గ్రూప్-1 ప్రిలిమ్స్ విజయానికి మార్గాలు...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 26న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను నిర్వహించనుంది. అంటే.. పరీక్షకు కొద్ది రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంది.
Bavitha అభ్యర్థులు కొన్ని నెలలుగా ఎంతో కష్టపడి ప్రిపరేషన్ సాగిస్తున్నారు. ఇప్పుడు పరీక్షకు కొద్దిరోజుల ముందు మరింత ఫోకస్డ్‌గా చదవడం ద్వారా తీవ్ర పోటీ ఉండే ప్రిలిమ్స్‌లో గట్టెక్కొచ్చు. అలాకాకుండా ఏమాత్రం ఒత్తిడికి లోనయినా.. ఆత్మవిశ్వాసం సన్నగిల్లినా.. దాని ప్రభావం పరీక్ష రోజు ప్రదర్శనపై పడుతుంది. అంతిమంగా ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు ప్రిపరేషన్ చివరి దశలో అనుసరించాల్సిన వ్యూహంపై సలహాలు, సూచనలు..

ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు:
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ప్రతి పేపర్ 120 ప్రశ్నలు-120 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం 120 నిమిషాలు. పేపర్1లో చరిత్ర-సంస్కృతి, రాజ్యాంగం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ అంశాలు, భారత, అంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ- ప్రణాళికలు, భౌగోళిక శాస్త్రం తదితర అంశాలు ఉంటాయి. అలాగే పేపర్ 2లో.. జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ప్రశ్నలు ఉంటాయి.

పేపర్ 1.. రివిజన్‌పై దృష్టి :
 • అభ్యర్థులు రివిజన్‌లో ప్రధానంగా ‘సంస్కృతి’కి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఏపీపీఎస్సీ గ్రూప్1 పరీక్ష విధానాన్ని సివిల్స్ తరహాలో మార్చిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీలో సంస్కృతిపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ట్రెండు ఏపీపీఎస్సీలోనూ కొనసాగే అవకాశం ఉంది.
 • చరిత్ర-సంస్కృతి అంశాలకు సంబంధించి కంపారిటివ్(పోల్చి) స్టడీ విధానాన్ని అనుసరించాలి. సింధు-వేద నాగరికతలు, బౌద్ధ-జైన మతాలు, భక్తి-సూఫీ ఉద్యమం తదితరాలపై ప్రశ్నలకు సన్నద్ధం కావాలి.
 • దేవాలయ శిల్పకళపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అజంతా, ఎల్లోరా తదితర శిల్పాలు, వాటి మధ్య ఉన్న పోలికలు, యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ప్రిపేర్ కావాలి.
 • ప్రాచీన భాషలు-గుర్తింపు, బౌద్ధ-జైన మత గ్రంథాలు, ఆయా కాలాల్లో ప్రముఖ గ్రంథాలు-రచయితల గురించి అవగాహన పెంచుకోవాలి.
 • 1857 తిరుగుబాటు, గవర్నర్ జనరల్స్, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, వల్లభాయ్‌పటేల్ తదితరులపై ప్రశ్నలు వచ్చే వీలుంది.
 • రాజ్యాంగ రూపకల్పన, కీలక ఘట్టాలు, పాలుపంచుకున్న వ్యక్తులు, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల మూలం(సోర్సు), గవర్నెన్స్ మొదలైన టాపిక్స్‌ను క్షుణ్నంగా పునశ్చరణ చేయాలి.
 • అంతర్జాతీయ సంబంధాల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. ద్వైపాక్షి ఒప్పందాలు, భారత్‌పై ప్రభావం చూపే అంతర్జాతీయ పరిణామాలు, అంతర్జాతీయ సదస్సులపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు ఇతర దేశాలతో భారత్ కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, భారత్‌ను రాజకీయంగా, ఆర్థికంగా ప్రభావితం చేసే తాజా అంతర్జాతీయ పరిణామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
 • భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు; దేశ, రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక స్థితిగతుల నుంచి ప్రశ్నలు వస్తాయి. దీంతోపాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం; దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, ఈ-గవర్నెన్స్ వంటివి ముఖ్యాంశాలుగా గుర్తించాలి.

పేపర్ 2... ప్రాక్టీస్‌కు పెద్దపీట :
ఇందులో జనరల్ ఎబిలిటీ నుంచి నంబర్ బేస్డ్, లెటర్ బేస్డ్, జనరల్ ప్రశ్నలు అడుగుతారు. పని-దూరం, పని-కాలం, శాతాలు, సరాసరి, వైశాల్యం, చుట్టుకొలత, సంఖ్యామానంపై సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
 • అభ్యర్థులు 1 నుంచి 60 వరకు స్క్వేర్‌లు, 1 నుంచి 20 వరకు క్యూబ్‌లను నేర్చుకోవాలి. తద్వారా నంబర్ బేస్డ్ ప్రశ్నలను సులభంగా సాధించేందుకు వీలవుతుంది. అలాగే ఎ నుంచి జెడ్ వరకు, జెడ్ నుంచి ఎ వరకు ఇంగ్లిష్ అక్షరాలను అనర్గళంగా చదవడం, వాటి స్థాన విలువలను గుర్తుపెట్టుకోవడం ద్వారా లెటర్ బేస్డ్ ప్రశ్నలను సాధించొచ్చు. ఈ నైపుణ్యాలు కోడింగ్, డీకోడింగ్ ప్రశ్నల సాధనకు ఉపయోగపడతాయి. బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ నుంచి జనరల్ ప్రశ్నలు వస్తాయి.
 • సైకలాజికల్ ఎబిలిటీస్‌లో భావోద్వేగ ప్రజ్ఞ-కోణాలు, సహానుభూతి, సామాజిక ప్రజ్ఞ, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాలు కీలకంగా నిలుస్తాయి.
 • సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్, డిఫెన్స్ టెక్నాలజీ, దైనందిన జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, భారత శక్తి వనరులు, సౌర, పవన విద్యుత్‌లు-ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు కీలకంగా ఉంటాయి.
 • ఎన్విరాన్‌మెంటల్ సైన్సులో హరిత గృహ ప్రభావం, వాతావరణ మార్పులు-ప్రభావం, విపత్తు నిర్వహణ, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, వన్యమృగ సంరక్షణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి.

