గ్రూప్ -1 ఇంటర్వ్యూ గైడెన్స్

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు జనవరి 8న విడుదల చేసింది. మొత్తం 314 ఖాళీలకు 1:2 చొప్పున 606 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 28 నుంచి నాంపల్లిలోని ఎపీపీఎస్సీ కార్యాలయంలో మౌఖిక పరీక్షలు నిర్వహించనుంది. 2011లో జారీ అయిన నోటిఫికేషన్‌కు 2012 మే 27న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పదివేలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా అందులో 606 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో గత విజేతలకు ఇంటర్వ్యూలో ఎదురైన సవాళ్లు, అనుభవాలు, విజేతగా నిలవాలంటే ఎలా సిద్ధమవ్వాలి, వంటి సమాచార సమాహారం మీ కోసం...

ఏ ఇంటర్వ్యూ బోర్డ్ అయినా అభ్యర్థిలో ఏం చూస్తుంది? తాను ప్రయత్నిస్తున్న ఉద్యోగానికి సదరు అభ్యర్థి సరిపోతాడా, లేదా అనే. ఈ సమయంలో అభ్యర్థి భావ వ్యక్తీకరణ, తార్కిక విశ్లేషణ శక్తి, మానసిక స్థిరత్వం, సమాజం పట్ల అవగాహన, అంకితభావం, నిజాయితీ వంటి అంశాలను పరిశీలిస్తారు. అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులు అభ్యర్థిని తికమకపెట్టే, అసహనానికి గురయ్యే ప్రశ్నలు అడగొచ్చు. ఈ సమయంలో సహనం కోల్పోకుండా, ఆలోచించి తార్కికంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతే తప్ప తెలియంది తెలిసినట్టు నటించి ఏదో చెప్పబోయి అభాసు పాలవడం మంచిది కాదు. ఏ ఇంటర్వ్యూ అయినా స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి అనవసర బేషజాలకు తావివ్వకుండా మర్యాదపూర్వక వాతావరణంలో ఇంటర్వ్యూను ఎదుర్కోవడం ఉత్తమం.

