పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఏప్రిల్ 4న జరిగిన బయాలజీ ప్రశ్నపత్రంలో బ్లూ ప్రింట్‌కు విరుద్ధంగా ప్రశ్నలు అడగడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. విద్యార్థులకు హెచ్‌ఐవీ తదితర వ్యాధులపై అవగాహన కల్పించేందుకు అడల్ట్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ఏఈపీ) కింద 2007 నుంచి పదో తరగతిలో సిలబస్‌ను ప్రవేశపెట్టారు. బ్లూ ప్రింట్ మేరకు గత ఐదేళ్లుగా ఆ పాఠ్యాంశాల నుంచి నాలుగున్నర మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ ఏడాది ఏఈపీ కింద ఒక్క ప్రశ్న కూడా ఇవ్వలేదు. అలాగే..బ్లూ ప్రింట్ ప్రకారం ఐదు మార్కులకు ప్రశ్నలిచ్చే పర్యావరణం అంశాలపై ఈ ఏడాది 11 మార్కులకు ప్రశ్నలు అడిగారు. బిట్ పేపర్‌లో రెండు ప్రశ్నలకు అనువాదంలోనూ, వాక్య నిర్మాణంలోనూ తప్పులు దొర్లినట్లు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలపాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రశ్నపత్రంలో ఎలాంటి తప్పుల్లేవని, బ్లూ ప్రింట్ ప్రకారం ఎయిడ్స్ అంశంపై ప్రశ్న ఇవ్వలేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు పేర్కొన్నారు. దీనిపై విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు. |