తెలంగాణ బడ్జెట్ 2019-20(ఓట్ ఆన్ అకౌంట్)


తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా.. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మేణా పునరంకితమవుతామని ఆయన ప్రకటించారు.
Budget 18-192019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫిబ్రవరి 22న ఆయన శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ ప్రతిపాదిత వ్యయం రూ.1,82,017 కోట్లుగా పేర్కొన్న సీఎం అందులో ప్రగతి పద్దు అంచనా వ్యయం రూ.1,07,302 కోట్లు, నిర్వహణ పద్దు వ్యయం 74,715 కోట్లుగా ప్రతిపాదించారు. బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

రెండు రెట్ల కన్నా ఎక్కువ జీఎస్డీపీ వృద్ధి..
సమైక్యపాలన చివరి రెండేళ్లలో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటు దేశసగటు కన్నా తక్కువ ఉండేది. ఆ రెండేళ్లలో దేశసగటు వృద్ధిరేటు 5.9% ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 4.2% మాత్రమే. అదే 2018-19లో వృద్ధిరేటు రెండురెట్ల కన్నా ఎక్కువగా 10.6% నమోదైంది. ప్రస్తుత ధరలలో జీఎస్డీపీ 2016-17లో 14.2% ఉంటే 2017-18లో 14.3%కు పెరిగింది. 2018-19లో 15% వృద్ధి సాధించనుంది. ఇది దేశ అభివృద్ధి రేటు 12.3% కన్నా ఎక్కువ. 2018-19లో జీఎస్డీపీ ప్రాథమిక రంగం 10.9% వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. విద్యుత్ పరిస్థితిలో మెరుగుదల, సాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా, రైతులకు పెట్టుబడి మద్దతు ద్వారా ఇది సాధ్యపడింది. పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లోనూ చెప్పుకోదగిన మెరుగుదల కనిపించింది. ఈ రంగాల్లో 14.9% వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. సేవారంగంలో 15.5% పెరుగుదల నమోదవుతుందని ఆశిస్తున్నాం. ఇక, తలసరిఆదాయం 2017-18లో రూ.1,81,102 ఉంటే 2018-19లో రూ.2,06,107కు చేరుకోనుంది.

షెడ్యూల్ కులాల ప్రగతి నిధికి...
పేద తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాలను చేపట్టాం. ఈ పథకం పేదలకు ఆర్థిక అండనివ్వడంతో పాటు సామాజిక సంస్కరణకు దోహదపడింది. 18ఏళ్లు నిండిన వారే అర్హులనే నిబంధనతో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.1,450 కోట్లు కేటాయిస్తున్నాం. నిరుద్యోగభృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.1,810 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్ కులాల ప్రగతినిధికి రూ.16,851 కోట్లు, షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి రూ.9,827 కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం 2,004 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.

రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు :
అకౌంటెంట్ జనరల్ ధ్రువీకరించిన ప్రకారం 2017-18లో మొత్తం వ్యయం రూ.1,43,133 కోట్లు. రెవెన్యూ రాబడులు రూ.88.824 కోట్లు. రెవెన్యూ ఖర్చు 85,365 కోట్లు. మిగులు రూ.3,459 కోట్లు. మొత్తం వ్యయంలో మూలధన వ్యయం రూ.23,902 కోట్లు. సవరించిన అంచనాల ప్రకారం 2018-19 సంవత్సరానికి అంచనా వ్యయం రూ.1,61,857 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,19,027 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.28,053 కోట్లు. రెవెన్యూ ఖాతాలో మిగులు రూ.353 కోట్లు. ఇక, 2019-20 సంవత్సరానికి రెవెన్యూ రాబడుల ప్రతిపాదనలు రూ.94,776 కోట్లు. కేంద్ర ప్రతిపాదిత బదిలీలు రూ.22,835 కోట్లు. ప్రగతి పద్దు అంచనా వ్యయం రూ.1,07,302 కోట్లు. నిర్వహణ పద్దు అంచనా వ్యయం రూ.74,715 కోట్లు. మొత్తం ప్రతిపాదిత వ్యయం రూ.1,82,107 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు. మిగులు రూ.6,564 కోట్లు. ఆర్థికలోటు రూ.27,749 కోట్లు. అంచనావేసిన జీఎస్డీపీలో ఇది 2.81%.
Budget 18-19
 • రూ.1,07,302 కోట్లు 2019-20కి ప్రగతి పద్దు
 • రూ.6,564 కోట్లు రెవెన్యూ మిగులు
 • రూ.1,74,453 కోట్లు 2018-19 ఆమోదించిన బడ్జెట్
 • రూ.74,715 కోట్లు నిర్వహణ పద్దుకు కేటాయించింది
 • రూ.27,749 కోట్లు ద్రవ్యలోటు
 • రూ.1,61,857 కోట్లు సవరించిన అంచనా బడ్జెట్
2019-20 వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు ఇలా...
 • పరిశ్రమలు, వాణిజ్యం రూ.241.79 కోట్లు
 • గిరిజన సంక్షేమం రూ.4,485.03 కోట్లు
 • హోంశాఖ రూ.2,270.48 కోట్లు
 • కార్మిక, ఉపాధి కల్పన రూ.899.61కోట్లు
 • ఐటీ, కమ్యూనికేషన్‌‌స రూ.65.34 కోట్లు
 • పాఠశాల విద్య రూ.4,954.50 కోట్లు
 • వైద్య, ఆరోగ్య శాఖ రూ.2,649.70 కోట్లు
 • గృహనిర్మాణం రూ.2,356.76 కోట్లు
 • పురపాలక శాఖ రూ.2,026.80 కోట్లు
 • మహిళ, శిశు, వికలాంగ సంక్షేమం రూ.814.12 కోట్లు
 • న్యాయ పరిపాలన రూ.347.74 కోట్లు
 • పశుసంవర్ధక, మత్స్య రూ.602.49 కోట్లు
 • అడవులు, పర్యావరణం రూ.171.24 కోట్లు
 • రవాణా రూ.39.72 కోట్లు
 • దేవాదాయ శాఖ రూ.33.74 కోట్లు
 • క్రీడలు, యువజన సర్వీసులు రూ.38.04 కోట్లు
 • విద్యుత్ రూ.2,003.46 కోట్లు
 • పర్యాటక, సాంస్కృతిక రూ.29.38 కోట్లు
 • పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ రూ.0.74 కోట్లు
 • అసెంబ్లీ రూ.69.90 కోట్లు
 • పౌర సరఫరాలు రూ.917.98 కోట్లు
 • వాణిజ్య పన్నులు రూ.163.16 కోట్లు
వ్యవసాయానికి రూ. 20,107 కోట్లు :
Budget 18-19వ్యవసాయశాఖకు నిధుల కేటాయింపు భారీగా పెరిగింది. నిధులు మూడేళ్లలో మూడింతలయ్యాయి. దీనిని బట్టి రైతుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యమేంటో అర్థమవుతుంది. రైతు బంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాల కారణంగా వ్యవసాయశాఖ బడ్జెట్ భారీగా పెరిగింది. 2017-18 బడ్జెట్లో రూ.6,498.15 కోట్లు కేటాయిస్తే, 2018-19 బడ్జెట్లో రూ.15,511కోట్లు కేటాయించింది. ఇప్పుడు రూ.20,107 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.4,596 కోట్లు పెరిగినట్లయింది. ఈసారి రైతుబంధుకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. రుణమాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించారు. రైతుబీమా అమలుకు రూ.650 కోట్లు కేటాయించారు. అంటే సింహభాగం ఈ 3 పథకాలకే ప్రభుత్వం కేటాయించింది.

పంట కాలనీపై కేంద్రీకరణ...
ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా పంట కాలనీలపై దృష్టి సారించనుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రసంగంలోనూ ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆయా జిల్లాల్లో ఉండే నేల స్వభావాన్ని బట్టి రాష్ట్రాన్ని పంట కాలనీలుగా చేస్తారు. ఆ దిశగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసా యశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు, దేశవిదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించేలా చేయడమే ఈ పంట కాలనీల లక్ష్యం. ఈ పథకాన్ని అమలుచేసే క్రమంలో చిన్న, మధ్యతరహా భారీ ఆహారశుద్ధి కేంద్రాలను అన్ని ప్రాంతాల్లో నెలకొల్పుతారు. వీటి నిర్వహణలో ఐకేపీ ఉద్యోగులు, ఆదర్శ మహిళాసంఘాల్ని భాగస్వాములు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 1.61 లక్షలున్న రైతు సమితి సభ్యులకు గౌరవ వేతనమిచ్చేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. రైతులకు మద్దతు ధర, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలను అందించాలనే బహు ముఖ వ్యూహంతో సమితులు పనిచేస్తాయి. ఈ సమితుల వేదికగా రైతు లందరినీ సంఘటిత పర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం.

