Sakshi education logo

తెలంగాణ - ప్రత్యేకతలు

Join our Community

facebook Twitter Youtube
తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో గోండ్వానా శిలలపై దక్కన్ పీఠభూమిలో ఉంది. అనాదిగా ఇది వైవిధ్యమైన సంస్కృతి, కళలకు ప్రసిద్ధి చెందింది.
కళలు
హస్తకళలు: భారతీయ హస్తకళల్లో తెలంగాణ చేతి వృత్తులకు విశిష్టస్థానం ఉంది. వస్త్ర పరిశ్రమ, లోహ, గృహోపకరణాలు, విలాస వస్తువులు, ఆటబొమ్మలు, శిల్పం, చిత్రలేఖనం లాంటివాటిలో విభిన్న హస్తకళా స్వరూపాలు ఉన్నాయి.
చేనేత వస్త్రాలు: నల్గొండ జిల్లాలోని ‘పోచంపల్లి’ ప్రత్యేక డిజైన్‌తో చేసిన నేత వస్త్రాలకు ప్రసిద్ధి. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. నారాయణపేట, గద్వాల, కొత్తకోట మొదలైన ప్రాంతాల్లో ప్రపంచ ప్రఖ్యాత చేనేత పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు. వరంగల్ రగ్గులు, కంబళ్ల తయారీకి ప్రసిద్ధి చెందింది.
అద్దకం పరిశ్రమ: మెదక్ అద్దకం వస్త్రాలకు దేశంతో పాటు అంతర్జాతీయంగానూ మంచి గిరాకీ ఉంది. ఒక ప్రత్యేక కళగా ఇది అభివృద్ధి చెందింది. ఒకే చిత్రంలో అనేక రంగులు అద్దడమే దీని ప్రత్యేకత.
బొమ్మలు - ఆట వస్తువులు: ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో రూపొందించే బొమ్మలు రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందాయి. నిర్మల్ బొమ్మల తయారీలో బూరుగు, పొనుకు కర్ర ఉపయోగిస్తారు. వీటితో అందమైన లాంతరు స్తంభాలు, ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. ఏటికొప్పాకలో పన్నీరు బుడ్లు, చదరంగపు బల్లలు, పిల్లలకు పనికి వచ్చే లక్కపిడతలు మొదలైనవాటిని విభిన్న ఆకృతుల్లో తయారు చేస్తున్నారు. వీటికి అంకుడు, గిరిమల్లి కర్రలను వినియోగిస్తారు.
లేసు అల్లికల పరిశ్రమ: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం లేసు అల్లికల పరిశ్రమకు ప్రసిద్ధి. క్రైస్తవ మిషనరీల ద్వారా మనదేశంలోకి ఈ కళ వ్యాపించింది. సూది, నూలు దారం దీని సాధనం. పరికిణీల అంచులకు, కిటికీ తెరలకు, టేబుల్ వస్త్రాలకు ఉపయోగిస్తారు. ఇవి విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.
కంచు - ఇత్తడి - రాగి వస్తువులు: తెలంగాణలో పానగల్, పెంబర్తి, కురనపల్లి, పరకాల, సిద్ధిపేట లాంటి ప్రాంతాలు లోహాలతో రూపొందించే వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందాయి. ఇత్తడి, కంచు ఉత్పత్తుల తయారీలో ఇక్కడి కళాకారులు సిద్ధహస్తులు.
పూసల పరిశ్రమ: స్త్రీల నల్లపూసలు, పశువుల మెడలో అలంకరణగా ఉపయోగించే పెద్ద పూసల తయారీకి పాపానాయుడుపేట ప్రసిద్ధి చెందింది. ఫిరోజ్‌బాద్ నుంచి దిగుమతి చేసుకునే ప్రత్యేకమైన గాజు రాయిని కరిగించి ఈ పూసలను చేతితోనే తయారు చేస్తారు.
