ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2015-16


విభజన తర్వాత ప్రవేశపెట్టిన రెండో ఆర్థిక సర్వే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది. పచ్చదనం తగ్గడం, ప్రజల ఆరోగ్యం క్షీణించడం, పాఠశాలల్లో డ్రాపౌట్ల సంఖ్య పెరిగిపోవడం వంటి విషయాలు ఆందోళన కలిగించే అంశాలని పేర్కొంది. 2015-16 ఆంధ్రప్రదేశ్ సర్వేను మార్చి 10న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సర్వే ముఖ్యాంశాలు మీ కోసం..
సర్వే ముఖ్యాంశాలు
వృద్ధిరేటులో సేవా రంగానిదే అగ్రస్థానం
వృద్ధి రేటులో 11.39 శాతంతో సేవా రంగం అగ్రస్థానానికి చేరింది. తదుపరి స్థానంలో 11.13శాతంతో పారిశ్రామిక రంగం ఉండగా అత్యధిక మంది ఆధారపడిన వ్యవసాయ రంగం 8.40 శాతంతో మూడో స్థానంలో ఉంది. 2015-16 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ. 6,03,376 కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీకి సమర్పించిన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే- 2015-16లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2011-12 ప్రామాణిక ధరల ప్రకారం జాతీయ వృద్ధి రేటు 7.3 శాతం కాగా రాష్ట్ర వృద్ధి రేటు 10.5 శాతం ఉంటుందని అంచనా. ఈ లెక్కన రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,07,532గా అంచనా వేశారు.

డీడీపీ అగ్రస్థానంలో కృష్ణా
2014-15 మొదట సవరించిన అంచనాల ప్రకారం జిల్లా స్థూల ఉత్పత్తి (డీడీపీ)లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. 2013-14లో విశాఖ అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుతం కృష్ణా ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ జిల్లా స్థూల ఉత్పత్తి రూ. 58,056 కోట్లు కాగా రూ.57,499 కోట్లతో విశాఖ రెండో స్థానంలో, రూ.50,940 కోట్లతో తూర్పు గోదావరి మూడో స్థానంలో ఉన్నాయి. రూ.18,218 కోట్లతో శ్రీకాకుళం, 18,742 కోట్లతో విజయనగరం, రూ.24,722 కోట్లతో వైఎస్సార్ జిల్లాలు డీడీపీలో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.

పచ్చదనం 23.04 శాతమే
రాష్ట్రంలో 23.04 శాతం మాత్రమే గ్రీన్ కవర్ ఉంది. దీన్ని 33 శాతానికి పెంచేందుకు అటవీశాఖ కృషి చేస్తోందని రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 36,914.78 చ.కి.మీ. మేర అడవులున్నాయి. ఇందులో 651.25 చ.కి.మీ. తీవ్ర దట్టమైన, 11,810.22 చ.కి.మీ. మోస్తరు దట్టమైన, 9,241.77 చ.కి.మీ.ల్లో పొదలు, 3,900.49 చ.కి.మీ. అటవీయేతర ప్రాంతం ఉన్నాయి.

భయపెడుతున్న ‘రక్తపోటు’
రాష్ట్రంలో రక్తపోటు, చక్కెర వ్యాధి బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా 2014-15లో 6,81,387 మందికి వైద్య పరీక్షలు చేయగా వీరిలో 83,838 మందికి షుగర్, 75,342 మందికి బీపీ ఉన్నట్లు తేలింది. 2015-16లో 1,39,938 మందికి మాత్రమే పరీక్షలు చేయగా అందులో 50,130 మందికి షుగర్, 56,152 మందికి రక్తపోటు ఉన్నట్లు నిర్ధారించారు.

డ్రాపౌట్లు ఎక్కువే
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేరిన వారిలో అయిదో తరగతిలోపే 8.76 శాతం మంది బడి మానేస్తున్నారు.1- 8 తరగతుల మధ్య 14.75 శాతం, 1-10 తరగతుల మధ్య 23.87 శాతం మంది డ్రాపౌట్లుగా నమోదవుతున్నారు. ఎస్సీల్లో పదోతరగతి లోపే బడిమానేసే వారి శాతం 39.64గా ఉంది. పదో తరగతిలో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 91.42 శాతం కాగా ఎస్సీల ఉత్తీర్ణత 85.43 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది.

