రైల్వే బడ్జెట్ 2014 - 15 విశేషాలు


పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రెల్వేల్లో ఇక ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించనున్నారు. ఈ మేరకు మోడీ సర్కారు రైల్వేల్లో దేశీ కార్పోరేట్లతో పాటు విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరించింది. కానీ ఆపరేషన్ విభాగంలో మాత్రం ఎఫ్‌డీఐలు ఉండవని తేల్చి చెప్పింది. ఎన్‌డీఏ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.1,64,374 కోట్లతో రూపొందించిన తొలి బడ్జెట్‌లో.. ఊహించినట్లే ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచటానికి, రైల్వేల ఆధునీకరణకు ప్రాధాన్యమిచ్చారు. కానీ ఎటువంటి ప్రజాకర్షక ప్రకటనలు లేకుండా రైల్వే మంత్రి సదానంద గౌడ 2014-15 రైల్వే బడ్జెట్‌ను జులై 8న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ - మహారాష్ట్రలోని ముంబై మధ్య ఒక బుల్లెట్ రైలు, ప్రధాన మెట్రో నగరాలను కలుపుతూ హై స్పీడ్ వజ్ర చతుర్భుజి రైల్వే వ్యవస్థ, తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్ల వరకూ పెంచటం, దేశవ్యాప్తంగా 58 కొత్త రైళ్లు ప్రవేశపెట్టటం, మరో 11 రైళ్ల ప్రయాణదూరం పొడిగింపు వంటి కొన్ని మాత్రమే ఊరట కలింగించే అంశాలు.ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండుగా విడిపోయినా అనుకున్న ప్రాధాన్యత దక్కలేదు. చివరకు చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పక్కనబెట్టేశారు. ఈ నేపథ్యంలో రైల్వే బడ్జెట్‌పై సమగ్ర సమాచార విశ్లేషణ మీ కోసం..రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు
 1. 2014-15లో రూ.1,64,374 కోట్ల ఆదాయం అంచనా. ఖర్చును రూ.1,49,176 కోట్లకు కుదించారు.
 2. గతంలో ఎన్నడూ లేనంతగా రూ.65,455 కోట్ల ప్రణాళికా వ్యయం.
 3. మొత్తం 58 కొత్త రైళ్లు. వీటిలో ఐదు జన్ సందర్శన్, ఐదు ప్రీమియం, ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళు్ల ఉన్నారుు. 11 రైళ్ల ప్రయాణ దూరం పొడగించనున్నారు.
 4. ప్రయూణికుల చార్జీలను, సరుకు రవాణా చార్జీలను పెంచలేదు. (15 రోజుల క్రితమే పెంచారు.)
 5. ముంబై - అహ్మదాబాద్ కారిడార్‌లో బుల్లెట్ రైలు. హైస్పీడ్ రైళ్ల కోసం వజ్ర చతుర్భుజి. ఈ ప్రాజెక్టు కోసం రూ.9 వేల కోట్లు అవసరమైతే రూ.100 కోట్ల కేటారుుంచారు.
 6. తొమ్మిది సెక్టార్లలోని ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్ల స్పీడ్‌ను గంటకు 160 నుంచి 200 కిలోమీటర్లకు పెంచే యోచన.
 7. ఆన్‌లైన్‌లో ఫ్లాట్‌ఫామ్‌తో పాటు అన్ రిజర్వ్‌డ్ టికెట్లు. స్టేషన్ల వద్ద పార్కింగ్‌కు, ప్లాట్‌ఫామ్‌కు కలిపి కోంబో టికెట్లు
 8. అన్ని స్టేషన్లలో ప్రయూణికుల విశ్రాంతి గది సౌకర్యం. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రధాన స్టేషన్లలో బ్యాటరీతో నడిచే కార్లు.
 9. భద్రత పెంపు కోసం 17 వేల మంది ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల భర్తీ. మహిళల బోగీల్లో భద్రత కోసం 4 వేల మంది మహిళా కానిస్టేబుళ్ల నియూమకం. రైళ్లలోని ఆర్పీఎఫ్ బృందాలకు మొబైల్ ఫోన్లు.
 10. ప్రధాన రైళ్లు, సబర్బన్ బోగీలకు తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకునే వ్యవస్థ ఏర్పాటు. రైలు సమయంపై ప్రయూణికులను అప్రమత్తం చేసేందుకు ఎస్మెమ్మెస్.
 11. సాంకేతిక, సాంకేతికేతర సబ్జెక్టులకు రైల్ విశ్వవిద్యాలయం.
 12. విమానాశ్రయూన్ని తలపించేలా, అలాంటి అనుభూతిని కలిగించేలా అంతర్జాతీయ స్థారుుకి టాప్ 10 స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ.
 13. రైలు ప్రయూణికులకు మరింత మెరుగైన ఆహారం. ప్రముఖ కంపెనీలకు చెందిన వండి తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం (రెడీ టు ఈట్ మీల్) అందజేత. నాణ్యత లోపిస్తే సంబంధితులపై చర్యలు. ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్.
 14. ఇ-టికెటింగ్ విధానంలో నిమిషానికి 7,200 టికెట్ల జారీ. ఏకకాలంలో 1,20,000 మంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం. ప్రస్తుతం నిమిషానికి 2 వేల టికెట్లే జారీ.
 15. కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ఆఫీస్ ఆన్ వీల్స్, వై-ఫై, వర్క్ స్టేషన్ సదుపాయూలు.
 16. స్వామి వివేకానంద బోధనల కోసం ప్రత్యేక రైలు.
రైల్వే బడ్జెట్ సమగ్ర స్వరూపం (రూ.కోట్లలో..)
ప్రయాణికుల ఆదాయం 44645.00
గూడ్సు ద్వారా ఆదాయం 105770.00
స్థూల ట్రాఫిక్ వసూళ్లు 160165.00
మొత్తం రెవెన్యూ వసూళ్లు 164374.00
మొత్తం నిర్వహణ వ్యయం 47650.00
మొత్తం వ్యయం 158310.56ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లోనే
గత 30 ఏళ్లలో రూ.1,57,883 కోట్ల వ్యయం కాగల 676 కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే.. ఇప్పటికి 317 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయని మిగిలినవి పూర్తిచేయటానికి రూ.1,82,000 కోట్లు అవసరమవుతాయని రైల్వే మంత్రి చెప్పారు. అలాగే గత పదేళ్లలో రూ. 60,000 కోట్ల విలువైన 99 కొత్త రైల్వే లైన్లకు అనుమతులివ్వగా.. అందులో ఇప్పటివరకూ పూర్తయింది ఒక్కటే.

