జేఈఈ మెయిన్‌–2018 విద్యార్థుల సందేహాలు– సమాధానాలు..

దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లో ప్రవేశం ఓ సంక్లిష్ట ప్రక్రియ. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే..
Edu news

మొదట జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌లో అర్హత సాధించాలి. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సొంతం చేసుకోవాలి. అలాగే ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, గవర్నమెంట్‌ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (జీఎఫ్‌టీఐ)లో ప్రవేశానికి జేఈఈ మెయిన్‌ రాయాలి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు పోటీ లక్షల్లోనే ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడం దగ్గర నుంచి అడ్మిషన్‌ పొందే వరకూ ప్రతి దశలోనూ విద్యార్థి అప్రమత్తంగా ఉంటేనే లక్ష్యం నెరవేరుతుంది. జేఈఈ మెయిన్‌–2018 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సందేహాలకు సమాధానాలు..

ముఖ్య తేదీలు...
ప్రశ్న:
2018 జేఈఈ మెయిన్‌ దరఖాస్తు తేదీలు?
జవాబు: 2018 జేఈఈ మెయిన్‌కు 2017, డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 2018 జనవరి 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రశ్న: 2018 జేఈఈ మెయిన్‌ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
జవాబు: జేఈఈ మెయిన్‌ పరీక్ష ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో జరుగుతుంది. ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్‌ బేస్డ్‌) పరీక్షను 2018, ఏప్రిల్‌ 8న నిర్వహిస్తారు. ఆన్‌లైన్లో 2018– ఏప్రిల్‌ 15, 16 తేదీల్లో జరుగుతుంది.

ప్రశ్న: అడ్మిట్‌ కార్డును ఎప్పుడు పొందొచ్చు?
జవాబు: దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 2018, మార్చి రెండో వారంలో అడ్మిట్‌ కార్డు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి?
జవాబు: పేపర్‌ 1 ఫలితాలు 2018 ఏప్రిల్‌ 30న; పేపర్‌2 ఫలితాలు మే 31న ప్రకటిస్తారు.

అర్హతలు..
ప్రశ్న:
2018 జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వయో పరిమితి ఏమిటి?
జవాబు: 1993, అక్టోబరు 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే 1988, అక్టోబరు 1 తర్వాత జన్మించినా అర్హులే.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్హతలేమిటి?
జవాబు: 2016/2017లో ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 2018లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా అర్హులే. ఇంటర్‌లో కనీసం ఐదు సబ్జెక్టులు చదివి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ /బయాలజీ/టెక్నికల్‌ వొకేషనల్‌ సబ్జెక్ట్‌.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌కు గరిష్టంగా ఎన్నిసార్లు హాజరుకావచ్చు?
జవాబు: గరిష్టంగా మూడుసార్లు పరీక్షకు హాజరుకావచ్చు.

ప్రశ్న: నేను జనరల్‌ అభ్యర్థిని. ఇంటర్‌లో 75 శాతం మార్కులు లేవు. నేను జేఈఈ మెయిన్‌ రాయొచ్చా?
జవాబు: సాంకేతికంగా రాసే వీలున్నా తుదిగా ఫలితం ఉండదు. కార ణం.. జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిం చే ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్‌టీఐలు ఇంటర్లో కనీసం 75 శాతం మార్కులు (ఎస్సీ/ఎస్టీలు కనీసం 65 శాతం మార్కులు పొందాలి) సాధించాలనే నిబంధనను అమలు చేయడం. లే దా ఇంటర్‌ బోర్డ్‌ ఫలితాల్లో టాప్‌–20 పర్సంటైల్‌లో నిలవాలి.

