భారత ఆర్థిక నివేదిక 2011-12


భారత ఆర్ధిక వ్యవస్థ తీరు తెన్నులను వివరించే... ‘భారత ఆర్థిక నివేదిక 2011-12’ను ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మార్చి15న పార్లమెంటుకు సమర్పించారు. గతేడాది అన్నిరంగాల్లో ఆర్ధిక వ్యవస్థ పనీతీరును.. లక్ష్యాలను అందుకోలేకపోవటానికి కారణాలను.. వ్యవస్థ పురోగమనానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదిక వివరించింది. ప్రగతి మందగించినప్పటికీ.. పరిస్థితులు ఆశావహంగానే ఉన్నాయని నివేదిక తెలిపింది. ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టటానికి ఆర్ధిక సంస్కరణలను తక్షణం అమలులో పెట్టడం ఒక్కటే మార్గమని సర్వే స్పష్టంచేసింది. ఆర్థిక సర్వే- 2012ను ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు కౌశిక్‌బసు, ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సలహాతో రూపొందించారు.

నివేదిక ముఖ్యాంశాలు :
 • దేశ ఆర్ధిక వృద్ధి రేటు ప్రస్తుత (2011-12) ఆర్థిక సంవత్సరానికి 6.9 శాతంగా సర్వే అంచనా వేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్ధిక చర్యల వల్ల 2012-13 కాలానికి వృద్ధిరేటు 7.6 శాతానికి... 2013-14 కాలానికి 8.6 శాతానికి చేరగలదని అంచనా వేసింది.
 • వ్యవసాయ, సేవా రంగాలు మంచి పనితీరు కనబరుస్తాయని సర్వే పేర్కొంది. అగ్రికల్చర్ రంగం 2.5 శాతం వృద్ధి రేటు... సేవా రంగం 9.4 శాతం వృద్ధి రేటును అంచనావేసింది. జీడీపీలో సేవా రంగం వాటా 59 శాతానికి చేరుకోనుంది.
 • పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు 4-5 శాతంగా ఉంటుందని.. ఇది మరింత పుంజుకునే అవకాశముందని ఆర్థిక సర్వే తెలిపింది.
 • ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటానికి కఠినమైన ద్రవ్య విధానాన్ని అమలు చేస్తున్నామని.. దాంతో త్వరలోనే ద్రవ్యోల్బణం 6.5 శాతం నుంచి 7 శాతానికి పరిమితం అవుతుందనే ఆశాభావం వ్యక్తంచేసింది. ద్రవ్యోల్బణం అదుపు ద్వారా వడ్డీ రేట్లు త గ్గి.. పెట్టుబడి కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని పేర్కొంది.
 • గత మూడు నెలల త్రైమాసానికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.1 శాతంగా ఉంది. ఇది అంతకుముందు త్రైమాసికాంతానికి ఉన్న 6.9 శాతం కంటే తక్కువ అయినప్పటికీ... ఈ ఏడాది చివరకు లక్షిత 6.9 శాతానికి చేరుతుందని తెలిపింది. వ్యవసాయం రంగం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంటందని ఆర్థిక సర్వే అంచనా. పదకొండో ప్రణాళిక (2007-12)లో 4 శాతంగా నిర్దేశించుకున్న వ్యవసాయ వృద్ధిరేటు లక్ష్యాన్ని అందుకోలేకపోవటం పట్ల సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ లక్ష్య సాధనకు సంఘటితకృషి అవసరమంది. అదే సమయంలో ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ వృద్ధి రేటు 3.28 శాతంగా అంచనా వేసింది.
 • పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ప్రస్తుత సంవత్సరంలో 4 నుంచి 5 శాతం ఉండొచ్చని అంచనా. వాణిజ్య, వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెరగటానికి అనువైన పరిస్థితులు కల్పించాలని.. ఈ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించి వ్యాపార విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించింది. ఆర్ధిక క్రమశిక్షణ వల్ల ద్రవ్యోల్బణం తగ్గి అంత ర్జాతీయ మార్కెట్‌లో సరుకుల ధరల తగ్గుతాయని, పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుందని తెలిపింది. నిర్మాణరంగం పుంజుకోవడం వల్ల గత దశాబ్ద కాలంలో(1999-2000 నుంచి 2009-10) పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పన 16.2 శాతం నుంచి 21.9 శాతానికి పెరిగింది.
 • మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి నిధులు కొరత అడ్డంకిగా మారింది. 12వ పంచవ ర్ష ప్రణాళికలో ఈ రంగానికి లక్ష కోట్ల డాలర్లు అవసరం అవుతాయని అంచనా. ఈ రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించటానికి ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టాల్సి ఉంది.
 • ద్రవ్యలోటును వీలైనంతర త్వరంగా తగ్గించి అదుపులో ఉంచితేనే అనుకున్న విధంగా అల్ప ద్రవ్యోల్బణం, అధిక వృద్ధి రేటు సాధించగలం. ఇందుకు అనవసర వ్యయాన్ని తగ్గించి, పన్ను-స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) నిష్పత్తిని ప్రస్తుతం ఉన్న 10.5 శాతం నుంచి 2016-17 ఆర్ధిక సంవత్సరానికి 13 శాతానికి చేర్చాలి.
 • ఏప్రిల్ 2011- జనవరి 2012 ఎగుమతులు 23.5 శాతం.. మొత్తం ఎగుమతుల విలువ 242. 8 బిలియన్ డాలర్లు.
 • విదేశీ మారక ద్రవ్యనిలువలు.. 293 బిలియన్ డాలర్లు. ఎక్స్‌టర్‌నల్ డెబ్ట్ 326 బిలియన్ డాలర్లు. డాలర్‌తో రూపాయి 12.4 శాతం తగ్గింది.
 • ప్రయారిటీ సెక్టార్ లెండింగ్‌లో.. ప్రభుత్వ రంగ బ్యాంకులు 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
 • వ్యవసాయ రంగానికి రుణాలు లక్షిత 19 శాతాన్ని దాటాయి. మొత్తం 127 లక్షల రైతులు లబ్ధి పొందారు.
 • ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 98 శాతం బ్రాంచ్‌ల కంప్యూటరీకరణ జరిగింది. విద్య రంగంపై వ్యయం 2006-07లో 2.72 శాతం నుంచి 2011-12లో 3.11 శాతానికి చేరుకుంది.
 • దేశీయంగా కరెన్సీ విలువ పడిపోకుండా ఉండాలంటే.. విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకోవాల్సి ఉంది. దేశం నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లినప్పుడు, బయట నుంచి ఆర్ధిక ఒత్తిళ్లు పెరిగినపుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు దేశాన్ని ఆదుకుంటాయి. సత్వరం విదేశీ మారక నిల్వలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.
 • ఆహార ద్రవ్యోల్బణం, రైతుల పంటకు గిట్టుబాటు ధర లభ్యత ప్రధాన సవాళ్లుగా మారాయి. వీటిని ఎదుర్కోటానికి మల్టీ బ్రాండ్ రిటైల్ గ్లోబల్ సూపర్ మార్కెట్‌లను దేశవ్యాప్తంగా విస్తరింపచేయటమే మార్గం. ఇందుకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను (ఎప్‌డీఐ)లను మెట్రో నగరాల్లో దశలవారిగా అనుమతించాలి. ఆధునిక రిటైల్ వర్తకం వల్ల వ్యవసాయ మార్కెటింగ్ మెరుగుపడటంతోపాటు ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది.
 • ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలకు, దే శీయ పెట్టుబడులకు ఊతంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా ప్రోత్సహించాలి. గ త సంవత్సరం (2011) ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో సేవారంగం, టెలికాం, నిర్మాణ రంగం, డ్రగ్స్, ఫార్మా రంగం, మెటలర్జికల్ ఇండస్ట్రీస్, విద్యుత్ రంగాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించగలిగాయి.
 • ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో (2011-12) సేవల రంగంలో వృద్ధి రేటు 9.4 శాతంగా ఉంటుంది
 • ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 2011- జనవరి 2012 కాలంలో దేశంలో ఎగుమతులు 23.5 శాతంగా సర్వే పేర్కొంది.
 • వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయ రంగం దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి.
 • ఆర్ధిక వ్యవస్థ పట్టిష్టతకు, పెరుగుదలకు కొత్త ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ చట్టాన్ని (ఎఫ్‌ఆర్‌బీఎమ్) తీసుకరావాల్సిన అవసరం ఉంది.
 • వ్యవసాయం ముమ్మరంగా సాగే కాలంలో కూలీల కొరత ఏర్పడకుండా మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)ను పటిష్టం చేయాలి.
