ఫారెస్టు కొలువులు.. ప్రిపరేషన్ ప్లాన్


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అటవీ శాఖలో కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్లు విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం మరో రెండు నెలల్లోనే పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ ఉద్యోగాల పరీక్షల్లో విజయానికి సూచనలు..
అడవుల పరిరక్షణ, విస్తరణ; వన్యమృగాలు, పర్యావరణ సంరక్షణ; విలువైన అటవీ సంపదకు భద్రత, భూములు ఆక్రమణకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అటవీ అధికారులదే. మానవ జాతి మనుగడకు పర్యావరణాన్ని కాపాడటం, జీవ వైవిధ్యం వన్య మృగాలను రక్షించటం లాంటి బృహత్తర విధులు ఉండే ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడటం ఔత్సాహికులకు చక్కటి అవకాశం. యూనిఫాం ఉద్యోగం, సమాజంలో గౌరవం, ఆకర్షణీయ వేతనాలు ఉన్న ఫారెస్ట్ కొలువులకు పటిష్ట ప్రణాళికతో సిద్ధమైతే సులభంగా విజయం సాధించొచ్చు అంటున్నారు నిపుణులు.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
ఇంటర్మీడియట్ విద్యార్హతతో వెలువడిన ఉద్యోగ ప్రకటన ఇది. మొత్తం 1,857 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులకు జూలై 1 నాటికి 18-31 ఏళ్ల లోపు వయసు ఉండాలి (రిజర్వేషన్లు వర్తిస్తాయి).

పరీక్ష విధానం: రాత పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. వీటిని పూర్తిగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. పేపర్-1లో జనరల్ నాలెడ్జ్, పేపర్-2లో జనరల్ మ్యాథమెటిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో పేపర్ 100 ప్రశ్నలకు, 90 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. మొత్తంగా రెండు పేపర్లకు 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది.

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
డిగ్రీ ఉత్తీర్ణతతో వెలువడిన నోటిఫికేషన్ ఇది. ఖాళీలు 90. బోటనీ/ఫారెస్ట్రీ/హార్టికల్చర్‌/జువాలజీ/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌/జియాలజీ/అగ్రికల్చర్‌లో ఏదో ఒక సబ్జెక్టుతో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ (కెమికల్/మెకానికల్/సివిల్) పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, శారీరక ప్రమాణాలు, వయసు మొదలైనవన్నీ బీట్ ఆఫీసర్ పోస్టు తరహాలోనే ఉన్నాయి.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
అటవీ శాఖలో రాష్ట్రస్థాయిలో కీలకమైన పోస్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ). 67 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్రికల్చర్/బోటనీ/కెమిస్ట్రీ/కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ఫారెస్ట్రీ/జియాలజీ/హార్టికల్చర్/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్/వెటర్నరీ సైన్స్/జువాలజీ సబ్జెక్టుతో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ (అగ్రికల్చర్/కెమికల్/మెకానికల్/సివిల్/కంప్యూటర్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్) పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత పరీక్ష
ఎంపిక ప్రక్రియలో మొదట ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టైప్) ఉంటుంది. ఇది అర్హత పరీక్ష. ఇందులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్లుంటాయి. ఒక్కో పేపర్ నుంచి 100 ప్రశ్నల చొప్పున 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో నిర్దేశిత మార్కులతో క్వాలిఫై అయిన అభ్యర్థులకు జనరల్ స్టడీస్ పేపర్‌లో 150 ప్రశ్నలతో 150 మార్కులకు, ఆప్షనల్ పేపర్ 150 ప్రశ్నలతో 300 మార్కులకు మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- వీటిలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: మూడు నోటఫికేషన్లకు రాత పరీక్ష, వాకింగ్ టెస్ట్( పురుషులకు 4గంటల్లో 25 కి.మీ., మహిళలకు 4 గంటల్లో 16 కి.మీ.), మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎఫ్‌ఆర్‌ఓ పోస్టులకు అదనంగా ఇంటర్వ్యూ ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

