సెప్టెంబర్ 26న గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 26న ప్రకటించాలని, 29న పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
Education Newsరాతపరీక్ష నిర్వహణకు 7,022 రాతపరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిలో ఒకే సమయంలో 17 లక్షల మందికి రాతపరీక్ష నిర్వహించే వీలుంటుంది. ఆగస్టు 7వ తేదీ సాయంత్రానికి 16,46,146 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో మూడు రోజులు గడువు ఉండడంతో ఈ దరఖాస్తుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఇందుకు అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో మరికొన్ని కేంద్రాలను గుర్తిస్తారు. ఈ ఉద్యోగాలకు సెప్టెంబరు 1, 7, 8 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పూర్తి ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే రాతపరీక్షకు సంబంధించి జవాబుల ప్రాథమిక ‘కీ’ని పరీక్ష జరిగిన రోజునే విడుదల చేస్తారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాల పరిశీలనానంతరం రాతపరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. రాతపరీక్ష మెరిట్ జాబితా సెప్టెంబరు 16న ప్రకటించిన తర్వాత, 20వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. సెప్టెంబర్ 26న ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లా యూనిట్‌గా వివిధ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పద్ధతిన అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేస్తారు. అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. రాతపరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఆగస్టు 12వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని తీరున రికార్డుస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ చేసిన నేపథ్యంలో నిర్ణీత అక్టోబరు రెండవ తేదీ కల్లా ఈ ప్రక్రియను సమర్ధవంతంగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళికను సైతం సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా, జిల్లా కేంద్రాలతో పాటు రెవిన్యూ డివిజన్ కేంద్రాలు ఉండే పట్టణాలలో సైతం రాత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
Published on 8/8/2019 11:28:00 AM

సంబంధిత అంశాలు