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.1,450 కోట్లు :
Budget 18-19 పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఒక్కో లబ్ధిదారుకు రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. తాజాగా ఈ పథకాలకు 2019-20 బడ్జెట్‌లో రూ. 1,450 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 1.433 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. 2018-19 వార్షిక సంవత్సరంలో ఈ రెండు పథకాలకు రూ. 1,400 కోట్లు కేటాయించింది. కాగా, ఈ పథకాలకు ఫిబ్రవరి 20వ తేదీ నాటికి 2.25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో జనవరి నెలాఖరు నాటికి 1,29,742 మందికి ఆర్థిక సాయం అందించారు. 2014-15లో కల్యాణలక్ష్మి పథకాన్ని ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అమలు చేయగా.. 2016-17 వార్షిక సంవత్సరం నుంచి బీసీ, ఈబీసీలకూ అందిస్తోంది.

ఆర్టీసీకి ఈసారి బడ్జెట్‌లో రూ. 630 కోట్లే :
Budget 18-19 రాష్ట్ర ఆర్టీసీకి ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో సైతం ఆర్టీసీకి నిరాశే ఎదురైంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.630 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులో వివిధ బస్సుపాస్‌లు ఇతర రాయితీల కింద రూ.520 కోట్లు వివిధ రీయింబర్స్‌ల కింద పోను, మిగిలిన రూ.110 కోట్లను రుణాల కోసం కేటాయించారు. కొత్త బస్సుల కొనుగోలుకు ఇందులోనే సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బడ్జెట్‌లో ప్రకటించిన మొత్తాన్ని ఏనాడూ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం గమనార్హం. గతేడాది రూ.975 కోట్లు కేటాయించిన సర్కారు ఈ సారి ఏకంగా రూ.345 కోట్ల కోత విధించింది.

వెద్య, ఆరోగ్య రంగానికి రూ. 5,536 :
Edu news వైద్య, ఆరోగ్య రంగంపట్ల సర్కారు ఈసారి చిన్నచూపు చూసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ప్రతి ఏటా ఆరోగ్యానికి నిధులను పెంచుతూ వస్తున్న ప్రభుత్వం 2019-20 సంవత్సరం బడ్జెట్‌లో కోత పెట్టింది. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అనేక కొత్త పథకాలను అమలు చేస్తూ వాటికి అనుగుణంగా నిధులు కేటాయిస్తోంది. కానీ, 2018-19 బడ్జెట్లో వైద్యారోగ్యానికి రూ.7,375.20 కోట్లు కేటాయించగా ఈసారి రూ.1839.2 కోట్లు తక్కువగా రూ.5,536 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే, కేసీఆర్ కిట్లు, ప్రభుత్పాస్పత్రుల్లో వైద్య పరికరాలు, మందుల కొనుగోలు, బస్తీ దవాఖానాల ఏర్పాటు, సిద్దిపేట, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రముఖంగా నిధులు కేటాయించినట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించిన నేపథ్యంలో ఈ పథకానికి కేటాయింపులు పెద్ద మొత్తంలో ఉండనున్నాయి. 2018-19 బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.7,375.20 కోట్లల్లో రూ.3522.71 కోట్లు నిర్వహణ పద్దుకాగా, రూ.3,852.49 కోట్లు ప్రగతి పద్దు. ఈ అంచనాలతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో నిర్వహణ పద్దు పోను మిగిలేది కేవలం రూ.2014 కోట్లు మాత్రమే.

గ్రామీణాభివృద్ధికి పెద్దపీట :
Budget 18-19 గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 20,093 కోట్లు, పంచాయతీరాజ్ విభాగం కింద రూ. 10,716 కోట్లు కేటాయించాలని ఆయా శాఖలు ప్రభుత్వాన్ని కోరగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో భాగంగా గ్రామీణాభివృద్ధికి రూ. 5,358 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖకు రూ. 4,221 కోట్లను సర్కారు ప్రతిపాదించింది. 2018-19 బడ్జెట్‌లో ఈ శాఖకు రూ. 15,562 కోట్లు (పీఆర్ విభాగానికి రూ. 8,929 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 6,633 కోట్లు) కేటాయించింది. మరోవైపు గత బడ్జెట్‌లో ఆసరా పింఛన్ల కింద రూ. 5,388 కోట్లు కేటాయించగా దానికంటే రెండింతలు అధికంగా తాజా బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ. 12,067 కోట్లకు ప్రభుత్వం పెంచింది. ఇక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథకు ప్రత్యక్ష కేటాయింపులు పెద్దగా కనిపించలేదు. గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 1,803 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం స్పష్టమైన కేటాయింపులు చేసినట్లు కనబడలేదు. అయితే పీఆర్, ఆర్‌డీకి సంబంధించి వివిధ రంగాలు, పథకాల కింద పలు రూపాల్లో కేటాయింపులు చేసినందున వాటిలోంచి మిషన్ భగీరథకు కేటాయించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 2017-18 బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు కేటాయించింది. కాగా, అటవీ, పర్యావరణ, విజ్ఞానం, సాంకేతిక నైపుణ్య శాఖకు రూ. 342 కోట్లు కేటాయించాలని అధికారులు కోరగా ప్రభుత్వం మాత్రం రూ. 171 కోట్లకే బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది.

డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 4,709 కోట్లు:
Budget 18-19 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.2,643 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల్లోపు 80 వేల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఈ సారి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌లో రూ.4,709.5 కోట్లు కేటాయించింది. దీంతో ఈ సారి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగనుంది. 2019 జనవరి వరకు మొత్తం 19,195 ఇళ్లను ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. వీటికి ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.

సాగునీటి రంగానికి అగ్రపీఠం :
Budget 18-19 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ఎప్పటిలాగే అగ్రపీఠం దక్కింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసేలా, చిన్న నీటి వనరులకు పునరుత్తేజం ఇచ్చేలా బడ్జెట్‌లో రూ.22,500 కోట్ల మేర కేటాయించింది. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.20,120.34 కోట్లు, మైనర్‌కు రూ.2,379.66కోట్లు కేటాయించింది. అయితే.. గత మూడేళ్ల బడ్జెట్‌తో పోలిస్తే సాగునీటిపారుదల రంగానికి ఈ ఏడాది రూ.2,250 కోట్లమేర కేటాయింపులు తగ్గాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తుండటం, దీనికి ఇదివరకే ఏర్పాటు చేసిన కార్పోరేషన్ ద్వారా రుణాలు తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌ను తగ్గించినట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి.
తగ్గిన కేటాయింపు: Budget 18-19 గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారీ ప్రాజెక్టులకు రూ.21,890 కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఈ ఏడాది దాన్ని రూ.20.120.34కోట్లకు కుదించారు. సుమారు ఇక్కడే రూ.1,770కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. మైనర్ ఇరిగేషన్ కింద గతేడాది రూ.2,743కోట్లు కేటయింపులు జరపగా, ఈ ఏడాది అవి రూ.2,371కోట్లకు తగ్గింది. ఇక్కడ రూ.364కోట్ల మేర తగ్గింది. ఇక గతేడాది 2018-19 ఏడాదిలో సాగునీటికి రూ.25వేల కోట్లు కేటాయింపులు జరగ్గా, జనవరి 31 నాటికి రూ.21,489 కోట్లు ఖర్చు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ.12,739.67కోట్ల మేర రుణాలు తీసుకుని బిల్లులు చెల్లించారు. ఇక సీతారామ, దేవాదుల, ఎఫ్‌ఎఫ్‌సీ, ఎస్సారెస్పీ-2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.13వేల కోట్లు రుణాల ద్వారానే ఖర్చు చేసింది. ఈ ఏడాది సైతం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో రూ.10,430కోట్ల నిధులను కార్పోరేషన్ రుణాల ద్వారానే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌లో ప్రాజెక్టులవారీగా కేటాయింపుల వివరాలు వెల్లడించనప్పటికీ, భారీ ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకే ఎక్కువ నిధులు దక్కనున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.5,898 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, రూ.5,500 కోట్ల మేర ఆర్థికశాఖ కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తర్వాతి స్థానంలో పాలమూరు-రంగారెడ్డికి రూ.2,732 కోట్లతో ప్రతిపాదనలు చేయగా, రూ.2,500 కోట్లకు ఓకే చెప్పినట్లుగా సమాచారం. దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులకు సైతం వెయి్య కోట్లకు పైగా కేటాయింపులు ఉంటాయని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక నిర్మాణ చివరి దశలో ఉన్న పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు రూ.1,085కోట్ల మేర బడ్జెట్ కోరగా, వీటికి పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో దేవాదుల, ఎస్సారెస్పీ-2, కాళేశ్వరం, వరదల కాల్వ, ఎల్లంపల్లి దిగువన మెజార్టీ ఆయకట్టుకు నీళ్లివ్వాలని ప్రభుత్వం ఇదివరకే లక్ష్యం నిర్ణయించినందున వాటికి అవసరాలకు తగ్గట్లే మొత్తం బడ్జెట్‌లో కేటాయింపులు జరుగనున్నాయి.
గొలుసుకట్టు చెరువులకు ఊతం :
రాష్ట్రంలో ఇప్పటిరవకు మిషన్ కాకతీయ కింద 20,171 చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. అయితే ఈ ఏడాది నుంచి కొత్తగా గొలుసుకట్టు చెరువులను అభివృధ్ది చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గొలుసుకట్టు కింద 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువు నిండి, కింది చెరువు వరకు నీరు పారే విధంగా కాల్వలను బాగు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచే కాల్వల ద్వారా చెరువులు నింపే కార్యాచరణ సిద్ధమవుతోంది. దీనికోసం మైనర్ ఇరిగేషన్ కింద 2,377.66 కోట్లు కేటాయించారు. ఇందులో 1,200 కోట్ల వరకు గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికే కేటాయించనుండగా, మిగతా నిధులు చెక్‌డ్యామ్‌లు, ఐడీసీలోని ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది.

