‘డీఎస్సీ-2018’ నియామకాలు వేగవంతం


సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ-2018 నియామకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. న్యాయస్థానాల్లో ఉన్న కేసులు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని, డీఎస్సీ నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు.
Edu newsసెప్టెంబర్ 5వ తేదీ నాటికి టీచర్ పోస్టుల నియామకాలు చేపడతామని అధికారులు గతంలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అయితే, హైకోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుల నేపథ్యంలో సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టుకు నివేదించిన గడువులోగా కాకున్నా పది రోజులు అటు ఇటుగా ఈ నియామకాలు పూర్తి చేస్తామని అంటున్నారు. 

 అన్ని తరగతులకూ టీచర్లు ..
 కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కారమయ్యేలా చూసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. టీచర్ పోస్టుల భర్తీపై ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో చర్చ జరిగింది. అన్ని తరగతులకూ టీచర్లుండేలా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. డీఎస్సీ-2018లోని 7,902 పోస్టుల నియామకాలను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 
 
 ఏడు సబ్జెక్టులపై న్యాయ వివాదాలు :
 రాష్ట్రంలో 7,902 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2018 అక్టోబర్ 10న ప్రభుత్వం టీఆర్‌టీ, టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 24 నుంచి 2019 జనవరి 31 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. 6,08,155 మంది దరఖాస్తు చేయగా, 5,89,165 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. వీరిలో 5,05,547 మంది పరీక్ష రాశారు. అయితే, ఫలితాలు, మెరిట్ జాబితాలు, సెలెక్షన్ జాబితాల విడుదలకు షెడ్యూల్ ప్రకటించినా అవి అనుకున్న తేదీల్లో వెలువడలేదు. చివరకు మెరిట్ జాబితాలను ప్రకటించి జిల్లాల వారీగా అర్హులైన అభ్యర్థుల ఎంపికను ఆన్‌లైన్ విధానంలో చేపడుతూ సుదీర్ఘ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం కూడా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. మెరిట్ జాబితాల విడుదల ఆలస్యం కావడం ఒకటైతే, మరోవైపు సెలెక్షన్ జాబితాల విడుదలలో కూడా జాప్యం జరగడం నియామకాలకు అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో వివిధ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఏడు సబ్జెక్టులపై న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయి. 
 
 డీఎస్సీ-2018 ద్వారా శాఖల వారీగా భర్తీ అయ్యే టీచర్ పోస్టులు..
 స్కూల్ ఎడ్యుకేషన్ : 4,514
 మున్సిపల్ :  1,100
 మోడల్ స్కూళ్లు : 909
 ట్రైబల్ వెల్ఫేర్- ఏజెన్సీ : 500
 బీసీ వెల్ఫేర్ : 404
 ట్రైబల్ వెల్ఫేర్-ప్లెయిన్ : 300
 రెసిడెన్షియల్ స్కూళ్లు : 175
Published on 9/3/2019 4:40:00 PM
టాగ్లు:
AP DSC-2018 Teacher posts AP DSC-2018details AP DSC recruitment AP school education department

Practice Papers

Related Topics