సివిల్స్, గ్రూప్స్‌కు ఏకకాలంలో సన్నద్ధత

జాతీయ స్థాయిలో లక్షల మంది లక్ష్యం.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్! రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగార్థుల టార్గెట్.. గ్రూప్స్ ఎగ్జామ్స్! ఈ పరీక్షల్లో విజయానికి కొందరు ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటే.. మరికొందరు బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ప్రణాళికలు అమలు చేస్తూ పోటీ పరీక్షల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధమయ్యే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2018 నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల కానుంది. జూన్ మొదటి వారంలో జరిగే ప్రిలిమినరీ పరీక్షకు ప్రిపరేషన్‌ను పరుగులు పెట్టించాల్సిన సమయం వచ్చింది. ఇదిలా ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి త్వరలో గ్రూప్స్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయనే వార్తలు అభ్యర్థులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

సివిల్స్ స్థాయిలో ప్రిపరేషన్...
సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ఉమ్మడిగా సన్నద్ధమయ్యే అభ్యర్థులు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. గ్రూప్స్‌తో పోల్చితే సివిల్స్ సిలబస్ కాస్త కఠినంగా ఉంటుంది. కాబట్టి సివిల్స్ సిలబస్‌ను లోతుగా చదవాలి. ఇది గ్రూప్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. సివిల్స్, గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ల్లోని సారూప్యతే దీనికి కారణం. సివిల్స్ మెయిన్స్‌లో ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్‌ను మినహాయిస్తే మిగిలిన అన్ని సబ్జెక్టులు గ్రూప్స్ సిలబస్‌లోనూ కనిపిస్తాయి.

రెండింటికీ ఉపయుక్తంగా..
అభ్యర్థులు ఒక సబ్జెక్టులోని అంశాలపై అవగాహన పొందే విషయంలో రెండు పరీక్షలకు ఉపయోగపడేలా వ్యవహరించాలి. ప్రధానంగా జనరల్ స్టడీస్, జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ వంటి సబ్జెక్టులకు సంబంధించి రెండు సిలబస్‌లను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఈ క్రమంలో ముందు ఉమ్మడి అంశాల ప్రిపరేషన్‌ను పూర్తిచేసి.. తర్వాత వేర్వేరుగా ఉన్న అంశాలపై దృష్టిసారించాలి. అభ్యర్థులు ఈ విషయంలో ఆయా పరీక్షల తేదీలకు అనుగుణంగా వ్యవహరించాలి.

ప్రశ్నల శైలికి అనుగుణంగా ప్రిపరేషన్...
యూపీఎస్సీ సివిల్స్ ప్రశ్నల శైలి.. గ్రూప్స్ ప్రశ్నల శైలికి కొంత భిన్నంగా ఉంటుంది. సివిల్స్‌లో ఎక్కువగా స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు కనిపిస్తాయి. గ్రూప్స్ పరీక్షల్లో ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలకు ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఇటీవల గ్రూప్స్ పరీక్షల్లోనూ మ్యాచింగ్స్, కొద్ది స్థాయిలో స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఒక అంశాన్ని చదువుతున్నప్పుడే కాన్సెప్ట్ ఓరియెంటేషన్‌తో ముందుకు సాగితే రెండు పరీక్షలకు ఉపయోగపడుతుంది.

సమన్వయం ఎలా?
 • ఇటీవల కాలంలో సివిల్స్, గ్రూప్స్ ఫలితాలను విశ్లేషిస్తే విజేతల్లో 30 నుంచి 40 శాతం వరకు అప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారే ఉంటున్నారు. వీరంతా ఉద్యోగాన్ని, ప్రిపరేషన్‌ను సమన్వయం చేసుకుంటూ నిర్దిష్ట ప్రణాళిక, టైం మేనేజ్‌మెంట్‌తో పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు.
 • సాధారణంగా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు రోజుకు 12 నుంచి 14 గంటలు చదువుతామని చెబుతుంటారు. ఇది ఫ్రెషర్స్ లేదా పూర్తి సమయం పోటీ పరీక్షలకు కేటాయించే అభ్యర్థులకు వీలైనా.. ఉద్యోగం చేస్తున్నవారికి కుదరదు. ఇలాంటి వారు ఏడాది పాటు రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రిపరేషన్ కొసాగిస్తే రెండు పరీక్షల సిలబస్‌ను పూర్తి చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ లెక్చర్స్ :
శిక్షణ సంస్థలు, నిపుణుల వద్ద ప్రత్యక్షంగా శిక్షణ తీసుకునే అవకాశం లేనివారికి ఆన్‌లైన్లో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. పలు ప్రముఖ వెబ్‌సైట్లు ఆన్‌లైన్ లెక్చర్స్, ఆన్‌లైన్ ట్యుటోరియల్స్‌ను అందిస్తున్నాయి. దీంతోపాటు మొబైల్ యాప్‌ల ద్వారా సివిల్స్ మెటీరియల్ అందుబాటులో ఉంది. వీటిని సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగార్థులతోపాటు జాబ్ హోల్డర్స్ కూడా సబ్జెక్టులపై పట్టు సాధించొచ్చు. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ అందిస్తున్న ప్రముఖ వెబ్ పోర్టల్స్ వివరాలు..
1. www.minglebox.com
2. www.tcyonline.com
3. www.clearias.com
4. www.wiziq.com
5. www.unacademy.com