ఇంటర్వ్యూకు ముందు, ఇంటర్వ్యూలో చేయాల్సినవి:
 1. అన్నింటికంటే ముఖ్యంగా మీపై మీకు పూర్తి నమ్మకం, మీరు చేసిన, చేస్తున్న పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. ఎందుకంటే.. మీ గురించి మీ కంటే బాగా ఇతరులకు తెలిసే అవకాశం లేదు.
 2. సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి. ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్న అంశాలపై కనీస పరిజ్ఞానం అవసరం. ఇంటర్వ్యూకు వెళ్లే రోజు కనీసం ఒక తెలుగు, ఇంగ్లిష్ పేపర్‌లోని వార్తలను చూసుకొని వెళ్లాలి.
 3. మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, సానుకూల, ప్రతికూల అంశాలను పరిశీలించుకోవడం మంచిది. దీని వల్ల భయం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
 4. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు సరిచూసుకోవాలి.
 5. వస్త్రధారణ గౌరవనీయంగా ఉండాలి. లేత రంగు దుస్తులు ధరించాలి. ఫర్‌ఫ్యూమ్, కాస్మోటిక్స్ వాడకూడదు. మరీ ఎక్కువగా అలంకరించుకోకూడదు. చూడగానే ఎదుటివారి దృష్టిని ఆకర్షించేలా ఉండాలి.
 6. ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి అరగంట ముందుగానే చేరుకోవడం వల్ల చివరిక్షణంలో జరిగే ఆందోళనకు స్వస్తి చెప్పవచ్చు.
 7. ఇంటర్వ్యూ సమయంలో ఏకాగ్రతతో వినడం, మర్యాద పూర్వకంగా సమాధానలివ్వడం వల్ల బోర్డు సభ్యుల దృష్టిని ఆకర్షించవచ్చు. లేనిపోని అడంబరాలకు పోయి ఇరుకున పడకూడదు.
 8. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి నిష్ర్కమించాలి. మీకేమైనా సందేహాలుంటే.. వారిని అడగొచ్చు. అది కూడా పాజిటివ్ దృక్పథంతోనే అడగాలి.
చేయకూడనివి:
 1. అతిగా అలంకరించుకోవడం, ఆడంబరాలకు పోవడం చేయకూడదు.
 2. ఇంటర్వ్యూ కేంద్రానికి ఆలస్యంగా వెళ్లడం మంచిది కాదు.
 3. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు మన ప్రవర్తన కీలకం. దిక్కులు చూడటం, గోళ్లు కొరకడం, నీరసంగా కన్పించడం, చేతులు కట్టుకోవడం చేయకూడదు.
 4. అనవసర వాదోపవాదనలకు తావివ్వకూడదు. ఎందుకంటే.. బోర్డు సభ్యులు మీతో వాదించడానికి అక్కడ కూర్చోలేదు. మీరు కూడా అక్కడికి వాదనకు రాలేదన్న సంగతి గుర్తించాలి.
 5. మీరు గతంలో పని చేసిన సంస్థ, మీకు పరిచయం ఉన్న ప్రభుత్వోద్యోగులు, ఇతరులను కించపరిచే విధంగా, వారిపై అభియోగాలు మోపడం వంటివి చేయకూడదు.
సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు
 1. మీ గురించి చెప్పండి?
 2. వ్యక్తిగతంగా మీ బలాలు, బలహీనతలు?
 3. మీకు అత్యంత ఇష్టమైనవి ఏవి? ఎందుకు?
 4. మీ విజయాలు, అపజయాల గురించి చెప్పండి?
 5. పెద్దవాళ్లను ఎందుకు గౌరవించాలి?
 6. మీ హాబీస్‌కు సంబంధించిన ప్రశ్నలు?
 7. మీ గ్రాడ్యుయేషన్ గురించి చెప్పండి?
 8. గతంలో మీరు చేసిన ఉద్యోగం ఏంటి? ఇప్పుడు దీనికి రావడానికి కారణం?
 9. మీ జిల్లా గొప్పతనం? అక్కడి ప్రముఖుల గురించి మీకేం తెలుసు?
 10. ఇంటర్వ్యూలో విజయం సాధించకపోతే మీరేం చేస్తారు?
 11. మీరు ఇంకొకరి స్థానంలో ఉంటే ఏం చేసేవారు?
 12. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు మీరిచ్చే పరిష్కారం?
ఆ మూడింటిపై ముఖ్య దృష్టి:
గ్రూప్-1 ఇంటర్వ్యూకి హాజరవుతున్న అభ్యర్థులు ముఖ్యంగా మూడు అంశాలపై దృష్టి సారించాలి. అవి.. సమకాలీన అంశాలు; వ్యక్తిగత వివరాలు; విద్యా నేపథ్యం-పరిజ్ఞానం. సాధారణంగా ఇంట ర్వ్యూ బోర్డ్ సభ్యులు అడిగే ప్రశ్నలు అధికశాతం వీటి నుంచే ఉంటాయి. సమకాలీన అంశాలకు సంబంధించి.. తాజాగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా తాజా చర్చ నీయాంశాలపై అవగాహన పొందాలి. విద్యా నేపథ్యానికి సంబంధించి.. తమ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్‌ల్లో బేసిక్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. కనీసం 10 నుంచి 15 శాతం ప్రశ్నలు వీటిపైనే ఉంటాయి. వ్యక్తిగత వివరాలు- లక్ష్యాలకు సంబంధించి.. అభ్యర్థులు తమ పేరు మొదలు, తమ ప్రాంత నేపథ్యం, చారిత్రక విశేషాలు ఉంటే వాటి గురించి, ‘పేరు’లోనూ ఇమిడి ఉన్న చారిత్రక ప్రాధాన్యం గురించి తెలిసుండాలి. ఉదాహరణకు మా ఇంటిపేరు గోండు... దీంతో మీ ఇంటి పేరుకు.. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధం ఉంది? వివరించగలరా? అని అడిగారు. వాస్తవానికి గోండు ఒక గిరిజన వర్గం. ఈ వర్గం జనాభా ఆదిలాబాద్‌లో అధికంగా ఉంటారు.

ఇలా ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ప్రతి అంశాన్ని క్షుణ్నంగా తెలుసుకుని ఉండాలి. అంతమాత్రాన తెలియని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకుంటే ఆందోళన అవసరం లేదు. ఆ విషయాన్ని నిజాయితీగా బోర్డుకు చెప్పాలి. కానీ తెలియకపోయినా.. ‘తెలుసు’ అనే రీతిలో తప్పు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. అంతేకాకుండా సగం మాత్రమే తెలిసిన ప్రశ్నల విషయంలోనూ తెలిసినంత వరకే చెప్పి.. పూర్తి వివరాలు తెలుసుకుంటాను అనే సమాధానం ఇవ్వాలి. దీనివల్ల అభ్యర్థికి ఉత్సుకత, తపన ఉన్నాయనే కోణంలో బోర్డును మెప్పించే వీలు కలుగుతుంది.

