quit

జూన్ 2013 వ్యక్తులు

సెస్ చైర్మన్గా ప్రొఫెసర్ రాధాకృష్ణ
కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)కు నూతన చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్.రాధాకృష్ట నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సెస్లో గౌరవ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్తోపాటు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్(అహ్మదాబాద్)కు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఐసీఎస్ఆర్కు గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నారు. రాధాకృష్ణ యునెస్కో, ఏడీబీ, ప్రపంచ బ్యాంకు, యూఎన్డీపీ సహా పలు ప్రతిష్టాత్మక సంస్థలకు సలహాదారుగా పనిచేశారు. జూలై 1న రాధాకృష్ణ బాధ్యతలు స్యీకరిస్తారని సెస్ జూన్ 26న ఓ ప్రకటనలో తెలిపింది.

చిన్నారి మేధావి
బ్రిటన్కు చెందిన ఆడమ్ కిర్బీ అనే రెండేళ్ల చిన్నారి ఐక్యూ పరీక్షలో 141 స్కోరు సాధించి, మేధావుల క్లబ్ ‘మెన్సా’లో సభ్యత్వం పొందిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఆడమ్ తెలివితేటలు అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరాన్ల కంటే ఎక్కువేనని ఐక్యూ పరీక్షలో తేలింది. షేక్స్పియర్ పుస్తకాలను అనర్గళంగా చదవగలిగే ఈ చిన్నారి జపనీస్, స్పానిష్, ఫ్రెంచి భాషలను అర్థం చేసుకోగలడు. వంద క్లిష్టమైన పదాలకు స్పెల్లింగులు, పిరియాడిక్ టేబుల్లోని మూలకాల పేర్లను చెప్పగలడు.

కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా అనిల్ గోస్వామి
కేంద్ర హోం శాఖ నూతన కార్యదర్శిగా జమ్మూ కాశ్మీర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ గోస్వామి(58) జూన్ 30న బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ హోం సెక్రటరీ పదవికి గోస్వామి పేరును ఆమోదించింది. 1978 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన గోస్వామి జమ్మూ నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి అధికారి కావడం విశేషం. 2015, జూన్ వరకు సుమారు రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. హోం శాఖలో ఇప్పటి వరకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా గోస్వామి బాధ్యతలు నిర్వహించారు.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సదాశివం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా తమిళనాడుకు చెందిన జస్టిస్ పీ సదాశివం (64) నియామకం ఖరారైంది. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూన్ 29న ఆమోదం తెలిపారు. ఈ నెల 18న సదాశివం బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆల్తమస్ కబీర్ పదవీకాలం ఈ నెల 18తో ముగియనుంది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1949, ఏప్రిల్ 27న సదాశివం జన్మించారు. 1973లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది, 1996 జనవరిలో మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా చేరారు. 2007 ఏప్రిల్లో పంజాబ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అదే సంవత్సరం ఆగస్టు 21న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన 2014, ఏప్రిల్ 26 వరకు ఈ పదవిలో ఉంటారు.
ది ఇండిపెండెంట్‌ ఎడిటర్‌గా భారత జాతీయుడు
బ్రిటన్‌ జాతీయ పత్రిక ది ఇండిపెండెంట్‌కు ఎడిటర్‌గా భారత జాతీయుడు నియమితులయ్యారు. ఇప్పటివరకు కామెంట్‌ ఎడిటర్‌గా ఉన్న రాజన్‌ ఇక నుంచి ది ఇండిపెండెంట్‌కు ఎడిటోరియల్‌ హెడ్‌గా వ్యవహరించనున్నారు. కోల్‌కతాలో జన్మించిన రాజన్‌ మూడేళ్ల ప్రాయంలో లండన్‌ చేరుకున్నారు. దక్షిణ లండన్‌లోని టూటింగ్‌లో పెరిగిన ఆయన కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. అనంతరం ఈవెనింగ్‌ స్టాండర్డ్‌, చానల్‌-5లలో కొం తకాలం పనిచేసి, రిపోర్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షునిగా జాన్‌ అషే
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (జనరల్‌ అసెంబ్లీ) 68వ సమావేశాలకు అధ్యక్షుడిగా జాన్‌ అషే ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో ఆంటిగ్వా, బార్బుడాల శాశ్వత రాయబారిగా ఉన్నారు. సాధారణ అసెంబ్లీ 68వ సమావేశాల్లో ఆయన ఈ పదవికి ఎన్నికయ్యారు. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాలతో కూడిన సాధారణ సభ అన్ని అంతర్జాతీయ అంశాలకు సంబంధించి బహుళ పక్ష చర్చలకు వేదికగా నిలుస్తుంది.

కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా కన్నుమూత
సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి విద్యా చరణ్‌ శుక్లా (84) న్యూఢిల్లీలో జూన్‌ 11న మరణించారు. ఆయన మే 25న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో గాయపడ్డారు. వీసీ శుక్లా తొలిసారి 1957లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో సమాచార ప్రసారశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత పీవీ నరసింహారావు మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, జలవనరుల మంత్రిగా విధులు నిర్వర్తించారు.