ప్రశ్న: స్టేట్‌ ఎలిజిబిలిటీ గురించి తెలపగలరు?
జవాబు: ఎన్‌ఐటీల్లో స్టేట్‌ కోటా కింద ప్రత్యేకంగా సీట్లు ఉంటాయి. మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు స్టేట్‌ కోటా అభ్యర్థులకు కేటాయిస్తారు. విద్యార్థి ఇంటర్‌ పూర్తిచేసిన ప్రాంతం ఆధా రంగా స్టేట్‌ ఎలిజిబిలిటీ నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఎన్‌ ఐటీ వరంగల్‌లో స్టేట్‌ కోటా కింద సీటు పొందాలంటే.. తెలంగాణలో ఇంటర్‌ పూర్తిచేసి ఉండాలి.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2కు దరఖాస్తు చేయాలనుకుంటే, అర్హతలు ఏమిటి?
జవాబు: పేపర్‌–1, 2లకు పైన తెలిపినట్లు ఒకే అర్హతలు ఉంటాయి.
పేపర్‌–1 పరీక్ష: బీటెక్‌/ బీఈ కోర్సు ఔత్సాహికులు రాయాల్సిన పరీక్ష.
పేపర్‌–2 పరీక్ష: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌/ప్లానింగ్‌ కోర్సుల ఔత్సాహికులు హాజరవ్వాల్సిన పరీక్ష.

దరఖాస్తు విధానం:
ప్రశ్న: జేఈఈ మెయిన్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
జవాబు: ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు నింపడానికి ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి.
దరఖాస్తు పూర్తిచేసే క్రమం: స్టెప్‌ 1–రిజిస్ట్రేషన్‌; స్టెప్‌ 2–ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫిల్లింగ్‌; స్టెప్‌ 3–స్కాన్‌ చేసిన ధ్రువీకరణపత్రాలను అప్‌లోడ్‌ చేయడం; స్టెప్‌ 4–అప్లికేషన్‌ ఫీజు చెల్లింపు; స్టెప్‌ 5– కన్ఫర్మేషన్‌ పేజీని ప్రింటవుట్‌ తీసుకోవాలి. ధ్రువీకరణపత్రాలను పోస్ట్‌ద్వారా పంపాల్సిన అవసరం లేదు.

ప్రశ్న: దరఖాస్తు చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి?
జవాబు: ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభించడానికి ముందే విద్యార్థి ఫొటో, సిగ్నేచర్‌తోపాటు పేరెంట్‌ సిగ్నేచర్‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఫొటోగ్రాఫ్‌ 4 కేబీ–40 కేబీ సైజులో, సిగ్నేచర్‌ 1 కేబీ– 30 కేబీ సైజులో జేపీఈజీ ఫార్మాట్‌ (ఫొటో ఫార్మాట్‌)లో సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితోపాటు అకడమిక్‌ సర్టిఫికెట్లను కూడా దగ్గర ఉంచుకుంటే విజయవంతంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయొచ్చు.

ప్రశ్న: దరఖాస్తు ఫీజు వివరాలు?
జవాబు: జేఈఈ మెయిన్‌ పేపర్‌–1 లేదా పేపర్‌–2 మాత్రమే రాస్తే.. ఆన్‌లైన్‌ పరీక్ష రాసే జనరల్‌/ఓబీసీ బాలురకు రూ.500; బాలికలకు రూ.250; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులకు రూ.250. పెన్, పేపర్‌ విధానంలో పరీక్ష రాసే జనరల్‌/ఓబీసీ బాలురకు రూ.1000; బాలికలకు రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులకు రూ.500.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌ రెండు పేపర్లు రాయాలనుకుంటే..
జవాబు: ఆన్‌లైన్‌ పరీక్ష రాసే జనరల్‌/ఓబీసీ బాలురకు రూ.1300; బాలికలకు రూ.650; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులకు రూ.650. పెన్, పేపర్‌ విధానంలో పరీక్ష రాసే జనరల్‌/ఓబీసీ బాలురకు రూ.1800; బాలికలకు రూ.900; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులకు రూ.900.

ప్రశ్న: దరఖాస్తులో పొరపాట్లు దొర్లితే, వేరే దరఖాస్తు చేసుకోవచ్చా?
జవాబు: ఒక దరఖాస్తును మాత్రమే సమర్పించాలి. ఒకవేళ తప్పులు దొర్లితే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. దీనిద్వారా సవరించుకోవచ్చు. విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి.

