Sakshi education logo

మే 2014 వ్యక్తులు

Join our Community

facebook Twitter Youtube
భారత నూతన అటార్నీ జనరల్‌గా ముకుల్ రోహత్గి
భారత నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని కేంద్ర ప్రభుత్వం మే 28న ఎంపిక చేసింది. 14వ అటార్నీ జనరల్‌గా నియమించిన రోహత్గి ప్రస్తుత అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతి స్థానంలో బాధ్యతలు చేపడతారు.

సొలిసిటర్ జనరల్‌గా రంజిత్‌కుమార్
భారత సొలిసిటర్ జనరల్‌గా మోహన్ పరాశరన్ స్థానంలో సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్‌ను నియమించాలని కేంద్రం మే 28న నిర్ణయించింది.

తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్‌కు అదనపు బాధ్యతలు
తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇకనుంచి నరసింహన్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తారు. ై ఈ మేరకు తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ జూన్ 2న బాధ్యతలు స్వీకరించారు.

జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్‌దోవల్
కేంద్ర ఇంటెలిజన్స్ బ్యూరో మాజీ అధిపతి అజిత్‌దోవల్ (69) శివశంకర్‌మీనన్ స్థానంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) గా మే 30న నియమితులయ్యారు.

స్పెల్ బీ విజేతలు.. శ్రీరామ్, సుజోయ్
ప్రతిష్టాత్మక స్పెల్ బీ చాంపియన్‌షిప్‌లో మరోసారి భారత సంతతి విద్యార్థులు సత్తా చాటారు. స్క్రిప్స్ నేషనల్ స్పెల్ బీ కాంటెస్ట్‌లో న్యూయార్క్‌కు చెందిన శ్రీరామ్ హత్వర్ (14), టెక్సాస్‌కు చెందిన అన్‌సన్ సుజోయ్ (13) సంయుక్త విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు. స్పెల్ బీ పోటీల చరిత్రలో ఇలా ఇద్దరు సంయుక్త విజేతలుగా నిలవడం ఇది నాలుగోసారి మాత్రమే. 1962లో చివరిసారిగా ఇద్దరు సంయుక్త విజేతలుగా నిలిస్తే.. మళ్లీ 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు శ్రీరామ్, సుజోయ్ ఆ ఘనత సాధించారు.

ఆర్మీ ఛీఫ్‌గా దల్బీర్‌సింగ్
భారత 26వ సైన్యాధిపతి (ఆర్మీ చీఫ్)గా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్‌ను నియమిస్తున్నట్లు మే 14న కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ బిక్రంసింగ్ జులై 31న పదవీ విరమణ చేయనున్నారు. బిక్రంసింగ్ అనంతరం నియమితుడయ్యే దల్బీర్‌సింగ్ సుహాగ్ 29నెలలపాటు సైన్యాధిపతిగా కొనసాగుతారు.

ఐరాస దళాలకు తొలి మహిళా కమాండర్
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి సారథ్యం వహించనున్న తొలి మహిళగా నార్వేకు చెందిన మేజర్ జనరల్ క్రిస్టీన్ లండ్ (55) నియమితులయ్యారు. సైప్రస్‌లో దాదాపు వెయ్యి మందితో కూడిన దళానికి ఆమె నేతత్వం వహించనున్నట్లు ఐరాస మే 12న వెల్లడించింది.

కేంద్ర జలసంఘం చైర్మన్‌గా పాండ్యా
కేంద్ర జలసంఘం చైర్మన్‌గా, కేంద్ర ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా బి. పాండ్య మే 15న నియమితులయ్యారు. 1977లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా సి.డబ్ల్యు.సి.లో చేరిన పాండ్య కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖలో పలు విభాగాల్లో అనేక బాధ్యతలు చేపట్టారు.

ఇంద్రజాలికుడు వేణుకు మెర్లిన్ పురస్కారం
ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణు మెర్లిన్ అవార్డ్ ఫర్ ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ టు మేజిక్ 2014 అనే అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. మన రాష్ట్రానికి చెందిన వేణు హైదరాబాద్‌లోని తెలుగు విశ్వ విద్యాలయం నుంచి ఇంద్రజాల విద్యలో డిప్లొమో చేశారు. ఆయన గత మూడు దశాబ్దాలుగా దేశ, విదేశాల్లో ఏడువేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అంతేకాదు ఏకధాటిగా 36 గంటలపాటు ఇంద్రజాల విద్యను ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

సీబీఐ కి తొలి మహిళా అదనపు డైరక్టర్
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అదనపు డెరక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చన రామసుందరం (56) మే 8న బాధ్యతలు స్వీకరించారు. సీబీఐలో ఈ పదవిని అలకరించిన తొలిమహిళగా అర్చన అరుదైన ఘనత సాధించారు. అయితే ఈ బాధ్యతలను చేపట్టే ముందు సరైన నియమాలను పాటించనందుకు ఆమెను తమిళనాడు ప్రభుత్వం పదవిని చేపట్టిన రోజే సస్పెండ్ చేసింది. అర్చన నియామకం అక్ర మం, చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు మే 9న తప్పు బట్టింది. సెలక్షన్ కమిటీకి ఆమె పేరును ప్రతిపాదించకపోయినా ఎలా నియమించారంటూ కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 1980 ఐపీఎస్ బ్యాచ్, తమిళనాడు కేడర్‌కు చెందిన ఆమె సీబీఐలో ఇప్పటివరకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ , జాయింట్ డెరైక్టర్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు.

