జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ పరీక్ష సరళి...

‘జేఈఈ అడ్వాన్స్‌డ్..’ ప్రతిష్టాత్మక ఐఐటీలలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష. ఇప్పటివరకు ఆఫ్‌లైన్ విధానంలో సాగిన ఈ పరీక్ష .. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆన్‌లైన్ రూపు సంతరించుకోనుంది. అంటే.. 2018లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. ఈ నేపథ్యంలో.. జేఈఈ- అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ తీరుతెన్నులు తెలుసుకుందాం..
Edu newsజేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఇప్పటివరకూ.. ఆఫ్‌లైన్ (పెన్-పేపర్) విధానంలో సాగింది. ఈ పరీక్షలో ర్యాంకు ద్వారా ఐఐటీల్లో చేరేందుకు విద్యార్థులు ఇంటర్మీడియెట్ తొలి రోజు నుంచే కష్టపడుతుంటారు. ఇటీవల జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) జేఈఈ- అడ్వాన్స్‌డ్‌ను వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించింది.

ఆఫ్‌లైన్ సమస్యలకు పరిష్కారంగా..
ఐఐటీల్లో ప్రవేశాలను పర్యవేక్షించే జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ).. ఆఫ్‌లైన్‌లో తలెత్తున్న సమస్యలను నివారించేందుకు జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ను 2018 నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. పెన్-పేపర్ విధానంలో ప్రశ్నపత్రం రూపకల్పన, ప్రశ్నల్లో అనువాద లోపాలు, పరీక్ష నిర్వహణ పరంగా ఎదురవుతున్న భద్రతాపరమైన సమస్యలను ఆన్‌లైన్ విధానం ద్వారా నివారించాలనేది జేఏబీ ఆలోచన.

లోపాలకు ఫుల్‌స్టాప్ :
ఆఫ్‌లైన్ విధానం నేపథ్యంలో ప్రశ్నల్లో అనువాద లోపాలు.. తద్వారా కోర్టు వివాదాలు సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. జేఈఈ- అడ్వాన్స్‌డ్-2017నే పరిగణనలోకి తీసుకుంటే ప్రశ్నపత్రాల్లో అనువాద లోపాలతో 18 బోనస్ మార్కులు కేటాయించాల్సి వచ్చింది. ప్రవేశ ప్రక్రియను కూడా కొద్ది రోజులు వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి సమస్యలకు ఆన్‌లైన్ ద్వారా అడ్డుకట్ట వేయొచ్చనేది జేఏబీ నిపుణుల అభిప్రాయంగా తెలుస్తోంది.

ప్రశ్నల స్వరూపంలోనూ మార్పులు...
అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ పరీక్ష ప్రశ్నల స్వరూపంలోనూ జేఏబీ స్వల్ప మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బహుళైచ్ఛిక ప్రశ్నలకే పరిమితం కాకుండా.. షార్ట్-ఆన్సర్ కొశ్చన్స్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. తద్వారా విద్యార్థుల్లో విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, సబ్జెక్టు ప్రాథమిక నైపుణ్యాన్ని, అప్లికేషన్ అప్రోచ్‌ను పరీక్షించేందుకు ఈ షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటివరకు ఆఫ్‌లైన్ ఆలోచనతో...
ప్రిపరేషన్ సాగిస్తున్న ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఆన్‌లైన్ నిర్ణయంతో సర్దుబాటుకు సతమతం అవుతున్నారు. ప్రధానంగా పరీక్షకు సన్నద్ధమయ్యే దిశగా మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. 30 శాతం మంది అభ్యర్థులపై ఆన్‌లైన్ ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. మూడేళ్ల గణాంకాల ప్రకారం- అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించిన విద్యార్థుల్లో 25 నుంచి 30 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన అల్పాదాయ వర్గాల పిల్లలే. వీరు శిక్షణ కూడా స్వస్థలాల్లోనే తీసుకున్నారు. మరికొందరు సొంతంగా సన్నద్ధమై విజయం సాధించినవారు.

మెయిన్‌లోనూ ఆఫ్‌లైన్‌కే ప్రాధాన్యం...
అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్ష.. జేఈఈ మెయిన్. మెయిన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఏటా రెండు పద్ధతుల్లో నిర్వహిస్తుంటే.. ఆఫ్‌లైన్‌లో హాజరయ్యే విద్యార్థులే అధికం. గత మూడేళ్ల గణాంకాలను విశ్లేషిస్తే.. 90 శాతం మంది విద్యార్థులు తమ నేపథ్యాల (ప్రాంతం, చదువు, బోధన మాధ్యమం)తో సంబంధం లేకుండా మెయిన్‌ను ఆఫ్‌లైన్‌లో రాశారు.

ఆన్‌లైన్‌తో సమస్యేంటి?
ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారితంగా పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. పల్లె ప్రాంత విద్యార్థులు పరీక్ష రోజు వరకు పేపర్ విధానంలో ప్రాక్టీస్ చేసి.. పరీక్ష హాల్లో కంప్యూటర్ స్క్రీన్‌పై సమాధానం ఇవ్వడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. కంప్యూటర్ ఆధారిత ప్రిపరేషన్‌కు అవకాశం లేకపోవడం కూడా ప్రతికూలత చూపుతుందనేది సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయం. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే క్రమంలో సమస్యలను అంచెలవారీ పద్ధతిలో సాధించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు కంప్యూటర్ బేస్డ్ విధానం వల్ల విద్యార్థులు ఇబ్బందిపడతారనే వాదన వినిపిస్తోంది.