సన్నద్ధత
జనరల్ నాలెడ్జ్/జనరల్ స్టడీస్
టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటనల్లో విరివిగా కనిపించే సెక్షన్ ఇది. ఎంపికలో రాత పరీక్షలో సాధించిన మార్కులే అత్యంత కీలకం కాబట్టి ఈ విభాగంలో సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు పొందేందుకు కృషి చేయాలి. సమాజంలో జరిగే రాజకీయ, ఆర్థిక, సామాజిక, అంతర్జాతీయ అంశాలను నిశితంగా పరిశీలించగలిగే అభ్యర్థులు మంచి స్కోరు సాధించవచ్చు. గత ఆరు నెలల నుంచి చోటుచేసుకున్న ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను అధ్యయనం చేస్తే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌కు దోహదపడుతుంది. ఈ పేపర్‌లోని ఇతర విభాగాలైన జనరల్ సైన్స్‌, పర్యావరణం- సమస్యలు, విపత్తు నిర్వహణ, దేశ, రాష్ర్ట ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం - ఫీచర్స్, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, ఆధునిక భారత దేశ చరిత్ర (జాతీయోద్యమం ప్రత్యేక దృష్టితో), తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణలో ప్రవేశపెట్టిన వివిధ పథకాలపై సమగ్ర సమాచారం అవసరం. వీటితోపాటు సామాజిక స్పృహ, నైతిక విలువలు, బలహీన వర్గాలు, లింగ వివక్ష తదితర సున్నిత అంశాలపై అభ్యర్థుల అభిప్రాయాన్ని తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి.
 • ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యమైన సంఘటనలపై అవగాహన పెంపొందించుకోవాలి. గాంధీ శకం ప్రాధాన్యం, స్వాతంత్య్రానంతరం ముఖ్య ఘట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 • దేశాలు, సరిహద్దులు, సరస్సులు, పీఠభూములు, పర్వతాలు, ఎడారులు, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పార్లమెంటు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, స్థానిక స్వపరిపాలన, గ్రామీణాభివృద్ధి, ప్రణాళికలు, జాతీయాదాయం, జనాభా.. ఇలా వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
 • జనరల్ సైన్స్‌, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీకి సంబంధించి ఏడు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. ఇక ఎక్కువగా దృష్టి సారించాల్సినవి.. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, వాటి ఉద్దేశాలు, లక్ష్యాలు. గణాంకాలతో సహా తెలుసుకోవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంది.
 • మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఎన్ని చేశారు. బడ్జెట్ నిధులు ఎలా సమకూర్చుకుంటున్నారు. ఈ పథకం వల్ల ఎంత మంది, ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు.. ఇలా వివిధ అంశాలపై అవగాహన అవసరం. అదే విధంగా మిషన్ భగీరథ, హరితహారం, ఆసరా పెన్షన్ స్కీమ్ తదితర ప్రభుత్వ ముఖ్య పథకాలు, మేజర్ డెవలప్‌మెంట్స్‌ను గమనిస్తూ ఉండాలి. సొంత నోట్స్ సిద్ధం చేసుకోవాలి.
 • కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, అడవుల ప్రాధాన్యం, అడవుల రక్షణ- సమస్యలు, వీటితో పాటు సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి. ఉదా: గ్లోబల్ వార్మింగ్ (భూతాపం)కు కారణాలు, ఒప్పందాలు, పారిస్ ఒప్పందం నుంచి అమెరికా నిష్ర్కమణ తదితర అంశాలు.
 • తెలంగాణ ప్రాచీన, మధ్యయుగ చరిత్రల్లో ఆయా రాజ్య వంశాలు, వాటి హయాంలో జరిగిన సామాజిక, ఆర్థిక అభివృద్ధి, పరిస్థితులపై అవగాహన (ఉదా: కాకతీయుల కాలంలో ప్రత్యేకత ఉన్న నీటిపారుదల వ్యవస్థ) పెంచుకోవాలి. ఆధునిక తెలంగాణ చరిత్రలో నిజాం సంస్కరణలు, శిస్తులు-విధానాలు, ఆయా రంగాల అభివృద్ధి; సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఉద్యమం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • తెలంగాణలోని కవులు-రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు-వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
 • తెలంగాణ జాగ్రఫీలో.. తెలంగాణలోని ప్రధాన నదులు- పరీవాహక ప్రాంతాలు; ముఖ్య పంటలు, భౌగోళిక ప్రాధాన్య ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై అవగాహన అవసరం.
 • తెలంగాణ ఎకానమీలో.. తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్య పరిశ్రమలు - ఉత్పాదకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన ఏర్పరచుకోవాలి.
జనరల్ మ్యాథమెటిక్స్
ఇది రెండో పేపర్. ఇందులోని ప్రశ్నల క్లిష్టత పదో తరగతి స్థాయిలో ఉంటుంది. దీనికోసం సంఖ్యలు, కసాగు, గసాభా, వడ్డీ-రకాలు, కాలం-పని, కాలం-దూరం, లాభనష్టాలు, రేఖా గణితం, సంవర్గమానాలు, తిక్రోణమితి, క్షేత్ర గణితం (వైశాల్యాలు, ఘనపరిమాణాలు), స్టాటిస్టిక్స్ తదితర అంశాలను చదవాలి. సూత్రాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. చాలా మంది నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు.. జీఎస్‌లో మంచి స్కోరు చేసినప్పటికీ ఇందులో వెనుకబడి పోతుంటారు. కాబట్టి సదరు అభ్యర్థులు వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రాక్టీస్‌కు కేటాయించాలి. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న గణిత పుస్తకాలను చదవాలి.

ఎఫ్‌ఆర్‌ఓలో ఇంగ్లిష్, ఆప్షనల్ సబ్జెక్ట్
మిగిలిన అన్ని పేపర్లకు భిన్నంగా ఎఫ్‌ఆర్‌ఓలో జనరల్ ఇంగ్లిష్ ఉంటుంది. ఇందులో వొకాబ్యులరీ, పార్‌‌ట్స ఆఫ్ స్పీచ్, టెన్సెస్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, కాంప్రెహెన్షన్ తదితర అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. ఇంగ్లిష్‌పై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. దీనికోసం బేసిక్ గ్రామర్ అంశాలపై పట్టు సాధించాలి.

ఆప్షనల్ సబ్జెక్టు: పరీక్షలో అత్యధిక వెయిటేజీ ఈ విభాగానికే కేటాయించారు. అభ్యర్థి ఆసక్తి మేరకు ఆప్షనల్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులోని ప్రశ్నల క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను అధ్యయనం చేయడం మంచిది. లైఫ్ సెన్సైస్ అభ్యర్థులు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌ సబ్జెక్టును ఎంచుకుని పరీక్ష రాస్తే అత్యధిక మార్కులు పొందొచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థులు వారి సబ్జెక్టులనే ఎంచుకుంటే మంచిది. ఈ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులకు గేట్ మెటీరియల్ చదవాలి.

రిఫరెన్స్‌ పుస్తకాలు
 • ఎన్‌సీఈఆర్‌టీ ఆరు నుంచి 12వ తరగతి పుస్తకాలు (మ్యాథ్స్, సైన్స్‌, సోషల్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్).
 • ఇంగ్లిష్-రెన్ అండ్ మార్టిన్
 • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్‌ఎస్ అగర్వాల్.
 • మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్-ఆర్‌ఎస్ అగర్వాల్.
Published on 8/21/2017 4:24:00 PM

Related Topics

<