గత ఏడాది, ఈ ఏడాది కేటాయింపులిలా (రూ.కోట్లలో)..
అంశం
2018-19 2019-20
మేజర్ ఇరిగేషన్ 21,890.87 20,120.34
మైనర్ ఇరిగేషన్ 2,743.65 2,379.66

ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఇంతవరకు చేసిన ఖర్చు(రూ.కోట్లలో) ...
ప్రాజెక్టు అంచనా వ్యయం చేసిన ఖర్చు ఆయకట్టు లక్ష్యం సాగులో ఉన్న భూమి
కాళేశ్వరం 80,500 44,610 18,25,700 -
పాలమూరు-రంగారెడ్డి 49,595 4,872 12,30,000 -
సీతారామ 13,057 1,855 3,87,859 -
ఏఎంఆర్‌పీ-ఎస్‌ఎల్‌బీసీ 8,090 6,416.90 4,11,572 2,85,286
డిండి 6,191.72 1,003 3,61,000 -
దేవాదుల 16,645.44 10,352 5,57,654 1,56,723
వరద కాల్వ 10,953.19 6,806 2,52,882 20,000
కల్వకుర్తి 4,896 4,136 4,24,105 3,07,000
బీమా 2,509 2,500 2,03,000 2,00,000
నెట్టెంపాడు 2,331 2,178 2,00,000 1,42,000
తుపాకులగూడెం 2,121 524 1,00,004 -
ఎస్సారెస్పీ-2 1,220.41 1,148.78 3,97,949 3,41,917

ఆయకట్టు... Budget 18-19 ఇక రాష్ట్రంలో మొత్తంగా 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 70లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.65లక్షల ఎకరాలమేర సాగులోకి రాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.78లక్షల ఎకరాలను సాగులోకి తేగలిగింది. మరో 54లక్షల ఎకరాలను వృద్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది జూన్ ఖరీఫ్ నాటికి కనిష్టంగా 12లక్షల ఎకరాలకై నా కొత్తగా నీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుకున్న ఆయకట్టు లక్ష్యాలను చేరాలంటే భూసేకరణ అత్యంత కీలకంగా మారనుంది. ప్రాజెక్టుల పరిధిలో మరో 58వేలకు పైగా భూమి సేకరించాల్సి ఉండటం ప్రభుత్వానికి పరీక్ష పెడుతోంది.

1956 నుంచి ఇప్పటివరకు సాగులోకి వచ్చిన, రావాల్సిన ఆయకట్టు లక్ష్యాలు (లక్షలఎకరాల్లో)..
ప్రాజెక్టు 1956 2004 2004-14 2014-19 సాగవుతోంది మిగిలింది
భారీ 2.31 19.01 5.39 10.37 37.09 52.57
మధ్యతరహా 1.21 1.91 0.32 0.58 4.01 0.88
మైనర్ 12.50 12.03 - 0.60 25.13 0.33
ఐడీసీ - 3.18 - 1.23 4.41 0.27
మొత్తం 16.03 36.13 5.71 12.78 70.64 54.05

సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర స్వరూపం...
 • మొత్తం భారీ,మధ్యతరహా ప్రాజెక్టులు 38
 • నిర్మాణాలకు అవసరమైన మొత్తం (కోట్లలో ) 2,19,535.51
 • సాగులోకి రావాల్సినఆయకట్టు (ఎకరాల్లో) 70.10 లక్షలు
 • రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఖర్చు చేసిన మొత్తం (కోట్లలో) 70,000
 • ఇంకా ఖర్చు చేయాల్సిన మొత్తం (కోట్లలో)1,16,376.85
 • ఇప్పటి వరకు సాగులోకి వచ్చిన ఆయకట్టు (ఎకరాల్లో) 16.11 లక్షలు
 • ఇంకా సాగులోకి రావాల్సింది (ఎకరాల్లో) 54 లక్షలు
రోడ్లు, భవనాల శాఖకు రూ.2,218.73 :
రోడ్లు, భవనాల శాఖ అద్భుతమైన పనితీరు చూపుతున్నా నిధుల లేమితో ఈ ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత దిగజారేలా కనిపిస్తోంది. గతేడాది రూ.5,575 కోట్లు కేటాయించి ఈసారి రూ.2218.73 కోట్లతో సరిపెట్టింది. గతేడాది కాంట్రాక్టర్లకు చేసిన పనులకే బిల్లులు చెల్లించలేనంతగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గత బడ్జెట్ లో రూ.5,575 కోట్లు కేటాయించినా వాస్తవానికి రూ.2,177 కోట్లు (ఇందులో రూ.1000 కోట్ల మేర అప్పులు) విడుదల చేసింది. మిగిలిన వాటికి అప్పు తెచ్చుకోమని చెప్పింది. మొత్తానికి ఈసారీ ఆర్ అండ్ బీకి అప్పులవేట తప్పేలా లేదు. రాష్ట్ర అవతరణ తర్వాత 3,155 కి.మీ.ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో 1,388 కి.మీల మేర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. మిగిలిన 1,767 కి.మీ.ల మేర రోడ్ల గుర్తింపును ఖరారు చేయాల్సి ఉంది.

పౌర సరఫరాల శాఖకు రూ. 2,744 :
పౌర సరఫరాల శాఖకు ఈ యేడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది రూ.202 కోట్ల మేర బడ్జెట్‌లో కోత పెట్టారు. గతేడాది బడ్జెట్‌లో బియ్యం సబ్సిడీలు కలుపుకొని మొత్తంగా రూ.2,946 కోట్లు కేటాయించగా, ఈ యేడాది రూ.2,744 కోట్లు కేటాయించారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో సైతం సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని గత ప్రభుత్వంలో ఆలోచనలు సాగినా.. దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు, నిధులూ కేటాయించలేదు.

ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి రూ.26,408 కోట్లు :
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికోసం కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ భారీగా నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 2019-20లో రూ.26,408 కోట్లు చొప్పున కేటాయింపులు జరిపింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,581 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,827 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఎస్సీఎస్‌డీఎఫ్‌కు అదనంగా రూ.128.21 కోట్లు, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌కు అదనంగా రూ. 133.89 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంలో పొందుపర్చిన నిబంధనల ప్రకారం మిగులు నిధులను క్యారీఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వార్షిక సంవత్సరం ఖర్చులు తేలిన తర్వాత నిధులను క్యారీఫార్వర్డ్ చేసే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

రవాణాశాఖ పాలనకు రూ.79.43 కోట్లు :
రవాణాశాఖ పరిపాలన ఖర్చుల కింద రూ.79.43 కోట్లు సర్కార్ కేటాయించింది. వాస్తవానికి రవాణాశాఖ అధికారులు రూ.243 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. అయితే వీరి అభ్యర్థన మేరకు పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు జరగలేదు. కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రవాణాశాఖ లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయాన్ని చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది రూ.3,950 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి వరకు రూ.2,950 కోట్ల వరకు ఆదాయాన్ని రాబట్టింది. దాదాపుగా 88.5 శాతం వరకు చేరుకున్నారు.

