images/p-logo.png

మరో ఆశా కిరణం..‘పంచాయతీ కార్యదర్శి’!.. ఉద్యోగాలు


ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ తర్వాత మరో ఉద్యోగ నియామకాల ప్రకటన నిరుద్యోగుల ముందుకు రానుంది.
Bavitha2,600 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ నెలాఖరులో ప్రకటన విడుదల కానున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల వెల్లడించారు. దీంతో అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ వ్యూహాలపై ఫోకస్...

2,677 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 2013, డిసెంబర్ 30న ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించింది. దీనికి 8.14 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 71 శాతం మంది పరీక్ష రాశారు. సిలబస్‌లో కొత్త అంశాలను చేర్చడం, ప్రిపరేషన్‌కు స్వల్ప సమయం ఉండటం తదితరాల వల్ల అభ్యర్థులు కొంత ఆందోళన చెందారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవచ్చు. ప్రశ్నపత్రంపై అవగాహన ఏర్పడింది కాబట్టి నోటిఫికేషన్ కోసం ఎదురుచూడకుండా ప్రిపరేషన్ ప్రారంభించి ఓ ప్రణాళిక ప్రకారం చదివి విజయాన్ని ఖాయం చేసుకోవచ్చు.

ఆకర్షణీయం:
పంచాయతీ రాజ్ సబార్డినేట్ సర్వీస్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 4) కీలక ఉద్యోగం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం (1994), 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)లో నిర్దేశించిన విధులను పంచాయతీ కార్యదర్శి నిర్వర్తించాలి. కార్యదర్శి.. గ్రామ పంచాయతీకి, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా వ్యవహరించాలి. వేతన స్కేలు రూ.7,520 - రూ. 22,430. కొత్త పీఆర్‌సీకి ఆమోదం లభిస్తే ఇది మరింత పెరగనుంది. దాదాపు రూ. 16 వేల వేతనంతో ఉద్యోగంలో చేరిన వారు పదోన్నతులు ద్వారా ఎంపీడీవో స్థాయికి చేరుకోవచ్చు. ఉద్యోగ భద్రత, గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరమైన పనివాతావరణం నేపథ్యంలో ఉద్యోగాలకు తీవ్ర పోటీ ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేయాలి.
వయసు: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన తేదీ నాటికి కనిష్ట వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 40 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పీహెచ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం:

పేపర్

ప్రశ్నలు

మార్కులు

1. జనరల్ స్టడీస్

150

150

2. గ్రామీణాభివృద్ధి-సమస్యలు (ఏపీకి ప్రాధాన్యం)

150

150


సమయం ఒక్కో పేపర్‌కు 150 నిమిషాలు ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

సిలబస్:
పేపర్ 1:
జనరల్ స్టడీస్ సిలబస్‌లో మొత్తం ఏడు అంశాలను పేర్కొన్నారు. అవి.. 1. జాతీయ, అంతర్జాతీయ ప్రధాన సంఘటనలు. 2. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు. 3. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- సమకాలీన పరిణామాలు. 4. ఆధునిక భారత దేశ చరిత్ర (జాతీయోద్యమానికి ప్రత్యేక ప్రాధాన్యం. 5. స్వాతంత్య్రానంతరం భారత్‌లో ఆర్థికాభివృద్ధి. 6. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్. 7. విపత్తు నిర్వహణ ప్రాథమిక అంశాలు.

పేపర్-2: సిలబస్‌లో ఐదు యూనిట్లు ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో నిర్వర్తించాల్సిన విధులకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. అవి.. 1. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, అంటువ్యాధులు-కారణాలు, పరిశుభ్రత. 2. సమకాలీన సమాజంలో ఉద్రిక్తతలు, ఘర్షణలు. 3. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ- ప్రజాస్వామ్య సంస్థలు, పంచాయతీరాజ్, గ్రామీణప్రాంతాల సేవలో సహకార సంస్థల పాత్ర. 4. గ్రామీణ ప్రాంతాలు-శాస్త్రీయ అభివృద్ధి, వివిధ రంగాల్లో అధునాతన పరికరాలు. 5. అకౌంటింగ్-మౌలిక అంశాలు.