15.49 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు
రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్ ఆఖరుకు 15.49 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. 2015-16లో 50 వేల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు కొత్తగా జారీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా 39,553 కనెక్షన్లు మాత్రమే ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికీ విద్యుత్తు సౌకర్యం లేని ఆవాస ప్రాంతాలు 1,031 ఉన్నాయి.

లక్ష జనాభాకు 9.98 కిలోమీటర్ల ఎన్‌హెచ్
రాష్ట్రంలో 24 జాతీయ రహదారులు(ఎన్‌హెచ్) 4,913.60 కిలోమీటర్ల మేర ఉన్నాయి. సగటున లక్ష జనాభాకు 9.98 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉంది. దేశ సగటు 7.67 కి.మీ. కావడం గమనార్హం. విస్తీర్ణం ప్రకారం ప్రతి వెయ్యి కిలోమీటర్లకు సగటున 30.70 కి.మీ. జాతీయ రహదారులు ఉండాలి. దేశంలో సగటు ప్రతి వెయ్యి కిలోమీటర్లకు 28.2 కిలోమీటర్లే ఉన్నాయి. రాష్ట్రంలో 6,485 కి.మీ. పొడవున రాష్ట్ర రహదారులు ఉన్నాయి.

85.05 లక్షల వాహనాలు
రాష్ట్రంలో మొత్తం 85.05 లక్షల వాహనాలు ఉన్నాయి. గతేడాది డిసెంబరు చివరికి రవాణా శాఖాధికారుల కార్యాలయాల్లో (ఆర్టీవోల్లో) వీటిరిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. వీటిలో 78.19 శాతానికి పైగా ద్విచక్ర వాహనాలే. మొత్తం వాహనాల్లో 66,50,311 ద్విచక్ర వాహనాలు, 4,29,902 ఆటోలు, 5,24,429 కార్లు ఉన్నాయి. 2014 మార్చికి మొత్తం 70,02,143 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా గతేడాది డిసెంబరుకు ఈ సంఖ్య 85,05,102కు పెరిగింది.

స్త్రీ పురుష నిష్పత్తి 997: 1000
రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4.95 కోట్ల మంది జనాభా ఉంది. ఇది దేశ జనాభాలో 4.1 శాతం మాత్రమే. రాష్ట్ర జనాభాలో 29.47 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. సగటున ప్రతి కిలోమీటరుకు 304 మంది చొప్పున ఉన్నారు. మహిళల అక్షరాస్యత 59.96 శాతంగా నమోదైంది.

పేదలకు ‘గూడు’పై నిర్లక్ష్యం
టీడీపీ సర్కారు హయాంలో పేదలకు ‘గూడు’ కల్పన ఎండమావిగా మారింది. . 2008-09లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో బలహీన వర్గాలకు 11,48,574 ఇళ్లు నిర్మించారు. తర్వాతి ప్రభుత్వమూ 2012-13లో 2,73,813 ఇళ్లు, 2013-14లో 2,34,151 ఇళ్లు నిర్మించింది. టీడీపీ ప్రభుత్వం మాత్రం 2014-15లో 29,342 ఇళ్లు, 2015-16లో(గతేడాది డిసెంబరు వరకూ) 44,256 ఇళ్లు నిర్మించింది. రెండేళ్లలో మొత్తం 73,598 ఇళ్లు మాత్రమే నిర్మించడం గమనార్హం.

నింగికెగసిన నిత్యావసరాల ధరలు
2014-15తో పోల్చితే 2015-16లో ధరలు భారీగా పెరిగినట్లు సామాజిక ఆర్థిక సర్వే- 2015-16 తేటతెల్లం చేసింది. 2014 మార్చి-నవంబరుతో పోల్చితే 2015 మార్చి-నవంబరు మధ్య 6 నిత్యావసరాల ధరలను అర్ధగణాంక శాఖ సమీక్షించింది. దీని ప్రకారం ఈ కాలంలో కందిపప్పు ధర 72.18 శాతం, రెండో రకం ఉల్లి 53.72, రెండోరకం ఎండుమిర్చి 29.12, వేరుసెనగ నూనె 13.29, సాధారణ చింతపండు 9.05, రెండోరకం బియ్యం ధర 2.45% పెరిగాయి.
Published on 3/14/2016 3:06:00 PM

Related Topics