టీఆర్‌టీ సోషల్ స్టడీస్‌లో మెరవండిలా..


స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్.. పోటీ ఎక్కువగా ఉండే పోస్ట్! బీఈడీలో ఇతర సబ్జెక్టుల కంటే సోషల్ స్టడీస్‌లో కోర్సును పూర్తిచేసిన వారే అధికం. దీన్ని దృష్టిలో ఉంచుకొని, పటిష్ట ప్రణాళికతో ముందడుగు వేయాలి. విస్తృతంగా ఉన్న సిలబస్‌ను విశ్లేషించుకుంటూ.. అందుబాటులో ఉన్న సమయంలో ప్రిపరేషన్ పూర్తిచేయడం ద్వారా విజయాన్ని అందుకోవచ్చు.
పరీక్ష విధానం
విభాగం ప్రశ్నలు మార్కులు
జనరల్ నాలెడ్జ్ అండ్ 20 10
కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు 20 10
కంటెంట్ 88 44
టీచింగ్ మెథడాలజీ 32 16
మొత్తం 160 80

కంటెంట్ - వెయిటేజీ అంచనా
గత పరీక్షలు, ప్రశ్నపత్రాలను పరిగణనలోకి తీసుకుంటే కంటెంట్ పరంగా ఆయా విభాగాల నుంచి అడిగే ప్రశ్నల సంఖ్యపై అంచనా..
విభాగం ప్రశ్నలు మార్కులు
భూగోళ శాస్త్రం 28-30 14-15
చరిత్ర 28-30 14-15
పౌరశాస్త్రం 14-16 7-8
అర్థ్ధశాస్త్రం 14-16 7-8
సోషల్ స్టడీస్ సిలబస్ పరిధి విస్తృతంగా ఉంది. అయితే విభాగాల వారీగా అంశాలను నిర్దిష్టంగా పేర్కొనడం అనుకూలించే అంశం. కచ్చితంగా అవగాహన పెంపొందించుకోవాల్సిన అంశాలపై స్పష్టత ఇచ్చారు. అభ్యర్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. దీనికంటే ముందుగా సిలబస్‌లో పేర్కొన్న అంశాలు.. అకడమిక్ పుస్తకాల్లో ఉన్న అంశాలను తులనాత్మకంగా బేరీజు వేసుకోవాలి. సిలబస్‌లోని కొన్ని అంశాలు ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాల్లోనే కాకుండా ఇంటర్మీడియెట్‌లోనూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు పాఠశాల స్థాయి పుస్తకాల్లోని అంశాలకు కొనసాగింపుగా ఇంటర్మీడియెట్‌లో ఉన్న అంశాలను కూడా అధ్యయనం చేయడం మంచిది.

అనుసంధాన విధానం
ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు అనుసంధాన విధానాన్ని అనుసరించాలి. ఒక తరగతిలో ఉన్న అంశాలకు కొనసాగింపు ఎగువ తరగతుల్లోనూ ఉంటుంది. ఇలాంటి అంశాలను అనుసంధానించుకుంటూ అధ్యయనం చేయాలి. చదువుతున్నప్పుడే సొంతంగా నోట్స్ రాసుకోవడం మంచిది. ఇందులో ముఖ్య సమాచారాన్ని మాత్రమే పొందుపరచాలి. ఉదాహరణకు దక్షిణ భారత రాజ్య వంశాలను తీసుకుంటే.. వీటికి సంబంధించిన చాప్టర్లు హైస్కూల్ స్థాయిలో అన్ని తరగతులు, ఇంటర్మీడియెట్‌లోనూ ఉంటాయి. వీటిని చదువుతున్నప్పుడు అన్ని తరగతుల్లో పేర్కొన్న అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదవడం సమయం పరంగా లాభిస్తుంది. ఒక తరగతికి సంబంధించి అన్ని చాప్టర్లను చదివిన తర్వాత మరో తరగతి చాప్టర్లను చదువుదామనే దృక్పథం సరికాదు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో సమయం వృథా అవడమే కాకుండా.. ప్రిపరేషన్ పరంగానూ అన్ని అంశాలను పూర్తిచేయలేని పరిస్థితి ఎదురవుతుంది. సిలబస్‌లోని అంశాలను, అదే విధంగా దానికి సంబంధించి రాసుకునే సొంత నోట్స్‌ను కనీసం రెండుసార్లు చదివేలా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. దీనివల్ల ఆయా అంశాలపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