విద్యార్థులకే అనుకూలం అంటున్న జేఏబీ :
ఆన్‌లైన్‌పై ఆందోళనలకు తావివ్వొద్దని.. ఇది విద్యార్థులకే అనుకూలమని జేఏబీ వర్గాలు పేర్కొంటున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో విద్యార్థులకు సమాధానాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని.. పెన్ పేపర్ విధానంలో ఓఎంఆర్ షీట్‌లో ఒకసారి జవాబును బబుల్ చేశాక మార్చుకునే వీలుండదని చెబుతున్నారు. ఆన్‌లైన్ పద్ధతిలో సమాధానాలను ఒకటికి రెండుసార్లు సరి చూసుకునే అవకాశమూ లభిస్తుందని ఉదహరిస్తున్నారు.

ఫలితాలు వేగంగా..
ఆన్‌లైన్ వల్ల సమాధాన పత్రాల మూల్యాంకన త్వరగా జరుగుతుంది. ఆ మేరకు ఫలితాలు వేగంగా వెల్లడవుతాయని జేఏబీ వివరిస్తోంది. తర్వాత దశలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను సైతం ముందుగా నిర్వహించి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆలస్యాన్ని నివారించే అవకాశం కలుగుతుందని చెబుతోంది.

సానుకూలతలు..
  1. త్వరితగతిన ఫలితాల ప్రకటన.
  2. ఆఫ్‌లైన్‌లో తరచుగా ఎదురవుతున్న ప్రశ్నల్లో లోపాలు, అనువాద దోషాలకు స్వస్తి.
  3. పెన్-పేపర్ విధానంలో జవాబులను బబుల్ చేయడానికి సగటున 15 నిమిషాల సమయం వెచ్చించాల్సి ఉంటోంది. ఆన్‌లైన్ ద్వారా దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఫలితంగా విద్యార్థులకు అదనంగా 15 నిమిషాలు లభించే అవకాశం.
  4. జవాబులను సరిగా బబుల్ చేయకపోతే మూల్యాంకన సమయంలో సమాధానాన్ని తప్పుగా పరిగణించే ప్రమాదం ఆఫ్‌లైన్‌లో ఉంది. ఇది నెగెటివ్ మార్కింగ్‌కు దారితీస్తుంది. ఈ సమస్యకు ఆన్‌లైన్ పరీక్ష- మూల్యాంకనాన్ని పరిష్కారంగా చూపుతున్నారు.
  5. ఆన్‌లైన్ విధానంలో.. సమాధానాలిచ్చిన ప్రశ్నలు, సమాధానాలిచ్చేందుకు ఉపక్రమించిన ప్రశ్నలు, సమాధానాలివ్వని ప్రశ్నలను వేర్వేరు రంగుల్లో చూపిస్తారు. దీనివల్ల అభ్యర్థులు సమాధానాలిచ్చే క్రమంలో ప్రాథమ్యాన్ని గుర్తించుకునే అవకాశం.
ప్రతికూలతలు...
  1. ఆన్‌లైన్‌లో ఇప్పటివరకు పలు పరీక్షల్లో ఎదురైన ప్రధాన సమస్య సాంకేతిక ఇబ్బందులు. అడ్వాన్స్‌డ్‌లోనూ ఈ ప్రమాదం ఉంది.
  2. సమాధానం ఇచ్చిన ప్రతిసారి సేవ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాల్సిన ఆవశ్యకత. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఇలా సేవ్ ఆప్షన్ క్లిక్ చేయకపోతే మార్కులు కోల్పేయే ప్రమాదం.
  3. ఆఫ్‌లైన్‌ను పరిగణనలోకి తీసుకుని సన్నాహకం సాగించిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రిపరేషన్ పరంగా సమస్యలు ఎదురయ్యే పరిస్థితి.
  4. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారికి మరింత ఇబ్బంది.
నమూనా సదుపాయం కల్పించాలి...
జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆన్‌లైన్ కానున్న నేపథ్యంలో అభ్యర్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారికి ‘అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్’ లేదా ఇతర మార్గాల ద్వారా మాక్ ట్యుటోరియల్‌ను అందుబాటులో ఉంచాలి. తద్వారా ఆన్‌లైన్ టెన్షన్ తొలిగిపోతుంది. జేఈఈ-మెయిన్ నోటిఫికేషన్ నుంచే దీనిని అందుబాటులోకి తెస్తే విద్యార్థులు పరీక్ష సమయానికి అన్ని రకాలుగా సంసిద్ధులయ్యే అవకాశం లభిస్తుంది.
- డాక్టర్ ఆనంద రామన్, డెరైక్టర్, ఫిట్‌జీ, హైదరాబాద్
Published on 9/6/2017 3:24:00 PM
టాగ్లు:
JEE advanced online exam details JEE advanced - 2018 JEE advanced online exam pattern JEE mains exam pattern JEE advanced online exam tips JEE advanced online exam problems JEE advanced offline exampatern

Related Topics