పేపర్ 1- జనరల్ స్టడీస్
Bavitha గత పరీక్షలో పేపర్-1 (జనరల్ స్టడీస్)లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం లభించింది. 150 ప్రశ్నల్లో 60కి పైగా ఈ విభాగం నుంచే వచ్చాయి. అందువల్ల అభ్యర్థులు వీటి ప్రిపరేషన్‌కు తగిన సమయం కేటాయించాలి.

దృష్టిసారించాల్సిన అంశాలు:
 • అంతర్జాతీయ సంస్థలు, దేశాల అధినేతలు.
 • వివిధ అంశాల్లో ప్రథమ వ్యక్తులు.
 • జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ పురస్కారాలు-విజేతలు.
 • ఇటీవల జరిగిన ఎన్నికలు-ఫలితాలు.
 • ఇటీవల కాలంలో జరిగిన నియామకాలు.
 • నదులు, ఉపనదులు, ప్రాజెక్టులు.
 • విశ్వవిద్యాలయాలు- అవి ఉన్న జిల్లాలు.
 • ఖండాల్లోని ముఖ్యమైన దేశాలు.
 • 2011 జనాభా లెక్కల వివరాలు.
 • దేశంలోని ప్రముఖ సంస్థలు-ఉన్న ప్రదేశాలు; భౌగోళిక మారుపేర్లు.
 • ప్రముఖ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు.
 • దేశాల మధ్య సరిహద్దు రేఖలు, దేశాలు-రాజధానులు.
 • అంతరిక్ష ప్రయోగాలు- ఉపగ్రహాలు.
 • గ్రంథాలు-రచయితలు; రాష్ట్రాల్లోని నృత్యాలు; ముఖ్య దినోత్సవాలు.
 • అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు- ఉన్న నగరాలు తదితర అంశాలు.
గత పరీక్షలో వచ్చిన ప్రశ్నలు:
 • ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి?
  (బాన్‌కీమూన్).
 • ఏంజెలా మెర్కల్ ఏ దేశానికి చాన్సలర్?
  (జర్మనీ).
 • నోబెల్ బహుమతి సాధించిన ప్రథమ భారతీయుడు?
  (రవీంద్రనాథ్ ఠాగూర్).
 • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి మహిళా చైర్‌పర్సన్?
  (అరుంధతీ భట్టాచార్య).
 • బిగ్ ఆపిల్ అని ఏ నగరాన్ని అంటారు?
  (న్యూయార్క్).
 • wwwపూర్తి పేరు?
  (వరల్డ్ వైడ్ వెబ్).
 • రేడియో యాక్టివిటీని కనుగొన్నది?
  (హెన్రీ బెకరల్).
 • ‘మై జర్నీ’ గ్రంథ రచయిత?
  (అబ్దుల్ కలాం).
 • అంతర్జాతీయ అక్షరాస్యతా దినం?
  (సెప్టెంబర్ 8).
 • జింబాబ్వే రాజధాని?
  (హరారే).
విపత్తు నిర్వహణ:
విపత్తు నిర్వహణపై గత పరీక్షలో 10 ప్రశ్నలు వచ్చాయి. ఈ విభాగం సిలబస్ తక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తి మార్కులు సాధించవచ్చు. సహజ విపత్తులు, భూకంపాలు, సునామీలు, వరదలు, విపత్తు నిర్వహణ చట్టం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తదితర అంశాలపై దృష్టిసారించాలి. విపత్తులకు సంబంధించిన వర్తమాన వ్యవహారాలను చదవడం తప్పనిసరి.