సబ్జెక్టుల వారీగా ముఖ్య చాప్టర్లు
జాగ్రఫీ: జాగ్రఫీ సిలబస్‌లో మొత్తం 14 చాప్టర్లు ఉన్నాయి. సౌర కుటుంబం, భూమి, ప్రధాన భూ స్వరూపాలు, శీతోష్ణస్థితి, అడవులు, భూకంపాలు, ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు, ఖండాల ముఖ్య సమాచారం, జనాభా, భారతదేశం, తెలంగాణ ప్రాంతీయ భౌగోళిక అంశాలు ముఖ్యమైనవి. భూ ఆవరణాలకు సంబంధించి వాతావరణం-జలావరణం-శిలావరణం-జీవావరణం అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. అడవులు, భూకంపాలు, అగ్ని పర్వతాలు అంశాల నుంచి ఒక్కో ప్రశ్న చొప్పున వచ్చేందుకు అవకాశముంది.

ఈసారి సిలబస్‌లో కొత్తగా చేరిన అంశం.. తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం. దీనికి సంబంధించి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల వ్యవస్థ-నదులు, పంటలు, ముఖ్య ఖనిజ వనరులు- విస్తరణ ప్రాంతాలు; వ్యవసాయం, పరిశ్రమలు, జనాభా అంశాలపై దృష్టిసారించాలి.

జాగ్రఫీ పాఠ్యాంశాల అధ్యయనానికి అట్లాస్‌ను ఉపయోగించుకోవాలి. ఆయా చాప్టర్లలో కనిపించే వివిధ ప్రాంతాలు, ఖండాలు, ప్రదేశాలు, సరస్సులు, పర్వతాలు-అక్కడి వర్షపాతం-ఉష్ణోగ్రత, శీతోష్ణస్థితి తదితరాలను అట్లాస్ సహాయంతో తేలిగ్గా అధ్యయనం చేయొచ్చు. వాస్తవానికి చాలామంది అభ్యర్థులు ఈ తరహా ప్రిపరేషన్‌లో సమయం వృథా అవుతుందనే భావనతో ఉంటారు. కానీ, మ్యాప్ పాయింటింగ్, మ్యాప్ రీడింగ్ నైపుణ్యంతో జాగ్రఫీలో వచ్చే ప్రశ్నలు ఏ విధంగా ఉన్నా.. సమాధానాలు తేలిగ్గా గుర్తించొచ్చు.

హిస్టరీ: హిస్టరీలో మొత్తం చాప్టర్ల సంఖ్య 34. ఈ సంఖ్యను చూసి ఆందోళన చెందాల్సిన పనిలేదు. సిలబస్ విస్తృతంగా కనిపిస్తున్నప్పటికీ.. జాగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్‌తో పోల్చుకుంటే.. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చరిత్రను అధ్యయనం చేయడం చాలా తేలిక.
చరిత్రను వివిధ విభాగాలుగావర్గీకరించుకోవాలి.
ప్రతి విభాగానికి సంబంధించి.. తదుపరి తరగతుల్లోని పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలతో అనుసంధానం చేసుకోవాలి.
నోట్స్‌ను కూడా చాలా క్లుప్తంగా రాసుకోవాలి.
చరిత్ర సిలబస్ పరంగా అట్లాస్‌పై అవగాహన పెంపొందించుకోవాలి.

