Sakshi education logo
Search Bar

దేశంలోనే టాప్‌ ఫార్మా ఇన్‌స్టిట్యూట్‌లలో చదవాలనుకునే వారి కోసం ఈ అవకాశం.. నైపర్‌–జేఈఈ–2021 నోటిఫికేషన్‌ విడుదల..

Join our Community

facebook Twitter Youtube
ఫార్మసీ రంగం.. ప్రస్తుత పరిస్థితుల్లో.. కెరీర్‌ పరంగా.. ఎంతో డిమాండ్‌! కరోనా కాలంలో ఫార్మా రంగంలో.. కొత్త కొత్త ప్రయోగాలు, టీకాలు, ఔషధాల ఆవిష్కరణల దిశగా సంస్థల పరిశోధనలు. దాంతో ఫార్మా కంపెనీల్లో నిపుణులకు డిమాండ్‌ ఏర్పడింది.
Edu news

ఫలితంగా.. ఫార్మా రంగంలో అవకాశాలు మెరుగవుతున్నాయి!! దేశంలో ఫార్మా రంగానికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దే విద్యాసంస్థలు.. నైపర్‌ క్యాంపస్‌లు! దేశవ్యాప్తంగా ఉన్న ఏడు నైపర్‌ క్యాంపస్‌లలో ఫార్మసీలో మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నైపర్‌–జేఈఈ! తాజాగా.. 2021–22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి.. నైపర్‌–జేఈఈ–2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నైపర్‌–జేఈఈ వివరాలు, అర్హతలు, నైపర్‌ క్యాంపస్‌లు అందిస్తున్న పీజీ, పీహెచ్‌డీ కోర్సులు, కెరీర్‌ అవకాశాలపై సమగ్ర కథనం...

ఫార్మసీ.. వృద్ధి బాటలో పయనిస్తున్న రంగం. ఫార్మా సంస్థలకు నిపుణులైన మానవ వనరులను అందించే విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నైపర్‌ క్యాంపస్‌లు. ఫార్మా విద్య ముఖ్యంగా మాస్టర్స్, పీహెచ్‌డీ స్థాయి కోర్సులు అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీ, రీసెర్చ్‌ ల్యాబ్స్‌తో ఒప్పందాల ద్వారా ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యమిస్తూ ఎం.ఫార్మసీ,పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందిస్తున్న నైపర్‌లు.. జాతీయ స్థాయిలోనే కాకుండా.. అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందాయి. వీటిల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులను పూర్తి చేసుకుంటే..ఫార్మా రంగంలో మెరుగైన అవకాశాలు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఏడు క్యాంపస్‌లు..
దేశవ్యాప్తంగా మొత్తం ఏడు నైపర్‌ క్యాంపస్‌లు ఉన్నాయి. అవి.. అహ్మదాబాద్‌; గువహటి; హాజీపూర్‌; హైదరాబాద్‌; కోల్‌కత; రాయ్‌బరేలి; ఎస్‌.ఎ.ఎస్‌.నగర్‌(పంజాబ్‌). వీటిలో ఎం.ఫార్మసీ, పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌ స్టడీస్‌ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నైపర్‌ క్యాంపస్‌ల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షే.. నైపర్‌–జేఈఈ. పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థులకు నైపర్‌–జేఈఈని వేర్వేరుగా నిర్వహిస్తారు.

నైపర్‌–జేఈఈకి అర్హతలు..
బీఫార్మసీ తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించాలి. దాంతోపాటు జీప్యాట్‌/గేట్‌/నెట్‌ పరీక్షల్లో అర్హత సాధించాలి.

పదహారు పీజీలు..