చెప్పే సమాధానాలు కూడా ఏకపంథాగా ఉండకూడదు. విమర్శతో కూడిన సమాధానాలు చెప్పడం అసలు సరికాదు. సమతుల్యత పాటిస్తూ.. లోపాలను తెలియజేస్తూ.. వాటిని సరిదిద్దే పరిష్కార మార్గాలను చూపే విధంగా సమాధానం ఇవ్వాలి. అంటే స్థూలంగా విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించే రీతిలో సమాధానాలు ఇవ్వాలి.

ప్రస్తుతం ఇంటర్వ్యూకి హాజరవుతున్న అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ తేదీకి కనీసం 15 రోజుల ముందు నుంచి కచ్చితంగా ఒక తెలుగు, ఒక ఇంగ్లిష్ దినపత్రికను సమగ్రంగా చదవాలి. ఇంటర్వ్యూ తేదీ రోజు కూడా ఒక తెలుగు, ఒక ఇంగ్లిష్ పేపర్‌ను కచ్చితంగా చదివి సిద్ధంగా ఉండాలి. సగటున 20 ప్రశ్నలు అడిగే ఇంటర్వ్యూలో కనీసం అయిదు ఇంటర్వ్యూ రోజునాటి న్యూస్ పేపర్‌లోని ముఖ్యాంశాలపైనే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. కాబట్టి అభ్యర్థులు కచ్చితంగా దీన్ని గుర్తించాలి. అంతేకాకుండా ఎడిటోరియల్స్‌ను ఆసాంతం చదవడం ఎంతో ప్రయోజనకరం.

అడిగిన ప్రశ్నలు:
 1. దేశంలో బాల కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది? దీన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు?
 2. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన కొన్ని పథకాలు విఫలమవుతున్నాయి? కారణాలు చర్చించండి?
 3. ప్రభుత్వాలు మారినప్పుడు ఉద్దేశం ఒకటే అయినప్పటికీ ఆయా పథకాల పేర్లు మారుతున్నాయి? ఎందుకు?
 4. చెనా నుంచి దిగుమతి అవుతూ చౌకగా లభిస్తున్న వస్తువులు భారత ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావం?
 5. అరబ్ సంక్షోభం?
 6. ‘గోండు’ పదానికి, ఆదిలాబాద్ జిల్లాకు ఉన్న సంబంధం?
 7. భూమి గుండ్రంగా ఉంటుంది. సముద్రం సమతలంగా ఉంటుంది? కారణం?
 8. టూనా చేప ప్రత్యేకత?
 9. వ్యవసాయానికి సంబంధించి స్వామినాథన్ కమిటీ సూచించిన మెకనైజేషన్ గురించి వివరిస్తారా?
 10. మీ దృష్టిలో సమాజంలో మీరు గొప్ప వ్యక్తులుగా భావించే వారెవరు?
జి. చక్రధర రావు
ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్, కర్నూలు
ఇంటర్వ్యూ: 20 నిమిషాలు మార్కులు: 54

వ్యక్తిత్వ పరీక్ష... ఇంటర్వ్యూ
గ్రూప్-1 ఇంటర్వ్యూకి సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు.. ఒక నిర్దిష్ట అంశం లేదా ప్రశ్నను వివరించగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి. వాస్తవానికి బోర్డ్ ఆశించేది కూడా అలాంటి వ్యక్తిత్వాన్నే. మనం ఇంటర్వ్యూ అని సంబోధిస్తున్నాం.. కానీ అది పర్సనాలిటీ టెస్ట్. అంటే వ్యక్తిత్వ పరీక్ష. కాబట్టి అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో తమ వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాలి. అదే సమయంలో ప్రస్తుతం సమకాలీనంగా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై కచ్చితమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా గత రెండు మూడు నెలలుగా వార్తల్లో నిలుస్తున్న అంతర్జాతీయ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఇంటర్వ్యూ సమయంలో సమయోచితంగా, సందర్భానుసారంగా స్పందించే నైపుణ్యం అలవర్చుకోవాలి. బోర్డ్ సభ్యులతో వాదనకు దిగకూడదు. కొన్ని సందర్భాల్లో బోర్డ్ సభ్యులే ఉద్దేశపూర్వకంగా అవాస్తవ వ్యాఖ్యలు చేసి స్పందించమని అడుగుతారు. దీనికి కారణం.. అభ్యర్థి వాస్తవ వ్యక్తిత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడమే. ఇలాంటి ప్రశ్నలకు కొందరు తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. మరికొందరు బోర్డ్ సభ్యులు మెచ్చుకుంటారనే ఉద్దేశంతో వారు చెప్పింది సరైనది అనే కోణంలో స్పందిస్తారు. ఈ రెండూ సరికాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ‘నా ఉద్దేశంలో వాస్తవమిది’.. అనే ధోరణిలో సమాధానం చెప్పి, మెప్పించాలి. అడిగే ప్రశ్నలన్నీ అభ్యర్థుల నుంచి అభిప్రాయలని, సంబంధిత పరిజ్ఞానాన్ని ఆశించే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి.