గత ప్రశ్నలు:
 • ఏది ప్రకృతి విపత్తు?
  ఎ) కరువు
  బి) యుద్ధం
  సి) అంతర్గత యుద్ధం
  డి) ఉగ్రవాదం
  సమాధానం:
 • ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు?
  ఎ) 2003
  బి) 2004
  సి) 2005
  డి) 2006
  సమాధానం: సి
ఆధునిక భారత దేశ చరిత్ర:
 • మత, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు; 1857 తిరుగుబాటు, భారత స్వాతంత్య్ర ఉద్యమం; ఆంగ్ల, మరాఠా యుద్ధాలు; భారత జాతీయ కాంగ్రెస్ తదితర అంశాలను చదవాలి.
 • పంచవర్ష ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి, అభివృద్ధి పథకాలు, బ్యాంకింగ్ రంగంలో మార్పులు తదితర అంశాలపై దృష్టిసారించాలి.


అకౌంటింగ్
పంచాయతీ కార్యదర్శికి ఖాతాల నిర్వహణపై అవగాహన తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, సిలబస్‌లో అకౌంటింగ్ అంశాన్ని చేర్చారు. గత పరీక్షలో 150 మార్కులకున్న రెండో పేపర్‌లో అకౌంటింగ్‌కు సంబంధించి 26 ప్రశ్నలు వచ్చాయి. నగదు పుస్తకం, పెట్టుబడి-ఖర్చు, ఆదాయం, భాగస్వామ్యం-ఖాతాలు, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్, అకౌంటింగ్ ప్రాథమిక సూత్రాలు తదితరాలపై ప్రశ్నలు అడిగారు. ఇవన్నీ ఇంటర్ స్థాయి అకౌంటింగ్‌కు సంబంధించిన అంశాలే. అందువల్ల అభ్యర్థులు ఇంటర్ అకాడమీ పుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. కాస్త శ్రమిస్తే ఇందులో పూర్తిస్థాయి మార్కులు సాధించవచ్చు.

గత ప్రశ్నలు:
 • కింది వాటిలో ఏది సరైనది?
  ఎ) అప్పులు= మూలధనం+ఆస్తులు
  బి) మూలధనం= ఆస్తులు-అప్పులు
  సి) మూలధనం= ఆస్తులు+అప్పులు
  డి) ఆస్తులు= అప్పులు × మూలధనం
  సమాధానం: బి
 • రుణగ్రస్తులకు ఇచ్చిన నగదు డిస్కౌంట్ ఏ ఖాతాకు క్రెడిట్ చేయాలి?
  ఎ) రుణగ్రస్తుల ఖాతా
  బి) కొనుగోలు ఖాతా
  సి) డిస్కౌంట్ ఖాతా
  డి) అమ్మకాలు ఖాతా
  సమాధానం:
 • పంచాయతీ వార్షిక లెక్కలను సకాలంలో ఆడిట్ చేయించకపోతే పర్యవసానం?
  ఎ) పంచాయతీకి నిధులు నిలిపేస్తారు
  బి) సర్పంచి పదవి కోల్పోతాడు
  సి) జరిమానా విధిస్తారు
  డి) పంచాయతీ నిధులను డ్రా చేసే అధికారంపై నిషేధం
  సమాధానం:
కురుహూరి రమేశ్, సీనియర్ ఫ్యాకల్టీ.


 • తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థ-రాజ్యాంగం; స్థానిక సంస్థల నిర్మాణం, విధులు; 73వ రాజ్యాంగ సవరణ ప్రాముఖ్యత; అధికార వికేంద్రీకరణ తదితర అంశాలపై విస్తృత దృష్టిసారించాలి.
 • అంటువ్యాధులు ప్రబలినపుడు సత్వరం తీసుకోవాల్సిన చర్యలు; అంటు వ్యాధులు- కారణాలు; పారిశుద్ధ్యం వంటి అంశాలను, సమకాలీన పరిణామాలతో అనుసంధానం చేస్తూ చదవాలి. ప్రజారోగ్యానికి సంబంధించిన పథకాలు, వాటి అమలు తీరుపై అవగాహన పెంపొందించుకోవాలి.
 • గ్రామీణ సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, ఆయా వర్గాల సమస్యలపై దృష్టిసారించాలి.
Published on 12/19/2014 4:04:00 PM
టాగ్లు:
Competitive guidance Career Guidance Panchayat Secretary jobs notification

ఎగ్జామ్ రిసోర్సెస్

Related Topics