Advertisement

ఎల్‌ఐసీ ఏఏవో నియామక విధానం - వ్యూహాలు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎల్‌ఐసీగా ఇంటింటికీ సుపరిచితమైన పేరు! బీమా రంగంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ సంస్థ గత కొన్నేళ్లుగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. దీంతో భారీగా ఉద్యోగులను నియమించుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా 700 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో) ఉద్యోగాల భర్తీకి ఎల్‌ఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకర్షణీయ వేతనాలు, పదోన్నతులకు వీలుకల్పించే ఈ ఉద్యోగాలకు అర్హతలు, నియామక విధానం, విజయానికి వ్యూహాలు తదితరాలపై ఫోకస్...
Bavitha బీమా రంగం.. గత దశాబ్దకాలంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగం. ఎన్నో ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో ప్రవేశిస్తున్నాయి. అయినా ఎల్‌ఐసీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అలాంటి సంస్థలో ఉద్యోగిగా ప్రవేశించేందుకు తాజా నోటిఫికేషన్ వీలుకల్పిస్తోంది. ఏఏవో రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ పేరుతో సంస్థలోకి ఆహ్వానిస్తోంది. ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే ప్రారంభంలోనే ఏ క్లాస్ సిటీలో రూ.40,245 నెల జీతంతో కెరీర్ ప్రారంభించొచ్చు. తర్వాత అనుభవం, అదనపు అర్హతలు సాధిస్తే కెరీర్ గ్రాఫ్‌లో జోనల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు.

ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీలు: 700
కేటగిరీ ఖాళీలు
ఎస్సీ 104
ఎస్టీ 52
ఓబీసీ 192
అన్‌రిజర్వ్‌డ్ 349
మొత్తం 697
3 బ్యాక్‌లాగ్ ఖాళీలున్నాయి.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత
వయో పరిమితి: 2015, డిసెంబర్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; పీడబ్ల్యూడీ జనరల్ అభ్యర్థులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 13 ఏళ్లు సడలింపు ఉంటుంది.

రెండు దశలుగా ఎంపిక
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నియామకాల కోసం చేపట్టిన ఎంపిక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశ రాత పరీక్ష. రెండో దశ పర్సనల్ ఇంటర్వ్యూ. రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అందులోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే ఏడాది ప్రొబేషన్.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కొలువు ఖాయమవుతుంది.

ఆన్‌లైన్లో ఏఏవో పరీక్ష
విభాగం ప్రశ్నలు మార్కులు
రీజనింగ్ ఎబిలిటీ 30 90
క్వాంటిటేటివ్ ఎబిలిటీ 30 90
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 30 60
కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 30 60
ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ 40 --
మొత్తం 160 300

కనీస మార్కులు తప్పనిసరి
రాత పరీక్ష తర్వాత దశలో నిర్వహించే పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపికవ్వాలంటే నిబంధనల ప్రకారం ప్రతి సెక్షన్‌లో కనీస అర్హత మార్కులు (కటాఫ్) పొందాలి. వీటిని మొత్తం హాజరైన అభ్యర్థులు, పొందిన మార్కులు, ఖాళీల ఆధారంగా ఎల్‌ఐసీ నిర్ణయిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు కోత విధిస్తారు. సాధారణంగా ఒక్కో ఖాళీకి ముగ్గురు చొప్పున పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్షలోని అయిదో సెక్షన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ కేవలం అర్హత విభాగమే. ఈ విభాగంలో పొందిన మార్కులను మలి దశకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు పరిగణనలోకి తీసుకోరు.

పదో తరగతి, +2 స్థాయిలో
పరీక్షలో పేర్కొన్న విభాగాల్లో ప్రశ్నలు పదో తరగతి, ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో విభాగాల వారీగా దృష్టి సారించాల్సిన ముఖ్యాంశాలు..

రీజనింగ్ ఎబిలిటీ
కొద్దిపాటి తార్కిక నైపుణ్యంతో ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కోడింగ్, డీ-కోడింగ్, నంబర్ సిరీస్, సిలాజిజమ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, గ్రాఫ్‌లపై అవగాహన పెంపొందించుకోవాలి.

క్వాంటిటేటివ్ ఎబిలిటీ
అభ్యర్థుల్లోని మ్యాథమెటిక్స్ నైపుణ్యాన్ని పరీక్షించే విభాగం. ఇందులో రాణించేందుకు అంక గణితంలోని ప్రధానాంశాలైన టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్ రేషియోస్ వంటి ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.

