తెలంగాణ తొలి బడ్జెట్.. రూ. 1,00,637.96 కోట్లు


Education News

నీటిపారుదల, చెరువులు, తాగునీటికే అధిక ప్రాధ్యాన్యమిస్తూ రాష్ర్ట తొలి బడ్జెట్‌ను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారీగా కేటాయింపులు, అంతకుమించిన అంచనాలతో బడ్జెట్ పరిమాణం రూ. లక్ష కోట్లు దాటింది. ఎన్నికల హామీలకు చోటు కల్పించడంతో పాటు సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తూ నిధుల వరద పారించింది. నవంబర్ 5న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ భారీ అంచనాలతో రూ. 1,00,637.96 కోట్ల బడ్జెట్‌ను శాసనసభ ముందుంచారు. ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల కాలానికి మాత్రమే దీన్ని ప్రతిపాదించారు. మిగిలిన నాలుగు మాసాల స్వల్ప కాలంలో సర్కారు ఎంత వ్యయం చేస్తుందన్న అంశాన్ని పక్కనపెడితే సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయంతో పాటు వాటర్‌గ్రిడ్ వంటి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. బడ్జెట్ రూపకల్పనలో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు ప్రతిబింబించేలా ఆర్థిక మంత్రి ప్రయత్నించారు. ప్రణాళిక పద్దు కింద రూ. 48,648 కోట్లు, ప్రణాళికేతర పద్దు కింద రూ. 51,989 కోట్లను కేటాయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెడింటి మధ్య అంతరాన్ని బాగా తగ్గించడం చెప్పుకోదగ్గ విషయం. 17,398 కోట్ల మేర ద్రవ్యలోటును చూపినప్పటికీ.. 301 కోట్ల రెవెన్యూ మిగులును ప్రతిపాదించడం విశేషం. కానీ నికర మిగులు మాత్రం రూ. 5.5 కోట్లుగా ఉంది. అయితే బడ్జెట్‌లో చూపిన ఆదాయం అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఎక్కువగా కేంద్ర సాయం, రుణాల సమీకరణ, పన్నుల వాటా వంటి వనరులపైనే ప్రభుత్వం ఆధారపడింది. కాగా, రైతుల ఆత్మహత్యలకు తక్షణ ఉపశమనంపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోయినా.. వ్యవసాయంతోపాటు విద్యుత్, నీటిపారుదల రంగాలకు అధిక కేటాయింపులు చేసింది. వీటికి ప్రణాళిక పద్దులో భారీగా నిధులు ఇచ్చింది.

Published on 11/6/2014 4:32:00 PM

Related Topics