Sakshi education logo

ఐఈఎస్‌లో ర్యాంక్ సంకల్పంతో సాధించా...

Join our Community

facebook Twitter Youtube
సగటు గ్రామీణ విద్యార్థి.. ప్రాథమిక విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే.. ఇంటర్ వరకు తెలుగు మాధ్యమమే. ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో పలుసార్లు విఫలమయ్యాడు. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో విజయం సాధించాడు. అతనే ప్రకాశం జిల్లా వాసి అవులూరి శ్రీనివాసులు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో శ్రీనివాసులు ప్రతిభ చాటాడు. జాతీయ స్థాయిలో ఐఈఎస్‌లో మూడో ర్యాంక్ సాధించిన శ్రీనివాసులు సక్సెస్ స్పీక్స్..
మాది ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం నాగరాజుకుంట గ్రామం. నాన్న అవులూరి పుల్లారెడ్డి రైతు. అమ్మ వెంకట లక్ష్మి గృహిణి. అన్న రమణారెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్, తమ్ముడు వెంకటేశ్వర్లు సీఏ చదువుతున్నాడు. నా విద్యాభ్యాసం అంతా ప్రకాశం జిల్లాలోనే సాగింది. ఏడో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో, పదో తరగతి వరకు పొదిలిలోని శ్రీ వివేకానంద హైస్కూల్‌లో చదివా. ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాను.

ఐఈఎస్ గురించి తెలియదు:
2012లో నా ఇంజనీరింగ్ పూర్తయింది. 80 శాతం మార్కులు వచ్చాయి. చదువుపరంగా కళాశాల మెరుగ్గా ఉన్నా.. ఇతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంతో ఉద్యోగం దొరకడం కష్టమైంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుని హైదరాబాద్‌కు వెళ్లి గేట్‌కు సన్నద్ధమవడం ప్రారంభించా. శిక్షణ సంస్థలో చేరాక అక్కడివారి ద్వారా ఐఈఎస్ గురించి మొదటిసారిగా తెలిసింది. ఐఈఎస్ అత్యంత క్రేజీ అని చెప్పడం.. ఒకే మాదిరి సిలబస్ ఉండటంతో గేట్‌తో పాటు ఐఈఎస్‌కూ సన్నద్ధమవ్వాలనుకున్నా.

వరుస వైఫల్యాలు..
ఇస్రో, బార్క్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, ఎన్‌పీసీఎల్ మొదలైన సంస్థల్లో ఇంజనీరింగ్ సంబంధిత ఉద్యోగాల కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరయ్యా. ఎక్కడా ఉద్యోగం రాలేదు. 2015లో ఐఈఎస్ ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 2016లో మరింత కష్టపడి చదివినా వైఫల్యమే ఎదురైంది. దీంతో కాసింత ఒత్తిడికి లోనయ్యా. గతంలో గేట్‌లో క్వాలిఫై అయినా ఉద్యోగం రాలేదు. ఈసారి 336వ ర్యాంకు వచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో జూనియర్ టెలికాం ఆఫీసర్‌గా కొద్ది రోజుల్లో చేరాల్సి ఉంది. తాజాగా ఐఈఎస్‌కు ఎంపికయ్యా.

ప్రిపరేషన్ ఇలా...
నాకు 2014లో డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డీఎల్‌ఆర్‌ఎల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియన్ రీసెర్చ్ ఫెలోగా ఉద్యోగం లభించింది. సాయంత్రం ఉద్యోగం ముగిశాక.. ఐఈఎస్ కోచింగ్ తరగతులకు వెళ్ల్లేవాణ్ని. ప్రతి శని, ఆదివారాలు సెలవులు ఉండటంతో ఆ రెండు రోజులు పూర్తిగా క్లాసులకు హాజరయ్యేవాడిని. ఎటువంటి ప్రణాళికలు లేకుండా వీలు కుదిరినప్పుడల్లా చదివా.

ఊహించని ర్యాంకు...
గత వైఫల్యాలు, ఈ సారి పరీక్ష విధానం మారడంతో ఐఈఎస్‌పై పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. నామమాత్ర సన్నద్ధతతో ప్రిలిమ్స్‌కు హాజరయ్యా. మెయిన్స్‌కు ఎంపికవడంతో పరీక్షకు మూడు నెలల ముందే ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రిపరేషన్ ప్రారంభించా. సక్సెస్ అవుతాననే నమ్మకం తక్కువగానే ఉంది. ఊహించని విధంగా మూడో ర్యాంకు వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. మెయిన్స్ పరీక్షను 350 మంది రాశారు. 130 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తుదిగా 48 మంది ఎంపికయ్యారు.

