గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఎక్స్‌పెక్టెడ్ క్వశ్చన్స్

గ్రూప్-1 ఇంటర్వ్యూలకు రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో మొదలుకానున్న ఇంటర్వ్యూలకు అభ్యర్థులు అన్ని రకాల అస్త్రశస్త్రాలకు పదును పెట్టే సమయం. మరోవైపు ఈ దశలో అభ్యర్థులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన విభాగాలు ఎకానమీ, కరెంట్ అఫైర్స్. కారణం.. గత రెండు, మూడు గ్రూప్-1 ఇంటర్వ్యూల్లో అడిగిన ప్రశ్నలను గమనిస్తే అధికశాతం.. ఎకానమీని కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితం చేసి అడిగిన ప్రశ్నలే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ఇంటర్వ్యూల్లో కరెంట్ అఫైర్స్, ఎకానమీ సంబంధించి అడిగే అవకాశం ఉన్న కొన్ని ముఖ్య ప్రశ్నలు, అభ్యర్థులు సమాధానంలో చర్చించాల్సిన అంశాలపై విశ్లేషణ...

1.నగదు బదిలీ పథకం అంటే ఏంటి? కలిగే ప్రయోజనాలు? 121 కోట్ల జనాభా గల దేశంలో అమలు సాధ్యమేనా?
సమాధానమిలా:
 1. వంట గ్యాస్, రేషన్, ఎరువులపై సబ్సిడీలు, పింఛన్లు, ఉపకార వేతనాలు, ఉపాధి హామీ చెల్లింపులు తదితరాలను నగదు రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేయడమే నగదు బదిలీ పథకం.
 2. ‘మీ డబ్బు.. మీ హక్కు’ నినాదంతో జనవరి 1, 2013 నుంచి అమలు.
 3. దేశవ్యాప్తంగా తొలి దశలో 51 జిల్లాల్లో ప్రారంభం.
 4. సంక్షేమ నిధుల విషయంలో అవినీతి, అక్రమాలు నివారించడమే ప్రధానోద్దేశం.
సమస్యలు:
 1. నిజమైన లబ్ధిదారులను గుర్తించడం కష్టంతో కూడుకున్న వ్యవహారం.
 2. ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు లేకపోవడం (దేశంలో 51.7 శాతం; రాష్ట్రంలో 58.7 శాతం కుటుంబాలకు మాత్రమే ఖాతాలున్నాయి.)
 3. ఆధార్ కార్డుల జారీ ఇప్పటికీ అసంపూర్ణం.
 4. పేదలు-పేదరికం అనే విషయంపై స్పష్టమైన నిర్వచనం లేకపోవడం.
 5. రాజకీయ జోక్యం ఎక్కువయ్యే అవకాశం.
 6. సబ్సిడీ లబ్ధిదారులు ఎక్కువగా గ్రామీణ ప్రాంత వాసులే. వారిలో అధికశాతం నిరక్షరాస్యులు.
 7. పర్యవేక్షణ, నిఘా విభాగాల్లో నిర్లక్ష్య ధోరణి.
ప్రయోజనాలు:
 1. ప్రాథమిక దశలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలంలో అత్యంత ప్రయోజనం.
 2. నిజమైన పేదవారికే లబ్ధి చేకూరడంతోపాటు నేరుగా బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ ఫలితంగా దళారీల ప్రభావం తొలగిపోతుంది.
 3. పీడీఎస్ డీలర్ల అక్రమాల నిరోధానికి ఆస్కారం.
 4. అమలు యంత్రాంగం నిబద్ధతతో ఉంటే పథకం కచ్చితంగా విజయవంతం అవుతుంది.
2. ఎఫ్‌డీఐ అంటే? సుమారు అయిదు కోట్ల మందికి ఉపాధి కల్పించే రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించడం శ్రేయస్కరమా?
సమాధానమిలా:
 1. దీర్ఘకాలంలో శ్రేయస్కరమే.
