

పేపర్-1 లో మొదటిభాగం (వనరుల అభివృద్ధి, సమానత) పాఠ్యాంశాల నుండి ప్రశ్నలనిస్తారు. పేపర్-2 లో రెండవ భాగం (సమకాలీన ప్రపంచం భారతదేశం) పాఠ్యాంశాల నుండి ప్రశ్నలను ఇస్తారు. ఈ ప్రశ్నలు విద్యార్థులలో అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞానాన్ని, అవగాహన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. ఇవి బట్టీ పట్టి రాయడానికి వీలులేకుండా ఉంటాయి. విద్యార్థులు బాగా ఆలోచించి, అన్వయించుకొని జవాబులు రాయాలి. అంతేకాకుండా ప్రశ్నలకు బహుళ సమాధానాలు వచ్చేవిధంగా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు ఉంటాయి. ఈప్రశ్నలన్నింటిని ఇఉఖఖీ వారు నిర్దేశించిన వివిధ విద్యా ప్రమాణాల కింద పొందుపర్చి పరీక్షలో వాటికి మార్కులు కేటాయిస్తారు.
విద్యా ప్రమాణాలు కేటాయించిన మార్కులు (పేపర్-1/ పేపర్-2)
1. విషయ అవగాహన 10 మార్కులు
2. ఇచ్చిన పాఠ్యాంశంను చదివి అర్థంచేసుకొని వ్యాఖ్యానించడం 5 మార్కులు
3. సమాచార సేకరణ నైపుణ్యం 5 మార్కులు
4. సమకాలీన అంశాలపై - ప్రశ్నించడం- ప్రతిస్పందన 5 మార్కులు
5. పట నైపుణ్యాలు 10 మార్కులు
6. ప్రశంస/ అభినందన సున్నితత్వం 5 మార్కులు
మొత్తం 40 మార్కులు

అత్యధికంగా మార్కులు తెచ్చుకోవడానికి విద్యార్థులకు ప్రధాన సూచనలు
  • చాప్టర్‌వైజ్ పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా చదవాలి. చివరలో ఉన్న కీలక పదాలను, నిర్వచనాలను ప్రత్యేక దృష్టితో చదవాలి.
  • పాఠ్యాంశాలపై ఉపాధ్యాయుని విశ్లేషణను సావధానంగా వినాలి.
  • ఆ విశ్లేషణలపై తన ప్రతిస్పందనలను వారికి తెలిపి అవి సరైనవో కావో నిర్దారణ చేసుకోవాలి.
  • పాఠ్యాంశాలలోని అంశాలను, ఉదాహరణలను తోటి విద్యార్థులతో చర్చించాలి.
  • పట నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇంటిదగ్గర ప్రపంచ పటంను, భారతదేశ పటంను రెగ్యులర్‌గా ఫాలో అవాలి.
  • సమాచార సేకరణ పని/ ప్రాజెక్టు పనిని స్వంతంగా, నిబద్ధతతో పారదర్శకంగా చేయాలి.
  • సమకాలీన అంశాలను అవగాహన చేసుకోవడంలో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక దినపత్రికను చదవాలి.
  • పాఠ్యాంశాలకు సంబంధించిన అనుబంధ సమాచారాన్ని ఉపాధ్యాయులచేగాని, పాఠశాల లైబ్రరీ ద్వారాగానీ ఇతరత్రాగానీ సేకరించి ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోవాలి.
  • పాఠ్యాంశం చివరలో ఉన్న ప్రశ్నలకు స్వంతంగా సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా చేయడం వలన రాత నైపుణ్యం కూడా పెరుగుతుంది.
  • పాఠశాలచే నిర్వహించబడే క్షేత్ర పర్యటనల్లో తప్పనిసరిగా పాల్గొనాలి.
Published on 7/11/2014 10:29:00 AM
టాగ్లు:
Social Studies

Related Topics