రైల్వే బడ్జెట్ 2013-2014


2013-14 రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సాల్ ఫిబ్రవరి 26న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 17 ఏళ్ల తర్వాత రైల్వే శాఖ కాంగ్రెస్ చేతుల్లోకి రావడం, మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు వంటి కారణాలతో ఈ బడ్జెట్ అనేక జనాకర్షక పథకాలను ప్రకటిస్తుందని అంతా ఆశించారు. అందుకు భిన్నంగా పరోక్షంగా అన్ని వర్గాలపై భారం పడేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండటం విమర్శకులను విస్మయపరిచింది.. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమగ్ర స్వరూపం మీ కోసం..

రైల్వే బడ్జెట్ సమగ్ర స్వరూపం (రూ.కోట్లలో)
2012-13 2013-14
స్థూల ట్రాఫిక్ వసూళ్లు 1,25,680 1,43,740
నిర్వహణ వ్యయం 1,11,400 1,26,000
నికర ఆదాయం 15,750 19,400
డివిడెండ్ 5,340 6,250
నిర్వహణ నిష్పత్తి 88.8% 87.8%
మొత్తం మిగులు 10,410 13,150


బడ్జెట్ హైలైట్స్
 1. మొత్తం బడ్జెట్ రూ.63,363 కోట్లు.
 2. ఏసీ ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల రిజర్వేషన్ ఫీజును రూ.35 నుంచి రూ.60కి పెంపు
 3. టికెట్ రద్దుపై అన్ని తరగతుల వారిపై భారం. తరగతుల వారీగా రూ.5 నుంచి రూ.50 వరకు పెంచారు. పార్సల్, లగేజీ రేట్లు యథాతథంగా ఉంచారు.
 4. నిమిషానికి 7,200 టికెట్లను బుక్ చేసుకునేలా భావితర టికెటింగ్ వ్యవస్థకు ప్రణాళికలు. ఒకేసారి 1.2 లక్షల మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే వీలు.
 5. ముంబై సబర్బన్‌లో తొలిసారి ఏసీ ఈఎంయూ బోగీలు.
 6. ముంబైలో 72, కోల్‌కతాలో 18 అదనపు రైళ్ల సర్వీసులు
 7. కోల్‌కతాలో 80 సర్వీసుల్లో, చెన్నైలో 30 సర్వీసుల్లో బోగీల సంఖ్య 9 నుంచి 12కు పెంపు
 8. పట్టాలెక్కనున్న 8 డెమూ, 5 మెమూ రైలు సర్వీసులు
 9. రైళ్లలో గమ్యస్థానాల వివరాలు తెలిపేలా ఎలక్ట్రానిక్ తెరలు, అనౌన్స్‌మెంట్ ఏర్పాట్లు. పలు రైళ్లలో ఉచిత వైఫై సౌకర్యం.
 10. ప్రయాణికుల భద్రత కోసం పదేళ్లపాటు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు
 11. 12వ ప్రణాళిక కాలంలో 10,797 లెవెల్ క్రాసింగ్‌ల రద్దు. వీటిస్థానంలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థల ఏర్పాటు
 12. బోగీల్లో పొగ, మంటలను గుర్తించేందుకు అత్యాధునిక వ్యవస్థల ఏర్పాటు
 13. రైళ్లలో కేటరింగ్ సర్వీసులపై ఫిర్యాదులకు 1800-111-321 (టోల్‌ఫ్రీ) నంబరుతో కేంద్రీకృత పర్యవేక్షణ
 14. రిజర్వేషన్, తత్కాల్ టికెట్లలో అక్రమాల నిరోధానికి చర్యలు
 15. 2013-14లో 1,047 మిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యం. కిందటిసారి కంటే ఇది 40 మిలియన్ టన్నులు ఎక్కువ
 16. 2013-14లో రైల్వే ప్రయాణికుల్లో పెరుగుదల 5.2 శాతంగా అంచనా
 17. 2013-14లోస్థూల ఆదాయార్జన రూ.1,43,742 కోట్లుగా అంచనా
 18. వివిధ పనులకు(నిర్వహణకు) అయ్యే ఖర్చు రూ.96,500 కోట్లు
 19. 500 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు. 750 కిలోమీటర్ల మేర డబ్లింగ్, 450 కిలోమీటర్ల గేజ్ మార్పిడి పనులు
కేటాయింపులు-వివరాలు
రవాణా చార్జీలు 5.8 శాతం పెంపు
సరుకు రవాణా చార్జీలను సగటున 5.8 శాతం పెంచారు. 2013-14లో మొత్తం 104.7 కోట్ల టన్నుల సరుకుల రవాణా ద్వారా రూ.93,554 కోట్ల ఆర్జనను లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే రూ. 4,200 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చు కోవాలనుకుంటున్నారు.