 2. కేవలం పది లక్షల జనాభా కలిగిన నగరాలకే పరిమితం చేయడం వల్ల గ్రామీణ రిటైల్ రంగంపై ప్రభావం ఉండదు.
 3. మూడు సంవత్సరాల్లో పట్టణ ప్రాంతాల్లో సుమారు పది లక్షల ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
 4. రిటైలింగ్ చైన్‌ను విస్తరిస్తే భారీ పెట్టుబడులు లభిస్తాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది.
 5. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. దళారీ వ్యవస్థ తొలగుతుంది.
 6. వస్తువుల పరిమాణం పెరగడం ఫలితంగా ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్బణ నియంత్రణ సాధ్యమవుతుంది.
 7. ఉత్పత్తిదారుల మధ్య పోటీ వల్ల నాణ్యమైన వస్తువులు లభించి వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
నష్టాలు/ వ్యతిరేక అంశాలు:
 1. ప్రారంభంలో తక్కువ ధరకు వస్తువులు విక్రయించినా.. మార్కెట్‌లో పూర్తిస్థాయి ఆధిపత్యం పొందాక బ్రాండ్ పేరుతో ధరలు పెంచే ప్రమాదం ఉంది.
 2. మరోవైపు భారీస్థాయిలో ఉండే సూపర్ మార్కెట్లు ధరలు తగ్గించడం వల్ల చిన్న దుకాణాలు మూతపడే అవకాశం ఉంది.
 3. భవిష్యత్తులో భారీ సంస్థల గుత్తాధిపత్యం పెరిగే ప్రమాదం కూడా ఉంది.
3. ‘ఎ.పి. అడ్వాంటేజ్’ ఉద్దేశం ఏంటి? దీనికి ఆదర్శంగా నిలిచిన పథకం ఏంటి?
సమాధానమిలా:
 1. పారిశ్రామిక వ్యాపార సంస్థలను ఆహ్వానిస్తూ ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరుతో గుజరాత్ ప్రభుత్వం సదస్సు నిర్వహించి స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.
 2. ఇదే తరహాలో మన రాష్ట్రం కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఎ.పి. అడ్వాంటేజ్’ సదస్సును నిర్వహించింది.
4. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రవేశ పెట్టిన ‘పైసా బోల్తా హై’ ఏంటి?
సమాధానమిలా:
 1. అసలు, నకిలీ నోట్ల మధ్య వ్యత్యాసాన్ని గమనించే తీరును వివరించడానికి ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన
వెబ్‌సైట్ ‘పైసా బోల్తా హై.’

5. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్-2007 లక్ష్యాలు ఏంటి?
సమాధానమిలా:
 1. వరి ఉత్పత్తి 70 మిలియన్ టన్నులకు, గోధుమ ఉత్పత్తి 8 మిలియన్ టన్నులకు, పప్పు ధాన్యాల ఉత్పత్తి రెండు మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యం.
6.ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ పాలసీ-2012 గురించి చెప్పండి. ఇది రాష్ర్టంలోని విద్యుత్ సంక్షోభాన్ని నివారిస్తుందా? వివరించండి?
సమాధానమిలా:
 1. సౌరశక్తి ద్వారా రాష్ర్టంలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు ఆస్కారం ఉంది.
 2. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఇందుకు సంప్రదాయ మార్గాలే కాకుండా, సంప్రదాయేతర విధానాలతోనే ఇది సాధ్యపడుతుంది.
 3. సౌర శక్తి ద్వారా నిరంతరం ఉత్పత్తి జరిగే అవకాశం ఉండటం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి.
 4. అభివృద్ధి చెందిన దేశాల్లో సౌర శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి విజయవంతంగా జరుగుతోంది.
7.సుమారు 60 శాతం జనాభా ఆధారపడే వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణ (మెకనైజేషన్) ప్రవేశపెట్టడం శ్రేయస్కరమేనా?