మాజీ ముఖ్యమంత్రి ఎన్.జనార్దన్‌రెడ్డి మృతి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి (80) హైదరాబాద్‌లో మే 9న అనారోగ్యంతో మరణించారు. ఆయన 1990 డిసెంబర్ 17నుంచి 1992 అక్టోబర్ 2 వరకు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, లోక్‌సభ సభ్యుడిగా, రాష్ట్రమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగానూ పనిచేశారు.

నోకియా సీఈఓగా రాజీవ్ సూరి
ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ నోకియా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా భారత్‌కు చెందిన రాజీవ్ సూరి ఎంపికయ్యారు. ఆయన స్టీఫెన్ ఎలాఫ్ స్థానంలో మే 1న సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. గతంలో నోకియా నెట్‌వర్క్ పరికరాల యూనిట్, సొల్యూషన్స్ అండ్ నెట్‌వర్క్‌లో సూరి ప్రధాన అధికారిగా పని చేశారు. 1967లో జన్మించిన సూరి మంగుళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. 1995లో ఎన్‌ఎస్‌ఎన్ ఇండియాలో సిస్టమ్ మార్కెటింగ్ మేనేజర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జస్టిస్ మొహంతా
హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అశుతోష్ మొహంతా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మే 1న నియమితులయ్యారు. ఈ పదవికి మొహంతా పేరును గవర్నర్ నరసింహన్ నామినేట్ చేసినట్లు న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది.

ఇట్స్ ఏపీ అధ్యక్షుడిగా రమేశ్ లోగనాథన్
ఐటీ, ఐటీఈఎస్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ (ఇట్స్ ఏపీ) నూతన అధ్యక్షుడిగా ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ రమేశ్ లోగనాథన్ ఏప్రిల్ 29న ఎన్నికయ్యారు. ఆయన రెండేళ్లు(2014-16) ఈ పదవిలో ఉంటారు. హైదరాబాద్‌లోని ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా ఉన్న ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దడంలో రమేశ్ లోగనాథన్ కీలక పాత్ర పోషించారు.

నల్లధనంపై సిట్ అధిపతిగా జస్టిస్ షా
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధ నంపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి. షాను సుప్రీంకోర్టు మే1న నియమించింది. వైస్ చైర్మన్‌గా మరో రిటైర్డ్ న్యాయమూర్తి అరిజిత్ పసాయత్‌ను ధర్మాసనం నియమించింది.

భారత్ తొలి ఓటరు శ్యామ్ నేగి
భారత్ తొలి ఓటరుగా శ్యామ్‌నేగిని భారత ఎన్నికల సంఘం అధికారులు ధ్రువీకరించారు. ఆయన ఇప్పటివరకు (1951 నుంచి) మొత్తం 16 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 97 ఏళ్ల నేగి తొలిసారి 1951 అక్టోబరు లో నిర్వహించిన ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని కిక్నార్ జిల్లా కల్వాలో ఓటు వేశారు.

జవహర్ కలియానీకి అమెరికాలో కీలక పదవి
భారత సంతతికి చెందిన జవహర్ కలియానీ అమెరికా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖలో మే 2న నియమితులయ్యారు. కంట్రోలర్ ఆఫ్ కరెన్సీ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్లికేషన్ల అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన నేతృత్వం వహిస్తారు. జవహర్ కలియానీ ముంబైలో ఇంజనీరింగ్, అమెరికాలోని ఇలినాయిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు.

మేలో తొలి పని దినంగా స్వాతి డే
చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో మే 1న బెంగళూరు-గువహటి ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన పేలుళ్లలో మృతి చెందిన తెలుగమ్మాయి పరుచూరి స్వాతికి దక్షిణమధ్య రైల్వే అరుదైన గౌరవం కల్పించింది. స్వాతి స్మారకార్థం ఏటా మేలో తొలి పనిదినాన్ని స్వాతి డేగా పాటించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రతలో పునరంకితమయ్యే ఉద్దేశంతో స్వాతి డేను అమలు చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. స్వాతిది గుంటూరు జిల్లా.
Published on 5/8/2014 12:38:00 PM
టాగ్లు:
Current Affairs 2014

Related Topics