రిజర్వేషన్ చార్జీల పెంపు
రిజర్వేషన్ చార్జీల్ని బడ్జెట్‌లో భారీగా పెంచేశారు. సప్లిమెంటరీ చార్జీలు రూ.5 నుంచి రూ.25 వరకు పెరిగాయి. తత్కాల్ చార్జీలైతే ఏకంగా రూ.25 నుంచి రూ.100 వరకూ పెరిగాయి. టికెట్ల రద్దు చార్జీలూ తరగతిని బట్టి రూ.10 నుంచి రూ.50 దాకా పెరిగాయి.

67 ఎక్స్‌ప్రెస్, 26 ప్యాసింజర్ రైళ్లు
ఈ ఏడాది మొత్తంగా 106 కొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. వీటిలో 67 ఎక్స్‌ప్రెస్, 26 ప్యాసింజర్ రైళ్లతోపాటు 5 మొయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్(మెము), 8 డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్(డెము) ఉన్నాయి.

స్వాతంత్య్ర సందేశ ప్రచారానికి ఎక్స్‌ప్రెస్
దేశ స్వాతంత్య్రోద్యమ సందేశాన్ని ప్రచారం చేయడానికి ‘ఆజాదీ ఎక్స్‌ప్రెస్’ పేరుతో విద్యా, పర్యాటక రైలును ప్రారంభించనున్నారు. యువతీ యువకులు ఈ ఉద్యమంతో ముడిపడి ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా దీన్ని తెస్తున్నారు.

ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు
రైలు ప్రయాణికులు ఆహార పదార్థాల నాణ్యత సరిగా లేకున్నా, సేవాలోపం జరిగినా టోల్ ఫ్రీ నంబరు 1800 111 321కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే సూచనలు చేయవచ్చు. ఆయా ఫిర్యాదులు, సలహాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఒక వ్యవస్థ జనవరి 18వ తేదీ నుంచి పనిచేస్తోంది.

ప్లాస్టిక్ నిషేధం
రైలులో ప్రయాణికులకు ఆహారం పంపిణీకి ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లపై నిషేధం విధించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. వాటి స్థానంలో వ్యవసాయ సంబంధిత, పునరుత్పత్తికి అవకాశం ఉన్న పదార్థాలతో తయారైనవాటిని ప్రోత్సహించాలని ప్రతిపాదించింది.

పీపీపీ ద్వారా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష్యం
పెండింగ్‌లో ఉన్న వివిధ దీర్ఘకాలిక రైల్వే ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో భారీగా నిధులు సమీకరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 12వ పంచవర్ష ప్రణాళికలో పీపీపీ పద్ధతిలో రూ. లక్ష కోట్లను పెట్టుబడులుగా ఆకర్షించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.