  • నైపర్‌ క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్న పీజీ ప్రోగ్రామ్‌లు.. ఎంఎస్‌–ఫార్మసీ; ఎం.ఫార్మసీ; ఎం.టెక్‌(ఫార్మసీ); ఎంబీఏ(ఫార్మసీ). ఈ నాలు గు కోర్సులకు సంబంధించి పదహారు స్పెషలైజేషన్లలో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
  • ఎంఎస్‌–ఫార్మసీ: మెడిసినల్‌ కెమిస్ట్రీ; నేచురల్‌ ప్రొడక్ట్స్‌; ట్రెడిషనల్‌ మెడిసిన్‌; ఫార్మాస్యుటికల్‌ అనాలిసిస్‌; ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ; రెగ్యులేటరీ టాక్సికాలజీ; ఫార్మాస్యుటిక్స్‌; బయోటెక్నాలజీ; ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్‌; మెడికల్‌ డివైజెస్, రెగ్యులేటరీ అఫైర్స్‌.
  • ఎం.ఫార్మసీ: ఫార్మాస్యుటికల్‌ టెక్నాలజీ(ఫార్ములేషన్స్‌); ఫార్మసీ ప్రాక్టీస్‌; క్లినికల్‌ రీసెర్చ్‌.
  • ఎంటెక్‌ ఫార్మసీ: ఫార్మాస్యుటికల్‌ టెక్నాలజీ(ప్రాసెస్‌ కెమిస్ట్రీ); ఫార్మాస్యుటికల్‌ టెక్నాలజీ(బయో టెక్నాలజీ), ఎంబీఏ(ఫార్మాస్యుటికల్‌ మేనేజ్‌మెంట్‌).

మొత్తం పీజీ సీట్ల సంఖ్య: 968
మొహాలీ (ఎస్‌ఏఎస్‌ నగర్‌)–270, అహ్మదాబాద్‌–155, గువహటి–125, హైదరాబాద్‌–182, హాజీపూర్‌–70, కోల్‌కత–79, రాయ్‌బరేలి–87.

మాస్టర్స్‌ కోర్సులకు 200 మార్కులకు..

  • నైపర్‌ జేఈఈ(మాస్టర్స్‌) పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) నిర్వహిస్తారు. పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. అలాగే తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత వేస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు.
  • పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే నైపర్‌ జేఈఈలో మెరుగైన ర్యాంకు పొందాలంటే.. బీఫార్మసీ స్థాయిలోని అకడమిక్స్‌పై పూర్థిస్థాయి అవగాహన పెంచుకోవాలి.
  • కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యుటికల్‌ అనాలిసిస్‌ విభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మొత్తం 200 ప్రశ్నల్లో 70 శాతం వరకూ వీటి నుంచే అడిగే అవకాశముంది. జనరల్‌ ఆప్టిట్యూడ్‌ కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి.
  • బీఫార్మసీలో పొందిన నైపుణ్యం, జీప్యాట్‌ సన్నద్ధతతో రాణించేందుకు వీలుంది. ఫార్మకాలజీలో రిసెప్టర్స్‌ వాటి రకాలు, మెకానిజమ్‌ ఆఫ్‌ యాక్షన్, ఔషధాల వర్గీకరణ, క్లినికల్‌ ట్రయల్స్‌పై అవగాహన, ప్రీ–క్లినికల్‌ ట్రయల్స్‌ అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. డ్రగ్‌ డిస్కవరీకి సంబంధించి ముఖ్యంగా వాటి ప్రాముఖ్యతలు, దాంతోపాటు రియాక్షన్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఎంబీఏ.. జీడీ/పీఐ
నైపర్‌ క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్న ఎంబీఏ ఫార్మా మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశానికి నైపర్‌–జేఈఈలో ఉత్తీర్ణతతోపాటు తర్వాత దశలో గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వూలోనూ రాణించాల్సి ఉంటుంది. నైపర్‌–జేఈఈకి 85 శాతం వెయిటేజీ; గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వూ్య రెండింటికీ కలిపి 15 శాతం వెయిటేజీ ఇస్తారు.

ఉమ్మడి కౌన్సెలింగ్‌..
నైపర్‌–జేఈఈలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించిన అభ్యర్థులకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అందుబాటులో ఉన్న సీట్లు.. అభ్యర్థులు సాధించిన ర్యాంకు ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. ఆ మేరకు అభ్యర్థులు తమకు లభించిన క్యాంపస్‌లో జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రతి ఏటా ఒక క్యాంపస్‌ నైపర్‌–జేఈఈని నిర్వహిస్తుంది. ఆ క్యాంపస్‌ ఆధ్వర్యంలోనే ఉమ్మడి కౌన్సెలింగ్‌ జరుగుతుంది.