ఇంటర్వ్యూలో టెక్నికల్ అంశాలే...
నలుగురు సభ్యులున్న ప్యానెల్ ఇంటర్వ్యూ చేసింది. పూర్తిగా టెక్నికల్ సబ్జెక్టు, నా పని అనుభవం మీదే ప్రశ్నలు అడిగారు. మొబైల్ జనరేషన్స్ (2జీ, 3జీ, 4జీ, 5జీ), బ్లూటూత్, వైఫై .. వాటి రేంజ్ దూరాలు మొదలైన వాటి గురించి అడిగారు. నాకు డీఆర్‌డీవోలో పనిచేసిన అనుభవం ఉండటంతో దానిపై ఎక్కువగా ప్రశ్నించారు. ఇంటర్వ్యూ దాదాపు 20- 25 నిమిషాల పాటు సాగింది. నేను డిటైయిల్డ్ అప్లికేషన్ ఫాంలో మొదటి ప్రాధాన్యతగా ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ ఆప్షన్‌గా ఇచ్చాను. కాబట్టి అదే సర్వీస్ వస్తుంది.

మారిన సిలబస్ మేలే...
ఈ ఏడాది నుంచే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విధానంలో మార్పులు వచ్చాయి. గతంలో సోషల్ సబ్జెక్టుల నుంచి జనరల్ స్టడీస్ పేపర్లో అడిగేవారు. ఇప్పుడు జీఎస్ పేపర్‌లోనూ వివిధ ఇంజనీరింగ్ సబ్జెక్టుల నుంచి కూడా ప్రశ్నలు ఉంటున్నాయి. ఇది ఔత్సాహిక అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. ఐఈఎస్‌కు ప్రిపర్ అవ్వాలనుకునేవారు శ్రమించాల్సి ఉంటుంది. కోచింగ్ తీసుకోవడం ఉపకరిస్తుంది. నమూనా పరీక్షలకు హాజరుకావాలి. శిక్షణ తీసుకోనివారు టెస్ట్ సిరీస్ రాస్తే పరీక్ష విధానం అలవడుతుంది. అప్పటికే నేర్చుకున్న ఫార్ములాలు, కాన్పెప్టులు రివిజన్ అవుతాయి. నమూనా టెస్టుల్లో చేసిన తప్పొప్పులను సమీక్షించుకోవాలి. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. పాత పేపర్లు చూస్తే గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి..? ఏమేం కాన్సెప్టుల నుంచి అడుగుతున్నారో అర్థమవుతుంది. కోచింగ్ తీసుకోలేని వారికి కూడా ఆన్‌లైన్‌లో విస్తృత సమాచారం అందుబాటులో ఉంది. ఐఐటీ ప్రొఫెసర్లు చెప్పే పాఠాలను ఎన్‌పీటీఈఎల్‌లో వీక్షించవచ్చు. వీటితోపాటు యూట్యూబ్‌లో గేట్ వీడియోలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

ఇంగ్లిష్‌పై పట్టు ఇలా..
ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదవడంతో ఇంజనీరింగ్‌లో చేరిన తొలినాళ్లల్లో పాఠాలు అర్థమయ్యేవి కావు. చాలా కష్టపడేవాణ్ని. ఇంజనీరింగ్ తర్వాత డీఆర్‌డీవోలో చేసిన ఉద్యోగం కీలక మలుపు. ఆఫీసులో ఎక్కువగా హిందీ వచ్చినవారే ఉండటం.. నాకు అసలు హిందీ రాకపోవడంతో తప్పనిసరిగా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాల్సి వచ్చింది. దీంతో ఇంగ్లిష్ అలవాటైంది. తప్పులు ఉంటే సహోద్యోగి ఒకతను వివరించే వాడు. అలా అలవడిన ఇంగ్లిష్ ఐఈఎస్ మెయిన్స్, పర్సనాలిటీ టెస్టులో ఎంతో ఉపకరించింది. తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు కోసం ప్రయత్నించాలి. కేరీర్‌లో ప్రతి దశలోనూ ఇది ఉపయోగపడుతుంది.

సానుకూలంగా ఉండండి...
వైఫల్యాలకు కుంగిపోయి ప్రతికూల ఆలోచనలు దరి చేరనీయవద్దు. నేను కొన్నేళ్లు శ్రమిస్తేగాని ఫలితం దక్కలేదు. కాబట్టి గేట్, ఐఈఎస్‌లకు సన్నద్ధమయ్యే విద్యార్థులు హార్డ్‌వర్క్‌ను నమ్ముకుంటేనే ఫలితాలు వస్తాయి.

ప్రొఫైల్...
పదో తరగతి :
482 మార్కులు
ఇంటర్ : 938 మార్కులు
ఎంసెట్ ర్యాంకు : 18,500
Published on 9/15/2017 4:20:00 PM

సంబంధిత అంశాలు