సిలబస్ విభజన
 • పూర్వ చారిత్రక యుగం,
 • ప్రాచీన భారతదేశ చరిత్ర
 • మధ్యయుగ భారతదేశ చరిత్ర
 • ఆధునిక భారత దేశ చరిత్ర
 • ప్రాచీన ప్రపంచ నాగరికతలు
 • మధ్యయుగ ప్రపంచ చరిత్ర
 • ఆధునిక ప్రపంచ చరిత్ర
 • భారత స్వాతంత్య్రోద్యమం
 • స్వతంత్ర భారతదేశంలోని ముఖ్య ఘట్టాలు
 • సామాజిక ఉద్యమాలు
 • జాతీయవాద ఉద్యమాలు
 • రెండు ప్రపంచ యుద్ధాలు-వాటి పరిణామాలు
 • తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం
ప్రాచీన ఇనుపయుగ సమాజాలు; ప్రాచీన భారతీయ నాగరికతలు; క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలోని నూతన మతాలు, మౌర్యులు, మగధ, శాతవాహన, కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలు, గుప్తులు, చాళుక్యులు, పల్లవుల సాంస్కృతిక వికాసం, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ పాలకులు, బ్రిటిష్ పాలనలో భారతదేశం, భారత స్వాతంత్య్రోద్యమం, ప్రపంచ యుద్ధాలు, సామాజిక ఉద్యమాలు, ఆధునిక ప్రపంచం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.

ఈసారి కొత్తగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అంశాలు సిలబస్‌లో చేరాయి. వీటి ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు దారితీసిన పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలి.

1960, 70లలో జరిగిన ఉద్యమాలు, పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు-వాటిని ఉల్లఘించిన విధానం గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత 2001 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జరిగిన పరిణామాలపై అవగాహన అవసరం.

సివిక్స్: మిగిలిన విభాగాలతో పోల్చితే సివిక్స్ సిలబస్‌లో తక్కువ అంశాలున్నాయి. సిలబస్‌లో 13 చాప్టర్లు ఉన్నాయి. డిగ్రీ స్థాయిలో అకడమిక్‌గా పట్టున్న అభ్యర్థులు టీఆర్‌టీ సిలబస్‌ను తేలిగ్గానే అధ్యయనం చేయగలరు.

ముఖ్యమైన చాప్టర్లు: రాజ్యం, మన ప్రభుత్వాలు, పౌర పాలన, ప్రపంచ శాంతిలో భారతదేశం పాత్ర, ఐక్యరాజ్య సమితి, బాలల హక్కులు, మహిళా రక్షణ చట్టం, సంస్కృతి, సమాచారం తదితర అంశాలు.
సివిక్స్ విషయంలో సిలబస్‌ను ఇలా విభజించుకుని, అధ్యయనం చేయడం మంచిది..
 • కుటుంబం - సమాజం.
 • రాజ్యం - జాతి - భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు.
 • కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వం - స్థానిక ప్రభుత్వం.
 • శాసన నిర్మాణ శాఖ - కార్య నిర్వాహక వర్గం - న్యాయ శాఖ.
 • పౌరుల రక్షణ విభాగాలు - బాలల హక్కులు - మహిళా రక్షణ చట్టాలు.
 • భారత దేశ విదేశాంగ విధానం - సంబంధాలు.
 • ప్రపంచ శాంతిలో ఐక్యరాజ్య సమితి పాత్ర.
 • రహదారి భద్రత విద్య.
పౌరశాస్త్ర అధ్యయనాన్ని, అవగాహనను విస్తృతం చేసుకునే క్రమంలో రోజూ దినపత్రికలు చదవడాన్ని అలవరచుకోవాలి. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, ప్రభుత్వ విధానాలు-చట్టాలు, న్యాయస్థానాల తీర్పులు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలను పరిశీలిస్తుండాలి. వీటికి సంబంధించి మూల భావనలు పాఠ్యపుస్తకంలో ఉంటాయి. ఈ తరహా అధ్యయనం కరెంట్ అఫైర్స్ - జనరల్ నాలెడ్జ్ విభాగంలోని ప్రశ్నలకు కూడా ఉపయోగపడుతుంది.
Published on 11/21/2017 1:52:00 PM
టాగ్లు:
TS TRT social studies guidance TS TRT social studies preparation tips TRT SA Social preparation tips TS TRT guidance TRT SA Social guidance tips for TS TRT social studies How to prepare social studies in TS TRT what to prepare in TRT social studies

Practice Papers

Related Topics