పలు రైళ్లలో అధునాతన సౌకర్యాలు
శతాబ్ది, రాజధాని రైళ్లలో ప్రయాణం ఇకపై మరింత హాయిగా సాగనుంది. అత్యంత సౌకర్యవంతంగా ఉండే అధునాతన బోగీలను వీటికి జతచేస్తారు. అధునిక వసతులు, సేవలు ఉండే వీటికి ‘అనుభూతి’గా పేరు పెట్టనున్నారు. ఇలాంటి బోగీలను ఎంపిక చేసిన రైళ్లలో ఒక్కోదాంట్లో ఒకటి ప్రవేశపెడతామని, వీటిలో అధునాతన కుషన్ సీట్లు, బెర్తులు, ఎల్‌సీడీ వీడియో స్క్రీన్లు, గాలి ఒత్తిడితో పనిచేసే టాయిలెట్లు ఉంటాయి.

తొలిసారిగా అరుణాచలప్రదేశ్‌తో లింకు
అరుణాచల్‌ప్రదేశ్‌ను తొలి సారిగా రైల్వే నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకురానున్నారు. హర్ముతి-నహర్లగున్ మధ్య రైల్వే లైన్ పనులు ఈ ఏడాది పూర్తి కానున్నాయి.

అవార్డు గ్రహీతలకు పాసులు
 1. రాజీవ్ ఖేల్ రత్న, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలకు ఫస్ట్‌క్లాస్/సెకండ్ ఏసీ ప్రయాణాలకు కాంప్లిమెంటరీ కార్డు పాసులు జారీ చేస్తారు.
 2. అవార్డు గ్రహీతలకు వర్తింపజేస్తున్నట్లుగా ఒలింపిక్ పతక విజేతలు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలకు కూడా రాజధాని/శతాబ్ది రైళ్లలో ప్రయాణాలకు కాంప్లిమెంటరీ కార్డు పాసుల జారీ.
 3. శత్రు సేనలపై పోరులో ప్రాణాలర్పించిన అవివాహ సైనికుల తరఫున మహావీర్ చక్ర, వీర్‌చక్ర, కీర్తిచక్ర, శౌర్య చక్ర, రాష్ట్రపతి పోలీసు పతకం, పోలీసు సాహస పతకం వంటి అవార్డులు అందుకుంటున్న తల్లిదండ్రులకు ఫస్ట్‌క్లాస్/సెకండ్ ఏసీ ప్రయాణాల్లో కాంప్లిమెంటరీ కార్డు పాసుల సౌకర్యం వర్తింపు.
 4. పోలీసు సాహస పతక గ్రహీతలు ఏటా ఒకసారి రాజధాని/శతాబ్ది రైళ్లలోని సెకండ్ ఏసీలో మరో వ్యక్తితో కలిసి ప్రయాణించేందుకు కాంప్లిమెంటరీ పాసు జారీ.
 5. స్వాతంత్య్ర సమరయోధుల పాసుల రిన్యూవల్ గడువు ఏడాది నుంచి మూడేళ్లకు పెంపు.
1.52 లక్షల పోస్టుల భర్తీ
 1. రైల్వేల్లో ఖాళీగా ఉన్న 1.52 లక్షల పోస్టులను ఈ ఏడాది భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. భారత రైల్వేల్లో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
 2. రైల్వేల అవసరాలకు తగిన విధంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో శిక్షణ కల్పించనున్నారు. నాగపూర్‌లో మల్టీ డిసిప్లినరీ ట్రయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు సికింద్రాబాద్‌లో ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఐఆర్‌ఐఎఫ్‌ఎం) ఏర్పాటు చేస్తారు.
రైల్వే సొంత విద్యుత్ కంపెనీ
ఏటా సుమారు రూ. 9 వేల కోట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్న రైల్వేశాఖ విద్యుత్ కొనుగోళ్లతో పాటు ఇంధన పొదుపు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు త్వరలో రైల్వే ఎనర్జీ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఆర్‌ఈఎంసీ) ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ సౌర, పవన విద్యుత్‌పై దృష్టిపెట్టనుంది. ప్రభుత్వరంగ సంస్థ రైట్స్ లిమిటెడ్‌కు 51 శాతం ఈక్విటీ, రైల్వేకు 49 శాతం ఈక్విటీతో ఈ కంపెనీ ఏర్పాటు కానుంది.

