సాక్షి ‘భవిత’.. నా విజయానికి మలుపు: వీఆర్‌వో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎస్.చిట్టిబాబు

ఎన్ని పోటీపరీక్షలు రాసినా విజయం ఒక్కమెట్టు దూరంలో ఆగిపోయింది. చివరకు అపజయాలతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. భవిష్యత్తులో పోటీపరీక్షల్లో ఇక రాణించడం అసాధ్యమనే అభద్రతాభావం నెలకొంది. చివరకు చిన్న ధైర్యం ఆ యువకుడిని లక్షలాది మంది పోటీపడ్డ వీఆర్‌వో పరీక్షలో స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలిచేలా చేసింది. అతనే చిట్టిబాబు. ఆయన విజయ ప్రస్థానం తన మాటల్లోనే..

నిరాశలో కూరుకుపోయాను:
ఏదోక జాబ్ వస్తే చాలనుకున్నా. వీఆర్‌వో పరీక్షకు మిగిలిన పోటీపరీక్షల మాదిరిగా మామూలుగానే దరఖాస్తుచేశా. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదోక ఉద్యోగంలో చేరాలనే తపనతో పట్టుదలగా ప్రిపేరయ్యా. కనీసం జనరల్‌కేటగిరీలో ఉద్యోగం రాకపోయినా రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ వస్తుందనే ఆశతో ప్రిపరేషన్ మొదలుపెట్టా. అయితే ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. వరుస అపజయాలతో కుంగిపోయిన దశలో నాకు వచ్చిన ఫస్ట్‌ర్యాంకు ఎంతో ఆత్మవిశ్వాసం నింపింది. పోటీపరీక్షలకు ఇక పనికిరాననుకుని నిరాశలో కూరుకుపోయిన సమయంలో ఈ ర్యాంకు భవిష్యత్తులో నా కల నెరవేర్చుకునేందుకు తగిన ప్రోత్సాహం ఇస్తుందని నమ్ముతున్నాను. స్నేహితులు ఫోన్ చేసి చెప్పేవరకు 93 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచాననే సంగతి తెలియదు.

ఎంఎస్సీ, బీఈడీ చదివా:
మాది శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తలవరం గ్రామం. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఇక్కడే పూర్తయింది. డిగ్రీ అనకాపల్లిలో చదివాను. ఆ తర్వాత నంద్యాలలో బీఈడీ, ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా విధానం ద్వారా ఎంఎస్సీ మ్యాథ్స్ చదివాను.

ఏ పోటీపరీక్ష రాసినా అపజయమే:
ఇప్పటివరకు గ్రూప్1, 2, డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్, బీసీసంక్షేమశాఖలో పోస్టులకు దరఖాస్తు చేశా. ఎందులోనూ విజయం సాధించలేదు. దీంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అచ్చిరాదేమోననుకున్నా. చివరకు ఇంట్లో కూడా నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించలేనేమోననే బెంగ పెట్టుకున్నారు. దీంతో నాలో పట్టుదల పెరిగింది. చివరకు ఏదోక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుని వీఆర్‌వో పరీక్షకు దరఖాస్తుచేశా. మిగిలిన పోటీపరీక్షలకు చేసిన ప్రిపరేషన్ ఈ పరీక్షకు ఉపయోగపడింది. దీంతో ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలిచా.

సాక్షి భవిత ధైర్యం నింపింది:
ఇప్పటివరకు చాలా పోటీపరీక్షలు రాశాను. వీఆర్‌వో పరీక్షకు సిలబస్ కచ్చితంగా ఎలా ఉంటుందో తెలియదు. పైగా ఈ పోస్టుకు దరఖాస్తుచేద్దామన్నా సరే నా లక్ష్యం వేరేవిధంగా ఉంది. అప్పటికే నాపై నాకు నమ్మకం సడలిపోయింది.నాకు ప్రభుత్వ ఉద్యోగం రాదని ఇంట్లో కూడా దాదాపు ఫిక్స్ అయిపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఈ సమయంలో సాక్షి ‘విద్య’లో వీఆర్‌వో పరీక్ష కోసం స్టడీమెటీరియల్‌తోపాటు మోడల్‌పేపర్లు ఇచ్చారు. వీటిని చూడటంతో సిలబస్ గతంలో చదివినట్లు అనిపించింది. తరచుగా భవితను ఫాలో అయ్యా. అదేవిధంగా భవితలో ఇచ్చిన వీఆర్‌వో గ్రాండ్ టెస్ట్‌ను ఆన్సర్ చేస్తే 83 మార్కులు వచ్చాయి. దీంతో వీఆర్‌వో కచ్చితంగా విజయం సాధించగలననే నమ్మకం ఏర్పడింది. అంతే.. పట్టుదలగా చదివాను. చివరకు ఫలితం అనుకూలంగా వచ్చింది.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీవిత లక్ష్యం;
గ్రూప్2లో ఎగ్జిక్యూటివ్ పోస్టు సాధించాలనేదే నా లక్ష్యం.
Published on 3/15/2012 3:59:00 PM

Related Topics