వెండి నగిషీ పనులు: కరీంనగర్ జిల్లాలో వెండి నగిషీ పని నాణ్యమైంది. ఇది అతి ప్రాచీనమైన చేతిపని. అతి సన్నని వెండి తీగల అల్లికలతో డిజైన్లు తయారు చేస్తారు. యాష్‌ట్రేలు (గాజుతో), తమలపాకుల పెట్టెలు, చేతిబొత్తాలు, భరిణెలు, పతకాలు, గుండీలు, ఫొటోఫ్రేమ్‌లు మొదలైన అనేక రకాల వస్తువులను తయారు చేస్తారు.
బీదర్ వస్తువులు (బిద్రీ): మిశ్రమ ధాతువులను కలిపి రూపొందించే ప్రత్యేకమైన బిద్రీ వస్తువులు అందంగా ఉంటాయి. ఇది పారశీక దేశానికి సంబంధించిన కళ. దక్కన్‌లో బహమనీ సుల్తాన్ల కాలంలో బిద్రీకళ బాగా ప్రాచుర్యం పొందింది. బీదర్ నుంచి హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. తుత్తునాగం, రాగి తదితర ధాతువులను కలిపి మిశ్రమ లోహంతో నీటికూజాలు, హుక్కాలు, పరిమళ వస్తువుల పెట్టెలు, భరిణలు, పూలసజ్జలు రూపొందిస్తారు. ఈ మిశ్రమ లోహం తుప్పు పట్టదు.
తెలంగాణ సంస్కృతి
బతుకమ్మ:
ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇది 9 రోజుల పండుగ. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కుంకుమబొట్టు పెట్టి పూలతో అలంకరిస్తారు. వాటిని తలమీద పెట్టుకొని చెరువు గట్టున ఖాళీ ప్రదేశంలో ఉంచుతారు. వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడతారు. చివరిరోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. పాట చివరన ‘ఉయ్యాలో’, ‘వలలో’, ‘చందమామ’ లాంటి పదాలను ఉపయోగిస్తారు.
బోనాలు: తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే మరో పండుగ ‘బోనాలు’. బోనం అంటే భోజనం. వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి ప్రజలను, పశువులను, పంటను కాపాడాలని అమ్మవారికి మొక్కి నైవేద్యం సమర్పించే పండుగ ఇది. గోల్కొండ దుర్గమ్మ, పోచమ్మలతో పాటు గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు. పరమాన్నం, పప్పన్నంతోపాటు రకరకాల పిండి వంటలు చేస్తారు. ఫలాలు, పూలతో బండ్లను అలంకరించి వాటిని గుడి వద్దకు తీసుకు వస్తారు. ఈ పండగలో పోతరాజు వేషధారణ ప్రత్యేకమైంది. బోనాల పండుగలో రెండో రోజు ‘రంగం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళ ‘భవిష్యవాణి’ వినిపిస్తుంది. అంటే రాబోయే కాలంలో ప్రజలు, ఎదుర్కొనే కష్టసుఖాల గురించి తెలుపుతుంది.
జానపద కళలు
జంగాలు:
తెలుగు గేయ సాహిత్యంలో పద్యాలను, కీర్తనలను యక్షగాన పద్ధతిలో గానం చేసిన ‘వీరజంగం కథలు’ ప్రసిద్ధి చెందాయి. ప్రాచీన కాలం నుంచి జానపద సాహిత్యం జంగాల వల్ల ఊపిరిపోసుకుంది. వీరు ప్రముఖంగా శైవగాథల్నే చెబుతారు.
దాసర్లు: దాసర్లలో బుక్కదాసరి, పాగదాసరి, భాగవత దాసరి, చిన్నదాసరి, దండి దాసరి, మాల దాసరి మొదలైన ఉపజాతులున్నాయి. వీరు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. బాలనాగమ్మ, చిన్నమ్మ, కాకమ్మ కథల్ని పాడతారు. విష్ణు సంకీర్తనలతో ఇంటింటా భిక్షమడుగుతారు. ఈ కళ క్రమేణా కనుమరుగవుతోంది.
అసాదులు: తెలంగాణలో ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మలను గ్రామ దేవతలుగా పూజిస్తారు. ఈ పూజలను నిర్వహించే పూజారులనే ‘అసాదులు’ అంటారు. దళితులతో పాటు కుమ్మర్లు కూడా అసాదులుగా ఉంటారు. గ్రామ దేవతలకు పూజలు చేసే క్రమంలో అమ్మవార్లను స్తుతిస్తారు. అమ్మవార్ల కొలువంతా తాంత్రి పద్ధతిలో జరుగుతుంది.