సమాధానమిలా:
 1. వాస్తవానికి ఆర్థికాభివృద్ధిలో భాగంగా యాంత్రికీకరణ అవసరం ఉంది.
 2. ఆర్థికాభివృద్ధి నమోదవుతున్న కొద్దీ.. జనాభా వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలకు మళ్లే అవకాశం ఉంది.
 3. యాంత్రికీకరణ వల్ల సమయం కూడా ఆదా అవడంతోపాటు ఉత్పత్తి వేగవంతమవుతుంది.
 4. అధికంగా శ్రమించాల్సిన అవసరం లేదు. దీనివల్ల విద్యావంతులు కూడా వ్యవసాయ రంగంవైపు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఫలితంగా భవిష్యత్తులో ఉత్పత్తి, నాణ్యత పెరుగుతాయి.
8. స్వయం ఉపాధి, వేతన ఉపాధి పథకాలకు మధ్య వ్యత్యాసం ఏంటి? ఈ రెండింటిలో నిరుద్యోగం లేదా పేదరికం నిర్మూలనకు ఏది సరైంది?
సమాధానమిలా:
 1. ఆయా రంగాల్లో సొంతంగా ఆదాయార్జన పరంగా శిక్షణనిచ్చేది స్వయం ఉపాధి. ఉదా: డ్వాక్రా, ట్రైసం
 2. పనికి ఆహారం లేదా వేతనం ఇచ్చేది వేతన ఉపాధి. ఉదా: FWP, EGS, MGNREGP తదితరాలు
 3. దీర్ఘకాలిక దృష్టితో ఆలోచిస్తే స్వయం ఉపాధి పథకాలే మంచివని చెప్పొచ్చు. దీనికోసం ఇచ్చే శిక్షణ ద్వారా నైపుణ్యం పొందిన ఒక వ్యక్తికి భవిష్యత్తులో ఎక్కడైనా ఉపాధి లభిస్తుంది. నూతన పద్ధతులను అన్వేషించగలరు. అభివృద్ధిలో భాగస్వాములు కాగలరు.
9.భారతదేశంలో నకిలీ కరెన్సీ భారీగా పెరుగుతోంది. దీన్ని నివారించడానికి మీరిచ్చే సూచనలు? సమాధానమిలా:
 1. అధిక డినామినేషన్ కలిగిన నోట్లను తొలగించాలి.
 2. ప్లాస్టిక్ కరెన్సీ విధానాన్ని అమలు చేయాలి.
 3. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, చెక్స్, డిమాండ్ డ్రాఫ్ట్స్ తదితర కరెన్సీయేతర సాధనాలకు ప్రాచుర్యాన్ని పెంచాలి.
 4. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే ద్రవ్య చలామణి చేపట్టాలి.
 5. అసలు, నకిలీ నోట్ల వ్యత్యాసాలను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించాలి.
 6. మరోవైపు భారతదేశంలో పన్నుల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నల్లద్రవ్యం కూడా పెరుగుతుంది. ఈ విధంగా నల్లద్రవ్యం, నకిలీ కరెన్సీలు దేశంలో నగదు ప్రవాహాన్ని పెంచి ద్రవ్యోల్బణానికి దారి తీస్తున్నాయి.
10.ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానం అంటే ఏంటి?
సమాధానమిలా:
 1. ఇస్లామిక్ షరియా, న్యాయ సూత్రాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడమే ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానం.
 2. ముస్లిం దేశాల్లో ఈ బ్యాంకులు పని చేస్తున్నాయి. కానీ భారత్‌లో లేవు.
 3. ఇస్లామిక్ బ్యాంకులు రిస్క్ షేరింగ్ సూత్రం ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
 4. సాధారణ బ్యాంకులు రిస్క్ ట్రాన్స్‌ఫర్ సూత్రం ఆధారంగా పని చేస్తాయి.