ప్రశ్న: పాస్‌వర్డ్‌ మర్చిపోతే, అడ్మిట్‌కార్డును ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి?
జవాబు: పాస్‌వర్డ్‌ను రాసుకొని, జాగ్రత్తగా దాచుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్‌ పాస్‌వర్డ్‌ మరచిపోతే.. సెక్యూ రిటీ క్వశ్చన్, రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబర్, ఇ–మెయిల్‌ ఆధారంగా రీసెట్‌ చేసుకోవాలి.

ప్రశ్న: పరీక్ష సమయంలో గుర్తింపు కార్డు ఏమైనా తీసుకెళ్లాలా?
జవాబు: అడ్మిట్‌ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. 2016, 2017లో ఇంటర్‌ పూర్తిచేసిన వారు ఇంటర్‌ మార్కుల మెమో జిరాక్స్‌ తీసుకెళ్లాలి.

పరీక్ష విధానం :
ప్రశ్న: పేపర్‌ 1 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
జవాబు: పరీక్షల్లో మూడు విభాగాలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నల చొప్పున 90 ప్రశ్నలకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 360 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం కూడా ఉంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌ పేపర్‌ 1 సిలబస్‌ ఏముంటుంది? ముఖ్యమైన చాప్టర్లు, ప్రిపరేషన్‌ టిప్స్‌ తెలియజేయండి?
జవాబు: ప్రధానంగా ఇంటర్మీడియెట్‌/10+2లో చదివిన అంశాలే సిలబస్‌లో ఉంటాయి.
ఫిజిక్స్‌: ముఖ్యంగా ఎలక్ట్రోడైనమిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం, వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. కాన్సెప్ట్‌లను అన్వయించే విధంగా ప్రాక్టీస్‌ చేస్తూ ముఖ్యమైన పాయింట్లు, ఫార్ములాలు నోట్‌ చేసుకుంటూ ముందుకుసాగాలి. వీటిపై పట్టుసాధిస్తే 40 శాతం మేర మార్కులను సులువుగా సొంతం చేసుకోవచ్చు. సెంటర్‌ ఆఫ్‌ మాస్, మూమెంటమ్‌ అండ్‌ కొలిజన్‌; సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌పై పట్టు సాధించడం ద్వారా మరిన్ని మార్కులు సొంతం చేసుకోవచ్చు.
మ్యాథమెటిక్స్‌: పరీక్ష పరంగా ప్రతి చాప్టరూ ముఖ్యమైనదే. 3–డి జామెట్రీ; కో ఆర్డినేట్‌ జామెట్రీ; వెక్టార్‌ ఆల్జీబ్రా; ఇంటిగ్రేషన్‌; కాంప్లెక్స్‌ నెంబర్స్‌; పారాబోలా; ట్రిగనోమెట్రిక్‌ రేషియోస్‌కు కొంచెం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్కోరింగ్‌ పెంచుకోవచ్చు. వీటితోపాటు క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌; పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్, బైనామియల్‌ థీరమ్, లోకస్‌ అంశాలను కనీసం ఒక్కసారైనా పూర్తిచేసే విధంగా ప్రిపరేషన్‌ సాగించాలి.
కెమిస్ట్రీ: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ల కంటే విద్యార్థులు కాస్త తేలిగ్గా భావించే విభాగం కెమిస్ట్రీ. ఇందులో అడిగే ప్రశ్నలు ఎక్కువ శాతం కెమికల్‌ బాండింగ్, పీరియాడిక్‌ టేబుల్‌ తదితరాల ఆధారంగా ఉంటాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని విద్యార్థులు మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్టక్చ్రర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలి.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 ఆన్‌లైన్‌లో ఉంటుందా? పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
జవాబు: ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పేపర్‌–2కు హాజరు కావాలి. ఇది పేపర్‌ బేస్డ్‌ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు డ్రాయింగ్‌ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. పేపర్‌ 1, 2ల సిలబస్‌ భిన్నంగా ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఇందులో 30 ఆబ్జెక్టివ్‌ టైప్‌ మ్యాథ్స్‌ ప్రశ్నలు; 50 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు ఉంటాయి. డ్రాయింగ్‌ ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే రెండు ప్రశ్నలు ఉంటాయి. డ్రాయింగ్‌ ఆప్టిట్యూడ్‌ మినహా మిగతా వాటికి రుణాత్మక మార్కులు ఉంటాయి.

