Sakshi education logo

సాహిత్య విమర్శ- కవి - కావ్యం

AP TET cum TRT
సాహిత్య విమర్శ: ‘మృశ్’ అనే ధాతువుకు ‘వి’ అనే ఉపసర్గ చేరి ‘విమర్శ’ అనే పదం ఏర్పడింది. విమర్శ అనే పదానికి పరిశీలించడం, పరీక్షించడం, పరామర్శించడం, ఆలోచించడం, చర్చించడం అనే అర్థాలున్నాయి. ఒకరు చేసిన పనిలో బాగోగులను ఇంకొకరు వివేచించి తెలపడాన్ని ‘విమర్శ’ అంటారు.
ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ప్రవేశించిన నూతన ప్రక్రియల్లో ‘సాహిత్య విమర్శ’ ఒకటి. ఒక గ్రంథంలోని లోపాలోపాలను, ఔచిత్య, అనౌచిత్యాలను, భావ గంభీరతను అలంకార రచనా పాటవాన్ని, ధ్వని విశేషాల్ని, శయ్యా సౌభాగ్యాన్ని, వస్తు నిర్మాణ సౌష్టవాన్ని, పాత్ర పోషణ, రస పోషణ, సన్నివేశ కల్పనలను, ఆ గ్రంథానికి సంబంధించిన సర్వ విషయాలను కూలంకషంగా చర్చించి సాహిత్యంలో ఆ గ్రంథానికి ఉన్న స్థానాన్ని నిర్ణయించడాన్ని సాహిత్య విమర్శగా పేర్కొనవచ్చు.
ఆచార్య సి. నారాయణరెడ్డి కవిత్వానికి, విమర్శకు ఉన్న భేదాన్ని కవితా స్ఫోరకంగా ‘కప్పి ఉంచితే కవిత్వం/విప్పి చెబితే విమర్శ’ అన్నారు.
పాశ్చాత్య విమర్శకులు విమర్శ స్వరూపాన్ని వివరించారు.
టి.ఎస్. ఇలియట్ ‘విమర్శ కవి మీద కాకుండా కవిత్వంపై ఉండాల’న్నారు. బెన్‌జాన్సన్.. ‘విమర్శకుడు దోషాల్ని చెప్పడమే కాకుండా, దోష రహితంగా ఎలా ఉండాలో’ చెప్పాలన్నారు.
డ్రైడెన్‌ ‘సాహిత్యానికి ప్రామాణికమైన చక్కని పరిష్కారం’ విమర్శ అన్నారు. విమర్శ పరిధిని, విమర్శకుడి విధులను సీన్స్‌ వివరించారు. సాహిత్య విమర్శ పరమావధి పొగడ్త, తెగడ్తలు కాదని అది నిర్వహించాల్సిన విధులు నాలుగున్నాయని ఆయన తెలిపారు. అవి..
1) తారతమ్య పరిశీలన
2) స్థిరమైన సిద్ధాంత ప్రతిపాదన
3) వివేచనతో కూడిన ఉపదేశం
4) నిజాయితీతో కూడిన ప్రశంస.
హడ్సన్ విమర్శ విధులను వివరిస్తూ...
'Criticism may be regarded as having two different functions that of interpretation and that of Judgement' అని అన్నారు. విమర్శ సూత్రాలను కావ్యంతో సమన్వయించి విశ్లేషించడం, సాహిత్యంలో ఆ గ్రంథ స్థానాన్ని నిర్ధారించడమేనని హడ్సన్ అన్నారు.
విమర్శకుడి లక్షణాల్లో ప్రధానమైంది రాగద్వేషాలకు అతీతమైన సహృదయం. అందుకు..
బహుముఖ ప్రజ్ఞాశాలి కావాలి.
తులనాత్మక అధ్యయనం ఉండాలి.
ఆకర్షణీయమైన భాషా శైలి కావాలి.
విమర్శ పాఠకుడికి మార్గదర్శకంగా,
ప్రయోజనాత్మకంగా ఉండాలి.
విమర్శ పరిణామం: పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో విమర్శ ప్రక్రియ తెలుగులో ప్రవేశించింది. 19వ శతాబ్ది చివరలో తెలుగు సాహితీ ప్రక్రియలన్నింటినీ స్పృశించి సుసంపన్నం చేసిన కందుకూరి వీరేశలింగం.. కొక్కొండ వేంకటరత్నం పంతులు రాసిన ‘విగ్రహ తంత్రం’పై ‘విగ్రహతంత్ర విమర్శనం’ (1876) అనే విమర్శ గ్రంథం రాసి ‘వివేక వర్ధిని’ పత్రికలో ప్రచురించారు. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి కందుకూరి నవల ‘రాజశేఖర చరిత్ర’పై ‘వివేక చంద్రికా దర్శనం’ పేరుతో విమర్శ వ్యాసం రాశారు. వీరేశలింగం క్షీణ యుగాన్ని విమర్శిస్తూ ‘సరస్వతీ నారద విలాపం’ పేరుతో పద్య గ్రంథం రాశారు. వీటిని తెలుగు సాహిత్య విమర్శకు నేపథ్యాలుగా భావించవచ్చు.