 5. ఇస్లామిక్ బ్యాంకులు వడ్డీ రేట్ల వసూలును నిషేధిస్తాయి. మద్యం, జూదం, స్పెక్యులేషన్ వంటి కార్యకలాపాలను షరియా నిషేధిస్తుంది. అందుకే ఈ వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు.
 6. ఈ బ్యాంకులు సంప్రదాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.
 7. రిస్క్ షేరింగ్, ప్రాఫిట్ షేరింగ్, సేఫ్ కీపింగ్, జాయింట్ వెంచర్, లీజింగ్ తదితర అంశాలను ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానమే ప్రవేశ పెట్టింది.
మరికొన్ని ఎక్స్‌పెక్టెడ్ క్వశ్చన్స్
 1. మహిళా సాధికారికత అంటే ఏంటి? మహిళా సాధికారికతను సాధించడానికి సూచనలు? దేశంలో మహిళలకు సామాజిక, ఆర్థిక నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉందా?
 2. మహిళలకు చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికీ ఇది నామమాత్రమే అవుతోంది. కారణమేంటి?
 3. ఆధార్ కార్డుల జారీ విజయవంతమైందని మీరు భావిస్తున్నారా? అన్ని పథకాలకు ఈ కార్డులనే ప్రామాణికం చేయడం సబబేనా?
 4. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ప్రభావం ఉండగా.. మన దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితుల ప్రభావం కనిపిస్తోంది. కారణమేంటి?
 5. పేదరికానికి నూతనంగా ప్రతిపాదించిన నిర్వచనం ఏంటి? దీన్ని మీరు సమర్థిస్తారా?
 6. భారతదేశంలో ప్రణాళికేతర వ్యయం పెరగడానికి కారణాలేంటి? ఇవి దేశ ఆర్థికాభివృద్ధికి ప్రయోజనం కలిగిస్తాయా?
 7. ప్రస్తుత దేశ పరిస్థితుల దృష్టితో ఆలోచిస్తే రెండో దశ ఆర్థిక సంస్కరణలు అవసరమా?
 8. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో విజయవంతమైందా? ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలను వ్యవసాయ పనులకు దూరం చేస్తుందనే అభిప్రాయాన్ని సమర్థిస్తారా?
 9. ఆర్‌బీఐ ద్రవ్యపరమైన చర్యల ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఎలా తగ్గించగలదో వివరించండి?
 10. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారికత సాధించడానికి స్వయం సహాయక బృందాలు దోహదం చేస్తున్నాయని మీరు భావిస్తున్నారా? అసలు స్వయం సహాయక బృందాల పాత్ర ఏంటి?
 11. రాష్ర్టంలో పంటలకు కనీస మద్దతు ధరలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. కారణాలేంటి?
 12. రైతులకు రుణాలు కల్పించడంలో బ్యాంకులు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానం సాధ్యం కావట్లేదు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు మీ సలహా ఏంటి?
 13. కనీస మద్దతు ధరలకు, సబ్సిడీ ధరలకు వ్యత్యాసం ఏంటి?
 14. JNNURAMపథకం ఉద్దేశమేంటి?
 15. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో గల లోపాలు? వీటిని నివారించడానికి మీరు సూచించే మార్గాలు?
 16. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు ఏంటి? ’Very Faster & Inclusive Growth’ అంటే ఏంటి?
 17. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి సత్ఫలితాలనిస్తుందని భావించొచ్చా?
 18. ఆంగ్ల విద్యకు ప్రాధాన్యం పెరుగుతూ, తెలుగు మీడియం పాఠశాలలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికార భాష హోదాలో తెలుగు భాష పూర్వ ప్రాభవాన్ని పొందుతుందని మీరు భావిస్తారా?
 19. ‘మన బియ్యం’ పథకం లక్ష్యం ఏంటి?
Published on 1/25/2013 6:08:00 PM

సంబంధిత అంశాలు