ఈ కంపెనీ ఏం చేస్తుందంటే...
 1. సొంత అవసరాలకు విద్యుత్ కొనుగోలు, ఇతర కస్టమర్ల కోసం విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం.
 2. 75 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు.
 3. సౌర విద్యుత్ ద్వారా వెయ్యి లెవల్ క్రాసింగ్‌ల నిర్వహణ
 4. ఇంధన సామర్థ్య ఆధునిక విద్యుత్ ఇంజన్ల తయారీ
ఆదాయం లక్ష్యం రూ. 1.43 లక్షల కోట్లు
 1. భారతీయ రైల్వే 2013-14లో రికార్డు స్థాయిలో రూ. 1,43,742 కోట్ల ఆదాయ సముపార్జనను లక్ష్యంగా ప్రకటించింది. ప్రయాణికులపై వివిధ చార్జీలు పెంపు ద్వారా రూ. 42,210 , సరుకు రవాణా చార్జీలను పెంచటం ద్వారా రూ. 93,554 కోట్ల నిధులు సమకూర్చుకోనున్నారు.
 2. 2012-13 బడ్జెట్‌లో నిర్దేశించుకున్న రూ.1.35 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని రైల్వే అందుకునే పరిస్థితి లేదు. దీనిని రూ. 1.28 లక్షల కోట్లకు సవరించారు.
సిగ్నలింగ్ బలోపేతం-భద్రతా హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు
 1. పట్టాల సామర్థ్యాన్ని పెంచి, రైళ్లను సురక్షితంగా నడపడానికి సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుదల. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థల్లో రైలు భద్రతా హెచ్చరిక వ్యవస్థ(టీపీడబ్ల్యూస్) ఏర్పాటు.
 2. రైళ్ల ఢీ ని అడ్డుకోవడానికి దేశీయంగా రూపొందించిన టీసీఏఎస్ వ్యవస్థ ప్రాథమిక పరీక్షలు విజయవంతమైన నేపథ్యంలో దీన్ని ప్రామాణీకరించడానికి సంక్లిష్ట ఆపరేషన్లలో మరింత పటిష్టంగా పరీక్షించడం.
 3. 60 కేజీల పట్టాలు, 260 మీటర్ల పొడవున్న రైలు ప్యానళ్లుతో పట్టాల ఆధునీకరణ. పటిష్టమైన, ఒకదానిపై ఒకటి ఎక్కలే ని ఎల్‌హెచ్‌ఎస్ బోగీలను ప్రవేశపెట్టడం.
 4. ప్రమాదాల్లో సహాయక చర్యల కోసం గంటకు 160 నుంచి 200 కి.మీ వేగంతో వెళ్లే సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్ల(స్పార్ట్)ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం.
 5. అగ్నిప్రమాదాల నివారణకు అగ్ని, పొగను గుర్తించే వ్యవస్థలను పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదిక ప్రవేశపెట్టడం. అన్ని రైళ్లలో పోర్టబుల్ అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయడం.
 6. భద్రతపై దీర్ఘకాలం దృష్టి సారించడానికి వచ్చే పదేళ్ల కాలానికి(2014-24) కార్పొరేట్ భద్రత ప్రణాళిక ప్రతిపాదన.
వెబ్‌సైట్ సామర్థ్యం భారీగా పెంపు
 1. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ప్రస్తుతం నిమిషానికి 2 వేల టికెట్లే అందించే సామర్థ్యం కలిగి ఉంది. దీనిని నిమిషానికి 7,200కు పెంచేలా మార్పులు చేస్తున్నారు.
 2. ప్రస్తుతం ఈ టికెటింగ్ సైట్‌ను ఒకేసారి 40 వేల మంది మాత్రమే ఉపయోగించే అవకాశం ఉండగా.. దాన్ని 1.20 లక్షల మంది ఉపయోగించేలా సామర్థ్యం పెంచనున్నారు.
 3. మొబైల్ ఫోన్ నుంచే నేరుగా టికెట్ తీసుకునే సౌకర్యం కల్పించనున్నారు. రైలు రిజర్వేషన్ స్టేటస్‌ను ప్రయాణికుడికి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ అలర్టుల ద్వారా తెలియజేసే ప్రాజెక్టు చేపట్టనున్నారు.
 4. ఇంటర్నెట్ టికెట్ల బుకింగ్ సమయాన్ని పెంచారు. ఇకపై అర్ధరాత్రి 00:30 గంటల నుంచి 23:30 వరకు బుక్ చేసుకోవచ్చు.
రవాణా కారిడార్లకు భూసేకరణ పూర్తి
 1. 2,800 కిలోమీటర్ల పొడవైన తూర్పు, పశ్చిమ రవాణా కారిడార్ల కోసం భూసేకరణ దాదాపు పూర్తయింది.
 2. ఖరగ్‌పూర్, విజయవాడ మధ్య 1,100 కి.మీ పొడవైన ఈస్ట్‌కోస్ట్ కారిడార్, ఢిల్లీ, చెన్నైల మధ్య 2,173 కి.మీ పొడవైన నార్త్-సౌత్ కారిడార్‌తో పాటు పలు కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలిపారు.
బొగ్గు గనులతో అనుసంధానానికి 4 వేల కోట్లు
విద్యుత్‌రంగ సమస్యలను పరిష్కరించేందుకు బొగ్గు గనులతో అనుసంధానం కోసం రూ. 4 వేల కోట్లు పెట్టుబడిగా ప్రతిపాదించారు.