అడిగిన ప్రశ్నలు:
 1. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే వివరించండి?
 2. మేఘ మథనం అంటే ఏంటి? ఆ ప్రక్రియలో వినియోగించే రసాయనం? ఆ ప్రక్రియ విఫలమైందా.. లేదా సఫలమైందా? విఫలైమేతే కారణం ఏంటి?
 3. కంప్యూటర్‌లో ఫిషింగ్ (Phishing) అంటే ఏంటి?
 4. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రత్యేకత ఏంటి?
 5. 2007లోనే బీటెక్ పూర్తి చేశారు కదా? ఇన్ని రోజులు ఏం చేశారు?
 6. సాఫ్ట్‌వేర్ రంగం విస్తృతి కారణంగా మన సంస్కృతి ప్రాశస్త్యం తగ్గుతోంది? దీనిపై మీ స్పందన?
 7. భారత స్త్రీలో ప్రత్యేక లక్షణాలు?
 8. కోడలు దిద్దిన కాపురం సినిమా చూశారా? అందులో కోడలు లక్షణాలు ఏంటి?
 9. ప్రియాంక చోప్రా ఎలా మిస్ యూనివర్స్ అయింది? (నా పేరు ప్రియాంక కావడంతో ఈ ప్రశ్న)
 10. ప్రస్తుతం దేశంలో మహిళా ముఖ్యమంత్రులు పేర్లు చెప్పండి?
సి.హెచ్. ప్రియాంక
ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్, కృష్ణా జిల్లా
ఇంటర్వ్యూ: 15 నిమిషాలు, మార్కులు: 49.5

విశ్లేషణ నైపుణ్యంతో విజయం దిశగా
కాన్ఫిడెన్స్, ప్రాక్టికాలిటీ, హానెస్టీ.. ప్రస్తుత అభ్యర్థులు సొంతం చేసుకోవాల్సిన మూడు ప్రధాన లక్షణాలు. సాధారణంగా ఇంటర్వ్యూలో అధిక శాతం కరెంట్ అఫైర్స్ అందులోనూ భారత్- ఇతర దేశాల సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తోంది. ప్రతి అంశానికి నేపథ్యం, వర్తమాన పరిణామాలు, భవిష్యత్తులో ఏం జరగొచ్చు? అనే మూడు కోణాల్లో విశ్లేషించే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. ఇలా సమాచార సేకరణతోపాటు దాన్ని విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇంటర్వ్యూలో సగటున ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడానికి లభించే సమయం ఒకటి లేదా ఒకటిన్నర నిమిషం ఉంటుంది. దీంతో ఈ సమయంలోనే విశ్లేషణాత్మకంగా, తడబడకుండా సమాధానం చెప్పగలిగేలా పట్టు సాధించాలి. వీలైతే గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్‌కు హాజరు కావడం వంటి వ్యూహాలు అనుసరించాలి. బయోడేటా, విద్యా నేపథ్యం నుంచి కచ్చితంగా రెండు, మూడు ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల వీటి విషయంలోనూ ప్రాధాన్యం ఇవ్వాలి. బయోడేటాలో పేర్కొన్న ప్రతి అక్షరంపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అంతమాత్రాన బోర్డ్ సభ్యులంటే భయపెట్టేవారనే అపోహ సరికాదు. వీలైనంత మేరకు అభ్యర్థులను ఆహ్లాదభరిత వాతావరణంలో ఉంచేందుకే ప్రయత్నిస్తారు.

