English Version

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ప్రయోగం విజయవంతం

భారత్‌కు సొంత నావిగేషన్ వ్యవస్థ (నావిక్)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1ఐ ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 వాహకనౌక ద్వారా ఏప్రిల్ 12న ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐను ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 43వ ఉపగ్రహం అయిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ (రీప్లేస్‌మెంట్) బరువు 1,425 కిలోలు. ఇందులో ఎల్5, ఎస్‌బ్యాండ్ నావిగేషన్ సాధనాలు, రుబీడియరం పరమాణు గడియారాలు, సీబ్యాండ్ రేంజింగ్ పేలోడ్, లేజర్ రేంజింగ్ కోసం కార్నర్ క్యూబ్ రెట్రో రెఫ్లెక్టర్లున్నాయి. దీని పరిమాణం 1.58 మీ. × 1.5 మీ. × 1.5 మీ. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇస్రో సంయుక్తంగా రూపొందించాయి.
Current Affairsప్రయోగం జరిగిందిలా..
321 టన్నుల బరువు, 44.4 మీటర్ల పొడవున్న సీ41 రాకెట్ ప్రయోగంను మొత్తం నాలుగు దశల్లో ఆరు ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సహాయంతో చేపట్టారు. మొదటిదశలో స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సహాయంతో 110 సెకన్లలో మొదటి దశను పూర్తిచేశారు. ఆ తర్వాత 42 టన్నుల ద్రవ ఇంధనంతో 263 సెకండ్లకు రెండో దశ, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 598 సెకండ్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1122 సెకండ్లకు నాలుగోదశ పూర్తయింది. ఈ ఉపగ్రహాన్ని పెరీజీ (భూమిగా దగ్గరగా) 284 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 20,650 కిలోమీటర్ల ఎత్తులో భూ బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు. అనంతరం 827 కిలోల ద్రవ ఇంధనాన్ని దశల వారీగా మండించి ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిరకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

నావిక్ దిక్సూచీ వ్యవస్థ పనిచేయడానికి కనీసం ఏడు ఉపగ్రహాలు అవసరం కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో ఇది తొమ్మిదో ఉపగ్రహం. ఇందులో మొదటి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ను 2013 జులై 1న కక్ష్యలోకి పంపారు. ఇందులో సమయాన్ని నిర్ధరించడానికి ఏర్పాటు చేసిన మూడు రుబీడియం గడియారాలు విఫలమయ్యాయి. దాని స్థానంలో 2017 ఆగస్టు 31న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహంను ప్రయోగించారు. ఉష్ణకవచాలు తెరుచుకోకపోవడంతో ప్రయోగం చివరి దశలో ఇది కూడా విఫలమైంది. దీంతో తాజాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1ఐను ఇస్రో ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో కొన్ని ఉపగ్రహాలు భూస్థిర కక్ష్య (జీఈవో) లో మరికొన్ని భూఅనువర్తిత కక్ష్య (జీఎస్‌వో)లో పరిభ్రమిస్తాయి.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపయోగాలు
  • నింగి, నేల, నీటిలో కూడా నావిగేషన్ సేవలు అందిస్తుంది.
  • సైనికులకు ఖచ్చితత్వంతో కూడిన సమయాన్ని చూపిస్తుంది.
  • మత్స్యకారులు, విపత్తు నిర్వహణ సేవలను అందిస్తుంది.
  • వాహనాల గమనం, మొబైల్ ఫోన్లతో వాహనాల అనుసంధానం.
  • మ్యాపింగ్ వంటి తదితర సేవలు కూడా పొందవచ్చు.

నావిక్ లేదా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ అంటే?
అమెరికా ప్రవేశపెట్టిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) తరహాలో భారత్‌కు సొంత దిక్సూచి (నావిగేషన్) వ్యవస్థ ఉండాలని ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీని వల్ల భారత్ చుట్టూ 1500 కిలోమీటర్ల మేర నిర్ధిష్ట సమయం, పొజిషన్, నావిగేషన్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.2,246 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి గ్లోబల్ ఇండియన్ నావిగేషనల్ సిస్టమ్ (జీఐఎన్‌ఎస్)ను ఇస్రో చేపట్టనుంది.

దేశాలు

దిక్సూచీ వ్యవస్థలు

అమెరికా

జీపీఎస్

రష్యా

గ్లోనాస్

యూరప్

గెలీలియో

భారత్

నావిక్

Published on 4/13/2018 12:32:00 PM

సంబంధిత అంశాలు