రికార్డు స్థాయి రైల్వే ప్రణాళిక...
2014-15లో రూ.1,64,374 కోట్ల రాబడిని అంచనా వేశారు. దీన్లో సరుకు రవాణా ఆదాయం రూ.1,05,770 కోట్లు, ప్రయాణ చార్జీల ఆదాయం రూ. 44,645 కోట్లు. దీన్లో రూ.1,49,176 కోట్లు అంచనా వ్యయం కాగా.. సాధారణ నిర్వహణ వ్యయం 1,12,649 కోట్లు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రూ. 15,078 కోట్లు ఎక్కువ.

ఈ ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ. 65,445 కోట్ల ప్రణాళికా వ్యయాన్ని ప్రకటించారు. ఇందులో రూ. 30,000 కోట్లకు పైగా బడ్జెటరీ మద్దతుగా కేంద్రం అందిస్తుంది. మార్కెట్ అప్పుల ద్వారా రూ. 11,790 కోట్లు, అంతర్గత వనరులు రూ. 15,350 కోట్లు, పీపీపీల ద్వారా 6,005 కోట్లు సమీకరిస్తారు. బడ్జెట్‌లో పెన్షన్ చెల్లింపుల కోసం రూ. 28,850 కోట్లు, డివిడెండ్ చెల్లింపుల కోసం రూ. 9,135 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఒక్క బుల్లెట్ రైలు రూ. 60,000 కోట్లు
ఒక్క బుల్లెట్ రైలును ప్రవేశపెట్టటానికి రూ. 60,000 కోట్లు ఖర్చవుతుంది. అంతేకాక అన్ని మెట్రోలు, ప్రధాన నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్(వజ్ర చతుర్భుజి నెట్‌వర్క్)ను నిర్మించాలనే బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిని పూర్తి చేయడానికి రూ.9 లక్షల కోట్లకన్నా ఎక్కువ నిధులు అవసరం.

రైల్వేల్లోకి విదేశీ పెట్టుబడులు...
రైల్వేల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడానికి, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగు పర్చేందుకు రెల్వేల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించనున్నారు. దేశీయంగా కార్పోరేట్లకు కూడా పెట్టుబడుల పెట్టడానికి అనుమతి లభించనుంది.