మైనార్టీ సంక్షేమానికి రూ.2,004 కోట్లు :
2019-20 వార్షిక సంవత్సరంలో మైనార్టీ సంక్షేమానికి రూ. 2,004 కోట్లు కేటాయించింది. 2018-19 వార్షిక సంవత్సరంలో మైనార్టీ సంక్షేమానికి రూ.1999.9 కోట్లు కేటాయించగా... ఈసారి నిధుల కేటాయింపు స్వల్పంగా పెంచింది. దావత్ ఎ ఇఫ్తార్, కిస్మస్ ఫెస్ట్‌లకూ ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేయనుంది. మైనార్టీ డెవలప్‌మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

భద్రతకు రూ. 4,540 కోట్లు :
తాజా బడ్జెట్‌లో హోంశాఖకు రూ.4,540 కోట్ల నిధులు కేటాయించింది. అయితే గతేడాది కంటే ఈ సారి బడ్జెట్‌లో భద్రతకు రూ.1,250 కోట్ల మేర కేటాయింపులు తగ్గడం గమనార్హం. గస్తీకి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఇప్పటికే వేలాదిగా వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చింది. ఇందులో 2014లో 3,800, 2018లో 11,500 వాహనాలు ఆ శాఖకు అందజేసింది. నాలుగున్నరేళ్లలో దాదాపుగా 15 వేల వాహనాలు (ఇందులో ఇన్నోవాలు, బస్సులు, బైకులు తదితరాలు) సమకూర్చింది. హైదరాబాద్ వ్యాప్తంగా 5 లక్షల సీసీ కెమెరాలు అమర్చింది. దశలవారీగా ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా విస్తరించే యోచనలో ఉంది.

నిరుద్యోగ భృతికి రూ. 1,810 కోట్లు :
నిరుద్యోగులకు తాజా బడ్జెట్ భారీ ఊరటనిచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 ఆర్థిక సాయం ఇస్తామని టీఆర్‌ఎస్ చేసిన హామీని నిలబెట్టుకుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2019-20 బడ్జెట్‌లో నిరుద్యోగుల భృతికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. ఈ వార్షికానికి రూ.1,810 కోట్లు బడ్జెట్‌లో పొందుపర్చారు. ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు కేటాయించిన ప్రభుత్వం నిరుద్యోగ భృతికి మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. తాజాగా బడ్జెట్‌లో పేర్కొన్న నిధులతో ఏడాదిపాటు ఐదులక్షల మందికి నిరుద్యోగ భృతి అందించవచ్చు.

పశుసంవర్ధక, మత్స్యశాఖకు రు.1,204 కోట్లు :
రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,204.97 కోట్లు కేటాయించింది. ఇందులో పశుసంవర్థక శాఖకు రూ.650 కోట్ల నిధులు ఉన్నాయి. పశువులకు సంబంధించిన మందుల కొనుగోలు, గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర పథకాల అమలు, సిబ్బంది వేతనాలకు కలిపి రూ.200 కోట్లు ప్రతిపాదించింది. విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం చెల్లిస్తున్నారు. మరో 4 ప్రైవేట్ డెయిరీలకు పాలు, 2.13 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకం ఇస్తున్నారు. మత్స్యశాఖకు రూ.320 కోట్లు ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ, రొయ్యల పెంపకానికి నిధులు ప్రతిపాదించారు.

మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ సంక్షేమానికి రూ.1,628.24 కోట్లు :
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ సంక్షేమానికి ప్రాధాన్యత దక్కలేదు. 2019-20 వార్షిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.1,628.24 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే తాజా కేటాయింపుల్లో రూ.170.58 కోట్లు తగ్గింది. 2018-19 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.1,798.82 కోట్లు, 2017-18లో రూ.1,731.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టనప్పటికీ గతేడాది నుంచి అమల్లోకి వచ్చి న స్త్రీ శక్తి కేంద్రాలు, సఖి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోలేదు.

బీసీ సంక్షేమానికి రూ.4,528.01 కోట్లు :
2019-20 వార్షిక సంవత్సరానికి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.4,528.01 కోట్లు మాత్రమే కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.1,391.82 కోట్లు తగ్గింది. జనాభాలో సగం ఉన్న బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయించా లని గత కొంతకాలంగా డిమాండ్ వస్తుండగా 2017 డిసెంబర్ నెలలో బీసీల సంక్షేమంపై సీఎం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2018- 19 వార్షిక బడ్జెట్‌లో బీసీ ప్రత్యేక అభివృద్ధి నిధిని అమల్లోకి తీసుకొస్తారని అంతా భావించినా బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 850కోట్లు అదనంగా కేటాయించి కొంత ప్రాధాన్యమిచ్చారు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో అదే తరహా ప్రాధాన్యం దక్కు తుందని భావించినా తాజా బడ్జెట్ గణాంకాలను చూస్తే పెద్ద మొత్తానికి కోత పెట్టడం గమనార్హం.
ముచ్చటగా మూడోసారి...
అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 2017-18 వార్షిక సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. అదేతరహాలో 2018-19లో రూ.వెయి్య కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో కూడా రూ. 1,000 కోట్లు కేటాయించింది. తొలి ఏడాది నిధులు కేటాయించినా ఎంబీసీలపై స్పష్టత రాకపోవడంతో ఆ నిధులను ఖర్చు చేయలేదు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఎంబీసీలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసినా.. ఎంబీసీ కార్పొరేషన్ మాత్రం రూ.50కోట్లు ఖర్చు చేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కానీ రాయితీ రుణాలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై పెద్దగా స్పందన లేదు. తాజా బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు కేటాయించగా ఈ సారైనా పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తారో లేదో చూడాలి.