ప్రశ్న: ఏయే భాషల్లో జేఈఈ మెయిన్‌ పరీక్షను నిర్వహిస్తారు?
జవాబు: ఇంగ్లిష్, హిందీ భాషల్లో పేపర్‌ 1ను నిర్వహిస్తారు.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌లో క్యాలిక్యులేటర్‌ ఉంటుందా?
జవాబు: పరీక్షగదిలోకి క్యాలిక్యులేటర్‌ను అనుమతించరు.

ప్రశ్న: ఇంటర్, జేఈఈ మెయిన్‌లకు ఒకేసారి సన్నద్ధత ఎలా?
జవాబు: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ప్రణాళిక ప్రకారం ఇంటర్‌కు సమాంతరంగా జేఈఈ మెయిన్‌కు సిద్ధమవాలి. రెండింటినీ అనుసంధానించుకుంటూ చదవడం లాభిస్తుంది. డిసెంబర్‌ చివరి వరకు జేఈఈ మెయిన్‌ సిలబస్, ఇంటర్మీడియెట్‌ రెండేళ్ల సిలబస్‌లోని ఉమ్మడి అంశాల ప్రిపరేషన్‌ పూర్తిచేయాలి. జనవరిలో జేఈఈ మెయిన్‌ సిలబస్‌లో మాత్రమే ఉన్న అంశాలపై దృష్టిపెట్టాలి. ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఇంటర్మీడియెట్‌ పరీక్షల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాక పూర్తిస్థాయిలో మెయిన్‌ పరీక్షపై దృష్టిసారించాలి.
∙ప్రిపరేషన్‌ సమయంలో రాసుకున్న సొంత నోట్స్, షార్ట్‌ కట్‌ ఫార్ములాల ఆధారంగా రివిజన్‌ చేయాలి.
రోజూ ఇంటర్‌ ప్రిపరేషన్‌తోపాటు జేఈఈ మెయిన్‌ ప్రిపరేషన్‌కు సమయం కేటాయించే విధంగా ప్లాన్‌ చేసుకోవాలి.
మెయిన్, ఇంటర్మీడియెట్‌ అంశాల ప్రిపరేషన్‌కు రోజుకు కనీసం ఆరు గంటలు కేటాయించాలి.
చదివే ప్రతి అంశానికి సంబంధించి కాన్సెప్ట్, అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్‌ సాగించాలి. వీక్లీ, మాక్, గ్రాండ్‌ టెస్ట్‌లు రాయడం వల్ల పరీక్ష రోజు అనుసరించాల్సిన విధానంపై అవగాహన ఏర్పడుతుంది.

ప్రశ్న: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌.. విధానాల్లో ఏ విధంగా పరీక్షకు హాజరైతే మంచిది?
ఆఫ్‌లైన్‌ :
జవాబు: విద్యార్థులు చిన్నప్పటి నుంచి పెన్, పేపర్‌ విధానంలో పరీక్షలకు అలవాటు పడి ఉంటారు. పేపర్‌లో రాసింది వేగంగా చదవడం...పెన్‌తో వేగంగా రాయగలగడం ఇప్పటికే అలవాటై ఉంటుంది. కాబట్టి పెన్, పేపర్‌ వి«ధానంలో రాస్తే వేగంగా చదివి.. త్వరగా సమాధానాలు గుర్తించే వీలుంటుంది. దీనివల్ల ఎంతో విలువైన సమయం కలిసొస్తుంది.
బుక్‌లెట్‌ చేతికి ఇవ్వగానే ఒకసారి అన్ని ప్రశ్నలను చూసి... తేలిగ్గా ఉన్న వాటిని ముందు పూర్తిచేసి... కష్టమైన వాటికి సమాధానాలు చివర్లో గుర్తించేలా ప్లాన్‌ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌ విధానంలో రాస్తే టెక్నికల్‌ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు.
పరీక్ష పూర్తయ్యాక బుక్‌లెట్‌ను ఇంటికి తీసుకెళ్లి... మీ సమాధానాలను చెక్‌ చేసుకొని ఎంత స్కోర్‌ వస్తుందో అంచనాకు రావచ్చు.

