జాతీయంఅంతర్జాతీయంక్రీడలు
జాతీయం
బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం

ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద గల ఐటీఆర్ (ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్) నుంచి మార్చి 28న నిర్వహించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. దీన్ని ‘స్టీప్ డ్రైవ్’ అనే నూతన పద్ధతిలో పరీక్షించారు. ఈ ప్రయోగంలో బ్రహ్మోస్ క్షిపణి ధ్వని వేగం కంటే రెండున్న రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లింది. ఈ క్షిపణిని పరీక్షించడం ఇది 29వ సారి. 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ 300 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు.
న్యాయ వ్యవస్థ జవాబుదారీ బిల్లుకు ఆమోదం

న్యాయ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు 2010కి లోక్‌సభ మార్చి 29న ఆమోదం తెలిపింది. సుప్రీం లేదా హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు వీలుగా ఓ వ్యవస్థ ఏర్పాటుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే జడ్జీల విచారణ చట్టం-1968 రద్దు అవుతుంది. అదే సమయంలో పాత చట్టంలోని పార్లమెంట్‌కు సుప్రీం, హైకోర్టు జడ్జీల అభిశంసన అధికారం వంటి కీలక అంశాలు కొనసాగుతాయి. అంతేకాకుండా.. సుప్రీం, హైకోర్టు జడ్జీలు వారి ఆస్తులను వెల్లడించాలి. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే కమిటీ కార్యకలాపాలను వీడియో తీయాలన్న స్థాయి సంఘం ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2010లో 5.56 లక్షల క్యాన్సర్ మరణాలు
భారత్‌లో 2010లో 5.56 లక్షల మంది క్యాన్సర్ వ్యాధితో మరణించారని ‘ది లాన్సెట్’ అనే అంతర్జాతీయ పత్రిక మార్చి 28 సంచికలో తెలిపింది. వీరిలో 71 శాతం మంది 30-69 సంవత్సరాల మధ్య వయసు వారు. పురుషుల్లో ఎక్కువ మంది నోటి క్యాన్సర్ వల్ల.. మిహ ళల్లో ఎక్కువ మంది సర్వికల్ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. సర్వికల్ క్యాన్సర్‌తో దేశంలో ప్రతి ఏటా 33,000 మంది మృత్యువాత పడుతున్నారు.
ఆరు ఒప్పందాలపై భారత్-బ్రెజిల్ సంతకాలు
బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి మార్చి 30న ఒప్పందాలు కుదిరాయి. ఇందులో శాస్త్రసాంకేతిక రంగం, బయోటెక్నాలజీ, సాంస్కృతిక సంబంధాలు, భారత్‌లో బ్రెజిల్ విద్యార్థులకు, పరిశోధకులకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలు ఉన్నాయి. రక్షణ, అణు ఇంధనం, మరికొన్ని ప్రధాన రంగాల్లో పూర్తిగా సహకరించుకోవాలని, గ్లోబల్ గవర్నెన్స్ విధానంలో ముఖ్యంగా జి-20 ప్రక్రియకు సంబంధించి చర్చలు విస్తరించుకోవాలని కూడా ఈ సందర్భంగా ఇరు దేశాలు అంగీకరించాయి.
మిస్ ఇండియా వరల్డ్ వన్య మిశ్రా

మిస్ ఇండియా-2012గా చండీగఢ్‌కు చెందిన వన్య మిశ్రా ఎంపికయ్యారు. మార్చి 30న ముంబైలో జరిగిన పోటీలో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్‌ను ప్రాచీ మిశ్రా గెలుచుకోగా, మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌గా రోఛెల్లీ మరియా రావు నిలిచింది. వీరు 2012 మిస్ వరల్డ్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషన్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తారు.
భారత్‌లో అమెరికా రాయబారిగా పావెల్
భారత్‌లో అమెరికా రాయబారిగా నాన్సీ పావెల్ నియామకాన్ని అమెరికా చట్ట సభ సెనెట్ మార్చి 30న ఖరారు చేసింది. గతేడాది ఏప్రిల్‌లో తిమోతీ రోమర్ రాజీనామాతో ఈ పదవి ఖాళీగా ఉంది. దీంతో ఆ పదవిలో డిసెంబర్ 16న నాన్సీ పావెల్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు.
అంతర్జాతీయం
సియోల్‌లో అణు భద్రత సదస్సు

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రెండో అణు భద్రత సదస్సు మార్చి 26, 27 తేదీల్లో జరిగింది. ఇందులో 53 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అణు భద్రతను పటిష్టం చేయడం, అణు ఉగ్రవాద భయాన్ని తగ్గించడం, తీవ్రవాదులు, నేరస్తులు, ఇతర చట్ట వ్యతిరేక సంస్థలు అణు పదార్థాలు పొందకుండా నిరోధించే దిశగా పని చేయాలని సదస్సు తీర్మానించింది. అంతర్జాతీయ భద్రతకు అణు తీవ్రవాదం అత్యంత సవాలుగా నిలిచిందని సదస్సు పేర్కొంది. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ ప్రపంచంలో అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలిస్తేనే అణుభద్రత సాధ్యమవుతుందని అన్నారు. అణు భద్రతపై తొలి సదస్సు 2010లో అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగింది. తదుపరి సదస్సుకు 2014లో నెదర్లాండ్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.
దలైలామాకు టెంపుల్టన్ ప్రైజ్