కర్నూలుకు రెండు వర్క్‌షాప్‌లు
కర్నూలుకు రెండు వర్క్‌షాప్‌లు మంజూరయ్యాయి. ఇందులో సగం జీవితకాలం పూర్తయిన బోగీలు వెంటనే మరమ్మతు దశకు రాకుండా వాటిని తిరిగి పటిష్టం చేసే ‘కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్’ ఒకటి కాగా, డెమూ రైళ్ల మరమ్మతు కేంద్రం మరోటి.

కొత్త రైళ్లు..
 1. కాకినాడ-ముంబై ఎక్స్‌ప్రెస్(బైవీక్లీ)
 2. కర్నూలు టౌన్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(డైలీ)
 3. మంగుళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్(వీక్లీ) వయా డోన్, గుత్తి, రేణిగుంట, కోయంబత్తూరు
 4. నిజామాబాద్-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్(వీక్లీ)
 5. తిరుపతి-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్(వీక్లీ)
 6. తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్(వీక్లీ) వయా విశాఖపట్నం
 7. విశాఖపట్టణం- జోధ్‌పూర్ (వీక్లీ)
 8. విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్(వీక్లీ)
మన రాష్ట్రం గుండా వెళ్లే కొత్త రైళ్లు..
 1. అజ్ని(నాగ్‌పూర్)-లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్(వీక్లీ) హింగోలి
 2. బికనీర్-చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్(వీక్లీ) వయా జైపూర్, సవాయ్ మాధోపూర్, నగడ, భోపాల్, నాగ్‌పూర్
 3. గాంధీధామ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్(వీక్లీ) వయా అహ్మదాబాద్, వార్దా, బల్హార్షా, విజయవాడ
 4. హౌరా-చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్(బై వీక్లీ)
 5. వయా భద్రక్, దువ్వాడ, గూడూరు
 6. కమాఖ్య(గువాహటి)-బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్(వీక్లీ)
 7. జబల్పూర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్(వీక్లీ) వయా నాగ్‌పూర్, ధర్మవరం
 8. పాటలీపుత్ర(పాట్నా)-బెంగళూరు ఎక్స్‌ప్రెస్(వీక్లీ) వయా చెవోకి
 9. చెన్నై-నాగర్‌సోల్(సాయినగర్ షిర్డి) ఎక్స్‌ప్రెస్(వీక్లీ) వయా రేణిగుంట, డోన్, కాచిగూడ
ఐదు కొత్త ప్రాజెక్టులు మంజూరు
 1. కంభం-ప్రొద్దుటూరు (142 కి.మీ), ప్రాజెక్టు వ్యయం రూ.829 కోట్లు, కేటాయింపులు రూ.10 లక్షలు.
 2. కొండపల్లి-కొత్తగూడెం (125 కి.మీ), ప్రాజెక్టు వ్యయం రూ.723 కోట్లు, కేటాయింపులు రూ.10లక్షలు
 3. మణుగూరు-రామగుండం (200 కి.మీ), ప్రాజెక్టు వ్యయం రూ.1,112 కోట్లు, కేటాయింపులు రూ.10 లక్షలు
 4. చిక్‌బళ్లాపూర్-పుట్టపర్తి-శ్రీసత్యసాయి నిలయం (103 కి.మీ), రూ.558 కోట్లు, కేటాయింపులు రూ.10లక్షలు
 5. శ్రీనివాసపుర-మదనపల్లి (75 కి.మీ), రూ.296 కోట్లు, కేటాయింపులు రూ.10 లక్షలు
తత్కాల్ కొత్త చార్జీలు, పెంపు వివరాలు..
తరగతి కనిష్టం గరిష్టం
సెకండ్ క్లాస్ 10 (పెంపు లేదు) 15 (పెంపు లేదు)
స్లీపర్ 90 (పెంపు రూ. 15) 175 (పెంపు రూ. 25)
ఏసీ చైర్ కార్ 100 (పెంపు రూ. 25) 200 (పెంపు రూ. 50)
ఏసీ 3 టైర్ 250 (పెంపు రూ. 50) 350 (పెంపు రూ. 50)
ఏసీ 2 టైర్ 300 (పెంపు రూ. 100) 400 (పెంపు రూ. 100)
ఎగ్జిక్యూటివ్ క్లాస్ 300 (పెంపు రూ. 100) 400 (పెంపు రూ. 100)