ఒత్తిడితో చిత్తు కావొద్దు..
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలామంది పరీక్ష తేదీ దగ్గరయ్యే కొద్దీ ఒత్తిడికి లోనవుతుంటారు. పరీక్ష రోజు అనవసర ఆందోళనకు గురై పరీక్ష సరిగా రాయలేక ఫలితాల్లో వెనకబడుతుంటారు. అభ్యర్థులు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరికీ అందుబాటులో ఉన్నది అదే సమయం, అదే సిలబస్, అవే ఉద్వేగాలు. కొందరు మాత్రమే వాటన్నింటినీ తమ నియంత్రణలోకి తెచ్చుకుంటారు. అలాంటి వాళ్లే విజేతలుగా నిలుస్తారు. భావోద్వేగాలను నియంత్రించుకొని ప్రశాంతంగా ఉండగలిగే వారే ఏ పరీక్షలోనైనా విజయం సాధిస్తారు. కొంతమంది పరీక్షకు బాగా సన్నద్ధమైనా.. చివరి దశలో ఒత్తిడికి లోనై విజయావకాశాలను పోగొట్టుకుంటారు. కాబట్టి అభ్యర్థులు పరీక్షకు ముందు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండాలి.

ఆ పని చేయొద్దు :
పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు చేసే మరో తప్పు... చివరి వరకు చదువుతూనే ఉండటం. ఈ దశలో విద్యార్థులు కొత్త అంశాల జోలికి అస్సలు పోకూడదు. రివిజన్ సమయంలో కొత్త టాపిక్స్ చదవడం వల్ల అనవసర గందరగోళం తలెత్తుతుంది. అంతేకాకుండా అనేక సందేహాలు తలెత్తి విలువైన సమయం వృథా అవుతుంది. కాబట్టి అందుబాటులో ఉన్న ఈ కొద్ది సమయాన్ని గతంలో చదివిన అంశాల రివిజన్‌కే కేటాయించాలి.

మాక్‌టెస్టులు :
చివరి రోజుల్లో మాక్‌టెస్టులకు హాజరవడం వల్ల పరీక్ష సన్నద్ధతపై అవగాహన వస్తుంది. ఇది పరీక్ష రోజు అభ్యర్థిని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి అభ్యర్థులు సాధ్యమైనన్ని మాక్‌టెస్టులకు హాజరవడం మేలు. మాక్‌టెస్టుల్లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించనట్లయితే ఆయా అంశాలను మరోసారి రివిజన్ చేయాలి. యూపీఎ స్సీ, ఏపీపీఎస్సీ గత ప్రశ్నపత్రాల సాధన ఉపయోగపడుతుంది.

ఆహారం, ఆరోగ్యం :
పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. తినే ఆహారం మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అభ్యర్థులు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. దీంతోపాటు శరీరానికి కావాల్సినంత విశ్రాంతిని ఇవ్వాలి. అర్ధరాత్రి వరకు మేలుకొని చదవడం వల్ల ఉపయోగం ఉండదు. త్వరగా నిద్రపోయి వేకువజామునే లేచి చదవడం లాభిస్తుంది. దీంతోపాటు జాగింగ్, యోగా, వ్యాయామం చేయాలి. ఇవి శరీరాన్ని, మనసును తేలికపరచి.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి.

ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు..
‘ఆత్మవిశ్వాసమే సగం బలం’ అనే విషయాన్ని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. పరీక్ష గదిలో ప్రవేశించి.. పేపర్‌ను చూసిన తర్వాత కూడా చిరునవ్వు చెదరకూడదు. ఒకవేళ మొదట్లో కొన్ని తెలియని ప్రశ్నలు ఎదురైనా.. ఒత్తిడికి లోనవకుండా ముందుకెళ్లాలి. పరీక్షకు తక్కువ సమయం అందుబాటులో ఉంది కాబట్టి రివిజన్, స్వీయ టెస్టింగ్‌ను సమాంతరంగా కొనసాగించాలి. బేసిక్స్‌పై పట్టుసాధించి ముందుకెళ్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆల్ ది బెస్ట్!
- ఎ.నిశాంత్‌రెడ్డి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టాపర్.
Tags:
APPSC Group-1 Prelims Exam APPSC Group-1 Prelims Exampreparation tips APPSC Group-1 Prelims Exampreparation APPSC APPSC Group-1 Prelims Exam syllabus APPSC Group-1 Prelims Examcandidates
Published on 5/17/2019 5:55:00 PM

Related Topics