టిబెట్ మత గురువు దలైలామా టెంపుల్టన్ ప్రైజ్-2012 కు ఎంపికయ్యారు. లండన్‌లో మే 14న జరిగే ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డును జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ అందజేస్తుంది. దీన్ని 1972లో నెలకొల్పారు. దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది.
అరబ్ లీగ్ సదస్సు
ఇ

రాక్ రాజధాని బాగ్దాద్‌లో మార్చి 29న అరబ్ లీగ్ దేశాల సదస్సు జరిగింది. సిరియా సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుక్కోవాలని సదస్సులో పాల్గొన్న నేతలు కోరారు. ఈ సదస్సును ఐక్యరాజ్యసమితి కార్యదర్శి బాన్-కీ-మూన్ ప్రారంభించారు. సిరియాలో సంక్షోభ నివారణ కోసం యూఎన్-అరబ్ లీగ్ ప్రతినిధి కోఫి అన్నన్ సూచించిన ప్రణాళికను అమలు చేయాలని ఆ దేశాధ్యక్షుడు అస్సాద్‌కు బాన్-కీ-మూన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత అరబ్‌లీగ్ సదస్సు బాగ్దాద్‌లో జరిగింది. ఈ లీగ్ నుంచి సస్పెండ్ అయిన సిరియాను సదస్సుకు ఆహ్వానించలేదు. అరబ్ లీగ్‌లో 22 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ‘ఎర్త్ అవర్’

భూగోళం పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మార్చి 31న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి ‘ఎర్త్ అవర్’ పాటించారు. గతేడాది ఎర్త్ అవర్‌లో 135 దేశాలు పాల్గొనగా, ఈ ఏడాది ఆ సంఖ్య 147కు పెరిగింది. వాతావరణ మార్పులపై ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్‌ను తొలి సారిగా నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా మార్చి చివరి శనివారం ఈ కార్యక్రమాన్ని పాటిస్తున్నారు. మన దేశంలో ఎర్త్ అవర్‌ను 2009 నుంచి నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు

బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల నాలుగో సదస్సు మార్చి 29న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్, చైనా అధ్యక్షుడు హూ జింటావో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ నేతలు ఉమ్మడి ఢిల్లీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఇందులోని
ముఖ్యాంశాలు..
- ఇరాన్ అణు కార్యక్రమం సంక్షోభాన్ని దౌత్యపరంగా పరిష్కరించడం
- ప్రపంచ బ్యాంకు తరహాలో తమ ఆర్థిక అవసరాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాల పరిశీలన
- ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలలో సంస్కరణలకు పిలుపు.
- తమ స్థానిక కరెన్సీలోనే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా సంబంధిత ఒప్పందాలపై సంతకాలు.
- తొలిసారి 2006లో న్యూయార్క్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. దీన్ని బ్రిక్(BRIC)గా వ్యవహరించేవారు. మొదటి సదస్సు 2009లో ఎకటెరిన్ బర్గ్(రష్యా)లో జరిగింది. రెండో సదస్సుకు బ్రెసిలియా(బ్రెజిల్), మూడో సదస్సుకు సాన్యా(చైనా) వేదికలుగా నిలిచాయి. ఈ సదస్సులో దక్షిణాఫ్రికా చేరడంతో ఈ కూటమిని బ్రిక్స్ (BRICS)గా వ్యవహరిస్తున్నారు. ఈ దే శాలు ప్రపంచ జనాభాలో సగ భాగం జనాభాను కలిగి ఉన్నాయి. ఐదో సదస్సుకు 2013లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది.
క్రీడలు
ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత బరోడా

దేశవాళీ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని బరోడా జట్టు గెలుచుకుంది. ముంబైలో మార్చి 27న జరిగిన ఫైనల్లో పంజాబ్‌ను ఓడించింది. ఇర్ఫాన్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత మాజీ క్రికెటర్ సయ్యద్ ముస్తాక్ అలీ పేరిట ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
పేస్ జోడికి మియామి టైటిల్

ఏటీపీ మియామి మాస్టర్స్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను లియాండ్ పేస్(భారత్), రాడెక్ స్టెపానెక్ (చెక్) జోడి గెలుచుకుంది. ఫైనల్లో మాక్స్ మిర్నీ (బెలారస్), డానియల్ నెస్టర్(కెనడా) జంటపై విజయం సాధించారు. పేస్ కెరీర్లో ఇది 50వ అంతర్జాతీయ టైటిల్. మహేశ్ భూపతి(50 టైటిల్స్) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రీడాకారుడిగా..ఏటీపీ చరిత్రలో 24వ ప్లేయర్‌గా పేస్ గుర్తింపు పొందాడు. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నోవాక్ జొకోవిచ్ గెలుచుకోగా, మహిళల విభాగంలో అగ్నెజెకా రాడ్వాన్సికా విజేతగా నిలిచింది.
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన గీత

భారత రెజ్లర్ గీత లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో జరిగిన ఆసియా క్వాలిఫైయింగ్ ఈవెంట్లో 55 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయురాలిగా(మహిళల రెజ్లింగ్ విభాగంలో) చరిత్ర సృష్టించింది.
వరల్డ్ టీటీ విజేత చైనా

వరల్డ్ టేబుల్ టెన్నిస్(టీటీ) పురుషుల చాంపియన్‌షిప్‌ను చైనా గెలుచుకుంది. ఏప్రిల్ 1న డోర్ట్ముండ్(జర్మనీ)లో జరిగిన ఫైనల్లో జర్మనీని ఓడించింది. ఈ టోర్నమెంట్లో భారత్ 27వ స్థానంలో నిలిచింది.