20వ శతాబ్దిలో కట్టమంచి రామలింగారెడ్డి రాసిన ‘కవిత్వతత్వ విచారం’ (1914)ను తెలుగులో సమగ్రమైన తొలి విమర్శ గ్రంథంగా విమర్శకులు నిర్ధారించారు. కట్టమంచి పాశ్చాత్య విమర్శ ప్రమాణాలను ప్రాచీన కావ్యానుశీలనలో ప్రయోగించి విమర్శకు రూపురేఖలు దిద్దారు. కావ్య నిర్మాణ శిల్పాన్ని వివేచించే వివేకాన్ని తెలుగు విమర్శకు నేర్పారు. తెలుగు సాహిత్యానికి కట్టమంచి సృజనాత్మక విమర్శను చవి చూపించారనే విషయం నిర్వివాదం. ఆయన ఒరవడితో బుర్రా శేషగిరిరావు, బసవరాజు అప్పారావు వంటి వారు ఆంగ్ల విమర్శ పద్ధతుల ఆధారంగా విమర్శ గ్రంథాలు రాశారు. దువ్వూరి రామిరెడ్డి ఆంగ్ల కవుల రమణీయక దృక్పథంతో తెలుగు కవిత్వాన్ని విశ్లేషించారు. డా॥జి.వి. కృష్ణారావు, సర్దేశాయి తిరుమలరావు, గుంటూరు శేషేంద్రశర్మ, ఆర్.యస్.సుదర్శనం వంటి వారు పాశ్చాత్య విమర్శ దృక్పథంతో విమర్శలు సాగించారు. ఆచార్య సి. నారాయణరెడ్డి, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, కొడవటిగంటి కుటుంబరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి వంటివారు ప్రసిద్ధ విమర్శ గ్రంథాలు రాశారు. ఆధునిక విమర్శకుల్లో ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య కాత్యాయినీ విద్మహే వంటి వారు విమర్శ ప్రక్రియలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు.
విమర్శ పద్ధతులను స్థూలంగా ప్రాచీన విమర్శ పద్ధతి, ఆధునిక విమర్శ పద్ధతి అని వర్గీకరించారు. ప్రాచీన విమర్శ పద్ధతిని అస్వతంత్ర విమర్శ పద్ధతి, స్వతంత్ర విమర్శ పద్ధతి అని రెండుగా విభజించారు. అస్వతంత్ర విమర్శకు ప్రాచీన విమర్శ, సంప్రదాయక విమర్శ, ఆలంకారిక విమర్శ, నిబద్ధ విమర్శ అనే పేర్లున్నాయి. ఆంగ్లంలో దీన్ని ‘డెటికేటివ్ క్రిటిసిజమ్’, ‘జ్యుడీషియల్ క్రిటిసిజమ్’ అని పిలుస్తారు. ఆత్మాశ్రయ ధోరణిలో సాగే ఈ విమర్శ పద్ధతిలో పక్షపాత ధోరణి ఉన్నందున దీన్ని ప్రామాణిక విమర్శగా పరిగణించేందుకు వీలు లేదు.
ఆధునిక విమర్శ పద్ధతుల్లో అనేక పద్ధతులున్నాయి. వాటిలో గ్రంథ పరిష్కార విమర్శ, ఆలంకారిక విమర్శ, పౌరాణిక విమర్శ, చారిత్రక విమర్శ, సాంఘిక విమర్శ, నైతిక విమర్శ, కళా విమర్శ, కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ, మనో వైజ్ఞానిక విమర్శ, మార్కిస్టు విమర్శ, అభిరుచి విమర్శ, సాంకేతిక విమర్శ, శైలీ విమర్శ, ప్రకృతి వాద విమర్శ, ప్రతీక వాద విమర్శ వంటి పద్ధతులున్నాయి. వీటిలో కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ పద్ధతిలో సిద్ధాంత గ్రంథ రచనలు సాగుతున్నాయి. ప్రక్రియను అనుసరించి విమర్శ పద్ధతులను విమర్శకులు పాటిస్తున్నారు.
 