టికెట్ల రద్దుకు కొత్త చార్జీలు, పెంపు ఇలా...
తరగతి వెయిటింగ్ లిస్ట్ / ఆర్‌ఏసీ కన్‌ఫర్మ్‌డ్ టికెట్లు
సెకండ్ క్లాస్ 15 (పెంపు రూ. 5) 30 (పెంపు రూ. 10)
స్లీపర్ క్లాస్ 30 (పెంపు రూ. 10) 60 (పెంపు రూ. 20)
ఏసీ చైర్ కార్ 30 (పెంపు రూ. 10) 90 (పెంపు రూ. 30)
ఏసీ-3 ఎకానమీ 30 (పెంపు రూ. 10) 90 (పెంపు రూ. 30)
ఏసీ-3 టైర్ 30 (పెంపు రూ. 10) 90 (పెంపు రూ. 30)
ఫస్ట్ క్లాస్ 30 (పెంపు రూ. 10) 100 (పెంపు రూ. 40)
ఏసీ-2 టైర్ 30 (పెంపు రూ. 10) 100 (పెంపు రూ. 40)
ఏసీ ఫస్ట్ క్లాస్ 30 (పెంపు రూ. 10) 120 (పెంపు రూ. 50)
ఎగ్జిక్యూటివ్ క్లాస్ 30 (పెంపు రూ. 10) 120 (పెంపు రూ. 50)


కొత్త రిజర్వేషన్ ఫీజులు, సప్లిమెంటరీ చార్జీలు
తరగతి రిజర్వేషన్ చార్జి సప్లిమెంటరీ చార్జి
సెకండ్ క్లాస్ 15 (పెంపు లేదు) 15 (పెంపు రూ. 5)
స్లీపర్ క్లాస్ 20 (పెంపు లేదు) 30 (పెంపు రూ. 10)
ఏసీ చైర్ కార్ 40 (పెంపు రూ. 15) 45 (పెంపు రూ. 15)
ఏసీ-3 ఎకానమీ 40 (పెంపు రూ. 15) 45 (పెంపు రూ. 15)
ఏసీ 3 టైర్ 40 (పెంపు రూ. 15) 45 (పెంపు రూ. 15)
ఫస్ట్ క్లాస్ 50 (పెంపు రూ. 25) 45 (పెంపు రూ. 15)
ఏసీ 2 టైర్ 50 (పెంపు రూ. 25) 45 (పెంపు రూ. 15)
ఏసీ ఫస్ట్ క్లాస్ 60 (పెంపు రూ. 25) 75 (పెంపు రూ. 25)
ఎగ్జిక్యూటివ్ క్లాస్ 60 (పెంపు రూ. 25) 75 (పెంపు రూ. 25)