జీకే అండ్ కరెంట్ అఫైర్స్
అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ మార్కులు సొంతం చేసుకోగలిగిన విభాగం. అదే విధంగా అన్ని అంశాలపై అవగాహన పొందాల్సిన విభాగం జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ విభాగంలో చరిత్ర, భౌగోళిక శాస్త్రం, రాజ్యాంగం, ఆర్థిక శాస్త్రం విభాగాల నుంచి స్టాండర్డ్ జీకే ప్రశ్నలు వస్తాయి. అదే విధంగా ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన వ్యక్తులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న రికార్డ్‌లు వంటిపై అవగాహన పెంపొందించుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి అంతకుముందు సంవత్సర కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, సదస్సులు, ఒప్పందాల గురించి తెలుసుకోవాలి. అభ్యర్థులు బ్యాంకింగ్, బీమా రంగంలో నెలకొన్న తాజా పరిణామాలు తెలుసుకుంటే మరింత ఉపయుక్తంగా ఉంటుంది.

కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్
ఇది అభ్యర్థుల్లోని కంప్యూటర్ నైపుణ్యాలను పరీక్షించే విభాగం. కొలువు ఖాయం చేసుకున్నాక అధిక శాతం విధులన్నీ కంప్యూటర్ ఆధారితంగానే నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ఈ విభాగాన్ని పొందుపర్చారు. ఇందులో మంచి మార్కులు పొందాలంటే ఎం.ఎస్.ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ (ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎక్సెల్ ప్రొ) వంటి వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన పొందాలి. అంతేకాకుండా ఆఫీస్ టూల్స్‌ను వినియోగించే క్రమంలో సంబంధిత షార్ట్ కట్ కీస్‌పై అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి. ఉదా: న్యూ విండో క్రియేషన్ (కంట్రోల్ ఎన్), కాపీ (కంట్రోల్ సి), పేస్ట్ (కంట్రోల్ వి) తదితరాలు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలోని మార్కులను మలి దశ ఎంపికకు పరిగణనలోకి తీసుకోనప్పటికీ కనీస మార్కులు పొందాలి. విద్యార్థులు బేసిక్ గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ - ప్యాసివ్ వాయిస్, డెరైక్ట్ - ఇన్ డెరైక్ట్ స్పీచ్, యాంటానిమ్స్, సినానిమ్స్‌లపై అవగాహన పెంపొందించుకోవాలి. దీనికోసం పదో తరగతి స్థాయి గ్రామర్ పుస్తకాలను చదివితే ఉపయుక్తంగా ఉంటుంది.

రాత పరీక్ష కటాఫ్ (400 మార్కులకు)
జనరల్ 225
ఓబీసీ 214
ఎస్సీ 199
ఎస్‌టీ 175

ఫైనల్ కటాఫ్ (రాత పరీక్ష + పర్సనల్ ఇంటర్వ్యూ)
జనరల్ 277
ఓబీసీ 255
ఎస్సీ 242
ఎస్టీ 221

రాత పరీక్ష ముఖ్య తేదీలు
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జనవరి 5, 2016.
  • కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి, 2016 చివరి వారం
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: 2016 మార్చి 5, 6, 13.
  • వెబ్‌సైట్: http://http://www.licindia.in/Recruitment_ Assistant_Administrative_Officer.html

కొద్దిపాటి మెళకువలతో మెరుగయ్యే అవకాశాలు
ఎల్‌ఐసీలో ఆఫీసర్ హోదాలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి తొలి దశ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్. కొద్దిపాటి మెళకువలతో ఈ పరీక్షలో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. పదో తరగతి, +2 స్థాయిలో మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ఇక కెరీర్ పరంగా.. ఒకసారి విధుల్లో చేరిన తర్వాత జేఏఐఐబీ, సీఏఐఐబీ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా పదోన్నతులు పొంది జోనల్ మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.
- కె.సంజయ్, ఎల్‌ఐసీ నాన్- ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఐఎస్‌బీ ఫ్యాకల్టీ.

బీమా రంగంలో కెరీర్ అవకాశాలు
ఇన్సూరెన్స్ రంగంలో ఉజ్వల కెరీర్ అవకాశాలున్నాయి. ఇందుకు ఆయా సంస్థల సర్వేలు, నివేదికలే నిదర్శనాలు.
  • ఎన్‌ఎస్‌డీసీ అంచనా ప్రకారం 2020 నాటికి 8 లక్షల మంది అవసరం.
  • కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) అంచనాల ప్రకారం 2025 నాటికి ఒక్క ఇన్సూరెన్స్ రంగంలోనే 21 లక్షల మంది నిపుణుల అవసరం.
  • అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా (అసోచామ్) నివేదిక ప్రకారం 2030 నాటికి 30 లక్షల అవకాశాలకు ఇన్సూరెన్స్ రంగం వేదిక కానుంది.
వీటన్నటినీ పరిగణనలోకి తీసుకొని ఈ రంగంలో ఔత్సాహికులు, యువత.. ఎల్‌ఐసీ తాజా నోటిఫికేషన్‌ను మార్గంగా ఎంపిక చేసుకుని, అందులో విజయానికి కృషి చేయాలి.
Published on 12/24/2015 6:06:00 PM

Comment

Related Topics