కవి
వేదాల్లో కవిని భగవత్ స్వరూపుడిగా భావించారు. పరమాత్మ సాక్షాత్కారం పొందే రుషులను కవి శబ్దంతో సంబోధించారు. భవిష్యత్తును దర్శించగల ‘క్రాంత దర్శనత్వం’ కవికి ఉండాలనే లక్ష్యంతో ‘కవయః క్రాంత దర్శనః’ అనే నానుడి ప్రసిద్ధమైంది. ప్రాచీన కవులంతా యజ్ఞం చేసి రుషిత్వాన్ని పొంది క్రాంత దర్శనంపై కవిత్వ రచనకు పూనుకున్నారు. కవితాను దర్శించిన విషయాన్ని వర్ణనా నిపుణతతో పాఠకులకు ఆహ్లాదం కలిగేలా వర్ణిస్తాడు. భట్టతౌతుడు అనే ఆలంకారికుడు కవి తాను దర్శించిన విషయాన్ని వర్ణించినందునే లోకం లో ప్రసిద్ధి పొందుతున్నాడని చెప్పారు. మమ్మటుడు కవిలో కొత్త వర్ణనా నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఆనంద వర్థనుడు కవిని బ్రహ్మతో పోల్చి చెప్పారు.
కవికి ఉండాల్సిన లక్షణాలు
క్రాంత‌ దర్శనత్వం
వర్ణనా నిపుణత్వం
రసభావ ప్రతిపాదక విశ్లేషణాశక్తి
మనీషా సంపన్నత
మొదలైన లక్షణాలుండాలని ఆలంకారికుల అభిమతం.

కావ్య హేతువులు: కవితా కళా ప్రావీణ్యానికి మూడు ప్రధానమైన హేతువులుండాలని తొలిసారిగా ‘భామహుడు’ అనే ఆలంకారికుడు పేర్కొన్నారు. వీటినే కావ్య హేతువులు, కావ్య సామగ్రి, సాధన సామగ్రి పేర్లతో పిలుస్తారు.
1) ప్రతిభ
2) వ్యుత్పత్తి
3) అభ్యాసం అనేవి భామహుడు పేర్కొన్న కావ్య హేతువులు.