రైల్వే బడ్జెట్ విశేషాలు
 1. జార్జ్ స్టీఫెన్‌సన్: బ్రిటన్‌కు చెందిన జార్జ్ స్టీఫెన్‌సన్(1781-1848) రైల్వే పితామహుడిగా ప్రసిద్ధి. ఎందుకంటే.. 1814లో ఎక్కువ వ్యాగన్లను లాగే సత్తా ఉన్న స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్‌ను తయారు చేసింది ఆయనే. అంతకుముందు రిచర్డ్ ట్రెవిథిక్ అనే ఆయన తొలి ట్రామ్‌వే లోకోమోటివ్‌ను రూపొందించినా.. అది రోడ్డుపై నడిచే లోకోమోటివ్. తర్వాత మరికొంత మంది స్టీమ్ లోకోమోటివ్‌లను తయారు చేసినా.. స్టీఫెన్‌సన్ శక్తిమంతమైన దాన్ని తయారుచేశారు. పైగా.. ప్రపంచంలోనే తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలును లాగింది జార్జ్ తయారుచేసిన ఇంజినే.
 2. సెప్టెంబర్ 27, 1825.. ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌లోని స్టాక్‌టన్ ఆన్‌టీస్ నుంచి డార్లింగ్టన్ మధ్య తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలు నడిచింది ఈ రోజునే. ఈ రెండు పట్టణాల మధ్య 12.9 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మించాలని స్టాక్‌టన్ అండ్ డార్లింగ్టన్ రైల్వే యోచిస్తున్న విషయం తెలిసిన వెంటనే.. అప్పటివరకూ కిల్లింగ్‌వర్త్ కాలరీలో పనిచేస్తున్న జార్జ్ స్టీఫెన్‌సన్.. ఈ కంపెనీ అధినేత ఎడ్వర్డ్‌ను కలిశాడు. వాస్తవానికి ఈ రైల్వే లైనులో వ్యాగన్లను గుర్రాలతో లాగించాలని ఎడ్వర్డ్ భావించాడు. అయితే, వాటికి బదులుగా స్టీమ్ లోకోమోటివ్ ఇంజన్‌ను ఉపయోగిస్తే.. అంతకు 50 రెట్లు బరువును అవి లాగగలవంటూ తన ప్రణాళికను వివరించాడు. దీంతో ఎడ్వర్డ్ ఈ రైల్వే లైను మొత్తం బాధ్యతను జార్జ్‌కు అప్పగించాడు. సెప్టెంబర్ 27న 450 మంది మనుషులు, కొన్ని వందల కిలోల సరుకుతో ఈ రైలు బయల్దేరింది. గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ సమయంలో రైలింజన్‌ను నడిపింది స్టీఫెన్‌సనే.
 3. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వేది నాలుగో స్థానం. అమెరికా, రష్యా, చైనాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి.
 4. 63,974 కిలోమీటర్ల మార్గం, 7,083 స్టేషన్లు కలిగి ఉన్న భారతీయ రైల్వేలో ప్రతిరోజూ దాదాపు 19 వేల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో 12 వేల రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తుండగా, 7 వేల రైళ్లు సరుకు రవాణా చేస్తున్నాయి.
 5. ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కలిగిన ఉన్న సంస్థల్లో భారతీయ రైల్వే ఏడో స్థానంలో ఉంది. దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు.