తమిళ నటుడు మణివణ్ణన్‌ మృతి
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మణివణ్ణన్‌ (59) జూన్‌ 15న చెన్నైలో మరణించారు. ఆయన 200కు పైగా చిత్రాల్లో నటించారు. 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాద చిత్రాలుగానూ, రీమేక్‌ చిత్రాలుగాను వచ్చాయి.

ఎల్‌ఐసీ చైర్మన్‌గా ఎస్‌కే రాయ్‌
జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) చైర్మన్‌గా ప్రస్తుతం మేనేజింగ్‌ డెరైక్టర్‌గా ఉన్న ఎస్‌కే రాయ్‌ని జూన్‌ 14న ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా ఉన్న డీకే మెహ్రోత్రా పదవీకాలం మే 31న ముగియడంతో ఆయన స్థానంలో రాయ్‌ నియమితులయ్యారు. రాయ్‌ ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు.

హిందీ నటి జియాఖాన్ మృతి
హిందీ చలనచిత్ర నటి జియాఖాన్ (25) జూన్ 4న ముంబైలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లండన్‌లో పెరిగి ముంబైలో స్థిరపడిన జియాఖాన్ నిశ్శబ్ద్, గజిని, హౌస్‌ఫుల్ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆమె అసలు పేరు నఫీసా.

జె.వి.రాఘవులు కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు జెట్టి వీర రాఘవులు (83) జూన్ 7న రాజమండ్రిలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, మరాఠీ భాషల్లో సుమారు 175 చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. అదేవిధంగా 100కు పైగా సినిమా పాటలు పాడారు. దర్శకుడు రుతుపర్ణో ఘోష్ మృతి
బెంగాలీ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన ప్రముఖ సినీ దర్శకుడు రుతుపర్ణో ఘోష్ (49) కోల్‌కతాలో మే30న గుండెపోటుతో మరణించారు. ఆయన మహిళల సమస్యలను, కుటుంబ సంబంధాలను ఇతివత్తంగా తీసుకుని ఆలోచనాత్మక చిత్రాలు తీశారు. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఆయన బెంగాలీతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 12 జాతీయ అవార్డులతోపాటు కొన్ని అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన తీసిన హీరేర ఆంగ్తీ, దహన్, చోఖేర్‌బాలి, చిత్రాంగద, రెయిన్‌కోట్ తదితర చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ప్రముఖ నిర్మాత రామానాయుడు బెంగాలీలో నిర్మించిన అశూక్ చిత్రానికి ఘోష్ దర్శకత్వం వహించారు.

డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్‌గా అవినాశ్ చందర్
రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీవో) డెరైక్టర్ జనరల్‌గా, రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారుగా అవినాశ్ చందర్ మే 31న నియమితులయ్యారు. ఆయన రక్షణ పరిశోధన, అభివద్ధి శాఖకు కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. డీఆర్‌డీవో చీఫ్‌గా ఉన్న వి.కె.సారస్వత్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో అవినాశ్ చందర్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో పరిశోధన, అభివద్ధి (క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు) విభాగం చీఫ్ కంట్రోలర్‌గా ఉన్నారు. క్షిపణ శాస్త్రవేత్తగా ప్రఖ్యాతుడైన చందర్ అగ్ని ప్రోగ్రాం డెరైక్టర్‌గా అగ్ని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. దేశం గర్వించదగ్గ ఖండాంతర క్షిపణి అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ఆయన సారథ్యంలోనే రూపుదిద్దుకుంది. డీఆర్‌డీవో చీఫ్ పదవి కోసం సుమారు పన్నెండుమంది శాస్త్రవేత్తలు పోటీపడగా కేబినెట్ కార్యదర్శి నేతత్వంలోని శాస్త్రవేత్తల బందం అవినాశ్ ను ఎంపిక చేసింది. ఆయనను ఇటీవల భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

మహిళా ఉద్యమకారిణి వీణా మజుందార్ మృతి
ప్రముఖ విద్యావేత్త, భారత మహిళా ఉద్యమకారిణి వీణా మజుందార్ (86) న్యూఢిల్లీలో మే 30న మరణించారు. పార్లమెంట్ తదితర చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు ఆమె పోరాడారు. భారత సామాజిక శాస్త్రాల పరిశోధక మండలి (ఐసీఎస్‌ఎస్‌ఆర్)లో జాతీయ పరిశోధక ప్రొఫెసర్‌గా ఆమె పనిచేశారు
www.sakshieducation.com
టాగ్లు:
జూన్ 2013 వ్యక్తులు
 
Published on
 
 
 
pixel
Quick Links
Jobs in Telugu
State Govt Jobs
Bank Jobs
Defence Jobs
Engineering Jobs
Faculty & Non-faculty Jobs
Miscellaneous Jobs
Medical Jobs
Navaratna & Miniratna Jobs
Private Jobs
Public Service Commission/SSC Jobs
Railway Jobs
Research/Scientist Jobs
Security / Police Force Jobs
Walk-ins
pixel
Home | About Us | Disclaimer | Contact us at education@sakshi.com
Engineering | Competitive Exams | Tenth Class | Intermediate | Eamcet | Sitemap
Copyright © 2010 sakshieducation.com. All rights reserved.
Site is Best viewed in Internet Explorer 7 & above with 1024 × 768 Resolution
pixel
quit

Receive All Updates Via Facebook