ఆర్థిక ప్రోత్సాహం..
అన్ని దశల్లోనూ విజయం సాధించి ప్రవేశాలు ఖరారు చేసుకున్న విద్యార్థులు.. ఆర్థిక ప్రోత్సాహం పొందే అవకాశం కూడా ఉంది. ప్రతి విద్యార్థికి నెలకు రూ.12,400 స్టయిఫండ్‌ లభిస్తుంది. ఈ స్టయిఫండ్‌ కొనసాగాలంటే.. ప్రతి సెమిస్టర్‌లోనూ తప్పనిసరిగా జీపీఏ ఆరు పాయింట్లు కొనసాగించాలి.

నైపర్‌–జేఈఈ(మాస్టర్స్‌) 2021..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌ 9, 2021 –మే 8, 2021
  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: మే 21, 2021 నుంచి
  • నైపర్‌ జేఈఈ ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: జూన్‌ 5, 2021
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
  • ఫలితాల వెల్లడి: జూన్‌ 12, 2021
  • నైపర్‌ జాయింట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు: జూలై 7 నుంచి జూలై 9 వరకు
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.niperhyd.ac.in

ఉజ్వల భవిష్యత్తు..
నైపర్‌లో సీటు సొంతం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఖాయమని చెప్పొచ్చు. ఫార్మా కంపెనీలు, డ్రగ్‌ ఫార్ములేషన్‌ సెంటర్స్‌తోపాటు రీసెర్చ్‌ సెంటర్స్‌లోనూ అవకాశాలు లభిస్తాయి. ప్రారంభంలోనే కనీసం నెలకు రూ.40 వేల వేతనం అందుకోవచ్చు.
– డా‘‘ ఎస్‌.గణనధాము, ఇంఛార్జ్‌ రిజిస్ట్రార్, నైపర్‌–హైదరాబాద్‌

పీహెచ్‌డీ ప్రవేశాలు ఇలా..
దేశ వ్యాప్తంగా నైపర్‌ క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్న మొత్తం 180 పీహెచ్‌డీ సీట్లలో ప్రవేశానికి ప్రత్యేకంగా ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు నెపర్‌–జేఈఈ ఆన్‌లైన్‌ దరఖాస్తును పూర్తి చేసేటప్పుడే.. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

అర్హతలు..
అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగాలకు సంబంధించి.. ఎం.ఎస్, ఎం.ఫార్మసీ, ఎంటెక్‌ కోర్సులను సదరు స్పెషలైజేషన్లతో 6.5 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులు 6.25 సీజీపీఏ లేదా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. జీప్యాట్‌/గేట్‌/సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. ఎండీ, ఎంవీఎస్‌సీ, ఎండీఎస్, ఫార్మ్‌–డి ఉత్తీర్ణులకు జీప్యాట్‌ /నెట్‌/గేట్‌ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.

పీహెచ్‌డీ ఎంట్రన్స్‌..
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే నైపర్‌–జేఈఈ 170 ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. కెమికల్‌ సైన్సెస్, బయలాజికల్‌ సైన్సెస్, ఫార్మాస్యుటికల్‌ సైన్సెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.

ఇంటర్వూ..
పీహెచ్‌డీ అభ్యర్థులకు ఎంట్రన్స్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి ఇంటర్వూకు పిలుస్తారు. ఇంటర్వూకు కేటాయించిన మార్కులు 15. ఇంటర్వూలో సదరు స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో చేరేందుకు అభ్యర్థి చూపుతున్న ఆసక్తి, భవిష్యత్తు లక్ష్యాల గురించి పరిశీలిస్తారు.

స్టయిఫండ్‌..
పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేలు చొప్పున; మూడు, నాలుగు సంవత్సరాలు నెలకు రూ.35 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది. దీంతో పాటు హెచ్‌ఆర్‌ఏ కూడా అందుతుంది.

నైపర్‌ జేఈఈ –పీహెచ్‌డీ ఎంట్రన్స్‌– ముఖ్య సమాచారం

    • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌ 9, 2021 – మే 8, 2021
    • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: మే 21, 2021 నుంచి
    • నైపర్‌ జేఈఈ ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: జూన్‌ 5, 2021
    • ఫలితాల వెల్లడి: జూన్‌ 12, 2021
    • ఇంటర్వూ తేదీలు: జూలై 5–జూలై 8
    • నైపర్‌ జాయింట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు: జూలై 9, 2021
    • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.niperhyd.ac.in  
Published on 5/3/2021 4:48:00 PM

సంబంధిత అంశాలు