అమ్మే నడిపించింది..గ్రూప్-1 తొమ్మిదో ర్యాంకర్ సింధుప్రియ

‘లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు. 2011 గ్రూప్-1 పరీక్ష సందర్భంగా ప్రిలిమ్స్, మెయిన్స్ దశలు దాటి ఇంటర్వ్యూ పూర్తయ్యాక రద్దు కావడంతో ఆందోళన చెందా. ఆ సమయంలో అమ్మ నన్ను అడుగడుగునా ప్రోత్సాహిస్తూ వచ్చింది. నా విజయం తథ్యమని బలంగా విశ్వసించింది. ఆ ప్రోత్సాహమే నాలో ఉత్సాహాన్ని నింపింది. అమ్మ నాపై పెట్టుకున్న నమ్మకమే నన్ను ముందుకు నడిపించింది’ అంటున్నారు ఏపీపీఎస్సీ గ్రూప్-1(2016) తొమ్మిదో ర్యాంకర్ (488 మార్కులు), మహిళా విభాగంలో రెండో ర్యాంకు సాధించిన సింధూప్రియ. తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో విజయం సాధించిన సింధూ సక్సెస్ స్టోరీ తన మాటల్లోనే...
Career Guidanceమాది కడప. నాన్న చింతకుంట నారాయణ రెడ్డి, రిటైర్డ్ డిగ్రీ కాలేజీ లెక్చరర్. అమ్మ ప్రేమలత, గృహిణి. నేను ఐదో తరగతి వరకు రాజంపేట దగ్గర్లో నందలూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో.. ఆ తర్వాత ఆరు నుంచి పదోతరగతి వరకు ప్రొద్దుటూరులో చదివాను. నెల్లూరు నారాయణలో ఇంటర్, 2011లో శ్రీ విద్యానికేతన్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. చెల్లెలు జ్యోతి, ఎంటెక్ పూర్తి చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది.

ఐటీ జాబ్.. ఆర్నేల్లే
2011లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉండగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో రూ.4 లక్షల ప్యాకేజీతో కన్వర్జీస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే ఉద్యోగ జీవితం మెకానికల్‌గా అనిపించింది. అదే సమయంలో 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటికి నాకు గ్రూప్స్ పరీక్ష విధానం గురించి తెలియదు. హైదరాబాద్‌లో ఉండే బాబాయ్ విజయ కృష్ణారెడ్డి నన్ను అన్ని విధాలా మార్గనిర్దేశం చేశారు. కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు.

మధ్యలో వదిలేద్దామనుకున్నా..
కోచింగ్‌లో చేరాక.. సిలబస్ చూసి నా వల్ల కాదేమో, ఇక వదిలేద్దాం అనుకున్నా. కానీ అమ్మ ప్రోత్సాహం, బాబాయ్ గెడైన్స్‌తో ప్రిపరేషన్ కొనసాగించా. 2011 గ్రూప్-1 నోటిఫికేషన్‌కు ఇంటర్వ్యూ పూర్తయ్యాక పరీక్ష రద్దు కావడంతో నిరాశ చెందాను. మధ్యలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించి.. ఎస్‌ఎస్‌సీ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షలో 2016లో ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్నాను. ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1(2011) రీఎగ్జామ్ ఫలితాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాను.

పేపర్ చదివే అలవాటు వల్లే :
నేను గ్రూప్-1 ప్రిపరేషన్‌లో భాగంగా దినపత్రికలు ముఖ్యంగా ‘ది హిందూ’ పేపర్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చా. గత ఏడేళ్లుగా వార్తా పత్రికలు లోతుగా చదువుతుండటం నా ప్రిపరేషన్‌ను సులువు చేసింది. 2011లో కోచింగ్ తీసుకోవడం వల్ల నాకు ఆయా సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై అవగాహన వచ్చింది. బేసిక్స్‌పై పట్టుతోపాటు కరెంట్ అఫైర్స్‌ను లోతుగా చదవడం వల్ల గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను సులువుగా దాటగలిగాను.

సొంత నోట్స్‌తో మెయిన్స్ :
మెయిన్స్‌కు సంబంధించి అన్ని సబ్జెక్టులకు విడివిడిగా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. పాలిటీకి లక్ష్మీకాంత్ పుస్తకం, హిస్టరీకి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, బిపిన్ చంద్ర పుస్తకంతోపాటు ఆర్‌సీ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ నోట్స్, సైన్స్‌కు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివాను. ఎకానమీకి దినపత్రికలు చదువుతూ సొంతంగా నోట్స్ రాసుకున్నా. కీలకమైన కరెంట్ ఎఫైర్స్ కోసం దినపత్రికలతోపాటు రాజ్యసభ టీవీ డిస్కషన్స్ చూడటం ఉపకరించింది. డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లిష్ పేపర్లకు ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ప్రిపరేషన్ ఉపయోగపడింది. నాకు చిన్ననాటి నుంచి మ్యాథ్స్‌లో మంచి మార్కులు వచ్చేవి. దీంతో డేటా ఇంటర్‌ప్రిటేషన్ పేపర్ పెద్దగా కష్టంగా అనిపించలేదు.

జాబ్ ప్రొఫైల్‌పై ప్రశ్నలు :
ఇంటర్య్యూలో పూర్తిగా ప్రస్తుత నా జాబ్ ప్రొఫైల్ మీద ప్రశ్నలు అడిగారు. పన్నుల విధానానికి సంబంధించిన సాంకేతిక పదజాలంతోపాటు, జీఎస్టీపై నా అభిప్రాయం తెలుసుకునే విధంగా ప్రశ్నలు అడిగారు. అలాగే ప్రత్యేక హోదా, పెద్ద నోట్ల రద్దు, పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం, మహిళా రిజర్వేషన్ బిల్లు తదితర అంశాలపై ఇంటర్వూ బోర్డ్ ప్రశ్నలు సంధించింది.

సహనానికి పరీక్ష !
గ్రూప్-1 వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే.. హార్డ్‌వర్క్‌తోపాటు ఎంతో సహనం ఉండాలి. కష్టపడి చదువుతూ పూర్తిగా ప్రిపరేషన్‌లో లీనమైతే తప్ప విజయం సాధించడం కష్టం. ఇతరులతో పోల్చుకుంటూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. కొన్నిసార్లు ఒత్తిడి అనిపించినా ‘నెవర్ గివప్’ అటిట్యూడ్‌తో చదవాలి. కోచింగ్ తప్పనిసరి కాకున్నా.. గెడైన్స్, సిలబస్ పరిధి, ఎంతవరకు చదవాలి, ఏయే అంశాలపై దృష్టి సారించాలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాకు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్(సీటీవో) పోస్టు వచ్చే అవకాశముంది. మున్ముందు డిప్యూటీ కలెక్టర్ పోస్టు లక్ష్యంగా ప్రిపరేషన్ సాగించాలనుకుంటున్నా!!

ప్రొఫైల్..
పదో తరగతి మార్కులు:
543
ఇంటర్: 945
బీటెక్: 82 శాతం(జేఎన్‌టీయూ అనంతపురం నుంచి గోల్డ్ మెడలిస్ట్)
Tags:
APPSC Group 1 2016 toppers APPSC Group-1 2016 results Group 1 topper success tips Group-1 topper Nishanth reddy Group 1 topper Sindhu Priya Andhra pradesh public service commission Nishanth reddy Sindhu Priya APPSC Group-1 interview questions
Published on 3/26/2018 12:27:00 PM

Related Topics