Sakshi education logo
Search Bar

ఇంటర్‌ పరీక్షలపై ఆందోళన వద్దు.. సెకండియర్‌పై దృష్టి పెట్టండి: ఇంటర్‌ బోర్డు సైకాలజిస్టుల సూచనలు

Join our Community

facebook Twitter Youtube
‘మళ్లీ పరీక్షలు ఉంటాయి.. ఫస్టియర్, సెకండియర్‌ రెండూ చదవండి. ప్రమోట్‌ చేసినంత మాత్రాన ఫస్టియర్‌ వదిలేస్తారా.. అందులో మార్కులు వద్దా.. అందుకే రెండింటికి ప్రిపేర్‌ కావాలి.. ’ అంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారంటున్న విద్యార్థులు.
Education News ‘పరీక్షలు రద్దు చేశారు.. ఫస్టియర్‌కు మార్కులు ఇవ్వలేదు. సెకండ్‌ ఇయర్‌కు ప్రమోట్‌ చేస్తున్నారు. ఇలాగైతే ఇంటర్‌లో పర్సంటేజీ ఎలా..? వీలైతే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.. రెండింటికి పిల్లలను సిద్ధం చేయాల్సిందేనా’ ఇవీ మెజారిటీ తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్నలు.

కరోనా నేపథ్యంలో ఇంటర్మీడి యట్‌ పరీక్షలు, ఇతరత్రా అంశాలపై విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు, తగిన కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఇంటర్‌ బోర్డు ఏర్పాటు చేసిన సైకాలజిస్టులకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఫోన్లు చేసి అడుగుతున్న ప్రధాన సమస్యలివే. బోర్డు ఏర్పాటు చేసిన ఐదుగురు సైకాలిస్టులకు రోజూ వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. అందులో ‘ఇంటర్‌ పరీక్షలు రద్దు చేశారు.. విద్యార్థులను ప్రమోట్‌ చేశారు.. మార్కులు లేకపోతే ఎలా?’ అన్న దానిపైనే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తేలింది. 40 శాతం ఫోన్లు పిల్లలనుంచి వస్తే 60 శాతం ఫోన్లు తల్లిదండ్రులనుంచే వస్తున్నాయని సైకాలజిస్టు జవహర్‌లాల్‌నెహ్రూ వెల్లడించారు. తల్లిదండ్రుల్లోనే ఎక్కువ భయం ఉంటోందని, పిల్లలపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యహరించాల్సిన తీరును నెహ్రూ వివరించారు.

వాస్తవాలు గ్రహించి ముందుకెళ్తేనే మేలు
సెకండియర్‌ పరీక్షలను బోర్డు వాయిదా వేసింది. ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను ప్రమోట్‌ చేసింది. దాంతో సంతృప్తి చెందని ఎవరైనా ఉంటే.. వారికోసం వీలైతే భవిష్యత్తులో పరీక్షలు నిర్వహిస్తామంది. అందరూ కచ్చితంగా రాయాలని చెప్పలేదు. ప్రమోషన్‌తో సంతృప్తి చెందని వారే రాసుకోవచ్చంది. అందువల్ల విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దు.

ఫస్టియర్‌ను పక్కన పెట్టాలి
సెకండియర్‌కు ప్రమోట్‌ అయిన విద్యార్థులను మార్కుల కోసం ఫస్టియర్‌ సబ్జెక్టులను చదవమని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. అప్పుడే రెండేళ్లకు కలిపి 60 శాతం వస్తుందని చెబుతున్నారు. దానివల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. విద్యార్థులను ఎలాగూ ప్రమోట్‌ చేశారు కాబట్టి ఫస్టియర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి ద్వితీయ సంవత్సరంపై ప్రత్యేక దృష్టి సారించి 90 శాతం మార్కులు తెచ్చుకుంటే ఎంతో ఉపయోగం. ఆ 90 శాతానికి ప్రథమ సంవత్సరంలో ఇచ్చే 35 శాతం కలిస్తే 125 శాతం అవుతుంది. దానిని రెండేళ్లకు విభజిస్తే 60 శాతానికిపైగానే పర్సంటేజీ ఉంటుంది. కాబట్టి సెకండియర్‌పై దృష్టి సారిస్తే విద్యార్థులకు మేలు.

తెలంగాణ‌ ఇంట‌ర్మీడియెట్ - 2021 స్టడీ మెటీరియ‌ల్‌, ప్రిప‌రేష‌న్ గైడెన్స్‌, మోడ‌ల్ పేప‌ర్లు, బిట్ బ్యాంక్స్‌, కెరీర్ గైడెన్స్‌.. ఇత‌ర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

భారీ పర్సంటేజీలు వద్దు
ఉన్నత విద్యా ప్రవేశాల్లో ఇంటర్‌ మార్కుల తో సంబంధం లేదనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ఈసారి ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని తొలగించా రు. జేఈఈ మెయిన్‌లోనూ లేదు. ఇçప్పుడు అత్యధిక మార్కులతో పనిలేదు. ద్వితీయ సంవత్సరం బాగా చదువుకుంటే చాలు. తరువాత ఎంసెట్, జేఈఈ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలి. తల్లిదండ్రులకు భయపడి ఫస్టియర్‌ పరీక్షలు రాస్తామని విద్యార్థులు చెప్పినా ఎక్కువగా ఎంకరేజ్‌ చేయవద్దు.

ధైర్యవంతులుగా తీర్చిదిద్దండి
విద్యార్థులు.. ఏదైనా తట్టుకోగలమన్న ధై ర్యంతో ఉండాలి. ఏ సబ్జెక్టు అయినా నమ్మ కంతో చదివితే అదే వస్తుంది. ఆందోళన అక్కర్లేదు. తల్లిదండ్రులూ ప్రోత్సహించాలి. విద్యార్థులు నైతిక విలువలపై ఎక్కువ ఫోకస్‌ చేసేలా తల్లిదండ్రులు చూడాలి. మానవ సంబంధాలను నేర్పించాలి. అప్పుడే వారు గొప్ప విద్యార్థులుగా ఎదుగుతారు.
భవిష్యత్‌లో పరీక్షలను అందరూ రాయాల్సిన పనిలేదు. ప్రమోషన్‌తో సంతృప్తి చెందని వారు రాసుకోవచ్చని బోర్డు చెప్పింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దు.
– సైకాలజిస్టు జవహర్‌లాల్‌నెహ్రూ
Published on 5/19/2021 12:21:00 PM

సంబంధిత అంశాలు