మెటీరియల్ సేకరణలో జాగ్రత్తగా..
సాధారణంగా అభ్యర్థులు ఒక సబ్జెక్టు ప్రిపరేషన్ కోసం మూడు, నాలుగు పుస్తకాలను చదువుతుంటారు. కానీ, ఉద్యోగస్థుల విషయంలో ఇది సాధ్యం కాదు. వీరు మిగిలిన వారితో పోల్చుకోకుండా ఒక సబ్జెక్టు పరంగా సమగ్ర సమాచారం ఉన్న ఒక పుస్తకానికి పరిమితం కావడం మేలు. అయితే ఇలా ఒక పుస్తకాన్నే ఎంపిక చేసుకునే క్రమంలో నిపుణుల సలహాలు తప్పక తీసుకోవాలి.

ఆన్‌లైన్ టెస్ట్‌లతో అవగాహన...
ఇటీవల కాలంలో వెబ్ పోర్టల్స్, పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఆన్‌లైన్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. వాటికి హాజరైతే సదరు పరీక్ష శైలితోపాటు స్వీయ ప్రతిభపై అవగాహన ఏర్పడుతుంది. అదేవిధంగా పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.

మెంటారింగ్ ముఖ్యం..
 • ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ప్రిపరేషన్‌కు ఉపక్రమించినప్పటికీ.. సరైన మార్గంలో పయనించేందుకు ప్రతి సబ్జెక్టుకు ఒక మెంటార్‌ను ఎంపిక చేసుకోవాలి. సబ్జెక్టులో నిపుణులైన మెంటార్స్ ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ప్రిపరేషన్ పరంగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
 • ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు పరీక్ష తేదీకి కనీసం నెల రోజుల ముందు సెలవు పెట్టి.. పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించాలి. అలాచేస్తే సబ్జెక్టు పరంగా, మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష గదిలోకి అడుగుపెట్టొచ్చు.
రెగ్యులర్ స్టూడెంట్స్‌తో టచ్‌లో ఉండటం...
ఉద్యోగం చేస్తూ సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు.. తరచు పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులతో కమ్యూనికేట్ అవ్వాలి. ఫలితంగా తమకు తెలియని అంశాల గురించి తెలుసుకునే అవకాశంతోపాటు తాజా పరిణామాలపై అవగాహన పొందొచ్చు.

న్యూస్ పేపర్ రీడింగ్ :
జాబ్ హోల్డర్స్ ప్రిపరేషన్ పరంగా రోజూ న్యూస్ పేపర్ చదవాలి. ఇటీవల కాలంలో సివిల్స్, గ్రూప్స్ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. దాదాపు 30 నుంచి 40 శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ఆధారితంగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజూ న్యూస్ పేపర్ చదవడం, అందులోని ముఖ్య పరిణామాలను గుర్తించడం, వాటి నేపథ్యం గురించి తెలుసుకోవడం వంటివి చేయాలి.

ప్రిపరేషన్ :
చేయాల్సినవి...
 • రోజూ క్రమం తప్పకుండా చదివేలా సమయ ప్రణాళిక.
 • ఆన్‌లైన్ లెక్చర్స్, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం.
 • మెంటార్స్ గెడైన్స్ తీసుకోవడం.
 • ఫుల్‌టైమ్ ప్రిపరేషన్ సాగిస్తున్న వారితో సంప్రదింపులు.
 • కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యమిస్తూ న్యూస్ పేపర్ రీడింగ్.
చేయకూడనివి..
 • ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి నాలుగైదు పుస్తకాలు చదివే ధోరణి.
 • ప్రామాణిక మెటీరియల్ లేకుండా ప్రిపరేషన్‌కు ఉపక్రమించడం.
 • ఒక సబ్జెక్ట్/పేపర్ పూర్తయ్యాక మరో దానిపై దృష్టి పెట్టొచ్చనే ధోరణి.
 • ఇన్‌స్టంట్ గైడ్స్, కొశ్చన్ బ్యాంక్స్‌కు పరిమితం కావడం.
సమయపాలన కీలకం:
 సివిల్స్, గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ విషయంలో ప్రధాన పాత్ర పోషించేది సమయపాలనే. అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని రోజూ కచ్చితంగా కొన్ని గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. అంతేకాకుండా ఆ సమయంలోనే సివిల్స్, గ్రూప్స్ సిలబస్‌ను బేరీజు వేసుకొని, రెండింటికీ ఉపయోగపడేలా ముందుకు సాగాలి. 
- వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ.
Tags:
Civil services examinationsuccess tips Groups exams preparation tips Groups exams preparation tips Union public service commission UPSC Civil services examination 2018 notification Civil services exam syllabus Groups syllabus Civils and Groups exam preparation tips Current affairs and general knowledge Material for civil services exams Civils and Groups exam preparation candidates Civils and Groups Online tests
Published on 10/17/2017 5:27:00 PM

Related Topics