ఆన్‌లైన్‌ పరీక్ష :
ఆన్‌లైన్‌ పరీక్ష కంప్యూటర్‌ ఆధారంగా జరుగుతున్న దృష్ట్యా సమాధానాలను ఓఎంఆర్‌ షీట్‌పై బబుల్‌ చేయనవసరం లేదు. ఒక్క మౌస్‌ క్లిక్‌తో సమాధానాన్ని గుర్తించొచ్చు. దానివల్ల ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది.
∙ఆన్‌లైన్‌ పరీక్షతో మరో గొప్ప ప్రయోజనం.. ఒకసారి గుర్తించిన సమాధానం సరికాదనిపిస్తే.. ఎన్నిసార్లయినా మార్చుకునే వీలుంటుంది. ఆఫ్‌లైన్‌ విధానంలో ఆ వెసులుబాటు ఉండదు.
∙ఆన్‌లైన్‌ విధానంలో సమాధానాలు గుర్తించిన ప్రశ్నలు, సమాధానాలు గుర్తించని ప్రశ్నలు, రివ్యూ మార్క్‌ చేసిన ప్రశ్నలు, అసలు అటెంప్ట్‌ చేయని ప్రశ్నలు.. ఇలా కంప్యూటర్‌ స్క్రీన్‌పై వేర్వేరు రంగుల్లో కనిపిస్తుంటాయి. అలాగే టైమ్‌ కౌంటర్‌ కూడా కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంటుంది. కాబట్టి రాయాల్సిన ప్రశ్నలు, మిగిలి ఉన్న సమయాన్ని బేరీజు వేసుకుంటూ.. సమాధానాలు గుర్తించడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే వీలుంటుంది.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌ క్వాలిఫైయింగ్‌ మార్కులు ఎన్ని?
జవాబు: క్వాలిఫైయింగ్‌ మార్కులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈసారి కూడా పరీక్ష పూర్తయ్యాకే అర్హత మార్కులపై ఒక అంచనాకు వచ్చే అవకాశముంటుంది.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌లో అర్హత సాధిస్తే నేరుగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరు కావచ్చా? కటాఫ్స్‌ ఏమైనా ఉంటాయా?
జవాబు: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించాలంటే.. మెయిన్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన టాప్‌ 2,20,000 మందిలో ఒకరిగా ఉండాలి.

కీ, ఫలితాలు, ర్యాంకులు..
ప్రశ్న: జేఈఈ మెయిన్‌ 2018 ఆన్సర్‌ ‘కీ’లను ఎప్పుడు విడుదల చేస్తారు?
జవాబు: పేపర్‌–1 ఆన్సర్‌ కీతోపాటు పేపర్‌–2 ఆన్సర్‌ కీ కూడా విడుదల చేస్తారు. 2018, ఏప్రిల్‌ 24–27 మధ్య విడుదలయ్యే అవకాశముంది.

ప్రశ్న: విద్యార్థులు అఫీషియల్‌ ఆన్సర్‌ కీని ఛాలెంజ్‌ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి?
జవాబు: ఆన్సర్‌ కీని ఛాలెంజ్‌ చేయడం వల్ల సంబంధిత అధికారులు తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

ప్రశ్న: అఫీషియల్‌ ఆన్సర్‌ కీలో సందేహాలుంటే ఎలా అబ్జెక్ట్‌ చేయాలి?
జవాబు: జేఈఈ మెయిన్‌ 2018 అప్లికేషన్‌ నంబరు, పుట్టినతేదీని ఉపయోగించి జేఈఈ వెబ్‌సైట్లో లాగిన్‌ అవాలి. ఆన్సర్‌ కీ ఛాలెంజింగ్‌ ఫామ్‌ని పూరించాలి. ఆన్సర్‌ కీని ఛాలెంజ్‌ చేయాలంటే ప్రతి ప్రశ్నకు రూ.1000 చెల్లించాలి.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌ 2018 ఫలితాలను ఎలా చూసుకోవాలి?
జవాబు: పేపర్‌–1 ఫలితాలను 2018, ఏప్రిల్‌ 30న విడుదల చేస్తారు. ఆన్‌లైన్‌లో మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేరు, రోల్‌ నంబరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేరు, స్టేట్‌ కోడ్, కేటగిరీని ఎంటర్‌ చేసిన తర్వాత ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఫలితాలతో పాటు సబ్జెక్టుల వారీ మార్కుల వివరాలు, మొత్తం వచ్చిన మార్కులు, ఆల్‌ ఇండియా ర్యాంక్, కేటగిరీ ర్యాంకు, క్వాలిఫైడ్‌ స్టేటస్‌ ఫర్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్, కటాఫ్‌ స్కోర్స్‌ ఫర్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తదితర వివరాలను తెలుసుకోవచ్చు.