తెలంగాణ భౌగోళిక చరిత్ర
తెలంగాణ 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. జనాభా పరంగా, భౌగోళికంగా ఇది దేశంలో 12వ స్థానంలో ఉంది. దీని విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. పది జిల్లాలతో కూడిన తెలంగాణలో మొత్తం 68 నగరాలున్నాయి. ఇందులో ఆరు కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీలు, 25 నగర పంచాయతీలు, 8,691 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
 • 200 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 346.
 • 500 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 870.
 • 1000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 1733
 • 2000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 3,029
 • 5000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 43,104
 • 10,000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 630
 • 10,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 122 ఉన్నాయి.
రాష్ట్రం మొత్తంలో 83,57,826 కుటుంబాలున్నాయి. (సమగ్ర కుటుంబ సర్వే 2014 ఆగస్టు 19 ఆధారంగా). తెలంగాణలో పెద్ద జిల్లా మహబూబ్‌నగర్ (పాలమూర్). చిన్న జిల్లా హైదరాబాద్. తెలంగాణ అధికార భాష తెలుగు, రెండో భాష ఉర్దూ. తెలంగాణలో తొలి విశ్వవిద్యాలయమైన ఉస్మానియా యూనివర్సిటీని 1918లో స్థాపించారు. 1976లో వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ (నల్గొండ), శాతవాహన (కరీంనగర్), తెలంగాణ (నిజామాబాద్), పాలమూర్ విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
 • రాష్ట్ర సరిహద్దులుగా నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. అవి...
1) ఛత్తీస్‌గఢ్
2) మహారాష్ట్ర
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
గమనిక: పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు కలిసి ఉన్నప్పుడు ఒడిశాతో కూడా సరిహద్దు ఉంది.
 • తెలంగాణ భూపరివేష్టిత రాష్ర్టం. దీనికి అంతర్జాతీయ సరిహద్దు, సముద్రతీరం లేవు.
 • దేశంలో మొత్తం అయిదు భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి. అవి:
1) హరియాణా
2) జార్ఖండ్
3) ఛత్తీస్‌గఢ్
4) మధ్యప్రదేశ్
5) తెలంగాణ
 • రాష్ట్ర గీతం: ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’.
 • తెలంగాణ రాష్ట్ర పక్షి: పాలపిట్ట
 • రాష్ట్ర జంతువు: జింక
 • రాష్ట్ర వృక్షం: జమ్మిచెట్టు
 • రాష్ట్ర పుష్పం: తంగేడు పువ్వు
 • రాష్ట్ర పండుగలు: బతుకమ్మ, బోనాలు
 • తెలంగాణ రాష్ట్ర రాజధాని: హైదరాబాద్.
 • తెలంగాణ రాష్ర్టంలో మొత్తం 457 మండలాలు ఉన్నాయి. విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు.
 • ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు 1) భద్రాచలంలోని కొన్ని గ్రామాలు, 2) కూనవరం, 3) చింతూర్ 4) వరరామచంద్రపురం, 5) వేలేరుపాడు, 6) కుక్కునూరు, 7) బూర్గంపాడు.
 • తెలంగాణ రాష్ట్ర గీతం రాసినవారు ‘అందె శ్రీ’. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. వరంగల్ జిల్లాలోని రేబర్తి గ్రామం ఈయన జన్మస్థలం. ఈయనకు కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
 • తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో.. రెండు వలయాల లోపల కాకతీయ తోరణం, మధ్యలో చార్మినార్ ఉంటుంది. వెలుపలి వలయం బంగారు వర్ణంలో ఉంటుంది. ఇది అభివృద్ధికి గుర్తు. లోపలి వలయం, కాకతీయ తోరణం, చార్మినార్ ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. ఇది శాంతికి గుర్తు.
 • తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపకర్త ఏలే లక్ష్మణ్. ఈయనిది నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కదిరేని గూడెం.
- తెలంగాణలో విస్తీర్ణపరంగా పెద్ద జిల్లాలు:
1) మహబూబ్‌నగర్, 2) ఆదిలాబాద్.