ప్రయాణికుల భద్రత, సేవలకు ప్రాధాన్యం
ప్రధాన రైల్వేస్టేషన్లలో ఫుట్-ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటు; వికలాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీలతో నడిచే చక్రాల కుర్చీలు; రైళ్లలో వై-ఫై, కంప్యూటర్లతో వర్క్ స్టేషన్ల ఏర్పాటు, రైళ్లలో పరిశుభ్రమైన ఆహారం సరఫరా, రైల్వేస్టేషన్లలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు, ఈ-టికెట్ బుకింగ్ సౌకర్యాల విస్తరణ వంటి చర్యలను ప్రకటించారు. ట్రాక్‌ల పునరుద్ధరణ, కాపలా లేని లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం రూ. 40,000 కోట్లు అవసరం కాగా ప్రస్తుతం 1,785 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల భద్రత కోసం ఆటోమేటిక్‌గా తలుపులు మూసుకునే బోగీలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు.

4,000 మహిళా ఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లను నియామకం
రైళ్లలో మహిళలకు భద్రత కల్పించడానికి కొత్తగా 4,000 మంది మహిళా ఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించనున్నారు. అలాగే 17 వేల మంది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రైళ్లలోని ఆర్పీఎఫ్ బృందాలకు మొబైల్ ఫోన్లు ఇవ్వనున్నారు.

ఆఫీస్ ఆన్ వీల్స్, వై ఫై సౌకర్యాలు..
వైఫై సౌకర్యంతో కూడిన రైల్వే స్టేషన్‌లు, రెస్ట్ రూమ్‌లు, రైళ్లు త్వరలోనే రానున్నాయి. అంతేకాక ప్రయాణిచాల్సిన రైలు, దిగాల్సిన స్టేషన్ వంటి సమాచారం ఎప్పటికప్పుడు మొబైల్‌కు వస్తుంది. రైళ్లలో ప్రయాణించే వాణిజ్యవేత్తల సౌకర్యార్థం ‘ఆఫీస్ ఆన్ వీల్స్’ పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన కొన్ని రైళ్లలో ఏర్పాటు చేసే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే వారు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

58 కొత్త రైళ్లొస్తున్నాయ్!
ఎన్డీఏ ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్‌లో 58 కొత్త రైళ్లను ప్రతిపాదించింది. వీటిలో ఐదు జణ్ సాధారణ రైళ్లతోపాటు మరో ఐదు ప్రీమియం రైళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్ రైళ్లు, రెండు మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(మెమూ) సర్వీసులు, 5 డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) సర్వీసులు ఉన్నాయి.

రైల్వే వర్సిటీ ఏర్పాటుపై పరిశీలన
రైల్వేలకు సంబంధించిన అంశాల అధ్యయనం లక్ష్యంగా రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సాంకేతికేతర అంశాల అధ్యయనంకోసం ఈ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. సిబ్బందిలో నైపుణ్యాల మెరుగుదలకోసం ప్రణాళికలు రూపొందించినట్టు బడ్జెట్ సమర్పణ సందర్బంగా రైల్వే మంత్రి చెప్పారు.

పాసింజర్ టికెట్ వ్యవస్థలో సమూల మార్పులు
టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను నెక్ట్స్ జనరేషన్ ఈ-టికెటింగ్ వ్యవస్థగా రూపుదిద్దనున్నారు. ప్రస్తుతం నిమిషానికి 2,000 టికెట్లు ఇస్తున్నారు. దీనిని నిమిషానికి 7,200 టికెట్ల సామర్థ్యానికి పెంచనున్నారు. ఒకేసారి 1.20 లక్షల యూజర్లు ఈ-టికెటింగ్‌ను ఉపయోగించుకొనేలా అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా.. మొబైల్ ఫోన్లు, పోస్టాఫీసుల ద్వారా టికెట్లు ఇచ్చే విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేనున్నారు. ఇప్పటివరకు స్టేషన్లలోనే లభించే ప్లాట్‌ఫాం, అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను ఇక మీదట ఇంటర్నెట్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు.

మారనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు!
అందరికీ సుపరిచితమైన... సికింద్రాబాద్- ఢిల్లీ మధ్య నడిచే ‘ఏపీ ఎక్స్‌ప్రెస్’ పేరు మారనుంది. రైల్వే బడ్జెట్‌లో విజయవాడ- ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టనున్న రైలును ‘ఏపీ ఎక్స్‌ప్రెస్’గా పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన రైళ్లు:
 1. సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
 2. కాజీపేట్ - ముంబై ఎక్స్‌ప్రెస్ వయా బలార్షా (వీక్లీ)
 3. విజయవాడ- న్యూఢిల్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ (డైలీ)
 4. విశాఖ-చెన్నై ఎక్స్‌ప్రెస్ (వీక్లీ),
 5. పారాదీప్ - విశాఖ (వీక్లీ)
తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్లు
 1. జైపూర్-మధురై ప్రీమియం ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
 2. అహ్మదాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ వయా వసాయ్ రోడ్డు (బైవీక్లీ)
వేగం పెంచిన రైళ్లు:
చెన్నై - హైదరాబాద్, నాగ్‌పూర్ - సికింద్రాబాద్దక్షిణమధ్య రైల్వే పరిధిలో పనులకు (తెలంగాణ, ఏపీలకు కలిపి) కేటాయింపులు
 1. లెవల్ క్రాసింగుల వద్ద భద్రతా చర్యలు రూ. 63 కోట్లు
 2. ఆర్‌ఓబీ/ఆర్‌యూబీ పనులకు రూ. 147 కోట్లు
 3. ట్రాక్ రెన్యూవల్ రూ. 381 కోట్లు
 4. బ్రిడ్జి పనులకు రూ. 16 కోట్లు
 5. సిగ్నల్, టెలికాం రూ. 73 కోట్లు
 6. వర్క్‌షాప్స్ రూ.73 కోట్లు
 7. స్టాఫ్ క్వార్టర్ మరమ్మతులకు రూ. 47 కోట్లు
 8. ప్రయాణికుల వసతుల కల్పనకు రూ. 92 కోట్లు
భారతీయ రైల్వేలు - విశేషాలు
జార్జ్ స్టీఫెన్‌సన్: బ్రిటన్‌కు చెందిన జార్జ్ స్టీఫెన్‌సన్(1781-1848) రైల్వే పితామహుడిగా ప్రసిద్ధి. ఎందుకంటే.. 1814లో ఎక్కువ వ్యాగన్లను లాగే సత్తా ఉన్న స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్‌ను తయారు చేసింది ఆయనే. అంతకుముందు రిచర్డ్ ట్రెవిథిక్ అనే ఆయన తొలి ట్రామ్‌వే లోకోమోటివ్‌ను రూపొందించినా.. అది రోడ్డుపై నడిచే లోకోమోటివ్. తర్వాత మరికొంత మంది స్టీమ్ లోకోమోటివ్‌లను తయారుచేసినా.. స్టీఫెన్‌సన్ శక్తిమంతమైనదాన్ని తయారుచేశారు. పైగా.. ప్రపంచంలోనే తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలును లాగింది జార్జ్ తయారుచేసిన ఇంజినే.