అడిగిన ప్రశ్నలు:
 1. మాల్దీవుల్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు?
 2. INDIRAMMAఇళ్లు పథకం పేరులో ఇందిరమ్మను విస్తరించండి?
 3. ప్రభుత్వ పరిపాలనలో కంప్యూటర్ సైన్స్‌ను వినియోగించి ఇప్పటి వరకు అమలు చేయని పథకం ఏమైనా ఉందా?
 4. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి?
 5. If you want to achieve something, you will have to loose something? దీనిపై మీ స్పందన?
పి. మహేశ్
ట్రైనీ డీఎస్పీ
ఇంటర్వ్యూ : 25 నిమిషాలు, మార్కులు: 59

నిజాయితీకి పెద్దపీట:
ఇంటర్వ్యూకి హాజరవుతున్న అభ్యర్థులు నిజాయితీకి పెద్దపీట వేసే విధంగా అడుగులు వేయాలి. ఇక్కడ విద్యా నేపథ్యం, అకడెమిక్‌గా సాధించిన గోల్డ్‌మెడల్స్, ర్యాంకులు ఏవీ పరిగణనలోకి రావు. కాబట్టి అభ్యర్థులు బోర్డ్ సభ్యులను తప్పుదోవ పట్టించే రీతిలో వ్యవహరించకూడదు. తెలియని అంశాల గురించి నిర్భయంగా తెలియదు అని చెప్పడం మేలు. ప్రతి అభ్యర్థికి తెలియని ప్రశ్నలనేవి 40 శాతం వరకు ఎదురవుతాయి. ఇక.. అభ్యర్థులు ప్రిపరేషన్ పరంగా ఒక అంశంపై సొంతంగా నిర్దిష్ట అభిప్రాయం కలిగుండేలా అవగాహన ఏర్పరచుకోవాలి. అంటే ఒక గ్రూప్-1 స్థాయి అధికారికి నిర్ణయాత్మక శక్తి సామర్థ్యాలు తమలో కలిగున్నాయని తెలిపే విధంగా తమను తాము తీర్చి దిద్దుకోవాలి. ప్రస్తుత అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సముచితం. వీటితోపాటు బయోడేటా, తమ ప్రాంత చరిత్ర లేదా ప్రాధాన్యం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చేటప్పుడు తడబడాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం.. ఒక అంశంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఈ నేపథ్యంలో 12 మంది ఉండే బోర్డులో అందరినీ మెప్పించామా? లేదా అని ఆలోచించకుండా ప్రశ్నకు సరితూగే సమాధానాన్ని చెప్పే సామర్థ్యం తెచ్చుకోవాలి. ఉద్యోగస్తులు తమ రంగానికి సంబంధించిన అంశాలపై అవగాహనతో ఉండాలి.

అడిగిన ప్రశ్నలు:
 1. పశ్చిమాసియా సంక్షోభం, కారణాలు?
 2. అమెరికాలో ప్రభుత్వాల మార్పిడి డెమోక్రటిక్స్ / రిపబ్లికన్స్ మధ్యనే జరుగుతుంది. దీనికి కారణమేంటి?
 3. లోక్‌పాల్ గురించి వివరిస్తారా?
 4. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? కర్బన బంధం ఏంటి?
 5. ప్రస్తుతం దేశంలో అవినీతి గురించి మీ అభిప్రాయం?
 6. ప్రైవేటు బ్యాంకులతో పోల్చితే జాతీయ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల విలువ ఎక్కువ? కారణమేంటి?
 7. సింగరేణి గనుల్లో ఉత్పత్తయ్యే బొగ్గు సుపీరియర్ క్వాలిటీయా లేదా ఇన్ఫీరియర్ క్వాలిటీయా?
 8. ఉస్మానియా యూనివర్సిటీలో మీ నేతృత్వంలో విద్యార్థి సంఘాన్ని ఎలా సమర్థంగా నడిపించారు?
రవీంద్ర నాయక్, ట్రైనీ డీఎస్పీ
ఇంటర్వ్యూ: 20 నిమిషాలు మార్కులు: 29.75