 6. భారత్‌లో తొలి రైలు 1851 డిసెంబర్ 22న పట్టాలెక్కింది. రూర్కీలో నిర్మాణ సామగ్రితో అది ప్రయాణించింది. ప్రయాణికుల రైలు మాత్రం 1853 ఏప్రిల్ 16న బోంబే నుంచి థానే మధ్య (34 కిలోమీటర్లు) నడిచింది. 14 బోగీల్లో 400 మంది ప్రయాణికులు, మూడు ఇంజన్లతో ముందుకెళ్లింది. ఈ 34 కిలోమీటర్ల ప్రయాణానికి గంటా 15 నిమిషాలు పట్టింది.
 7. దక్షిణ భారత దేశంలో తొలి రైలు 1856 జూలై 1న వేయ్‌సరాప్ది(మద్రాస్) నుంచి వల్లజా రోడ్(ఆర్కాట్) వరకు ప్రయాణించింది.
 8. 1873లో ఢిల్లీ నుంచి రేవారి మధ్య ప్రపంచంలోనే తొలి మీటర్‌గేజ్ సర్వీస్ ప్రారంభమైంది.
 9. తొలి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న బోంబే వీటీ, కుర్లా మధ్య నడిచింది.
 10. 1862లో మూడో తరగతిలో రెండు వరుసల(టూ టైర్) సీట్లు ప్రవేశపెట్టారు.
 11. 1871-74 మధ్య ప్రయాణికుల బోగీల్లో గ్యాస్ దీపాలు అమర్చారు.
 12. 1872లో ఒకటో తరగతి బోగీల్లో ఎయిర్ కూలింగ్ సౌకర్యం ప్రారంభించారు. 1936లో ఏసీ ప్రవేశపెట్టారు.
 13. 1874లో రైళ్లలో నాలుగో తరగతి కోచ్‌లు ప్రవేశపెట్టారు. వీటిలో సీట్లు లేవు.
 14. రైళ్లలో తొలిసారిగా 1891లో టాయిలెట్‌లు(ఒకటో తరగతిలో) ప్రవేశపెట్టారు. దిగువ తరగతుల్లో 1905లో వాటిని ఏర్పాటుచేశారు.
 15. ప్రయాణికుల బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు 1952 నుంచి తప్పనిసరి చేశారు.
 16. 1967లో స్లీపర్ క్లాస్ బోగీలు ప్రారంభించారు.
 17. 1974లో 3వ తరగతి బోగీలు తొలగించారు.
 18. 1986లో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థ ఢిల్లీలో ప్రారంభమైంది.
 19. చిన్న పేరున్న రైల్వేస్టేషన్: ఇబ్- ib (ఒడిశా)
 20. పెద్ద పేరున్న రైల్వేస్టేషన్: శ్రీ వెంకటనరసింహరాజువారి పేట (తమిళనాడు)
 21. అత్యధిక దూరం ప్రయాణించే రైలు: వివేక్ ఎక్స్‌ప్రెస్ (దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4,273 కిలోమీటర్లు).
 22. అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు: నాగపూర్ నుంచి అజ్ని (మూడు కిలోమీటర్లు)
 23. ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు: త్రివేండ్రమ్ రాజధాని (వడోదర-కోట మధ్య 528 కిలోమీటర్లు 6.5 గంటల్లో)
 24. ఎప్పుడూ ఆలస్యంగా నడిచే రైలు: త్రివేండ్రమ్ సెంట్రల్-గౌహతి ఎక్స్‌ప్రెస్. ప్రతిరోజూ ఇది 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తుంది.
 25. దేశం నలుమూలల చివరి రైల్వేస్టేషన్లు: ఉత్తరాన జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా. పశ్చిమాన గుజరాత్‌లోని భుజ్ సమీపంలో నలీయా. దక్షిణాన కన్యాకుమారి. తూర్పున తిన్సుకియా లైన్‌లోని లీడో.
Published on 3/13/2013 5:15:00 PM

Related Topics