సెప్టెంబర్ 27, 1825.. ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌లోని స్టాక్‌టన్ ఆన్‌టీస్ నుంచి డార్లింగ్టన్ మధ్య తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలు నడిచింది ఈ రోజునే. ఈ రెండు పట్టణాల మధ్య 12.9 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మించాలని స్టాక్‌టన్ అండ్ డార్లింగ్టన్ రైల్వే యోచిస్తున్న విషయం తెలిసిన వెంటనే.. అప్పటివరకూ కిల్లింగ్‌వర్త్ కాలరీలో పనిచేస్తున్న జార్జ్ స్టీఫెన్‌సన్.. ఈ కంపెనీ అధినేత ఎడ్వర్డ్‌ను కలిశాడు. వాస్తవానికి ఈ రైల్వే లైనులో వ్యాగన్లను గుర్రాలతో లాగించాలని ఎడ్వర్డ్ భావించాడు. అయితే, వాటికి బదులుగా స్టీమ్ లోకోమోటివ్ ఇంజన్‌ను ఉపయోగిస్తే.. అంతకు 50 రెట్లు బరువును అవి లాగగలవంటూ తన ప్రణాళికను వివరించాడు. దీంతో ఎడ్వర్డ్ ఈ రైల్వే లైను మొత్తం బాధ్యతను జార్జ్‌కు అప్పగించాడు. సెప్టెంబర్ 27న 450 మంది మనుషులు, కొన్ని వందల కిలోల సరుకుతో ఈ రైలు బయల్దేరింది. గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ సమయంలో రైలింజన్‌ను నడిపింది స్టీఫెన్‌సనే.
 1. పత్యేకంగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతి 1924లో మొదలైంది.
 2. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నె ట్‌వర్క్‌లలో భారతీయ రైల్వేది నాలుగో స్థానం. అమెరికా, రష్యా, చైనాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి.
 3. 65 వేల కిలోమీటర్ల మార్గం, 7,083 స్టేషన్లు కలిగి ఉన్న భారతీయ రైల్వేలో ప్రతిరోజూ దాదాపు 19 వేల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో 12 వేల ైరైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తుండగా, 7 వేల రైళ్లు సరుకు రవాణా చేస్తున్నాయి.
 4. ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కలిగిన ఉన్న సంస్థల్లో భారతీయ రైల్వే ఏడో స్థానంలో ఉంది. దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు.
 5. భారత్‌లో తొలి రైలు 1851 డిసెంబర్ 22న పట్టాలెక్కింది. రూర్కీలో నిర్మాణ సామగ్రితో అది ప్రయాణించింది. ప్రయాణికుల రైలు మాత్రం 1853 ఏప్రిల్ 16న బోంబే నుంచి థానే మధ్య (34 కిలోమీటర్లు) నడిచింది. 14 బోగీల్లో 400 మంది ప్రయాణికులు, మూడు ఇంజన్లతో ముందుకెళ్లింది. ఈ 34 కిలోమీటర్ల ప్రయాణానికి 75 నిమిషాలు పట్టింది.
 6. దక్షిణ భారత దేశంలో తొలి రైలు 1856 జూలై 1న వేయ్‌సరాప్ది(మద్రాస్) నుంచి వల్లజా రోడ్(ఆర్కాట్) వరకు ప్రయాణించింది.
 7. 1873లో ఢిల్లీ నుంచి రేవారి మధ్య ప్రపంచంలోనే తొలి మీటర్‌గేజ్ సర్వీస్ ప్రారంభమైంది.
 8. తొలి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న బోంబే వీటీ, కుర్లా మధ్య నడిచింది.
 9. 1862లో మూడో తరగతిలో రెండు వరుసల(టూ టైర్) సీట్లు ప్రవేశపెట్టారు.
 10. 1871-74 మధ్య ప్రయాణికుల బోగీల్లో గ్యాస్ దీపాలు అమర్చారు.
 11. 1872లో ఒకటో తరగతి బోగీల్లో ఎయిర్ కూలింగ్ సౌకర్యం ప్రారంభించారు. 1936లో ఏసీ ప్రవేశపెట్టారు.
 12. 1874లో రైళ్లలో నాలుగో తరగతి కోచ్‌లు ప్రవేశపెట్టారు. వీటిలో సీట్లు లేవు.
 13. రైళ్లలో తొలిసారిగా 1891లో టాయిలెట్‌లు(ఒకటో తరగతిలో) ప్రవేశపెట్టారు. దిగువ తరగతుల్లో 1905లో వాటిని ఏర్పాటుచేశారు.
 14. ప్రయాణికుల బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు 1952 నుంచి తప్పనిసరి చేశారు.
 15. 1967లో స్లీపర్ క్లాస్ బోగీలు ప్రారంభించారు.
 16. 1974లో 3వ తరగతి బోగీలు తొలగించారు.
 17. 1986లో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థ ఢిల్లీలో ప్రారంభమైంది.
 18. చిన్న పేరున్న రైల్వేస్టేషన్: ఇబ్-ib (ఒడిశా)
 19. పెద్ద పేరున్న రైల్వేస్టేషన్: శ్రీ వెంకటనరసింహరాజువారి పేట (తమిళనాడు)
 20. అత్యధిక దూరం ప్రయాణించే రైలు: వివేక్ ఎక్స్‌ప్రెస్ (దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4,273 కిలోమీటర్లు).
 21. అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు: నాగపూర్ నుంచి అజ్ని (మూడు కిలోమీటర్లు)
 22. అత్యధిక దూరం ప్రయాణించే రెండో రైలు: (జమ్మూతావి నుంచి కన్యాకుమారి వరకు 3,715 కి.మీ)
 23. ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు: కేరళ ఎక్స్‌ప్రెస్ (3,054 కి.మీ). ఇది త్రివేండ్రమ్ రాజధాని (వడోదర-కోట మధ్య 528 కిలోమీటర్లు 6.5 గంటల్లో)
 24. ఎప్పుడూ ఆలస్యంగా నడిచే రైలు: త్రివేండ్రమ్ సెంట్రల్-గౌహతి ఎక్స్‌ప్రెస్. ప్రతిరోజూ ఇది 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తుంది.
 25. దేశం నలుమూలల చివరి రైల్వేస్టేషన్లు: ఉత్తరాన జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా. పశ్చిమాన గుజరాత్‌లోని భుజ్ సమీపంలో నలీయా. దక్షిణాన కన్యాకుమారి. తూర్పున తిన్సుకియా లైన్‌లోని లీడో.
 26. పపంచంలో తొలిసారి రైలు చక్రాల కింద పడి మరణించిన వ్యక్తి విలియం హస్కిసన్, బ్రిటన్ ఎంపీ. 1830 సెప్టెంబరు 15న బ్రిటన్‌లోని లివర్‌పూల్, మాంచెస్టర్ రైల్వేలైన్‌ను ప్రారంభించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మరణించారు.


Published on 7/11/2014 5:50:00 PM

Related Topics