సమకాలీన అంశాలు + సబ్జెక్ట్.. సమన్వయంతో
త్వరలో నిర్వహించనున్న గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు.. సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవడంతోపాటు వాటికి సంబంధించి సబ్జెక్ట్ నేపథ్యాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఉదాహరణకు పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 117వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అధికరణలు తదితరాలను తాజా సవరణతో అనుసంధానం చేసుకుని సన్నద్ధం కావాలి. అదే విధంగా ప్రశ్నలను విశ్లేషించాల్సి ఉంటుంది. దీంతో ఆ నైపుణ్యం అలవర్చుకోవాలి. ఉదాహరణకు కరెంట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్నకు దాని వెనుక ఉన్న కారణాలు (ఇంధన కొరత, డిమాండ్-సప్లయ్ మధ్య వ్యత్యాసం తదితర) విశ్లేషించాలి. వీటితోపాటు అభ్యర్థులు ముఖ్యంగా దృష్టి సారించాల్సిన అంశాలు అంతర్జాతీయ, జాతీయ అంశాలు. అనునిత్యం వార్తల్లో ప్రధానాంశాలుగా నిలుస్తున్న వాటిని గుర్తించి.. గ్రూప్-1 అధికారి అయితే సమస్యను ఎలా పరిష్కరించొచ్చు? అనే కోణంలో విశ్లేషించాలి. ఇక.. చాలామందికి ఉండే అపోహ సీనియర్స్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయని! ఇది అపోహ మాత్రమే అని గుర్తించాలి. ఎంపికవుతున్న వారిలో 60 నుంచి 70 శాతం మంది ఫ్రెషర్స్ ఉంటున్నారు. కాబట్టి ఫ్రెషర్స్ ఎలాంటి బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి. మరో అపోహ ఇంటర్వ్యూ ఎక్కువ సమయం జరిగితే సానుకూల ఫలితం వస్తుందని, తక్కువ సమయంలో ముగిస్తే ప్రతికూల ఫలితం వస్తుందని. దీన్ని కూడా విడనాడాలి. ఇంటర్వ్యూ జరిగే సమయం మనపైనే ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. మనం ఎంత చక్కగా విశ్లేషిస్తూ సమాధానాలు చెబుతుంటే.. అంతే స్థాయిలో బోర్డ్ స్పందించి సమయం పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అపోహలు వీడి ప్రస్తుత సమయంలో కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ నేపథ్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుని ఇంటర్వ్యూ నాటికి పూర్తి పరిపూర్ణతతో అడుగు పెట్టాలి.

అడిగిన ప్రశ్నలు:
 1. కుటుంబ నేపథ్యం
 2. భూ సేకరణ విధి విధానాలు (అప్పటికే నేను డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగం చేస్తుండటంతో ఈ ప్రశ్న)
 3. డార్వినిజం సిద్ధాంతం, నియో డార్వినిజం సిద్ధాంతం మధ్య తేడా?
 4. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ అంటే ఏంటి? రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏంటి?
 5. బెర్ముడా ట్రయాంగిల్ గురించి వివరించండి?
 6. ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తేడా?
 7. ఆర్‌డీఓ పోస్టునే ఎందుకు తొలి ప్రాథమ్యంగా ఎంచుకున్నారు?
 8. చిత్తడి నేలల దినోత్సవం ప్రాధాన్యం? బయో డైవర్సిటీని ఎందుకు పరిరక్షించాలి? (ఇంటర్వ్యూ జరిగిన తేదీ ఫిబ్రవరి 2 చిత్తడి నేలల దినోత్సవం నేపథ్యంలో ఈ ప్రశ్న)
 9. మీ ముద్దుపేరు
ఎం.పురేంద్ర, ఆర్‌టీఓ, ఏలూరు.
ఇంటర్వ్యూ: 25 నిమిషాలు, మార్కులు: 52

వ్యక్తిత్వం, విద్యా నేపథ్యం.. రెండూ..
ప్రస్తుత అభ్యర్థులు వ్యక్తిత్వానికి, అన్ని రకాల నేపథ్యాలకి (విద్య, ఉద్యోగం, కుటుంబం, ప్రాంతం, ఊరు, పేరు) ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. పేరు నుంచి ప్రపంచం వరకు ఎక్కడ్నుంచైనా ప్రశ్నలు అడగొచ్చు. ఒకవేళ పేరుకు సంబంధించి ఏమైనా ప్రాముఖ్యం ఉంటే, దాని గురించి తెలుసుకోవాలి. అదే విధంగా సొంత ఊరు, జిల్లా చరిత్రలపై అవగాహన తప్పనిసరి. ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగులు అధికంగా ఇంటర్వ్యూకి ఎంపికవుతున్నారు. అలాంటి అభ్యర్థులు ఆకర్షణీయమైన జీతాలుండే ఐటీ రంగాన్ని వదులుకుని, ప్రభుత్వ ఉద్యోగం దిశగా రావడానికి గల కారణాలను సంతృప్తి పరచే విధంగా విశ్లేషించాలి. ఇంటర్వ్యూలో అధికశాతం ఎకానమీ, పాలిటీ సంబంధ ప్రశ్నలే ఉంటున్నాయి. ఎకానమీ ప్రశ్నలు కూడా కరెంట్ అఫైర్స్ మిళితంగా ఉంటున్నాయి. వీటికోసం.. ఎకానమీ ప్రత్యేక దినపత్రికలు చదవాలి. అంతేకాకుండా ప్రతిరోజు దినపత్రికల్లో వచ్చే ఎకానమీ ఆర్టికల్స్ లేదా ఎడిటోరియల్స్‌ను ఔపోసన పట్టాలి. దీంతోపాటు చాలామంది సివిల్స్‌కు సన్నద్ధమవుతూ గ్రూప్-1 ఇంటర్వ్యూకి ఎంపికవుతారు. అలాంటి అభ్యర్థుల విషయంలో వారు సివిల్స్‌లో ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్టులపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఫ్రెషర్స్ అయితే వ్యక్తిగత నేపథ్యంతోపాటు తమ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్‌ల పునశ్చరణ చేసుకోవడం ఉపయుక్తం.