 • రూపాయి మారక విలువలో ఒడిదుడులను నివారించటానికి చర్యలు తీసుకోవాలి. గత ఏడాది (2011) జులై 27న 43.94 వద్ద గరిష్ట స్థాయిలో ఉన్న రూపాయి డిసెంబర్ 15 నాటికి 54.23 కనిష్ట స్థాయికి పతనమైంది.
 • మౌలిక రంగంలో రుణ నిధుల లభ్యత ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అశావహంగా లేదు. విద్యుత్, టెలీకమ్యూనికేషన్ల రంగానికి అందే పరపతి తగ్గింది. అంతక్రితం ఆర్ధిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఈ విధమైన నిధుల లభ్యత సుమారు 61 శాతంగా ఉంది.
 • ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతి (పీపీపీ) విజయవంతమైన నమూనాగా నిలిచింది.
 • మానవ ఉత్పాదకతను పెంచటానికి వైద్య (ఆరోగ్య), విద్య రంగాలను తక్షణం సంస్కరించాలి. జాబ్ మార్కెట్‌లో డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవటాన్ని సరి చేయటానికి యూనివర్సిటీ స్థాయి విద్యను సమూలంగా మార్చాలి.
 • పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి ఒక పకడ్బందీ వ్యూహం కావాలి. ఈ దిగుమతులు ఒక పరిమితికి మించకుండా నియంత్రించాలి.
 • వాతావరణ మార్పుల వల్ల ఆకస్మికంగా కలిగే వరదలు, కరవులను తట్టుకోడానికి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ మార్పుల వల్ల పంటలు, భూములు, పశు,మత్స్య సంపదలకు విపరీతంమైన సష్టం కలిగి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. ఈ సవాళ్లను ఎదర్కోటానికి తగిన వ్యూహాలు రచించుకోవాలి. ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యగా మారుతోంది.
 • మైనింగ్‌లో ఉత్పత్తి తగ్గిపోతోంది. ప్రధానంగా బొగ్గు, సహజవాయువు వెలికితీతలో ఈ పరిస్థితి ఉంది. విద్యుత్ రంగం పరిస్థితి బాగుంది. యంత్ర పరికరాలు, ఇంటర్మీడియరీ విభాగాలలో ప్రతికూల వృద్ధి నమోదౌతోంది.
 • ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలు మాంద్య పరిస్థితులు ఎదుర్కుంటున్నందున విదేశీ వాణిజ్య భాగసాములు రక్షణాత్మక వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఈ స్థితిలో భారత దేశం ఎగుమతులు పెంచుకోవటానికి ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాలి. ఎగుమతులకు యూరప్, అమెరికా మార్కెట్లపై అధికంగా ఆధారపడటం తగ్గించుకోవాలి. ఇందుకు తగిన మార్గాలు వెతకాలి. బంగారం వంటి అనుత్పాదక దిగుమతులను కట్టడి చేయాలి.
 • భారత ఫైనాన్షియల్ మార్కెట్లు ప్రధానంగా కరెన్సీ, ఈక్విటీ ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
 • దేశ ఆర్ధిక సంస్థలను బలోపేతం చేయడానికి దీర్ఘ కాలిక బాండ్ల మార్కెట్‌ను అభివృద్ధి చేయటం తప్పనిసరి.
 • అంతర్జాతీయ పైనాన్షియల్ మార్కెట్‌లో అనిశ్చితి, విదేశీ నిధుల లభ్యతను హరింప చేస్తుంది. విదేశీ నిధుల సమీకరణకు అయ్యే ఖర్చును పెంచుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
 • రిజర్వుబ్యాంకు విధించిన అధిక పాలసీ రేటు స్వల్పకాలిక వృద్ధిని ప్రభావితం చేస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు దానికి అనుగుణంగా ఆర్‌బీఐ రేటును కూడా తగ్గించాలి. ఆహారం, కినోసిన్‌లకు అందించే సబ్సిడీలను నేరుగా రేషన్‌దారులకే అందించే పద్ధతిని అనుసరించాలి.
 • ఆధార్ కార్డు ఆధారంగా పేదలకు నగదు బదిలీ చేయటానికి ప్రభుత్వం సుమఖంగా ఉంది.
 • ఇరాన్ సంక్షోభం వల్ల చమురు సరఫరాకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ముడి చముర ధర పెరిగే ప్రమాదం ఉంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
Published on 3/17/2012 8:30:00 PM

Related Topics