ఆంగ్ల విమర్శకులు
1) Emotion (భావావేశం)
2) Imagination (భావన)
3) Thought (ఆలోచన)
4) Form (రూపం)
అనే నాలుగింటిని కావ్య హేతువులుగా పేర్కొన్నారు.
1. ప్రతిభ: కావ్యహేతువుల్లో ప్రధానమైంది ప్రతిభ. సాధారణార్థంలో ప్రతిభను మేధస్సు అంటారు. ‘మమ్మటుడు’ దీన్ని ‘శక్తి’ అన్నారు. దండి ‘జన్మతః సంక్రమించే నైసర్గిక లక్షణం’గా పేర్కొన్నారు. అభినవ గుప్తుడు ‘అపూర్వ వస్తు నిర్మాణ ప్రజ్ఞ’గా చెప్పారు. రాజశేఖరుడు ‘కావ్య మీమాంస’ గ్రంథంలో ప్రతిభను రెండు విధాలుగా పేర్కొన్నారు. కవితా ప్రతిభను ‘కారయిత్రి’గా ఉటంకించారు. సహృదయ ఆస్వాదనా లక్షణాన్ని ‘భావయిత్రి’ అన్నారు. విమర్శకుడికి ఉండాల్సిన ప్రతిభ.. ‘భావయిత్రి’. జగన్నాథ పండితరాయలు ప్రతిభను ‘అదృష్ట జన్యం, అభ్యాస జన్యం’ అని రెండు విధాలుగా వర్గీకరించారు. పుట్టుకతో సంక్రమించే ప్రతిభా లక్షణం ‘అదృష్ట జన్యం’. అవిరళ కృషి, అభ్యాసాదులతో సాధించేది ‘అభ్యాస జన్యం’. భామహుడు ‘నవనవోన్మేష ప్రజ్ఞ’గా ప్రతిభను వర్ణించారు.
2. వ్యుత్పత్తి: ప్రతిభకు వికాసం కలిగించే సంస్కార హేతువు ‘వ్యుత్పత్తి’. సాధారణార్థంలో ‘వ్యుత్పత్తి’ అంటే పాండిత్యం. లోకశాస్త్ర కార్యాదుల పఠనం వల్ల కలిగేది పాండిత్యమని ఆలంకారికుల అభిప్రాయం. లక్షణ గ్రంథాలు, పూర్వ కవులు, సమకాలీన రచయితల గ్రంథాలు చదివి పరిజ్ఞానాన్ని పొందడం వ్యుత్పత్తిలో భాగం.
3. అభ్యాసం: ఏదైనా ఒక కళను లేదా విద్యను మెరుగుపర్చుకునేందుకు చేసే సాధన అభ్యాసం. ‘అభ్యాసం కూసువిద్య’ అనే లోకోక్తి అభ్యాస ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. దండి ‘నిరంతర అభ్యాసాన్ని ఆనందమయమైన అభియోగం’ అన్నారు. ప్రతిభను అభ్యాసం వల్ల పెంపొందించుకోవచ్చు. ఉపేక్షా భావంతో క్షీణింపజేయవచ్చు అనడం సముచితం. కావ్య హేతువుల్లో ‘ప్రతిభ’ ఉత్కర్షను విమర్శకులంతా పేర్కొన్నారు. వ్యుత్పత్తి అభ్యాసాలు ప్రతిభకు సంస్కార హేతువులే. ప్రతిభ లేని వ్యుత్పతి, అభ్యాసాలు వ్యర్థాలని వాగ్భటుడి వంటి ఆలంకారికులు పేర్కొన్నారు. రాజశేఖరుడు.. ప్రతిభ, వ్యుత్పత్తులు రెండూ కవికి శ్రేయోదాయకాలు అని పేర్కొన్నారు. వ్యుత్పత్తి కావ్య రచనకు తల్లి వంటిదన్నారు. ప్రతిభ లోపాన్ని వ్యుత్పత్తి కొంత మేరకు పూరించగలదని ఆయన అంటారు. మంగళుడు కూడా ప్రతిభా వ్యుత్పత్తుల సాన్నిహిత్యాన్ని వివరించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షంలో ‘కవి ప్రతిభలోన నుండు కావ్య గత శతాశముల యందు తొంబ‌దియైన‌ పాళ్లు’ అని ప్రతిభ ఉత్కర్షను పేర్కొన్నారు. ఉత్తమ కావ్యరచనకు ప్రతిభావంతమైన కవికి కావ్య హేతువులన్నీ ఉపాధేయాలే.