అడిగిన ప్రశ్నలు:
 1. ఆర్థికవేత్తలు పాల్ క్రూగ్‌మన్, అమర్త్యసేన్‌ల మధ్య తేడా?
 2. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా ఎలా ఉంది? ఎలా ఉండాలి? దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందా? ఉంటే ఎలా నియంత్రించొచ్చు?
 3. 2008 ఆర్థిక సంక్షోభం - కారణాలు?
 4. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి?
 5. క్రెడిట్ కార్డ్‌ల ఉపయోగాలు?
 6. మనీ ల్యాండరింగ్ అంటే ఏంటి?
 7. ప్రభుత్వ సర్వీస్‌లో మీకు సైకాలజీ సబ్జెక్ట్ ఎలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు?
వి. సిరి ఆనంద్, ఆర్‌టీఓ, విజయవాడ
ఇంటర్వ్యూ: 20 నిమిషాలు మార్కులు: 56

స్పందించే తీరే విజయానికి సోపానం
గ్రూప్-1 ఇంటర్వ్యూలో విజయానికి ముఖ్య సోపానం.. బోర్డ్ సభ్యులు అడిగే ప్రశ్నలకు లేదా ఆ ప్రశ్నల్లో పేర్కొన్న సంఘటనలకు అభ్యర్థులు స్పందించే తీరే. అందువల్ల మెయిన్స్ వరకు రాత పరీక్ష కోణంలో రైటింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చిన అభ్యర్థులు ఇప్పుడు.. స్పీకింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాక ప్రిపరేషన్‌ను నాలెడ్జ్ బేస్డ్‌గా సాగించడంతోపాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలి. ఏదైనా ఒక నిర్దిష్ట అంశాన్ని ఎంచుకుని దానికి సంబంధించిన విషయాలను.. అద్దం ముందు నిలబడి మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి. ఫలితంగా హావభావాల్లో లోపాలు, బలాలు, బలహీనతలు తెలుస్తాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూలో అధికశాతం కరెంట్ అఫైర్స్ గురించే అడుగుతున్నారు. కాబట్టి కచ్చితంగా ప్రతి రోజు ఒక ఇంగ్లిష్, ఒక తెలుగు దినపత్రికను చదవి అందులోని ముఖ్యాంశాలను, ప్రముఖుల అభిప్రాయాలు గుర్తుంచుకోవాలి. దీంతోపాటు ప్రతి అంశంపై తమకంటూ ఒక నిర్దిష్ట అభిప్రాయం దాన్ని సమర్ధించుకునే విధంగా కారణాలు సిద్ధం చేసుకోవాలి. ఇక.. ఇంటర్వ్యూ సమయంలో మొహంలో నవ్వు చెదరకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వ్యవహరించాలి. ఇంటర్వ్యూకు ముందు లభించే సమయంలో సహచరులతో మాట్లాడటం వల్ల బెరుకుదనం కొంత తగ్గించుకోవచ్చు.

అడిగిన ప్రశ్నలు:
 1. వరకట్న హత్యలు- కారణాలు?
 2. జి.ఐ.ఎస్. అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?
 3. సెబీ పనితీరు ఏంటి?
 4. ఒక చిన్న తప్పుతో సత్యం రామలింగరాజు శిక్షకు గురయ్యారు. కానీ ఆయన వల్లే ఐటీ రంగంలో రాష్ట్రానికి గుర్తింపు వచ్చింది. ఈ కారణంగా ఆయనకు విముక్తి కల్పించవచ్చు కదా? దీనిపై మీ అభిప్రాయం.
 5. వీటితోపాటు అప్పటికే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ ఆప్షనల్స్‌గా జాగ్రఫీ, సైకాలజీ ఎంచుకోవడంతో వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
వి. సుష్మా కృష్ణారెడ్డి
ట్రైనీ సీటీఓ, హైదరాబాద్
ఇంటర్వ్యూ: 25 నిమిషాలు మార్కులు: 56

