ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం విద్యార్థులకు చుక్కలు చూపించింది. ప్రశ్నపత్రం రూపకల్పనలో ఇంటర్ బోర్డ్ తీరు చూసిన విద్యార్థులకు కళ్లు తిరిగాయి. ఎక్కువ ప్రశ్నలను అప్లికేషన్ విధానంలో అడగడంతో సమయం చాలక నష్టపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇంటర్ బోర్డ్ రూపొందించిన బ్లూ ప్రింట్‌కు ప్రస్తుత ప్రశ్నపత్రం భిన్నంగా ఉంది. బ్లూ ప్రింట్‌ను పక్కనబెట్టి కొన్ని చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు, మరికొన్ని చాప్టర్ల నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నపత్రంలో ఇచ్చిన 2, 3, 8 ప్రశ్నలు తెలుగు అకాడెమీ పుస్తకంలోని కాకపోవడంతోపాటు 10వ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం తెలుగు అకాడెమీ ముద్రించిన పుస్తకంలోనే లేకపోవడం ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో 10, 15వ ప్రశ్నలకు జవాబులు రాసేందుకు ప్రయత్నించిన వారికి పూర్తి మార్కులు ఇవ్వాలని విద్యార్థులు, అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. |