విద్యారంగానికి రూ.12,220.78 కోట్లు :
Budget 18-19 రాష్ట్రం ఏర్పడిన తరువాత బడ్జెట్‌లో విద్యారంగం వాటా పరిస్థితిని పరిశీలిస్తే క్రమంగా తగ్గుతూ వస్తోంది. మొదటి రెండు ఆర్థిక సంవత్సరాల్లో విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్‌లో వాటా తగ్గినా నిధులపరంగా కొంత బాగానే ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి రాష్ట్ర బడ్జెట్ పెరిగినా, విద్యాశాఖ వాటా పెరగకపోగా తగ్గిపోయింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు కాగా, విద్యాశాఖకు రూ. 10,963 కోట్లు (రాష్ట్ర బడ్జెట్‌లో 10.88%) కేటాయించింది. 2015-16లో రాష్ట్ర బడ్జెట్ 1,15,689కోట్లు కాగా విద్యాశాఖకు రూ. 11,216 కోట్లు (9.69%) కేటాయించింది. 2016- 17లో రాష్ట్ర బడ్జెట్ రూ. 1,30,415 కోట్లు కాగా, విద్యాశాఖకు మాత్రం రూ. 10,738 కోట్లకు తగ్గిపోయింది. 2017-18లోనూ రాష్ట్ర బడ్జెట్ 1,49,453 కోట్లకు పెరిగింది. ఇందులో విద్యా శాఖ బడ్జెట్ రూ. 12,278 కోట్లకు పెరిగినా మొత్తం బడ్జెట్‌లో విద్యాశాఖ వాటా చూస్తే 8.49 శాతానికే పరిమితం అయింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 2018-19లో విద్యా శాఖ బడ్జెట్ రూ. 500 కోట్లకు పైగా పెరిగి రూ. 13,278 కోట్లకు చేరుకుంది. వాటా పరంగా చూస్తే 7.61 శాతమే. ఈసారి బడ్జెట్ కేటాయింపులు చూస్తే వాటానే కాదు.. నిధుల పరంగా చూసినా గతేడాది కంటే విద్యాశాఖకు కేటాయింపులు తగ్గిపోయాయి. 2018-19లో రాష్ట్ర బడ్జెట్ 1,74,453 కోట్లు కాగా విద్యాశాఖకు రూ. 13,278 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ. 1,058 కోట్లు తగ్గించి రూ. 12,220.78 కోట్లకు పరిమితం చేసింది. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే ఈసారి విద్యాశాఖ వాటా 6.71 శాతానికి పడిపోయింది.
ఉన్నత, సాంకేతిక విద్యలోనూ తగ్గిన కేటాయింపులు :
ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖలకు కేటాయించిన బడ్జెట్ గతేడాది కంటే ఈసారి రూ. 250 కోట్ల వరకు తగ్గిపోయింది. గత ఏడాది ఉన్నత విద్యకు రూ. 2,205.57 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ. 1,916.85 కోట్లు కేటాయించింది. సాంకేతిక విద్యకు 2018-19లో రూ. 422.32 కోట్లు కేటాయించగా. ఈసారి దానిని రూ. 394.93 కోట్లకు పరిమితం చేసింది.

విద్యాశాఖ మొత్తం బడ్జెట్ (కోట్ల రూపాయల్లో..) :
విభాగం 2017-18 (సవరించిన బడ్జెట్) 2018-19 2019-20 బడ్జెట్
పాఠశాల విద్య 10,197.22 10,830.30 9909
ఉన్నత విద్య 2061.95 2,025.57 1916.85
సాంకేతిక విద్య 376.37 422.32 394.93
మొత్తం 12,635.54 3,278.19 12220.78
Published on 2/23/2019 4:24:00 PM