అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఐసీట్) పై నిర్ణయం తీసుకుంటామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకోబోమని తెలిపారు. ‘మేం అన్ని రాష్ట్రాలను సంప్రదిస్తాం. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో సమావేశం నిర్వహిస్తాం. పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తమైన తర్వాతే ముందుకు సాగుతాం’ అని ఆయన అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (ఐసీసీ) ఉన్నత విద్యపై నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ సిబాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఇంజనీరింగ్ పరీక్ష ప్రతిపాదనను ఇప్పటికే తమిళనాడు, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పుదుచ్చేరి వ్యతిరేకించాయి. దీనిపై విస్తృత చర్చ జరగాలని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు కేంద్రాన్ని కోరాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఐసీట్‌ను నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. |