ప్రశ్న: జేఈఈ మెయిన్‌ ఫలితాలు, ర్యాంక్‌ కార్డు రెండూ వేర్వేరా.. వీటిని ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి?
జవాబు: రెండూ వేర్వేరు. ఫలితాల్లో స్కోర్స్, ర్యాంక్స్, క్వాలిఫైయింగ్‌ స్టేటస్‌ ఉంటాయి. అదే ర్యాంక్‌ కార్డులో ఆల్‌ ఇండియా ర్యాంక్, కేటగిరీ ర్యాంక్స్‌ ఉంటాయి. జేఈఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రోల్‌ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్‌ చేసి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కౌన్సెలింగ్‌ సమయంలో ధ్రువీకరణ కోసం ర్యాంక్‌ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది.

ప్రశ్న: ఆల్‌ ఇండియా ర్యాంకులు, స్టేట్‌ ర్యాంకులు వేర్వేరా?
జవాబు: రెండూ వేర్వేరు. ఆల్‌ ఇండియా ర్యాంకులు తొలుత ప్రకటించిన తర్వాత రాష్ట్రాల వారీగా ర్యాంకులు ప్రకటిస్తారు.

ప్రశ్న: ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే ఏ ప్రాతిపదికన ర్యాంకులు ప్రకటిస్తారు?
జవాబు: ఇలాంటి సమయంలో ఇంటర్‌ మార్కులు లేదా పేపర్‌–1/పేపర్‌ 2 మార్కులను వేరు చేసి (టై బ్రేకింగ్‌ సిస్టమ్‌) ర్యాంకులు ప్రకటిస్తారు.
పేపర్‌–1: మ్యాథ్స్‌ మార్కుల ఆధారంగా, తర్వాత ఫిజిక్స్‌ మార్కుల ఆధారంగా, నెగిటివ్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయిస్తారు.
ఇంకా టై వీడకుండా ఉంటే ఇద్దరికీ ఒకే ర్యాంక్‌ ప్రకటిస్తారు.
పేపర్‌–2: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ మార్కులు, డ్రాయింగ్‌ టెస్ట్‌ మార్కులు, తర్వాత డ్రాయింగ్‌ టెస్ట్‌ మార్కులు, నెగెటివ్‌ మార్కులు పరిశీలిస్తారు.
అప్పటికీ సమానమైన మార్కులు వస్తే ఇద్దరికీ ఒకే ర్యాంక్‌ ప్రకటిస్తారు.

ప్రశ్న: తల్లిదండ్రులు భారతీయులై తర్వాత కొంత కాలానికి ఓవర్సీస్‌ సిటిజన్‌ షిప్‌ పొందితే ఆ అభ్యర్థి ఏ కేటగిరీ కిందకు వస్తాడు?
జవాబు: తల్లిదండ్రులు ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కలిగి ఉంటే భారత విద్యార్థిగానే దరఖాస్తు చేసుకోవచ్చు. లేకుంటే ఫారెన్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవాలి.

Published on 12/9/2017 5:36:00 PM
టాగ్లు:
JEE Main- 2018 Joint entrance examination JEE main exam doubts JEE main 2018 students doubts NIT and IIT admissions JEE students doubts question and answers JEE Main- 2018 apply last date JEE Main- 2018 JEE Main- 2018 eligibilities JEE Main- 2018 exam syllabus

Related Topics