‘ఎస్జీటీ’ పోస్టులకు నార్మలైజేషన్ చిక్కులు!


ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018 టీచర్ పోస్టుల నియామకాలను త్వరగా ముగించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు గత ప్రభుత్వ నిర్ణయాలు శాపంగా పరిణమిస్తున్నాయి.
Edu newsడీఎస్సీ అర్హత విధివిధానాలు, పరీక్షల నిర్వహణలో తీసుకున్న అసంబద్ధ చర్యలు ఆటంకంగా పరిణమిస్తున్నాయి. పరీక్ష నిర్వహణపై కొంతమంది అభ్యర్థులు కోర్టులకు వెళ్లడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. వివాదంలోలేని పోస్టుల ఎంపికనూ అప్పటి ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో ముఖ్యంగా వేలాదిమంది సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల అభ్యర్ధులు నిరాశానిసృ్పహలకు గురవుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కోర్టు వివాదాలు లేని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సెప్టెంబర్ నెలాఖరులోపు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

గత ప్రభుత్వ హడావుడిఅభ్యర్థులకు శాపం:
అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఒక్క డీఎస్సీని నిర్వహించని గత ప్రభుత్వం సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు గత అక్టోబర్‌లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు దశలుగా పరీక్షలు నిర్వహించారు. ఎస్జీటీ పోస్టులకు ఒకసారి, మిగతా పోస్టులకు మరో దశలో పరీక్షలను ఆన్‌లైన్లో నిర్వహించారు. డిసెంబర్ ఆరు నుంచి 2019 జనవరి 2వ తేదీ వరకు ఈ పరీక్షలను స్కూల్ అసిస్టెంటు, పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్స్, తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కృత భాషాపండితులు, పీఈటీ, మ్యూజిక్, ఆర్‌‌ట్స, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఎస్జీటీ విభాగాలుగా నిర్వహించారు. 6,08,155 మంది దరఖాస్తు చేయగా 5,05,311 మంది హాజరయ్యారు.

ఒకే పేపర్, వేర్వేరు రోజుల్లో పరీక్ష...
ఒకే సబ్జెక్టు పేపర్‌ను వేర్వేరు తేదీల్లో నిర్వహించడంతో ఒక రోజు పరీక్ష రాసిన వారికి సులభంగా ప్రశ్నపత్రం వచ్చిందని, ఇతర రోజుల్లో ప్రశ్నపత్రం కష్టతరంగా ఉందని అప్పట్లోనే అభ్యర్ధుల్లో ఆందోళన వ్యక్తమైంది. గతంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను నిర్వహించినప్పుడు కూడా ఇదేరకమైన సమస్య వచ్చింది. అయినా ప్రభుత్వం ఆన్‌లైన్ పరీక్షల విధానానికే మొగ్గుచూపింది.

నార్మలైజేషన్ చేయకపోవడంతో అభ్యర్ధుల్లో గందరగోళం:
డీఎస్సీ మెరిట్ జాబితా వెల్లడి సమయంలో ఎంపికై న అభ్యర్ధుల జాబితాపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎస్జీటీ పోస్టులకు డిసెంబర్ 18, 20 తేదీల్లో పరీక్షలు రాసిన వారు ఎక్కువ మంది ఎంపికయ్యారని, తక్కిన రోజుల్లో ప్రశ్నపత్రాలు కష్టంగా ఉండడంతో నష్టపోయారని అభ్యర్ధులు ఆందోళచెందారు. ఒకే పరీక్షను ఆన్‌లైన్లో పది రోజుల పాటు నిర్వహించినందున ఈ పరిస్థితి ఏర్పడిందని వారు నిరసన వ్యక్తం చేశారు. జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ, ఎంసెట్ పరీక్షలను ఆన్‌లైన్లో నిర్వహించి ఫలితాలను నార్మలైజేషన్ చేసి ప్రకటిస్తుంటారు. తద్వారా పరీక్షలు వేర్వేరు రోజుల్లో వేర్వేరు సెషన్లలో నిర్వహించినా ఒకరోజు కష్టం మరో రోజు సులభం అన్న ప్రశ్న తలెత్తకుండా అందరు అభ్యర్ధులకు న్యాయం జరిగేలా ఫలితాలను నార్మలైజ్ చేసి ప్రకటిస్తుండడంతో అభ్యర్ధుల్లో అనుమానాలకు తావుండేదికాదు. డీఎస్సీలోనూ అదే విధంగా చేయాలని అభ్యర్ధులు తొలినుంచి కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. నార్మలైజేషన్ చేయకపోవడం వల్ల మెరిట్ అభ్యర్ధులకు నష్టం వాటిల్లుతోందంటూ కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉండడంతో ఫలితాలు వెల్లడి చేయలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

పోస్టుల వారీగా పరీక్షలకు హాజరైన అభ్యర్థులు :
కేటగిరీ మొత్తం పోస్టులు అభ్యర్థులు
ఎస్‌ఏ 1,625 1,18,284
ప్రిన్సిపల్ 89 4,539
పీజీటీ 583 21,886
టీజీటీ 715 36,615
ఎల్పీ 452 18,802
పీఈటీ 476 12,864
మ్యూజిక్ 76 546
ఆర్ట్ డ్రాయింగ్ 22 1,046
క్రాఫ్ట్ 25 1,546
ఎస్జీటీ 3,839 2,89,183
మొత్తం 7,902 5,05,311

3 వేల మందికి త్వరలో నియామక ఉత్తర్వులు :
న్యాయవివాదాల్లో ఉన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు (తెలుగు, హిందీ), భాషాపండితుల (తెలుగు, హిందీ) పోస్టులు మినహా తక్కిన వాటికి తుది ఎంపిక జాబితాలను సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. ఒక్కరే ఎక్కువ పోస్టులకు ఎంపికై ఉంటే వారినుంచి ఒక్క పోస్టుకే ఆప్షన్ తీసుకొని తక్కిన పోస్టులకు ఇతరులను ఎంపిక చేసి రెండో జాబితాను త్వరలో విడుదల చేస్తామన్నారు. ఈ ప్రక్రియను ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేసి నెలాఖరునాటికి నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నామని వివరించారు.

న్యాయ వివాదాలతో షెడ్యూల్ అస్తవ్యస్తం:

పరీక్షల అనంతరం షెడ్యూల్ ప్రకారం కూడా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. మెరిట్ జాబితాల విడుదల ఆలస్యం కావడం ఒకటైతే..సెలెక్షన్ జాబితాల విడుదలలో కూడా జాప్యం నియామకాలకు అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో కోర్టు వివాదాలు ఏర్పడ్డాయి. ఏడు సబ్జెక్టులపై ఈ న్యాయవివాదాలు నడుస్తున్నాయి.

డీఎస్సీ- 2018లో డిపార్టుమెంట్ల వారీగా ప్రకటించిన పోస్టులు
రెసిడెన్షియల్‌స్కూళ్లు 175
ట్రైబల్‌వెల్ఫేర్-ప్లెయిన్ 300
బీసీవెల్ఫేర్ 404
ట్రైబల్‌వెల్ఫేర్- ఏజెన్సీ 500
మోడల్ స్కూళ్లు 909
మున్సిపల్ 1,100
స్కూల్ ఎడ్యుకేషన్ 4,514
మొత్తం 7,902
Published on 9/11/2019 1:52:00 PM
టాగ్లు:
DSC-2018 SGT Posts TeacherPosts Teacher Eligibility Test Normalization Merit List Recruitment Orders Schedule

Practice Papers

Related Topics