గత డీఎస్సీలో అడిగిన ప్రశ్నలు

 1. పరామర్శించడం, ఆలోచించడం, చర్చించడం అనే మాటలు ఈ ప్రక్రియకు చెందినవి?
  1) కావ్యాత్మ
  2) విమర్శ
  3) ఇతిహాసం
  4) రసం
 2. విమర్శ దృక్పథానికి మార్గదర్శకంగా కట్టమంచి రామలింగారెడ్డి రచించిన గ్రంథం?
  1) అలంకారతత్వం
  2) కవిత్వ తత్వ విచారం
  3) కవిత్వ తత్వ విచార విమర్శనం
  4) తెలుగులో కవితా విప్లవాల స్వరూపం
 3. ‘సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు’ గ్రంథకర్త?
  1) వేదుల సుబ్రహ్మణ్యం
  2) ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం
  3) డా॥జి.వి. కృష్ణారావు 4) నాళం కృష్ణారావు
సమాధానాలు
1) 2 2) 2 3) 2

మాదిరి ప్రశ్నలు

 1. ‘కప్పి ఉంచితే కవిత్వం/ విప్పి చెబితే విమర్శ’ అని పేర్కొన్నవారు?
  1) ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం
  2) ఆచార్య ఎస్వీ. జోగారావు
  3) ఆచార్య సి. నారాయణరెడ్డి
  4) శేషేంద్రశర్మ
 2. విమర్శ సూత్రాలతో కావ్యాన్ని సమన్వయించడం, సాహిత్యంలో ఆ గ్రంథ స్థానాన్ని నిర్ణయించడం అనే రెండు విధులను విమర్శ నిర్వర్తించాలన్న విమర్శకుడు?
  1) జాన్సన్
  2) హడ్సన్
  3) బెన్ జాన్సన్
  4) మాథ్యూ ఆర్నాల్డ్
 3. ‘సాహిత్యానికి ప్రామాణికమైన చక్కని పరిష్కారం విమర్శ’ - అని చెప్పిన విమర్శకుడు?
  1) డ్రెడైన్
  2) సీన్‌‌స
  3) మిల్టన్
  4) కోలిరౌడ్జి
 4. సహృదయ విమర్శకుడి లక్షణం?
  1) రాగద్వేషాలకు అతీతమైన హృదయం
  2) బహుముఖ ప్రజ్ఞ
  3) ఆకర్షణీయమైన భాషాశైలి
  4) అన్నీ
 5. ‘విగ్రహతంత్ర విమర్శనం’ గ్రంథకర్త?
  1) కొక్కొండ వేంకటరత్నం పంతులు
  2) కందుకూరి వీరేశలింగం
  3) బుర్రా శేషగిరిరావు
  4) బసవరాజు అప్పారావు
 6. అస్వతంత్ర విమర్శకు మరోపేరు?
  1) ప్రాచీన విమర్శ
  2) సంప్రదాయక విమర్శ
  3) ఆలంకారిక విమర్శ 4) అన్నీ
 7. విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో పాటించే విమర్శ పద్ధతి?
  1) స్వతంత్ర విమర్శ పద్ధతి
  2) ఆలంకారిక విమర్శ
  3) కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ
  4) మార్క్సిస్టు విమర్శ
 8. ‘కవిశబ్దం’ వేదాల్లో ఈ విధంగా వాడారు?
  1) ఆలంకారికుడు
  2) తపస్వి
  3) రుషి
  4) పరమాత్మ

సమాధానాలు

1) 3 2) 2 3) 1 4) 4 5) 2 6) 4 7) 3 8) 3
Published on 1/8/2015 12:14:00 PM

Related Topics