‘సేవా దృక్పథం’.. సంతృప్తిపరచేలా
అభ్యర్థులు నిర్ణయాత్మక శక్తిని పెంచుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. వాస్తవానికి ఇంటర్వ్యూలో.. అభ్యర్థి తన సబ్జెక్ట్ నైపుణ్యాన్ని ప్రజా సేవలో ఎలా, ఏ మేరకు వినియోగించగలరు లేదా అన్వయించగలరు తద్వారా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోగలరు? అని ఆశించే విధంగా బోర్డ్ సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ప్రస్తుతమున్న సమయంలో 70 శాతం కరెంట్ అఫైర్స్‌కు, 30 శాతం సమయాన్ని ఆయా అంశాల విశ్లేషణకు కేటాయించాలి. ఆయా అంశాలపై అనర్గళంగా వ్యాఖ్యానించే నైపుణ్యం పెంచుకునేందుకు కృషి చేయాలి. స్థూలంగా చెప్పాలంటే పుంఖానుపుంఖాలుగా చదివిన అంశాలను కొన్ని పదాలు, లేదా వాక్యాల్లో చెప్పే లక్షణం అలవర్చుకోవాలి. ఇక.. ఇంటర్వ్యూ సమయంలో ఎలాంటి భావోద్వేగాలకు లోనవకుండా సమతుల్యత పాటిస్తూ సమాధానాలు ఇవ్వాలి. ఇంటర్వ్యూ అనేది జీవితంలో చాలా ముఖ్యమైన, జీవితాన్ని మలుపు తిప్పే అరుదైన అవకాశం. దీన్ని చేజార్చుకోకూడదు. ఎలాంటి ఒత్తిడికి లోనవద్దు. బోర్డ్ రూంలో కూడా స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నాడని భావిస్తే.. వారిని సాధారణ స్థితికి తెచ్చేందుకు బోర్డ్ సభ్యులు కూడా ఎంతో సహకరిస్తారు. కారణం.. ఒక వ్యక్తి నిజ వ్యక్తిత్వం వెలుగులోకి రావాలంటే అతణ్ని సాధారణ స్థితికి తేవాలి. అప్పుడే సరైన రీతిలో స్పందన వస్తుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా 15 లేదా 20 నిమిషాలపాటు మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఆశించిన ఫలితం అందుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం చాలామంది ‘ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో’ గ్రూప్-1 రాశాను అని చెబుతారు. ఆ సమాధానాన్ని సంతృప్తి పరచేవిధంగా బోర్డ్ సభ్యులను మెప్పించాలి. వ్యక్తిగతంగా లేదా స్నేహితులతో కలిసి ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే వాటి గురించి వివరించొచ్చు.

అడిగిన ప్రశ్నలు:
 1. మీరు నన్ను ఆర్డీఓ పోస్టుకు ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే నన్ను ఏం అడుగుతారు? (చైర్ పర్సన్ రేఛల్ ఛటర్జీ అడిగిన ప్రశ్న)
 2. మీలోని నాయకత్వ లక్షణాలు? గుర్తించదగిన సంఘటనలు?
 3. పాకిస్థాన్ ఆర్మీ, ప్రభుత్వం మధ్య వివాదం గురించి వివరించండి?
 4. ఐటీ నుంచి ప్రభుత్వ సర్వీస్‌కు ఎందుకు రావాలనుకుంటున్నారు? ప్రభుత్వ పథకాల్లో ఐటీని ఎలా వినియోగిస్తారు?
 5. శ్రీలంకలో తమిళులపై వివక్ష,వివాదాలకు కారణాలు? ట స్ఫూర్తి ప్రధాత?
 6. రష్యాలో భగవద్గీతపై కోర్టు నిషేధం- కారణాలు తెలపండి?
 7. 8.85 కోట్లు జనాభా ఉన్న రాష్ట్రంలో 2.25 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్ కార్డుల జారీ అవసరమా?
 8. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే ఏంటి?
 9. ఇటీవల కాలంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకులను లేదా రౌడీ షీటర్లను సంప్రదిస్తున్నారు? ఎందుకు?
ఎం. జయకృష్ణ,
ట్రైనీ సీటీఓ, హైదరాబాద్
ఇంటర్వ్యూ: 21 నిమిషాలు, మార్కులు: 56

సాధించాలనే పట్టుదల, కష్టపడే మనస్తత్వం, నలుగురికి సాయం చేయాలన్న తపన ఉంటే విజేతగా నిలవడం కష్టం కాదంటున్నారు గత గ్రూప్ 1 విజేతలు. లక్ష్యసాధన దిశగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని విజయం వైపు అడుగులు వేస్తున్న వారందరికీ ‘ఆల్ ద బెస్ట్’.
Published on 1/16/2013 1:21:00 PM

సంబంధిత అంశాలు