- తెలంగాణలో విస్తీర్ణపరంగా చిన్న జిల్లాలు:
1) హైదరాబాద్, 2) రంగారెడ్డి.
- రాష్ట్రంలో అధిక మండలాలున్న జిల్లాలు:
1) మహబూబ్‌నగర్ (64)
2) నల్గొండ (59)
- రాష్ట్రంలో తక్కువ మండలాలు ఉన్న జిల్లా:
1) హైదరాబాద్ (16)
2) నిజామాబాద్ (36)
 • తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం రామగుండం. ఆ తర్వాత భద్రాచలం, కొత్తగూడెంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
 • తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. లోక్‌సభ స్థానాలు 17, రాజ్యసభ స్థానాలు 7.
 • అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా - హైదరాబాద్ (15).
 • తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా - నిజామాబాద్ (9).
తెలంగాణ శబ్ద ఆవిర్భావం..
 స్కంద పురాణాల్లో తెలంగాణ ప్రాంతాన్ని ‘త్రిలింగ దేశం’గా పేర్కొన్నారు. ‘తెన్ + కళింగ’ నుంచి త్రిలింగదేశం అనే పదం ఆవిర్భవించిందని కొందరు భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుంగు, తెలంగ్, త్రిలింగ్ పదాలను ‘అంగునీయం’ అనే తమిళ వ్యాకరణ గ్రంథంలో పేర్కొన్నారు. హేమాద్రి రచించిన ‘వ్రత ఖండం’లో కాకతీయ రుద్రుడిని ‘త్రిలింగ అధిపతి’గా, ‘ఆంధ్ర మహారాజ్ఞి’గా, ఓరుగల్లును ‘ఆంధ్రనగరి’గా అభివర్ణించారు. అప్పటికే త్రిలింగదేశం, ఆంధ్రదేశం, తెలుగు జాతి, ఆంధ్రజాతి అనే పేర్లు స్థిరపడ్డాయని గమనించవచ్చు.
 ప్రతాపరుద్రుని ఆస్థాన కవి ‘అగస్త్య విద్యానాథుడు’ త్రిలింగ పదాన్ని మూడు లింగాలకు (శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం) అన్వయించాడు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధి పొందిన మూడు శైవ క్షేత్రాల మధ్య ప్రాంతాన్ని ‘త్రిలింగ దేశం’గా పేర్కొన్నాడు. 14వ శతాబ్దానికి చెందిన ‘కావ్యాలంకార చూడామణి’ గ్రంథకర్త విన్నకోట పెద్దన, 17వ శతాబ్దానికి చెందిన అప్పకవి కూడా అవే సరిహద్దులు చెప్పారు.
 14వ శతాబ్దంలో వేయించిన శ్రీరంగం తామ్ర శాసనంలో.. తూర్పున కళింగ, పడమర మహారాష్ట్ర, దక్షిణాన పాండ్యదేశం, ఉత్తరాన కన్యాకుబ్జం త్రిలింగదేశ సరిహద్దులుగా పేర్కొన్నారు.
 మహమ్మద్‌బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యాన్ని జయించిన తర్వాత ముస్లింలు త్రిలింగదేశాన్ని ‘తెలంగాణ’గా  వ్యవహరించారు. తుగ్లక్ సేనాని అనూర్‌వలి ఓరుగల్లు ఆక్రమణకు ప్రయత్నించాడు. ఆ తర్వాత కోస్తాపై దండెత్తాడు. తుగ్లక్ తన శాసనాల్లో, పరిపాలన కైఫీయతుల్లో ‘తెలంగాణ’ అని రాయించాడు. అప్పటి నుంచి ముస్లింలు ఆంధ్రదేశాన్ని ‘తెలింగి’గా వ్యవహరిస్తున్నారు. నిజాం కాలంలో కోస్తా ప్రాంతం బ్రిటిషర్ల వశమైంది. వారు ఈ ప్రాంతాన్ని ఆంధ్రగా వ్యవహరించారు. దీంతో నిజాం పాలనలోని ప్రాంతానికి తెలంగాణ పేరు నిలిచిపోయింది.
Published on 9/30/2015 5:58:00 PM

Related Topics